*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం: *చంద్రఘంటా!*
కవితాసంఖ్య: *03*
తేది: *05-10-2024-శనివారం*
శీర్షిక: *చంద్రఘంటా! వందనం!*
కవి: *వరలక్ష్మి యనమండ్ర* కవి సంఖ్య *(02)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
*****************************
*01*
సకల లోకములందుగొల్చెడు చంద్రఘంటా వందనం!
చికురముల్ భ్రమరంబులయ్యెను శ్రీకళా శుభ స్వాగతం
వికలమయ్యెను సృష్టియంతయు వేడుచుంటిమి భక్తితో
ముకుళితంబయె నాదు దేహము మ్రొక్కుచుంటిని పార్వతీ!
*02*
పదపదంబుల నీశు దల్చుచు భక్తితో తపియించగన్
ముదమునొందిన నీలకంఠుడు ముగ్ధుడయ్యెను శాంభవీ
వదనమంత ప్రకాశమై, హిమవంతు, మేనక మెచ్చిరే
కదము ద్రొక్కెను సంతసంబులు కాంతపార్వతి మోమునన్!
*03*
తొలుత ధూర్జటి నిన్ను జూడగ తొందరించె గణంబులన్
కొలుచు భూతపిశాచముల్ గని కూలిపోయెను మేనకే
పలికె పార్వతి చంద్రఘంటయి వస్త్రభూషణ శోభలన్
తళుకులొల్కెను సుందరేశుడు , తారలే దిగివచ్చెనే
*04*
రథమునెక్కె వివాహమై; శివరాణిగా యరుదెంచెనే
పథపథమ్మున దేవతల్ గని పారవశ్యము నొందిరే
వ్యథలుబాపగ చంద్రఘంటగ పార్వతీ యవతారమే
కథలుగావివి వాస్తవంబులు కామితార్ధము లొందగన్
*05*
గదనుబట్టిన సింహవాహిని ఖడ్గధారిణి శాంకరీ
కదనమందున దైత్యహారిణి ఘంట నాద వినోదినీ
సదనమందున కొల్వు సేయవె చండికా యవతారీణీ
సదయవై మముగాచు తల్లివి చంద్రఘంటవు నీవెగా!
*****************************
హామీ పత్రం: స్వీయ రచన
No comments:
Post a Comment