#రౌద్రగీతాలాపన
నాదేశం లో
చెట్లకు ఉరితాళ్లు కాస్తాయి
టీవీ లకు
సెలెబ్రిటీలు పుడతారు
పంటలకు రాజకీయతెగుళ్లు పడతాయి
దేశమంతటా పాపం విరివిగా పండుతుంది
ధనవంతులకు కొత్త రెక్కలు వస్తాయి
దరిద్రుల ఉన్న రెక్కలు విరుగుతాయి
వార్తలు చేయి తడుపుకొని
జనం మీద అబద్దాల వాంతులు చేసుకుంటాయి
పత్రికలు నిలువెత్తుగా పరమపదిస్తాయి
రోడ్ల కన్నా అందం గా
ప్రయివేట్ పార్ట్లు బహిరంగ ప్రదేశాలై టాటూలు తలెత్తుకొని తళ తళ మెరుస్తుంటాయి
చెత్త కుండీ లో దొరికే
టెడ్డి బేర్ ను
ఉతుక్కొని కడుక్కొని ఆడుకునే పిల్లల్లో మాతృదేశం
వంశాభివృద్ధి శరవేగగం గా పురుడుపోసుకుంటుంది
రోడ్డు మీద
ఎవడో బీరు తాగి పడేస్తే
ఆ ఖాళీ సీసాలు సేకరిస్తూ ఖాళీ కడుపుల్ని నింపుకునే
మనుషులు లెక్కల్లోకి రారు
వాళ్ళను ఎవ్వరూ లెక్క పెట్టరు
తరగతి గదుల్లో
మొద్దు బారిన తలకాయల్లో
ప్యాకేజిల దౌర్భాగ్యం పురి విప్పుకొని
చేతుల్లో డిగ్రీలు
బానిసలుగా ప్రశంసాపత్రాలై మెరుస్తుంటే
మేథావులు సామాన్యల మెడలు వొంచి పేరుగడించే ఆరాటం లో
విలువలు, విశ్లేషణలు రమించు కొని
పుట్టే రసకందాయ చూపుల్లో
భావ దారిద్య్రం బట్టలు లేకుండా
క్లబ్ నో కన్ను గా
పబ్ నో కన్ను గా
వెన్ను విరుచుకుంటూ అర్ధరాత్రి ఆవలిస్తూ
ఉదయానికి ఉపాధ్ఘాతాలకు ఉపక్రమిస్తుంది
అమ్మిన వాడు అధోగతిపాలై అదే ఊళ్ళో
అడుక్కుతింటుంటే
కొన్న వాడు కోరికల్ని సొంత పాదాల కింద ఆనందం గా నలుపుకుంటూ
మనుషుల్లో ఉన్నత శ్రేణి అని పేర్కొంటున్న ఉన్నోళ్లకు పుట్టిన కళ్ళకు
పురుగుల్లా కనిపిస్తూ
కార్లకు, షికార్లకు
దూరం గా తప్పుకుంటుంటారు
మీకు పెద్ద పెద్ద
భవనాల మీద
అద్భుతమైన రంగులు, చిత్రమాలికలు కనిపిస్తాయి కదా
అవి నాకు నెత్తురు మరకల్లా గోచరిస్తాయి
వాళ్ళ పద్ధతులు, ఆచార వ్యవహారాలు
నా ముందు తరాలకు ఆదర్శం అవుతుంటే
నాకు అమితానందమే
కానీ చచ్చే దాక వాడి పాదాలోత్తుకుంటూనే మురిసి పోతాం అంటే
నేను మీ మొహాల మీద ఉమ్మేయడానికి కుడా
వెనకాడను
నీకిప్పుడు
వినోదం కాదు
నీ దయనీయ స్థితిని చీము నెత్తురు తో చిత్రించే ఒక చలన చిత్రం కావాలి నీ అడుగు
కమ్మని కోయిలల గొంతులు కాదు
నీలో చచ్చిన ఆత్మగౌరవం పునర్జీవించే
రౌద్ర గీతాలాపన ప్రభవించాలి
బుర్ర నింపే బూజు పట్టిన
రంకు చరిత్రల సిలబస్లు కాదు
మెదడులో భూకంపం పుట్టే
ఆలోచనలకు ఆయువు పొసే
నికార్సైన అక్షర జ్ఞానం కావాలి
మనుషులల్ని అసహ్యించుకునే
మనుషులు నా కంటి కి
పందుల మలమూత్రాల్లా కనిపిస్తుంటారు
పుట్టడం వెనక చావడం వెనక
దేవుడి చిత్తశుద్ధి
ద్రోహులకు పంచభక్ష్య పరమాన్నాలను ప్రసాదిస్తుంది
నీలో నెత్తురు అడుగంటుతుంటే
చరిత్ర నీ మలమూత్రాలతో
చేతులు కడుక్కునే ప్రయత్నం లో నీ కన్నా ఓ అడుగు ముందే ఉంటుంది
నీ సంతోషం పక్కవాడి సంతోషం అయ్యింది కానీ
నీ బాధ పంచుకునే మహాత్ముడు నీ జీవితంలో ఎదురు పడ్డాడా!
నిన్ను నీవు గుర్తించుకో ముందు
నువ్వో ఏకాకి వి
నీ పిండం ముట్టడానికి కాకులు కుడా వెనకాడే వేదకాలం నాటి
వెనుకబాటు, దరిద్రాలే నేటికీ నీ ఆస్తి పాస్తులు
Indrapala Srinivas
No comments:
Post a Comment