15/04/2025.
మహతీ సాహితీ కవి సంగమం -
ప్రతిరోజు కవితా పండగే...
అంశం: జాతర : గేయం.
శీర్షిక : సాంప్రదాయ పండుగలు.
రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .(43).
కవిత సంఖ్య..1.
---------------------
గిరగిర తిరిగే రంగుల రాట్నాలు
సందడి నిండిన జాతర హోరులు
పెద్దల మదిలో భక్తి భావాలు
చిన్నారి పాపలు చిందేటి నవ్వులు !!
అంగడి నిండిన బొమ్మల కొలువులు
గాజుల గలగల నిండిన భామలు
పట్టు పావడల రేపరెపల కళలు
కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!
చల్లని పానీయాలు పంచేటి దాతలు
అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు
బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు
నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!
కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు
ఇంపైన భజనలు ,. భక్తి పాటలు
నాగస్వరాల నాడే పాములు
భక్తిశ్రద్ధలతో కొలువుల పూజలు !!
గుడిలో దేవుని దర్శన భాగ్యం
నమ్మిన జేజికి బోనాల భోగం.
మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!
తీర్థ ప్రసాదాలనందే యోగం.!!
పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు.
జనాల మోమున వెలిగే కాంతులు.
జాతర నిండిన ఆనంద దీపాలు
కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!
జాతర, సందళ్లు జయమైన కోర్కెలు
గుండెలు నిండిన అతి మధుర స్మృతులు
దేవుని మహిమల కీర్తులే పాటలు
ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!
----------------------------
ఈ గేయం నా స్వీయ రచన.
No comments:
Post a Comment