సంబోధన (ప్రథమా విభక్తి)
ఉ..
దండము వాయుపుత్ర!రిపు దండన భక్త విధేయ ధీమణీ!
కొండలరాయ దైత్యహర !కుండల భూషణ!వానరేశ్వరా! చండ పరాక్రమా!విబుధ సన్నుత!
యక్షయ దానవాంతకా!
భండన భీమ!సర్వజన బాంధవ! బ్రోవగరావెమారుతీ!
కళిక (వృషభ గతి)
పవన తనయా పాపహరణా!భవ వినాశక భక్త పాలన!
దివిజ వందిత కోటి భాస్కర దివ్య శోభిత గాన మోహన!
కనక రత్న కిరీట ధారణ కాంతి మంతుడ పరమ పావన!
వినుత సద్గుణ వేదవేద్యా! వీరవర్యా విమల శోభన!
భావి బ్రహ్మవు వీరహనుమా!
భయ నివారణ పాప సంహర!
కావరా కరుణాంతరంగా!గందమాదన గిరి విహారా!
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ!దోష రహితా యాంజనేయా!
యష్ట సిద్ధుల కాది దేవుడ!
యభయమిడి కాపాడ రావయ!
ఉత్కళిక ( హరిణగతి)
దివ్యగాత్రా! దీన పోషా!
భవ్య చరితా!వరకపీశా!
యంజనీసుత! యద్రి ధీరా!
యంజలించెద భక్తి మీరా!
రామదాసా రణవిశారద!
భీమ సోదర విశ్వ వరదా!
సూర్య మిత్రా! సూక్ష్మ రూపా
కార్య సాధన!ఘన ప్రతాపా!
సార్వ విభక్తికము
శా..
నీవే తోడు, గదయ్య నాకు నెదలో,నిన్ నమ్మితిన్ భక్తిచే!
రావే నీకయి,వేచి చూచెద నయా! రారమ్మి యో పావనీ!
నీవల్లన్ సుఖశాంతులబ్బు భువికిన్ నీయందు నాధ్యానమున్
దేవా!మారుతి యాంజనేయ!
హనుమా!తేజోమయా బ్రోవరా!!
అంకితాంకము
ఉ..
ఛందపు బంధనంబులను సంధుల సంగతులన్ గణించకే
యందముగా నుదాహరణ మన్ గృతి నొక్కటి వ్రాసి నీ పదం
బందున నుంచి మ్రొక్కితిని నంకిత మీయగ నెంచి యంజనీ
నందన! "బండకాడి"యను నామక వంశ్యపు "అంజయాఖ్యుడన్"
No comments:
Post a Comment