Sunday, May 25, 2025

శీర్షిక : వీడని లక్ష్యం.

15/05/2025.

శీర్షిక :  వీడని లక్ష్యం. 

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

కళ్యాణ్ : మహారాష్ట్ర.



హిమగిరుల శిఖరం నీ ధీరత్వానికి నిదర్శనం

ఆకాశమంత  విశాలమైనది నీ గుండె లయ తత్వం

 నీ మేని పులకరింతల మలుపు భూమి తల్లి  పిలుపు

నీ అడుగుల చప్పుడు శత్రువు గుండెల్లో ఉరుముల తలపు.


ఎండ నిప్పుల జ్వాలైనా నీ సంకల్పం చెదరనిది,

కురిసే వాన ప్రళయమైనా నీ ధైర్యం తరగనిది..

మంచు దుప్పటి ముసుగేసినా నీ కాంతి దాగని నిధి

నీ కనురెప్పల సారధి .సరిహద్దును కాచే పెన్నిధి.


 కొండంత బరువును మోసేది ,నీ భుజ బలం

నీ  చూపుల తూణీరం లక్ష్యాన్ని ఛేదించే వరం.

పట్టిన తుపాకీ బలం నీ  విశ్వాసానికి ప్రతిరూపం, 

తుపాకీ గుళ్ళ శబ్దం శత్రువు గుండెకు పిడుగుపాటు భయం.


నేల  నీ రక్తంతో ఎరుపెక్కినా, 

భరతమాత రక్షణకై నీవు నిలబడే ఉంటావు.

ఎప్పటికీ వదలని గమ్యం, భారతమాత కీర్తి పతాకం 

చివరి శ్వాస వదిలే వరకు ముందడుగే నీ లక్ష్యం.




15/05/2025.

మనోహరీ మహిళా పత్రిక కొరకు,

అంశం : ఐచ్ఛికం.

శీర్షిక: భరత వీరుడు.

ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర.



హిమగిరుల శిఖరాల వెన్నంటి నిలిచి,

దేశపు కీర్తి పతాకాన్ని భుజాన మోసేవు.

మాతృభూమి పిలుపు నీ గుండె చప్పుడుగా,

ప్రతి అడుగులో ధైర్యం నింపుకు నడిచేవు, 


ఎండైనా, వానైనా, మంచు కురిసినా ,చలికి వణకినా,

సరిహద్దు కాపలా నీ కర్తవ్యంగా నిలిచేవు.

చావు బతుకుల సంఘర్షణకు లోనవక

నీ గుండె లయల శ్వాసలో తెగువ నింపావు.


దేశమే నీ ఇల్లు, ప్రజలే నీ బంధువులుగా.

బలిదానమే బాధ్యతగా చేబట్టేవు.

అన్న పానాలకు లోటైనా, ఐనవారికి దూరమైనా 

కన్నీటి ప్రేమను కర్తవ్య బాధ్యతగా ఔపోసన పట్టావు.


తుపాకీ నీ ఆయుధంగా, ధైర్యమే నీ బలంగా,

న్యాయం కోసం పోరాటం  సాగించేవు

శత్రువు కంట పడితే సింహంలా గర్జించి,

భారతమాత రక్షణే నీ లక్ష్యమని నిరూపించేవు.


గాయాలైనా లెక్కచేయవు, ప్రాణాలైనా అర్పిస్తావు,

దేశం కోసం చేసే  నీ త్యాగం అనంతం.

నీ త్యాగానికి వెలకట్టలేము. 

మీ బలిదానానికి రుణం తీర్చుకోలేము..


ఓ భారతీయ సైనికుడా, నీ ధైర్యానికి  అభినందనం.

ఎనలేని నీ త్యాగానికి  నిత్య నీరాజనాలతో వందనం.


హామీ :

ఈ కవిత నా సీయ రచన





No comments:

Post a Comment