Tuesday, October 1, 2019

శ్రీ శ్రీ...గురించి.

🙏🌹🙏

శ్రీశ్రీ హాస్యవల్లరి...(ఎత్తిపోతలపథకం)

                                               🙏🌹👇

“ శ్రీశ్రీ “ తో సరదాగా కాస్సేపు…….!!

శ్రీశ్రీ అనగానే అగ్గి సెగ తగులుతుంది.ఎర్రజెండా రెపరెపలు కనిపిస్తాయి. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం.. శ్రీశ్రీ అంటే మరో ప్రస్థానం.శ్రీశ్రీ అంటే విప్లవం... కానీ..నిజానికి శ్రీశ్రీ అందరూ అనుకునేం సీరియస్ పొయెట్ ఏం కాదు. అప్పుడప్పుడు ఆటవిడుపుగా హాస్యాన్ని జోడించి ‘లైట్’  కవిత్వం కూడా చెప్పాడు.
శ్రీశ్రీ'సిప్రాలి‘..అదేనండి..(సి )సిరి‌సిరిమువ్వలు,(ప్రా )ప్రాస క్రీడలు,(లి ) లిమరిక్కులు ఈ కోవలోకే వస్తాయి.

“కంద” మంటే ఎంతిష్టమో?

వచన కవిగా మనకు తెలిసిన శ్రీ శ్రీ ,కవిత్వారంభంలో పద్యాలు రాశాడన్న సంగతి కొద్దిమందికే తెలుసు.”ప్రభవ “ “స్వర్గదేవతలు “ చదివితే శ్రీశ్రీ పద్యరచన తెలుస్తుంది.అయితే వీటిలో శ్రీ శ్రీ కందపద్యాన్ని మాత్రం వదిలేశాడు.నిజానికి.కందపద్యం అంటే శ్రీ గారికి తెగఇష్టం! శ్రీవచన కవిత్వం రాయడం మొదలెట్టాక పద్యాన్ని దాదాపు మరిచిపోయాడు .
ఓ పదేళ్ళ తర్వాత ఎందుకో మళ్ళీ కందపద్యంపై మనసు మళ్ళింది.ఏమయ్యా శ్రీ శ్రీ మళ్ళీపద్యం ఎందుకు ముట్టుకున్నావ్? అంటే..”.కందాల అందాలకోసమే రాస్తున్నా “ అన్నాడు.

“మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రా?యుటిది ఎట్లన్నన్
పళ్ళూడిన ముసలిది ,కు
చ్చెళ్ళన్ సవరించినట్టు సిరిసిరి మువ్వ !”

శ్రీశ్రీ ఆరంభిస్తే ఊరుకుంటాడా ! “సిరి సిరి మువ్వ “ మకుటంతో ఓ శతకమే రాసేశాడు.

“అందంగా,మధురస ని
ష్యందంగా ,పఠితృహృదయ సంస్పందంగా
కందా లొక వంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరి సిరి మువ్వా!”.!!

ఇదేకాదు 1945..50 కాలంలో మరో రెండు శతకాలను కూడా రాశాడు.
శతకం,లిమరిక్కులు.వీటన్నిటిని కలిపి “సిప్రాలి “ గా నామకరణం చేశాడు.రుక్కుటేశ్వరశతకం,పంచపదుల్ని కూడా సిప్రాలి లో పొందుపరిచాడు.నిజానికి సిప్రాలి ఇండియాలోపుట్టలేదు.1981లో అమెరికాలో వుండగా రాశాడు.అమెరికాలోనే పది డాలర్లు ఖర్చుపెట్టి మిమియో గ్రాఫ్ మిషన్ మీద యాభై ప్రతుల్ని స్వదస్తూరీతో తీయించాడు.సిప్రాలి ఒక్కో కాపీ ఖరీదు పది డాలర్లు.అవన్నీ అప్పుడే,అక్కడేఅమ్ముడైపోయాయి.

శ్రీశ్రీసిరిసిరిమువ్వ,రుక్కుటేశ్వరశతకం,చాటువులు,మేమే గేయసంపుటి లోని గేయాలు కేవలంనవ్వించే వుద్దేశంతో రాసినవి.నిజంగా కూడా నవ్వుతెప్పిస్తాయి.”బూతాడక దొరకునవ్వు పుట్టదు” (బూతు చెప్పక పోతే దొరకు నవ్వు పుట్టదు ) అంటూ మన బూతు కవి చౌడప్ప నవ్వింఛడమే తన ఉద్దేశమన్నాడు.శ్రీశ్రీ కూడా కేవలం నవ్వించే ఉద్దేశంతోనే సిప్రాలికి జన్మనిచ్చాడు.

శ్రీశ్రీ హాస్య రసం….!!

“ఎప్పుడు పడితే అప్పుడు
  కప్పెడు కాఫీ వొసంగ గలిగిన సుజనుల్
  చొప్పడిన యూరనుండుము
  చొప్పడకున్నట్టి యూరు చొలకుము మువ్వా “.

సుమతీ శతకంలోని పద్యానికి పద్యానికి పేరడీగా రాశాడీ పద్యాన్ని.

“వైవాహిక జీవితములు
దావాలకు దారితీసి తగలడిపోతే
కేవలము పెళ్ళి మాని ఖు
షీ వాలా లగుట మేలు ,సిరి సిరి మువ్వా! “

పెళ్ళి చేసుకొని,వాదులాడుకొని,విడిపోడానికి కోర్టులెక్కే బదులు ,పెళ్ళి మాని ఖుషీవాలాలు కావడమే మేలంటున్నాడు శ్రీశ్రీ.(శ్రీ శ్రీ గారికి రెండు పెళ్ళిళ్ళు.అది వేరే సంగతి )

“మీసాలకు రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే
సీసా లేబిల్ మార్చే
స్తే ,సారా బ్రాందీ యగునె ,సిరి సిరి మువ్వా !”

మీసాలకు,జుత్తుకు రంగేసుకుంటే తెలుపు దాగుతుందేమో గానీ,వయసు దాగదు కదా! ఉడికిపోయిన యవ్వనం తిరిగి వస్తుందా!సారా సీసాకు లేబిల్ మారిస్తే..సారా బ్రాందీ కాదు కదా అంటున్నాడు మన శ్రీ శ్రీ గారు (స్వీయానుభవం మరి )

“పనిలేని యట్టి మంగలి
యనుకొని మార్జాల శీర్షమును గొరిగెడు తీ
రున రాస్తానేదో ,రా
సిన దానికి కోపమేల ? సిరిసిరిమువ్వా !”

పనిలేని మంగలి పిల్లి తలగొరిగినట్లు ఏదో రాస్తాను.మీరు మాత్రం కోప్పడకండేం? అంటూముందుగానే సంజాయిషీ ఇచ్చుకుంటున్నడు శ్రీశ్రీ.కాబట్టి రాసిందాంట్లో తప్పులు వెదికేకన్నా. పనికొచ్చేదేమైనా వుంటే తీసుకోవడమే‌మేలన్నది కవి భావం.

రాసక్రీడ..శృంగారానికి, ప్రాసక్రీడ హాస్యానికంటూ ..”.ప్రాసల” తో ఎలా చెడుగుడు ఆడాడో?హాస్యం ఎలా పండించాడో చూడండి.

*”ప్రజాస్వామికం పేరిట
  పదవులకై పోటీ
  పరిపాలన చేసేదిక
  పోలీసుల లాటీ “...!!

ఎన్ని ప్రభుత్వాలు మారినా..నాయకులకు పదవుల ఆరాటమే తప్ప పరిపాలనపై దృష్టే వుండదు .పాలించేది,పరిపాలించేదీ పోలీసుల లాఠీలే ..మన  రాజకీయంపై శ్రీ శ్రీ చెంపదెబ్బ ఇది.

“వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు
వారి వారి సొంతం
పబ్లిక్కులో నిలబడితే
ఏమైనా అంటాం..”

తెలుగునాట బాగా పాపులర్ అయిన శ్రీ శ్రీ మాట ఇది.

*”ఉన్న మాటంటేనే
   ఉలికిపాటు పడాలా?
   యథార్థాన్ని వాదించే
   బంధువునే విడాలా?

యథార్థవాదీ లోక విరోధీ..అన్న సామెతకు శ్రీశ్రీ ప్రాస రూపం ఇది.ఉన్నమాటంటే ఉలిక్కిపడుతుంది లోకం.యథార్థాన్ని చెబితే ముఖం తిప్పే రోజులివి.!.

“లాటీలకు లోటుండదు
జైళ్ళలో చోటుండదు
రాబోయే ఎన్నికలలో
రౌడీలకు ఓటుండదు “...!!

శ్రీశ్రీ నాటి పరిస్థితుల్లో ఇలా రాశాడు గానీ..ఇప్పుడు వుండి వుంటే….“రాబోయే ఎన్నికలలో రౌడీలకే ఓటుండును “ అని రాసి వుండేవాడు.
అయితే ఈ కింది ప్రాస పద్యాన్ని మాత్రం సరిగ్గా రాశాడు.

“ పోలీసుల రాజ్యమిది
‌ పోలింగొక బూటకం
  ఫాసిజమై మారుతోంది
  ప్రజాస్వామ్య నాటకం “

ఇప్పటి పరిస్థితులకు చక్కగా అతికే పద్యమిది.

“పిట్టపోరు పిట్టపోరు
పిల్లి తీర్చినట్టుగా
రెడ్డి తగవు కమ్మ తగ్టవు
రెడ్సు తీర్త్రు గుట్టుగా “...

వర్త మాన రాజకీయాల్లో నిజానికి జరిగింది మాత్రం ఇది కాదు.రెడ్స్...అంటే కమ్యూనిస్టులు కొంతకాలం రెడ్లతో (కాంగ్రెస్ )మరికొంత కాలం కమ్మవారితో (తెలుగుదేశం  )పొత్తుల పేరుతోభుజంళభుజం కలిపి ఊరేగారు.ఫలితంగా రెడ్లు,కమ్మలు మిగిలారు.రెడ్స్ ..ఉనికే గల్లంతైంది.

*పంచపదుల్లోనూ “ప్రాసే “..!!

“అరవ్వాడి దోసై
మీద తోచింది వ్రాశై
ఏవో విట్లు వేశై
ఏవో ఫీట్లు చేశై
తర్వాత చూసుకుందాం ప్రాశై..!!”

ఈ దంపతులగురించి పంచపది ‘లో ఎలా  పంచ్ ‘ వేశాడో చూడండి.

“ అతగాడి పేరు గురాచారి
  అతనో పెద్ద దురాచారి
  అతని దెప్పుడూ మరో దారి
  అతని కంటే భార్య కొద్దిగా అనాకారి
  అతని పాలిట కావిడ మహామారి “!!

*లిమరుక్కలు….!!

అమెరికా స్నేహం గుబాళించే ఈ రోజులను శ్రీశ్రీ ఆనాడే ఊహించాడేమో?అమెరికా ముష్టి ఎంత నష్టమో? ఈ లిమరిక్కులో ఎంత చక్కగా చెప్పాడో చూడండి.!!

*”పెరిగితే వ్యాపార దృష్టి
  మరిగితే లాభాల సృష్టి
  దొరికితే అమెరికా ముష్టి
  మిగిలేది విగ్రహ పుష్టి
  నైవేద్య నష్టి!!

నాటి జనసంఘ్ గురించి ఎలా చెప్పాడో చూడండి.

*”జనసంఘం
  మారణ సంఘం
  ప్రతారణ సంఘం
  విచారణ సంఘం
  కలహ కారణ సంఘం
 
*”జనసంఘం
   హరేరాంభజన సంఘం
   అశక్త దుర్జన సంఘం
   అపకీర్తి సమార్జన సంఘం
   అమేధ్య భోజన సంఘం “..

ఈ జనసంఘే కాలగతిలో భారతీయ జనతాపార్టీగా మారింది.

సినారె మీద విసిరిన చమక్కు చూడండి.!!

*”సినారె
   బళారె
అన్నిట్లో హుషారె
   సినిమా రె
డీమేడ్ సరుక్కీ తయారె !!

ఇక విశ్వనాథ సత్యనారాయణ గారినైతే ఎలా ఉతికి ఆరేశాడో చూడండి!!

*”వెయ్యి పడగలు
   లక్ష పిడకలు
   లక్క పిడతలు
   కాగితపు పడవలు
   చాదస్తపు గొడవలు “!!

వెయ్యిపడగలు ఓ సుదీర్ఘ నవల.దీనికే విశ్వనాథవారికి జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.ఇక తనపై తానే జోకు వేసుకున్నాడంటే శ్రీ శ్రీ ఎంత హాస్యచతురుడో అర్థం చేసుకోవచ్చు.

*”శ్రీశ్రీ ఒక చెత్త కవి
   వాడి వల్లనే దేశం ముక్కలవుతోంది.”

నిజానికిది నాటి ముఖ్యమంత్రి వెంగళరావు గురించి చెబుతూ ,
“వెంగళరావొక జాతీయనాయకుడు..ఆయన వల్లనే తెలుగు వాడుఏకమైందంటూ...పొడిగింపుగా తన గురించి చెప్పుకున్నాడు.వెంగళరావు ముఖ్యమంత్రిగా వున్నపుడు ఎందరో కవులు జైలుపాలయ్యారు .ఎమర్జన్సీ సిఎం గా ఆయనకు చెడ్డపేరొచ్చింది.దానివల్లతెలుగు వాళ్ళంతా ఏకమై పోరాడారన్నది శ్రీశ్రీ భావం.ఇక శ్రీశ్రీ లాంటిచెత్త కవులవల్ల దేశం ముక్కలవుతోందన్నది నాటి రాజ్యం అభియోగం.అందుకే నాడు జైళ్ళు నోళ్ళు తెరిచాయి.ప్రభుత్వ నిరంకుశ విధానాల్ని ప్రశ్నించిన ప్రజాస్వామ్య వాదులు,కవులు,రచయితలు కటకటాలపాలయ్యారు.

ఏమైతేనేమి? థోడా ఖట్ఠా..థోడా మిట్ఠా.వెరసి శ్రీశ్రీ హాస్యవల్లరి పాఠకలోకంలో అల్లరి చేసింది!!

                                      🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment