డా బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి* సందర్బంగా కవిత.
అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.
శీర్షిక : నిత్య చైతన్య స్ఫూర్తి .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
--------------------------
నలుపు తెరల వెనుక దాగి,
నలిగిన గుండె చప్పుడు విన్నావా?
భీముని పిలుపులో, అణగారిన
ఆత్మల ఆక్రందన విన్నావా?
పుట్టిన నేలపైనే పరాయివాడై,
నీరు సైతం నిరాకరించబడిన ,
ఒక బలహీనని భవిత కథ విన్నావా?
నీడ లేని బాల్యం, నిప్పుల కొలిమి వంటిది,
అంటరానితనపు ముల్లు గుచ్చినా, ఆత్మ నిబ్బరం చెదరనిది.!!
జ్ఞానపు జ్యోతిని వెలిగించి, చీకటిని
పారద్రోలాలనే తపన నిండిన ఘనతతనిది.!!
బడి గడప తొక్కనివ్వకపోయినా, పట్టుదల వీడని దీక్షా దక్షుడు,
పుస్తకాలే ప్రాణమిత్రులు కాగా ,అక్షరాలనే ఆయుధంగా, చేసుకున్నాడు.!!
కోట్లాది గొంతుల సింహ గర్జనై ,హక్కుల కోసం
ఉప్పెనలా ఉద్యమించాడు,
రాజ్యాంగ నిర్మాతగా శిఖరంలా నిలచి ,
ధృవతారలా జాతికి దిక్సూచి అయ్యాడు,!!
కులమతాల కట్టుబాట్లను తెంచి
పౌర హక్కులను కవచంలా కాపాడాడు,
రాజ్యాంగపు చుక్కానియై,
నవభారతానికి దిశానిర్దేశం చేసాడు.
సమానత్వం, సౌభ్రాతృత్వం నినదించి,
జాతిని వెలుగుబాట పట్టించాడు..
భారతీయ సమాజానికి భాస్కరుడిలా,
వెలుగునిచ్చే మార్గదర్శకుడయ్యాడు .!!
అతని ఆశయాలే మనకు స్ఫూర్తి,
ఆతని అడుగుజాడలే మనకు గమ్యం,
ఆతని పోరాటమజరామరం,
అణగారిన వర్గాలకు ఆయన, నిత్య చైతన్య స్ఫూర్తి .
భారత జాతి గుండెల్లో కొలువై ఉన్న
"డాక్టర్ అంబేద్కర్ " అమర ఘన కీర్తి.,
No comments:
Post a Comment