Tuesday, May 25, 2021

నేల తల్లి.కవిత

గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక నేలతల్లి కవితల పోటీ కొరకు 

అంశం : నేల తల్లి 

శీర్షిక :  తల్లిగ క్షమిస్తున్నా

పృథ్వికి పుట్టెడు దుఃఖం పుత్రుల వలన 
రత్నగర్భకు రోదన సుతుల వలన
చెడ్డ కొడుకు గలడు ఇలలోన
చెడ్డ తల్లి ఉండబోదు కలనైన

నా తనువంత తూట్లు పొడిచినా 
పచ్చని పంటనే తిరిగి మీకిస్తున్నా 
నా బొజ్జన బొరియలు వేసినా 
మంచి నీటినే మీకందిస్తున్నా

నా కాయాన్ని ఖండాలు చేసినా  
బంగారాన్నే బదులుగా ఇస్తున్నా
నా తరువుల రెక్కలు విరిచినా
ప్రాణవాయువిచ్చి ప్రాణం పోస్తున్నా

బహుళంతస్తుల భావనాలెన్ని కట్టినా 
భారాన్నంతా పంటిబిగువన భరిస్తున్నా
భారమెక్కువై  నా భుజాలు వణికితే
కలిగిన అనర్ధానికి మన్నించమంటున్నా  

వ్యర్ధాలతో నా వదనాన్ని నింపినా 
ఎరువుగా మీకే మార్చిస్తున్నా 
కన్న కడుపునే కాలితో తంతున్నా
ఓర్పుతో సహిస్తున్నా, తల్లిగ క్షమిస్తున్నా

==== **** ==== **** ====

జె వి కుమార్ చేపూరి
హైదరాబాద్ – 500 019
చరవాణి : 96407 12062

No comments:

Post a Comment