Saturday, March 18, 2023

దేవీపురం వైజాగ్

తపస్వి మనోహరం మహిళా పత్రిక కొరకు
తేదీ 18_3_23

 అంశం దర్శనీయ స్థలాలు పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై 

శీర్షిక శ్రీ చక్రాలయం

 విశాఖపట్నం జిల్లా : దేవీపురం

 ఒక ఆలయాన్ని శ్రీ చక్ర ఆకారంలోనే నిర్మించడం చాలా అరుదైన విషయం. 
ఈ ఆలయంలో రాజరాజేశ్వరీ, శివుడు కొలువై ఉన్నారు. 

 వైజాగ్ నగరానికి సరిగ్గా 30 కి. మీ ల దూరంలో, చుట్టూ పచ్చదనంతో విరాజిల్లుతున్న 'దేవీపురం' ఒక గొప్ప ఆలయాల సముదాయం. దేవీపురం ఓ అద్బుతమైన అభినవ మణీద్వీపం.

 ఇది నవీన ఆలయం. ఈ ఆలయం 1983లో ప్రారంభించబడి, 1994లో పూర్తి చేయబడినది. 
ఇది నవీన ఆలయమైనను దీనికి ప్రాచీనత చేకూర్చు ఒక కథ చెప్పబడుతూ ఉంటుంది. 

 విజయనగర సామ్రాజ్య సంస్థాపకులు హరిహర బుక్క రాయలనియు, వారిని పురికొల్పినవారు శ్రీ విద్యారణ్య స్వాముల వారనియు తెలియుచున్నది. 
శ్రీ విద్యారణ్య స్వాములవారు రాజనీతి విశారదులేగాక, వేదవేదాంగ పారాయణులుగా గూడ .వారికి శ్రీచక్ర, శ్రీమేరు ఆలయమును కట్టించవలెనను కోరిక యొకటి ఉండేదట, వారొకనాడు శ్రీచక్రాధి దేవతయైన శ్రీవిద్యాదేవిని ప్రార్ధించి తన కోరిక నెరవేరని  కారణమేమిటని అడిగారని వారి మాటలు విని శ్రీవిద్యాదేవి, మహర్షి ఆ పని ఇపుడు భవిష్యత్తులో జరుగవలసి ఉంది. అందుల కొకరిని వేరే నియమించి ఉన్నాను. అందుచే ప్రయత్నం నెరవేరుట లేదు. కనుక నీవా ప్రయత్నం విరమించుకొని కాలమున అప్పగించిన అందుచే వారి ప్రయత్నమును విరమించుకొని, దానిని కాలమున కప్పగించారని తెలుస్తుంది.

 దేవీపురంలోని శ్రీ చక్రాలయంలో “సహస్రాక్షి” గా శ్రీరాజరాజేశ్వరీ దేవి భక్తులకు దర్శనమిస్తోంది. ఇక్కడి ఆలయం అంతా ఒక శ్రీ చక్రమే. ఇంత పెద్ద శ్రీచక్రాలయం ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు.

 స్థల పురాణం __

 న్యూక్లియర్ ఫిజిక్స్ లో డాక్టరేట్ చేసి, ముంబాయిలోని టాటా ఇన్ స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న నిష్ఠల ప్రహ్లాద శాస్త్రిని ఈ ఆలయ నిర్మాణానికి అమ్మవారు ఎన్నుకుంది. 
ఒకసారి ప్రహ్లాదశాస్త్రి గారు హైదరాబాద్ లో బిర్లామందిర్ కు వెళ్ళి, బాలాజీని దర్శించి, ఒకచోట ధ్యానం చేసుకుంటుండగా, వారికి బాలాజీ స్త్రీ రూపంలో త్రిపురసుందరిగా దర్శనమిచ్చి "నాకు ఇల్లు కట్టించు" అని పలికి అంతర్థానమైనట్లు అనిపించిందిట.
అప్పుడే కాకుండా మరొకమారు వారికి ధ్యానసమయంలో దర్శనమిచ్చి "ఈ కార్యం నీ వల్లే నెరవేరాలి. జాగ్రత్తగా, దోషరహితంగా, ప్రజలందరికీ మేలు కలిగేలా శ్రీదేవి నిలయం నిర్మించు" అని ఆదేశించింది.
ప్రహ్లాద శాస్త్రి తమ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వస్థలమైన విశాఖపట్నం వచ్చారు.

 ఆలయం నిర్మించాలనే సంకల్పంతో 1982 లో 108 రుత్విక్కులతో 16 రోజులు దేవీయాగం చేశారు. ఆ యజ్ఞంలో ఆలయం నిమిత్తం మూడు ఎకరాల భూమి యజ్ఞప్రసాదంగా లభించింది. ఈ విధంగా శ్రీ చక్రాలయ నిర్మాణ స్థలాన్ని త్రిపురసుందరీ దేవి స్వయంగా ఎంచుకుంది. 

 ఆ ప్రదేశంలో తవ్వితే, అగ్నిలో కాల్చిన గుర్తులున్న పంచలోహ శ్రీచక్ర మేరువు లభించింది. దాని గురించి విచారించగా సుమారు 250 ఏళ్ళ క్రితం అక్కడ గొప్ప యజ్ఞం జరిగినట్లు తెలిసింది. ఆ శ్రీచక్ర మేరువును మళ్ళీ భూమిలో నిక్షిప్తం చేసి దానిపై కామాఖ్యపీఠం ప్రతిష్టించారు. ప్రక్కనే వున్న ఎత్తైన కొండమీద శివాలయం కట్టించారు.

 ఈ  శ్రీచక్రమేరునిలయం 108 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు కొలతలతో నిర్మితమైంది. 
ప్రహ్లాదశాస్త్రి ఏకాగ్రతతో, సౌందర్యలహరిలో ఆదిశంకరులు సూచించిన విధంగా, లలితా సహస్రనామ స్తోత్రంలో వాగ్దేవతలు వర్ణించిన విధంగా ఉండేటట్లు ఆలయ నిర్మాణం పూర్తి చేయించారు. 1990 లో జూన్ 4 వతేదీన మూలవిరాట్ ‘సహస్రాక్షి’ విగ్రహ ప్రతిష్ట జరిగింది. 

 శ్రీ చక్రాలయంలో బిందు స్థానంలో (మూడో అంతస్తు) పవళించిన సదాశివుని మీద కూర్చున్న, నిలువెత్తు ఆ విగ్రహం కళ్ళలోకి చూస్తుంటే, జీవకళ ఉట్టిపడుతూ, జీవితం ధన్యమవుతుంది. 
ఆమె చుట్టూ, క్రింది అంతస్తులలో, నక్షత్రాలను2 పోలిన ఆవరణలు, వాటిలో ఆమె పరివార దేవతలు ఉన్నారు.

 నిష్ఠల ప్రహ్లాద శాస్త్రికి ధ్యానంలో గోచరించిన విధంగా ఖడ్గమాల దేవతలకు రూపకల్పన చేసి గంధర్వ మాతృమూర్తులుగా 68 విగ్రహాలను భూమి మీద, 10 విగ్రహాలను మొదటి అంతస్తులోను, 2 అంతస్తులో 10 విగ్రహాలను సిమెంటుతో చేసి పెట్టారు. 
మిగిలిన విగ్రహాలను పంచలోహాలతో చేయించి మూడో అంతస్తులో అష్ట దళ పద్మంలో ఉంచారు. 

 భ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండీ, మహాలక్ష్మీ, బాలాజీ, కాళియమర్దన చేస్తున్న శ్రీకృష్ణుడు _ఈ 10 విగ్రహాలనూ రాతితో చెక్కించి ప్రతిష్టించారు. 

 ఆది దేవత స్వరూపమైన సహ్రక్షి (సహ్రక్షి అంటే 'వెయ్యి కళ్ళు కలిగినదని' అర్థం) మరియు కామేశ్వరుడు (శివుడు) ఇక్కడి రెండు ప్రధాన దైవాలు.

 అమ్మవారు గర్భగుడి లో నిండైన వస్త్రధారణలంకరణ లో, బిందు స్థానంలో సృష్టికార్యంలో ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారికి నేరుగా భక్తులే పంచామృతాలను (నీరు, పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు) ఉపయోగించి జరుపుతారు.

వైజాగ్ కు దేవీపురం 28 కి. మి. ల దూరంలో కలదు. అనకాపల్లి ఐతే దీనికి దగ్గరలో ఉన్నది. ఇది కేవలం 18 కిలోమీటర్ల దూరమే ..

No comments:

Post a Comment