మహిమాన్విత రమణీయ క్షేత్రం వేములవాడ
~~~~~~~~~~~~~~~~
డా. బండారి సుజాత
~~~~~~~~~~~
భారతదేశంలో సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లంగములు ,అష్టాదశ శక్తిపీఠములు , పృథ్వి , జల , వాయు ,ఆకాశ, తేజ లింగంలో ముఖ్యమైనవి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవ స్థానం శ్రీశైల మహా క్షేత్రంది .ఇది కృష్ణానది దక్షిణ తటాకమునందున్నది. త్రిలింగక్షేత్రముగా పేరుగాంచిన కాళేశ్వరము, శ్రీశైలము , ద్రాక్షారామం తో పాటు అమరావతి,క్షీరారామం వంటి పంచారామములు ,మహానంది కాళహస్తి ,త్రికూటాద్రి ,కొలనుపాక, పానగల్లు ,ఉమామహేశ్వరం, ఆలంపురం ,సిద్ధవటము, పుష్పగిరి ,ఏలేశ్వరం, లేపాక్షి,
ముఖ లింగముల వంటి వందల కొద్ది శివ క్షేత్రములు అతి పవిత్రమైనవి ,ప్రాచీనమైనవి.
తెలంగాణలో ఆలయం లేని గ్రామం కనిపించదు. ప్రతి గ్రామం లో శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయములుండును.
వేములవాడ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలానికి చెందినది .2016 అక్టోబర్ 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణములలో ఈ నగరం కరీంనగర్ జిల్లా నుండి వేరు చేయబడినది.
తెలంగాణలో వేములవాడ గొప్ప శైవ క్షేత్రం .కాలేశ్వరం ద్రాక్షారామము, శ్రీశైలం ,శివ క్షేత్రాలతో త్రిలింగదేశంగా పేరుగాంచింది .
వేములవాడ తెలంగాణలో గల కోటిలింగాల దక్షిణ భారతదేశంలో రెండువేలఐదువందల సంవత్సరాలకు పూర్వమే తొలి రాజధాని నగరంగా వెలుగొందింది. అలాగే దక్కన్ లోని ఉత్తర తెలంగాణలో పదమూడువందల సంవత్సరాలకు పూర్వమే గొప్ప రాజధానిగా వెలుగొందిన పట్టణం వేములవాడ.
కరీంనగర్ కుపడమర
35 కిలోమీటర్ల దూరంలో మూల వాగు ఒడ్డున వెలసిన గ్రామం వేములవాడ .ఈ మూల వాగు మానేరు నదిలో కలుస్తుంది.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలోని అశ్మక రాజుల ఏలుబడిలో ఉన్నదని, శాతవాహనుల తర్వాత విష్ణుకుండినులు ,బాదామిచాళుక్యులు ఏలువడిలో ఉన్నదని చరిత్ర ద్వారా తెలియుచున్నది.
క్రీస్తు శకం 750 - 973 వరకు వేములవాడ చాళుక్యులు మొదట బోధన్ నుతర్వాత వేములవాడను రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 750 నుండి రాష్ట్ర కూటులకు సమకాలీనులైన వారి సామంతులుగా పరిపాలించారు .కళ్యాణి చాళుక్యుల రాజ్య స్థాపనతో వీరి రాజ్యమంతమొందెను.
వేములవాడ చాళుక్యులు 225 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా రాజ్యమేలిరి. ఆనాడు వేములవాడను లేంబులవాడ అనేవారు. కాలక్రమేనా వేములవాడగా మారినది.
పురాణాలలోవేములవాడ క్షేత్ర మహత్యం
~~~~~~~~~~~~~~~~
నారద మహర్షి కైలాసమునకు చేరి పరమశివుని దర్శించి మానవులను పాపకర్మల నుండి రక్షించమని కోరెను. నారదని విన్నపంతో పరమశివుడు కాశీని వీడి వేములవాడలో స్థిరపడెను. అందువలన ఈ క్షేత్రం రాజరాజేశ్వర క్షేత్రం ప్రసిద్ధి పొందిందని కథనం.
ఇంద్రుడు వృతాసురుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య పాప నివారణకు అనేక క్షేత్రములు దర్శించిన ఫలము నందలేదు. బృహస్పతి తో ఏ క్షేత్రం దర్శించిన పాప ప్రక్షాళన అవునని అడగగా రాజ రాజేశ్వర క్షేత్రము దర్శించమనెను .అచట ధర్మగుండం లో స్నానమాడి దైవాన్ని కొలిచిన ఇంద్రుడు పవిత్రుడైనాడని ప్రతీతి.
దక్ష ప్రజాపతి గంథమాధన పర్వతమున యాగమునర్చు సమయాన హవిస్సులు భాస్కరుడపహరించగ బాహువులు కోల్పోయెను. విప్రుల సూచనలతో పాపప్రక్షాళనకై వేములవాడలోని ధర్మ గుండ మన స్నానమాచరించి రాజరాజేశు నర్చించి స్వర్ణభాహములు పొందెను అందువలన ఈ ప్రదేశమును భాస్కర క్షేత్రం అనబడినది.
మహిషాసురుని అంతమొందించుటకు రాజేశ్వరుడు సమస్త దేవతల అంశములను తన తేజస్సును ఏకం చేసి స్త్రీని రూపొందించెను.ఆమెకు దివ్యాస్త్రములు ప్రసాదించి రాక్షస సంహారమొనర్చుటకాదేశించెను. మహిషాసురున్ని సంహరించిన మాత మహిషాసురమర్థినిగా పూజింపబడినది. ఇక్కడ మహిషాసురమర్తిని ఆలయము కలదు.
సతీ దేవి మరణము విన్న శివుడు రుద్రుడై దక్షునియాగము ధ్వంసం చేయుటకు వీరభద్రుని పంపెను. వీరభద్రుడు యాగమును ధ్వంసం చేసెను. తప్పును తెలుసుకున్న దక్షుడు శివుని శరణువేడును అతనికి శివుడు అభయం ఇచ్చెను. వీరభద్రుని విగ్రహము ఇచ్చట ఉన్నది.ఈ ప్రాంతమును దక్షవాటిక అని కూడా స్థలానికి పేరు కలదు.
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు,ద్వాపర యుగమున పాండవులు రాజరాజేశ్వరుని పూజించరని తెలియుచున్నది .ద్వాపర యుగానంతరమున 'కలి యుగ' ప్రారంభమున దుష్టశక్తుల విజృంభనము జరిగినది .అంతట రాజేశ్వర స్వామి ధర్మగుండంలో నివసించెను.రాజరాజ నరేంద్రుడు పొరపాటున ఒక బ్రాహ్మణ బాలుని మృగం అనుకొని బాణంతో కొట్టగా అతడు మరణించెను .పాప ప్రక్షాళన అనేక తీర్థములను సందర్శించినా మనస్తాపము చల్లారలేదు. వేములవాడలోని ధర్మకొండము నందలి ఉదకం ముమ్మారు సేవించగా, అంత శివుడు ఆరాజునకు కలలో కనపడి ధర్మగుండంలో ఉన్న తనను ఆలయము నిర్మించి ప్రతిష్టించమనెను. రాజరాజే నరేంద్రుడు శివుని ఆలయము నిర్మించి ప్రతిష్టించెను.
ఈగాథలన్నియు జనస్థితిలోనున్న కథలుగా పేర్కొనబడుచున్నవి.
వేములవాడ చాళుక్యుల కాలం న వేములవాడ వారి రాజధానిగా విలసిల్లినది. ఇచట రాజేశ్వర, నగరేశ్వర ఆలయంలో రెండవ అరికేసరి వేయించిన శాసనములందున్నవి. కావున ఈ పట్టణము ప్రాచీన కాలంలో అయిన వేములవాడ చాళుక్యుల కాలంలో మహోన్నత స్థితిలో ఉన్నదని తెలియజేయుచున్నది.
చాళుక్య అనంతరం1159 నుండి 1323 వరకు కాకతీయుల పరిపాలనలో ఉన్నది.
కాకతీయుల పతనానంతరం 1336 నుండి 1368 వరకు ముసునూరి నాయకుల ఏలుబడిలో ఉన్నది.
రేచర్ల పద్మనాయకుల ఏలుబడిలో 1368 నుండి 1470 వరకు
బహమనీ సుల్తానుల ఏలుబడిలో 1470 నుండి 1512 వరకు
కుతుబ్షాహీల ఏలుబడిలో 1512 నుండి 1687 వరకు
మొగలుల ఏలుబడిలో 1687 నుండి 1724 వరకు
అసఫ్జాహీల ఏలువడిలో 1724 నుండి 1948 వరకు
1948లో నిజాం పాలన అంతరించిన తర్వాత 1950లో వేములవాడ జాగీర్ పాలన రద్దయింది. 1952లో సాధారణ ఎన్నికలు జరిగి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఎన్నికై 1956లో సమైక్యాంధ్రప్రదేశ్ ఏర్పడునంతవరకు పాలించారు .వారి కాలంలో 1952 లోనే కలెక్టర్ చైర్మన్ అయిదుగురు అనధికారలు సభ్యులుగా వేములవాడ దేవస్థానపు ట్రస్టు బోర్డు ఏర్పడినది 1967 వరకు కొనసాగింది .ఆ తర్వాత అనధికారులతోకూడిన ట్రస్ బోర్డు నేటి వరకు అమలులో ఉన్నది. ఇవి దేవాలయ అభివృద్ధికి వివిధ అభివృద్ధి పనులకు తోడ్పడుచున్నది.
రాజరాజేశ్వరాలయం
~~~~~~~~~~
వేములవాడలో ప్రధాన దేవాలయము రాజరాజేశ్వరాలయం ఈ ఆలయ గోడలపై పౌరాణిక గాథలు, నీతి కథలు చిత్రింపబడినవి. ఆలయ ముఖ్య ద్వారములు రెండు వైపులా మాతృదేవతలగణ విగ్రహములు, ద్వారము మధ్య భాగమున గజలక్ష్మి విగ్రహము చెక్కబడి ఉన్నది .స్వామి వారి ఆలయానికి వామ భాగమున లక్ష్మీ గణపతి విగ్రహం అతిమనోహరంగా ఉన్నది.భక్తులు ముందు గణపతిని దర్శించుకుని దర్శించుకొని రాజేశుని దర్శించూదరు.
శ్రీ రాజరాజేశ్వరీ దేవి
~~~~~~~~~~~
రాజరాజేశ్వరాలయము కుడివైపు రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉన్నది.ఇందు గణపతి, రాజేశ్వర విగ్రహంలు ఉన్నవి.ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలుచేయదురు. నిత్య కుంకుమార్చనలు నిర్వహిస్తారు. పర్వదినాన సమస్త పూజలు నిర్వహించబడును.
రాజేశ్వరాలయమునకు వెళ్ళుదారిలో ఎడమవైపు కాశీ విశ్వేశ్వర ఆలయం ఉన్నది.ఈ మండపంలో లేత గులాబి రంగులోనున్న శివలింగము చూపరులను ఆకర్షించును. ఈ మండపంలో ఆంజనేయుడు, గంగాదేవి విగ్రహములు ఉన్నవి. ఈ మండపంలోని శివలింగమును కాశీ విశ్వేశ్వర లింగముగా కనబడుచున్నది ఈ శివలింగం వల్లనే వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినది.
నాగ శిల్పములు
~~~~~~~~~~
రాజరాజేశ్వరి స్వామి ఆలయ ప్రాకారానికి ఉత్తరాన ధర్మ కుండం ప్రక్కన అనేక నాగ ప్రతిమలు ప్రతిష్టించబడి ఉన్నవి నాగుల చవితి, నాగుల పంచమిలలో భక్తులు ఈ నాగదేవతలను అర్చించుదురు.
మహిషాసుర మర్దిని
~~~~~~~~~~~
వేములవాడ లోనున్న ధర్మశాలకు చేరువలో మహిషాసుర మర్దిని విగ్రహం ఉన్నది .ఇచట శివలింగము, గణపతి ప్రతిష్టించబడినది స్వామివారి సేవకు తేబడు కోడలు ఈ సత్రశాల పరిసరాలలో నిలుపుదురు.
అనంత పద్మనాభ స్వామి ఆలయం
~~~~~~~~~~~~~~~
ఈ ఆలయ ద్వారమున నటరాజ స్వామి విగ్రహం ఉన్నది. వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్నది .ఇవి రాజరాజేశ్వరాయ పశ్చిమాన ఉన్నవి.శివ కేశవుల ఉత్సవములు వేములవాడలో నిర్వహించబడుట వలన ఇది హరి హర క్షేత్రం గా ప్రసిద్ధిగాంచినది.
కోదండ రామాలయం
~~~~~~~~~~~~
పద్మనాభ స్వామి ఆలయం సమీపముననే కోదండరాముల ఆలయం ఉన్నది.ఈ ఆలయంలో శ్రీరామ ,లక్ష్మణ భరత ,శత్రుఘ్నలవిగ్రహములు సీతాదేవి విగ్రహములు ఉన్నవి. ఈ ఆలయమునకు అభిముఖంగా ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది.
ఉమామహేశ్వరాలయం
~~~~~~~~~~~~~~
వేములవాడ లోనున్న సోమేశ్వర లింగం వేలుపలి భాగమున ఉమా ,నంది హనుమాన్, నాగదేవతల విగ్రహములున్నవి. ఈ ఆలయము ఉమామహేశ్వరాలయముగా పిలవబడుచున్నది.
బాలా త్రిపుర సుందరి దేవి
~~~~~<~~~~~~~~~
రాజరాజేశ్వరాలయమునకు పడమరన నాగిరెడ్డి మంటపంలో బాలా త్రిపుర సుందరి ఆలయం ఉన్నది.ఇచ్చట భక్తులు కుంకుమార్చనతో పూజింతురు.
బాల రాజేశ్వరాలయం
~~~~~~~~~~~~
ధర్మ కుండం నుండి రాజేశ్వర లింగమును వెలికి తీసి యుంచి ఆలయమున ప్రతిష్టించవలసిన రాజరాజే నరేంద్ర కన్నా ముందుగా నవనాథుడు ప్రతిష్టించెను. నరేంద్రుడు బాధపడగా రాజ రాజేశ్వరుడు అతని స్వప్నములో కనిపించి బాల రాజేశ్వరని ప్రతిష్టింపుమనెను. ముందుగా నీవు ప్రతిష్టించిన లింగమునకు పూజలు జరుగునని తెలిపెను.రాజు సంతోషించెను. ఇప్పుడు కూడా ముందు బాలరాజేశ్వరుడే పూజలందుకుంటాడు.
విఠలేశ్వరాలయం
~~~~~~~~~~
విఠలేశ్వరాలయంలో విఠలేశ్వరుడు ,రుక్మిణి భాయి విగ్రహములు బహు సుందరంగా ఉండును. ఒక గదిలో వీరభద్రుని విగ్రహం కూడా ఉన్నది.
ద్వాదశ లింగములు కోటి లింగములుగా పిలవబడుచున్నవి. ఆలయమునకు పశ్చిమమున నైరుతి వాయువ్య దిశలయందు మూడు శివ పంచాయతనములు ఉన్నవి. మూలలందున్న మంటపాలలో ఇవి ప్రతిష్టింపబడినవి. ఇచట శివలింగము, అమ్మవారు ఆంజనేయస్వామి నంది విగ్రహములు ఉన్నవి .దక్షిణ దిశలో ఉన్న మంటపములో 8 పంచాయతనములన్నవి. భక్తులందరూ రాజరాజేశ్వరుని కొలిచిన తర్వాత ప్రాకారంలో నున్న ఈ ఆలయాలను భక్తితో దర్శించెదరు.
వేములవాడ క్షేత్రంలో శివకేశవుల ఉత్సవములు నిర్వహించట వలన ఇది హరిహర క్షేత్రం గా ప్రసిద్ధిగాంచినది.శైవంతో పాటు జైనానికి కేంద్రమైనది .ఆనాడు వినోదానికై కోడిపందెంలో ఎడ్లబండి పోటీలు నిర్వహించబడే చదరంగము పొంజితము అష్టా చెమ్మ సంగీతము మొదలైన ఆటలు పాటలు ఉండేవి.
భక్తులు తమకు పండిన పంటలో ప్రథమ భాగము దైవానికి ఈ నాటికి సమర్పిస్తున్నారు .ధాన్యముపండ్లు ఫలాలే కాక ఆవులు కోడెలు మేకలు మొదలగు జంతువులను దైవానికి వదిలిపెడతారు.
కొందరు భక్తులు ప్రథమ సంతానమైన పుత్రికలను స్వామినిలుగా చ శివసత్తులుగా దైవానికి సమర్పించేవారు ఇప్పటికీ ఇక్కడ శివసత్తులు ఉన్నారు.
నేటికీ ఇక్కడ శివసత్తులు దేవుని పేరుతో ఎక్కువగా ఉంటారు. వేములవాడ క్షేత్రమందు మహాశివరాత్రి ఉత్సవములు ఘనంగా జరుగుతాయి .పర్వదినాలన్ని శోభాయ మానంగా జరుపబడతాయి.నిత్యము భక్తుల ఆధ్యాత్మిక చింతనతో అలరారుతోంది వేములవాడ. ప్రతి సంవత్సరం త్యాగరాజ ఉత్సవాలు నిర్వహించబడతాయి. సంగీత విద్వాంసులు, వైణికులు వయోలిన్ మొదలకు సంగీత వాద్యముల వారిని ఇక్కడ సన్మానిస్తున్నారు. ప్రతిరోజు జాతరను తలపించే భక్తులతో నిత్య నీరాజనులతో భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలిసిల్లుతోంది వేములవాడ క్షేత్రం.
జిల్లాగా మారిన వేములవాడలో సౌకర్యాలు ఇంకా ఇంకా మెరుగుపడాలని, ఉద్యోగులు ఉద్యోగాన్ని ఉద్యోగంగా భావించక మనస్ఫూర్తిగా పనిచేస్తూ ప్రజలకు తోడ్పడాలని ,ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ ఇతరులను ఇబ్బంది కలిగించకుండా దైవానుగ్రహానికి పాత్రులు కావాలని ,ఆ దేవదేవుని ఆశీర్వాదం అందరిపై ప్రసరించాలని వేడుకుందాం.
సర్వేజనా సుఖినోభవంతు
డా. బండారి సుజాత
హనుమకొండ
చరవాణి: 9959771228
హామీ పత్రం: పై వ్యాసం నా స్వీయరచనని హామీ ఇస్తున్నాను