Sunday, May 25, 2025

శీర్షిక : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

శీర్షిక  : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. ( 38).


--------------------


అక్షరాల వేదికపై, ఆలోచనల స్ఫూర్తితో,

సత్య దీపాలు వెలిగించేవాడే కవి.

లోకానికి అద్దం పట్టే, నిజాలను

 నిర్భయంగా చాటి చెప్పేవాడే కవి.!!


కాగిత రణరంగంపై, కలాన్ని ఖడ్గంగా మార్చి,

అన్యాయంపై పోరాడే  అక్షర వీరుడే కవి.

కష్టాల కడలిలో, కన్నీటి అలలపై,

ఆశల తీరం చూపే నావికుడు కవి.!!


భయమన్నది లేక, పక్షపాతమన్నది ఎరుగక,

పలుకుబడికి తలొగ్గని ప్రవక్తే కవి.

మానవత్వం మంటగలిసినప్పుడు,

మనసున్న మనిషిలా మేల్కొనేవాడే కవి.!!


అంధకారం ఆవరించిన వేళ,

వెలుగు కిరణం చూపించే ధైర్యమే కవి.

నిజాన్ని నిగ్గదీసి, నిర్భయంగా నిలదీసి,

నిత్య సత్యాన్ని నిలబెట్టేవాడే కవి.!!


అక్షరాల ఆయుధాన్ని  ఝళిపిస్తూ

విభేధాలను సృష్టించే వారిని ప్రశ్నిస్తూ

మానవత్వానికి  మన్నననిస్తూ

మనుగడని ప్రశ్నించేవాడే కవి. !!.


నోళ్ళు మూగబోయిన చోట,

వారధిగా నిలిచే వాగ్ధాటి కవి.

అణగారిన గొంతులకి స్వరమై,

 పోరాడే అక్షర నినాదమే కవి.!!


భయం తెలియని

 భావనా సాగరం కవిత్వం,

పలుకుబడికి తలవంచని 

ప్రళయ ఘోష కవిత్వం.!!


నివురు గప్పిన నిజాలకు ,

అతని కవిత్వం ఒక కరదీపిక,

అది సమాజానికి  అవ్వాలి

దారి చూపే సరికొత్త మార్గదర్శిక.!!

-----------------------




No comments:

Post a Comment