Friday, March 10, 2023

నీరా ఆర్య ..వీర నారీమణి

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహతీ సాహితీ కవిసంగం-కరీంనగరం.
తేది: 10-03-2023, శుక్రవారం.
అంశం:ఐచ్ఛికము "వీరనారీమణులు"
ప్రక్రియ: వ్యాసము
శీర్షిక: "నీరా ఆర్య"
పేరు : జోషి మధుసూదన శర్మ

*మహిళా దినోత్సవం కానుకగా యదార్థ కథ
వింటేనే ఒళ్లు గగుర్పొడిచే వీరవనిత కథ ఇది.*


కుబేరుల కుటుంబంలో  పుట్టిన ఆ ఆడపిల్ల దేశం కోసం భర్తనే కడతేర్చి, జైలు కెళ్ళి జీవన చరమాంకంలో పూలు కట్టుకుని, వాటిని అమ్ముకుని బ్రతికింది తప్ప ప్రభుత్వం ముందు చేయిచాచి అడుక్కోలేదు. "అండమాన్ నికోబార్" జైలులో "కాలాపానీ చెరసాల"లో బంధీకృతమై దేశం కోసం తన యెదను కోయించుకుంది తప్ప తమ నాయకుడు బోస్ వాకబు విప్పలేదు. దర్జాగా కూర్చుని కాలుమీద కాలేసుకుని బ్రతకగల జీవితాన్ని కాదనుకుని దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆ వీరవనిత పేరు "నీరా ఆర్యా". ఇలాంటి ఎందరో త్యాగధనుల రక్తం ధారపోస్తే లభించిన స్వాతంత్ర్యం నేడు బిచ్చం విదిలిస్తే లొంగిపోయే అప్రతిష్ట ప్రస్థానం చూస్తుండటం తీరని చేటు.

నీరా ఆర్య గురించి విన్నాక ఇలా ఎందరు ఉన్నారు అని మనసు అల్లాడి పోతుంది. స్త్రీ తన యెదను కోయించుకోవడం కన్నా భయంకరమైన శిక్ష ఏముంటుంది?. నీరా ఆర్య ఉత్తర ప్రదేశ్ వనిత. ధనవంతుల కుటుంబం. తండ్రి సేఠ్ జఠ్మల్. కలకత్తా లో చదువుకుంది. ఆమెకు యుక్త వయసు రాగానే బ్రిటిష్ ప్రభుత్వంలో సి.ఐ.డి. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే శ్రీకాంత్ జయరాం దాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' పట్ల ఆసక్తి పెరిగి రహస్యంగా ఝాన్సీ లక్ష్మి రెజిమెంట్ లో చేరి తన దేశ భక్తిని చాటుకుంది నీరా. అదే సుభాష్ చంద్రబోస్ ను పట్టుకునే బాధ్యతను బ్రిటిష్ ప్రభుత్వం ఆమె భర్తకు అప్పగించింది. విధి విచిత్రం అంటే ఇదేనేమో. దేశభక్తి నిండిన భార్య. దేశభక్తుల్ని పట్టించే ఉద్యోగ భర్త. ఈ క్రీడలో చివరకు భర్తను హతమార్చి జైలు పాలైన భార్య వీరవనిత నీరా...

ఎలాగంటే సుభాష్ చంద్రబోస్ ఆంతరంగిక సేనాని అయిన నీరా ఆర్య గురించి భర్తకు తెలిసింది. తనకు బోస్ ను పట్టించమని ఆమెను అడిగాడు భర్త. తాను ఎప్పటికీ అలా చేయనని తెగేసి చెప్పింది నీరా. అయితే ఆమెకు చెప్పకుండా ఓ రోజు రహస్యంగా వెంబడించి వెళ్ళాడు ఆ భర్త. సుభాష్ చంద్రబోస్ కారులో వెళ్తూ కనిపించగానే కాల్చేశాడు. బుల్లెట్టు బోస్ కి కాకుండా డ్రైవర్ కి తగలటంతో బోస్ ప్రమాదం నుండి తప్పించుకున్నారు. తన భర్త ఆగడం పసిగట్టిన భార్య తక్షణం కత్తి దూసి అతని కుత్తుక కోసి ప్రాణాలు తీసేసింది. ఇది సాధ్యమా? దేశభక్తి అంత గొప్పది మరి. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో నీరా ఆర్య చేసిన ఈ తెగువ అసామాన్యమైనది. ఆమె చరిత్ర మరువలేనిది. బ్రిటిష్ ప్రభుత్వం ఆమె నేరాన్ని విచారించి జీవిత ఖైదు విధించింది. ఆమెను 'కాలాపానీ చెరసాల'లో గొలుసులతో కట్టి ఉంచారు. ఓ రోజు గొలుసులు తెంపే క్రమంలో సుత్తితో ఆమె కాలుపై కొట్టడంతో విలవిలలాడుతూ ఆ వ్యక్తిని తిట్టింది. దాంతో సుభాష్ స్థావరం ఎక్కడో చెప్పమని హింసించారు. తాను ససేమిరా చెప్పనని, ఆయన స్థావరం తన గుండెల్లో ఉందని చెప్పింది. అంతే మదించిన బ్రిటిష్ అధికారి ఆమె రొమ్ములు కోసేయమని ఆజ్ఞాపించాడు. చెట్టు కొమ్మలు నరికే రంపంతో ఆమె కుడి రొమ్ము కోసేశారు. రక్తం చిమ్ముతున్న ఆమె యెద తెగి నేలపై పడింది. విలవిలలాడుతూ కుప్పకూలిన ఆమె దైన్యావస్థను చూసి పగలబడి నవ్వుకున్న బ్రిటిష్ దమనకాండ ఈ తరానికి ఎలా తెలుస్తుంది.

 ఆమె ధైర్యం తెగువ చూసిన అక్కడి భారతీయ వైద్యులు ఆమెకు చికిత్స చేసి బ్రతికించారు. కాలాపానీ జైలులోనే నరక యాతన అనుభవించి, ‌స్వాతంత్ర్యం వచ్చాక ఆమె విడుదలైంది. మారిపోయిన దేశకాల పరిస్థితుల్లో ఆమె హైదరాబాద్ కు చేరుకుంది. చిన్న పూరి గుడిసె వేసుకుని పూలు అమ్ముకుని బ్రతికింది. ఆమె త్యాగం ఎవరికి పట్టలేదు. ఏ స్వాతంత్ర్య పింఛను పొందలేదు. రికమండేషన్ లెటర్స్ తో స్వాతంత్ర్య యోధుల జాబితాలో పేరు చేర్చుకుని చంకలు గుద్దుకున్న వంచకులు ఎందరో... కానీ విషాదం ఏమిటంటే ఆమె వేసుకున్న గుడిసె,  ప్రభుత్వ స్థలమని కూల్చేశారు. ఆమె ఎవరినీ ధూషించలేదు. అలాగే గాలికి ధూళికి బ్రతికింది.  చివరికి 96 ఏళ్ల వయసులో ఆమె 1998 లో మరణించారు. ఈ కధనం మనలో జాలి పుట్టిస్తే అది పెదవి వట్టి విరుపు. దేశభక్తి నింపితే అది నిజమైన గట్టి మలుపు.  స్త్రీ జాతి ధైర్యసాహసాలకు, దేశభక్తికి, త్యాగనిరతికి నీరా ఆర్య జీవితం ఈ దేశంలో మహిళలందరికీ స్ఫూర్తి.

 నీరా ఆర్య గురించి మహిళా దినోత్సవం రోజున తెలుసుకోవడం సముచితం. సుభాష్ చంద్రబోస్ స్థాపించిన "ఆజాద్ హింద్ ఫౌజ్" పట్ల ఆనాడు దేశభక్తితో ఎందరో మహిళలు చేరి దేశానికి తమ సేవలందించారు. ఈనాడు చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలకు దిగుతున్న మహిళలు ఈ కథ విన్నాక తమ జీవితాలను సరైన అవగాహనతో నడుపుకుంటారని ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటారని ఆశిద్దాం.

( ఈ వ్యాసం నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.)

No comments:

Post a Comment