నాణానికి రెండో వేపు...1
అఖిలకు చాలా సహనంగా ఉంది ఏంటి జీవితం ఎన్నాళ్ళు ఇలా ! పొద్దున్నే లేవడం, గబగబా ఇంటి పని, వంట పని- చేసుకొని ,ఆఫీస్ కి వెళ్లడం అక్కడ సాయంత్రం దాకా ఊపిరి తిరగని పనితో సాయంత్రం 5:30 దాకా కష్టపడడం , తిరిగి ఇంటికి రావడం, మళ్ళీ రాత్రి వంట ,
పొద్దున లేచి ఆఫీస్కి వేసుకునే బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, ఆఫీస్ డబ్బా కోసం కూరలు తరుక్కోవడం ,ఇలా...
రాత్రి పడుకునే సరికి 11 దాటిపోతుంది .
పని, పని ,పని , ఎంత చిరాకుగా ఉందో...
అమ్మా,నాన్నలకు ఆరోగ్యం అంతంత మాత్రం గానే ఉంది.
తన మీద అన్నొకడున్నాడు . వాడు ప్రేమ పెళ్ళంటూ
ఒక తమిళ అమ్మాయిని చేసుకొని, చక్కగా ఆమెతో పాటు
అమెరికా వెళ్ళి పోయాడు. వెళ్లిన వాడు వెళ్ళినట్టే వెళ్లి మరి తిరిగి రాలేదు, . కన్నెత్తి చూడలేదు , పన్నెత్తి పలకరించలేదు
దాంతో తల్లిదండ్రుల బాధ్యత తన మీద పడింది.
ఉద్యోగం వచ్చిన తర్వాత తన పెళ్లి విషయం తాత్కాలికంగా మూల పడింది.
రెండేళ్లు ఇట్టే గడిచిపోయాయి.
తనకు 30 ఏళ్ళు పైపడ్డాయి.
అమ్మ నాన్న తనకు పెళ్లి చేస్తామని అప్పటినుంచీ.. ప్రయత్నాలు చేస్తూనేన్నారు . కానీ "ఉద్యోగం చేసే పిల్లవద్దని" కొంతమంది , "అమె పెళ్లయిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు" అని కొంతమంది , "ఉద్యోగం చేసే పిల్ల అయితే మాకు కావాలి కానీ, తర్వాత మీ ఇరువురి బాధ్యత తను తీసుకోవాల్సి వస్తుందేమో కదా, "అని మరి కొంత మంది,
ఇలా ఏదోరకంగా వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతున్నాయి.
దాంతో అమ్మ నాన్నలకు ,తనకసలు పెళ్లి అవుతుందా అన్న బెంగ మొదలైంది.
వాళ్ల బెంగ చూసి తనకు నిరుత్సాహం మొదలైంది.
చూడడానికి అయితే తను బాగానే ఉంటుంది .అందంకేం కొరత లేదు. ఛాయ కూడా కాస్త తెలుపనే చెప్పొచ్చు .కన్ను ముక్కు తీరుగానే ఉంటాయి.
పోస్ట్ గ్రాడ్యుకేషన్ చేసింది . మంచి ఉద్యోగం చేస్తోంది .
మంచి జీతం వస్తుంది . కానీ తల్లిదండ్రుల బాధ్యత తన మీద ఉందన్న ఒక్క నెపంతో తనకి ఈనాటి దాకా సంబంధాలు కుదరలేదు.
ఇప్పటికే తన వయసు 32 దాటింది .రొటీన్ గా చేస్తున్న పనితో జీవితం చాలా విరక్తిగా ఉంటోంది.
ఆలోచిస్తూ అరగంట నుండి పక్క మీద దొర్లుతున్న , అఖిలకు నిద్ర అన్నది మాత్రం రావడం లేదు .
ఈరోజు తను డ్యూటీ నుంచి రాగానే అమ్మ చెప్పిన మాట
రేపు తనకు పెళ్లి చూపులట.అమ్మ చాలా సంబరంగా చెప్పింది
"అబ్బాయి చాలా సింపుల్ గా ఉంటాడట .కొంచెం పొట్టిగానీ మిగిలిన విషయాలకు ఏమి లోటు లేదట .
ఛాయ కొంచెం తక్కువైనా ,మంచితనానికి మారు పేరట.
ఎవరి మనసు కష్టపెట్టడట."
ఇవన్నీ చెప్పుకోవడానికే , గాని నిజంగా మగవాళ్లంతా అలా ఉంటారా ? చాలా అరుదు కదూ.
అబ్బాయికి తను నచ్చినా, తనకు మాత్రం అబ్బాయి నచ్చొద్దూ ? తనకన్నా పొట్టిగా ఉంటే ఎలా ఒప్పుకోవడం.
తనకన్నా కొంచెం ఛాయ కూడా తక్కువేనట .
ఏమో చూద్దాం, పొద్దున్నే చూస్తాను కదా !అప్పుడే నిర్ణయించుకోవచ్చు." అనుకుంటూ అఖిల నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ కళ్ళు మూసుకుంది.
*******************************
ఆరోజు ఆదివారం .
ఆఫీసుకి సెలవు రోజు. అయినా సరే పెళ్లిచూపులు కారణంగా తను తొందరగానే లేచింది..
పెళ్ళివారు రాగానే ఇవ్వడానికి ఒక స్వీటు, హాటు,తయారు చేసి ,కాఫీ గుండ ఫిల్టర్ లో వేసి, డికాషన్ తీసి ఉంచి,
పక్కనే గిన్నెలో పాలు వేడి చేసి ఉంచింది .
వీలైనంతవరకు అమ్మని శ్రమ పెట్టకుండా ఉండాలన్నదే అఖిల తాపత్రయం .
ఇల్లంతా నీట్ గా సర్ది ఉంచి, స్నానం చేసి , దేవుని ముందు దీపం పెట్టి ,తర్వాత తనకు తోచిన విధంగా తయారై హాల్లోకి వచ్చి కూర్చుంది.
అప్పటికే సమయం తొమ్మిదిన్నర అయింది.
పది, పదిన్నర ప్రాంతంల్లో పెళ్లి వారు వస్తున్నారు అన్న వార్త వచ్చింది.
ఆ వెంటనే అమ్మా ,నాన్న చేసిన హడావిడి ఇంతా-అంతా కాదు.
తుడిచిందే తుడిచేరు, సద్దిందే సర్దేరు.
తనకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఈ సంబంధం అన్నా కుదురుతుందా..? తనకు పెళ్లి కొడుకు నచ్చుతాడా? ఏమో?
ఆలోచిస్తుండగానే పెళ్లి వారు వచ్చేసారు .
అమ్మ, నాన్నగారు ,వాళ్ళందరికీ సకల మర్యాదలు చేసి- కుర్చీల్లో కూర్చోబెట్టారు.
అంతా కూర్చున్నారు. తనను వాళ్ళ ఎదురుగుండా కూర్చోబెట్టారు. వాళ్లు అమ్మ నాన్నలను ఏవేవో అడుగుతున్నారు.
తన దృష్టి మాత్రం ఎదురుగుండా కూర్చున్న పెళ్ళికొడుకు మీదే ఉంది.
అతడు చాలా సింపుల్ గా ఉన్నాడు.
చాయ్ తక్కువని చెప్పారు కానీ నల్లగానే ఉన్నాడు. దానికి తోడు పొట్టి. వెనకాతల బట్టతల కూడా ఉన్నట్టుంది.
జుట్టు చాలా పల్చగా ఉంది.
అతని పెదాలు లావుగా, చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. చూడగానే అతనిని పెళ్లి చేసుకోవాలనిపించలేదు అఖిలకు.
కూర్చున్నంతసేపు అతనేమీ మాట్లాడలేదు
.అన్ని వాళ్ళ అమ్మ నాన్న గారే మాట్లాడారు.
అతనిని గమనించడంలో వాళ్లు ఏం మాట్లాడుకున్నారో
తనేం వినేలేదు.
కొంతసేపు తర్వాత అమ్మ వచ్చి "అబ్బాయి తో ఏమైనా మాట్లాడతావా" అంటూ చెవిలో చెప్పింది.
ఇదేంటి పెళ్లి చూపుల్లో అబ్బాయి కదా తనతో మాట్లాడ వలసింది... అదే మాట అమ్మతో అంది.
" అలా కాదమ్మా. అతడు కాస్త మొహమాటస్తుడట .
అందుకే నువ్వే ఏదైనా అడగాలంటే అడిగేయ్" అంటూ చిన్నగా నవ్వింది.
నిరుత్సాహంగా ఉన్న తను
" మాట్లాడను" అన్నట్టుగా తల ఊపింది.
ఇంతలో అతన్ని తల్లి "మాకు అమ్మాయి నచ్చిందంటూ" చెప్పారు.
అంతేకాదు తమకు కట్న కానుక లేవీ అవసరం లేదని, పెళ్లయిన తర్వాత ఆమె బాధ్యతగా తల్లిదండ్రులను చూసుకోవచ్చని , అందుకు తమకేమీ అభ్యంతరం లేదని కూడా చెప్పారు.
ఆ చివరి మాట తనకు చాలా నచ్చింది." తనకు పెళ్లయితే అమ్మానాన్న సంగతి ఎలాగ. ? " అని ఆలోచిస్తున్న తనకు ఒక ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించింది.
అమ్మ నాన్నల ముఖాల్లో సంతోషం వెల్లి విరుస్తున్నది.
అమ్మ, వారి ముందే తనను అడుగుతోంది "ఆనంద్ నచ్చాడా" అంటూ..
అప్పుడు తెలిసింది అతని పేరు ఆనంద్ అని. పేరైతే చాలా బాగుంది.
కానీ అతను తనకన్నా చాలా పొట్టి గా ఉండటమే గాక
చూడటానికి కూడా బాగులేడు అందుకనే తనేం చెప్పలేకపోయింది.
నిజంగానే తనకు అబ్బాయి నచ్చలేదు కానీ, ఈ సంబంధం వద్దంటే మరొకళ్ళు వస్తారు ,కట్నం అడుగుతారు, లేదా తల్లిదండ్రులని చూడొద్దు అంటారు.
తను ఈ వయసులో వాళ్ళని వదిలి వెళ్ళలేదు.
ఎటునుండి ఎటు ఆలోచించినా ,తను ,ఈ సంబంధానికి ఒప్పుకుంటేనే మంచిది అనిపించింది.
అందుకే మరోసారి ఆలోచించకుండా "ఊ... "అన్నట్టుగా తల ఊపింది,.
*****************
పెళ్లి నిశ్చయమైపోయింది. వెనువెంటనే ముహూర్తం కూడా .…
జేష్ట మాసంలో చాలా సింపుల్ గా, తామిద్దరికీ
పెళ్లైపోయింది.
వ్రతం అంటూ అత్తవారింటికి తీసుకెళ్లారు. ఇల్లు బాగానే ఉంది. అత్తగారు, మావగారు చాలా మంచి వాళ్ళలాగే ఉన్నారు.
తనను అమ్మ ,అమ్మ ,అంటూ ,ఒక క్షణం వదలకుండా తన మంచి చెడులన్నీ చూసుకుంటున్నారు.
వచ్చిన వాళ్ళందరికీ చాలా సంతోషంగా తనను పరిచయం చేస్తున్నారు
ఇంట్లో ఇంత హడావిడి జరుగుతున్నా....
ఆనంద్ మాత్రం దూరంగా కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు..
కనీసం ఇలాంటి సమయంలో అయినా తన పక్కన కూర్చోవచ్చు కదా! మరీ ఇంత మొహమాటమా!
కనీసం వచ్చినవాళ్ళలో ఒక్కరినైనా పలకరిస్తాడా అని చూస్తే అదీ లేదే ! అసలు అతను సమంగా మాటలైనా మాట్లాడుతాడా ,లేక మరేదైనా ప్రాబ్లమా ! అఖిల ఆలోచిస్తూనే అతని వైపు చూస్తోంది .
అతను తలెత్తి చిన్నగా తన వైపు చూసి నవ్వాడు అఖిల గాభరాగా చూపులు మరోవైపుకు తిప్పుకుంది
వ్రతంలో తన పక్కనే కూర్చున్న ఆనంద్ ,చాలా శ్రద్ధగా పూజ అంతా చేసాడు.
వ్రతం బాగానే జరిగింది. తర్వాత భోజన కార్యక్రమం.. అందరికీ తాంబూలాలు ఇచ్చుకోవడం వంటి పద్ధతులన్నీ
అయ్యేసరికి సాయంకాలం అయిపోయింది.
వచ్చిన వారందరూ సంతోషంగా వెళ్లిపోయారు
ఆ తర్వాత అత్తగారు, మామగారు ,నాన్నగారు, అమ్మ- కూర్చుని చాలా సేపు పిచ్చా- పాటీమాట్లాడుకున్నారు.
తర్వాత సడన్గా టాపిక్ మారిపోయింది.
వాళ్ళు తమ శోభనం కార్యక్రమం గురించి మాట్లాడుకుంటూ ఉంటే తన గుండె గుభిల్లుమంది.
అమ్మో !ఇతగాడి తోటా !శోభనమా!
తను చచ్చినా ఈ కార్యక్రమానికి ఒప్పుకోదు .
కానీ ఎలా ఎలా తప్పించుకోవడం..? కానీ ఎప్పుడో అప్పుడు ఇదంతా జరగవలసినదే కదా..?
ఇప్పుడు తప్పించుకున్నా మరొకప్పుడు వీళ్ళు ఇదంతా చేయడం మానరు .దాని బదులు ఇప్పుడే కాముగా ఊరుకుంటే సరి.
అసలు తనకు పెళ్లి కొడుకు నచ్చనప్పుడు తనీ పెళ్లెందుకు చేసుకుంది.
చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తోంది..
అంటే తనకు పెళ్లి కాదని భయమా...
"లేదు, లేదు, తను అమ్మానాన్నల కోసమే ఈ పెళ్లి చేసుకుంది. వీళ్లు మాత్రమే తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకునేందుకు ఒప్పుకున్న వాళ్ళు..
అందుకే తనకు ఆనంద నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకుంది. అంతే....
అఖిల మనసులో ఉన్న ఏహ్య భావాన్ని, బయటకు కనబడనీయకుండా నానా అవస్థలు పడుతోంది.
దూరంగా కూర్చున్న ఆనంద్ , తనను చాలాసేపటినుండి గమనిస్తున్నాడని తెలుసుకున్న అఖిల మొదటిసారిగా సిగ్గుపడుతూ తల మరో వైపుకు తప్పుకుంది .
*****************************
రూమ్ లో పెద్ద మంచంపై తెల్లటి దుప్పటి .దానిపై మల్లెపూలు, జాజిపూలు, గులాబీ రేకులు, పరిచి ఉన్నాయి.
పక్కన టేబుల్ మీద పెట్టిన అగరబత్తుల వాసన , మంచి గుభాళింపుతో హాయిగ మత్తెక్కిస్తోంది.
ఆ పక్కనే కొన్ని రకాల సీట్స్, హాట్స్ , పాలు వంటివి పెట్టి ఉన్నాయి.
ఆ పక్కన కుర్చీలో ఆనంద్ పంచకట్టు, లాల్చీ వేసుకుని ఠీవిగా కూర్చుని ఉన్నాడు.
అతని బుగ్గ మీద నల్లగా పెద్ద పుట్టుమచ్చ లాంటిది పెట్టారు.
మెడలో కర్పూరపు దండ వేలాడుతోంది.
పొట్టిగా ఉన్న అతన్ని ఆ విధంగా చూసేసరికి అఖిలకు నవ్వు ఆగలేదు .
అది కష్టం మీద నవ్వు ఆపుకుంటూ చిన్నగా నవ్వింది.
అఖిల లోపలికి రాగానే ఆనంద్ మెల్లగా లేచి అఖిల దగ్గరికి వచ్చి , "రా అఖిలా " అంటూ నెమ్మదిగా ఆమె చేయి పట్టుకున్నాడు.
అఖిలకు ఏదోలా ఉంది .తనకు అతనే ఇష్టం లేనప్పుడు.. అతనితో ఈ రాత్రి ఎలా గడపడం ?
అనుకుంటూ ,ఎటూ తేల్చుకోలేక మెల్లిగా అతని వెనకాలే నడిచింది.
ఆనంద్ ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు . మెల్లిగా తను కూడా అమె పక్కన కూర్చుంటూ , "అలిసిపోయావా" అంటూ అడిగాడు.
అఖిలకు చిర్రెత్తుకొచ్చింది .
ఇదీ అడగవలసిన మాటేనా? నాలుగు రోజులు బట్టి నిద్ర లేకుండా ,రెస్ట్ లేకుండా ,తమ పెళ్ళి హడావిడి అంతలా జరుగుతూ ఉంటే.... అలసటగా ఉండదా..
అనుకుంటూ చిరాకుగా అతని వైపు చూసింది.
ఆనంద్ మెల్లగా నవ్వుతూ "పడుకో అఖిలా !
ఈ రాత్రంతా నువ్వు రెస్ట్ తీసుకో . నేను ఆ బయట వరండాలో పడుకుంటాను అని ,తన మాటకోసం ఎదురు చూడకుండా తలగడ పట్టుకుని చక్కా
బాల్కనీలోకి వెళ్ళిపోయాడు.
ఒక్క క్షణం అఖిల అవాక్కైపోయింది.
కానీ మరుక్షణం తనకి ఈరోజు గండం తప్పినందుకు సంతోష పడింది.
రోజులు గడుస్తున్నాయి. అతను రాత్రి రూమ్ లోకి రాగానే రోజు అడుగుతున్నాడు ".వరండాలో పడుకోనా" అని,
తను సరే అని తల ఊపుతుంది .అతను వరండాలోనే పడుకుంటున్నాడు అతనిలో కనీసం కోపం కూడా కనపడడం లేదు ,చిరాకు అంతకన్నా లేదు. పైగా తన ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ప్రతి పనిలోనీ సాయం చేస్తున్నాడు.
ఇదంతా చూస్తున్నా అఖిలకు ఏం చేయాలో అర్థం కావడం
లేదు. అటు అత్తగారు మామగారు కూడా తనను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు.
ఇదంతా చూస్తున్న అఖిలకు, అసలు అతడు మగాడా , కాదా ,అన్నా అనుమానం రోజురోజుకు పెరిగిపోతోంది.
ఇక ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో, అఖిల తనంతట తానే ఒక రాత్రి అతన్ని వరండాలోకి వెళ్ళనివ్వలేదు.
అతను చిన్నగా నవ్వుతూ తన వైపు చూశాడు .
తను మళ్ళీ సిగ్గుతో తలొంచుకుంది.
కానీ ఆ రాత్రి అతని ప్రవర్తన తనకి చాలా విచిత్రంగా అనిపించింది.
తనతో ముద్దుగా, ముచ్చటగా ,ఏ మాటలు మాట్లాడలేదు.
తనను దగ్గరికి తీసుకుంటూ పరవాలేదా ,నీకు ఇష్టమే కదా అని మాత్రం అడిగాడు.
ఆ తర్వాత ఆయన మరింకేమీ మాట్లాడలేదు. తన మనసులో ఏముందో కూడా తెలుసుకోకుండానే
తన కోరికను తీర్చుకోవడంల్లో నిమగ్నమైపోయాడు.
అరగంట దాటగానే అతడు గుర్రు పెట్టి నిద్రపోయాడు.
అఖిలకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి .ఇదే నా జీవితం అంటే.. ఇకముందు కూడా, ఇతను ఇలాగే ప్రవర్తిస్తాడా...?
తన శరీరంతో తప్ప తన మనసుతో అతనికి పని లేదా...
అతను తనతో కొంచెం సేపైనా ప్రేమగా మాట్లాడితే కనీసం మనసైనా తెలుసుకోగలిగి జీవితంలో కాస్త రాజీ పడేది.
కానీ ఆనంద్ ప్రతిరోజు ఒకేలా ప్రవర్తిస్తున్నాడు తనతో ఎక్కువగా మాట్లాడడు. తన దగ్గర ఉంటే మాత్రం ఒంట్లో బాగుందా అని అడుగుతాడు. కానీ నిజంగా ఒంట్లో బాగు
లేకపోయినా ,చెప్తే గాని అర్థం చేసుకోలేడు .
తను చేయాలనుకుంటే ఇంటి పని ,వంట పని, ఆడ పని అంతా కూడా చేసేస్తాడు.
అతనికి మూడ్ లేకపోతే తను చచ్చిపోతున్నా లేవడు.
అసలు అతడేంటో అతని మనస్తత్వం ఏంటో పెళ్లై ఇన్ని నెలలైనా తనకి ఇంకా బోధపడలేదు.
ముందు ముందు తను ఇంకా ఎన్ని విషయాలలో ఎంత అడ్జస్ట్ అవ్వాలో.....
ఆలోచిస్తున్న అఖిలకు తెల్లారితూ ఉండగా కాస్త కునుకు
పట్టింది.
లేచేసరికి తెల్లారి 7: గంటలు దాటింది.
అత్తగారికి మామగారికి కావలసిన వంట చేయనేలేదు ఎలా? తను డబ్బా కట్టుకోకపోయినా పర్వాలేదు.
ఈ పూటకి అతను ఏదో బయట తినేస్తారు.
కానీ తను ఆఫీసుకి వెళ్ళిపోయాక అత్తయ్య గారు తామిద్దరికి వండుకోగలరా? లేదు లేదు.
ఆవిడ చేసుకోలేరు .తనే ఏదో కొంచెం చేసి పెట్టి వెళ్ళాలి.
ఆలోచిస్తునే గబగబా కిచెన్లోకి వెళ్ళింది.
అక్కడ వంటిల్లు అంతా నీట్ గా సర్ది ఉంది.
కిచెన్లో వంట వండిన సూచనలు కనిపిస్తున్నాయి.
ఒక మూల గిన్నెల్లో, వండిన వంటంతా శుభ్రంగా నీట్ గా సర్ది ఉంది.
తన కేరేజి కూడా సర్దేసి ఒక మూల పెట్టి ఉంది.
సింకు దగ్గర ఆనంద్ చిన్న బర్ముడా వేసుకొని,
చెమటలు కారుతూ, అంట్ల గిన్నెలు బర బరా తోముతూ కనిపించాడు.
అదేంటి ? ఇతనెప్పుడు లేచాడు ..? అతను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి కదా! ఈ పనంతా ఎప్పుడు లేచి చేసాడు...?
ఐనా ఇతనేంటి ,ఎప్పుడూ అంటిడీ గానే ఉంటాడు .
గట్టిగా మొహం కడుక్కొని, శుభ్రంగా మంచి సూట్ వేసుకొని, టక్ చేసుకుని, నీటుగా తలదువ్వు కొని ,కాస్త సెంటు స్ప్రే చేసుకుని కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు పేడ తట్టలా మొహం వేసుకుని తనెదురుగా తిరుగుతూ ఉంటాడు. అతను ఎప్పుడు ఆఫీస్ కి వెళ్తాడో గాని ,తను వెళ్ళిపోయే వరకు కూడా ఇలాగే ఉంటాడు. శుభ్రంగా తయారై ఉండగా అతనిని తనెప్పుడూ చూడలేదు..
ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో తన ముఖానికి ఇలాంటి భర్తను రాసి పెట్టాడు దేవుడు. అనుకుంటూ ఆఫీస్కి తయా రవ్వ సాగింది. అద్దం ముందు నిలబడీ ఉన్న అఖిలకు, సడన్గా తన ఆఫీసులో బాస్ గుర్తుకొచ్చాడు.
అతడు ఎంత బాగుంటాడని ఎప్పుడూ నీటుగా సూటు వేసుకుని ఉంటాడు కాళ్ళకు పోలీష్. చేసిన బూట్లు నిగనిగలాడుతూ ఉంటాయి .
మంచి ఒడ్డు పొడుగుతో అందంగా ఉంటాడు.
అతనిని చూస్తున్న కొద్ది చూడాలనే అనిపిస్తుంది.
అందరితోనూ చాలా రిజర్వుడ్ గా ఉంటాడు
చాలా తక్కువ మాట్లాడుతాడు. సాయంత్రం వరకు చొక్కా నలగకుండా, రూపు చెదరకుండా అలాగే ఉంటాడు.
అతని ఆఫీసులో లేడీస్ ష్టాఫ్ కొంచెం ఎక్కువ మందే ఉన్నారు. అందరూ అతనితో ఏదో పని కల్పించుకుని మాట్లాడుతూ ఉంటారు .
తనకి కూడా అనిపిస్తుంది తను కూడా మాట్లాడదామని కానీ ఒక రకమైన భయంతో అలాగే ఉండిపోయేది.
రోజులు గడుస్తున్నాయి
అతనికి కూడా తను నచ్చిందేమో చాలాసార్లు తన వైపు చూస్తూ ఉండడం తను గమనించింది .
అతని భార్య ఎంత అదృష్టవంతురాలో...
నిన్న మాత్రం అతను ఒక అడుగు ముందుకేసాడనే చెప్పాలి ఫైల్స్ చూపించమన్న మిషతో తనను లోపలికి పిలిచాడు. ఎంత మర్యాదగా మాట్లాడాడని.
తనకోసం కాఫీ కూడా తెప్పించాడు.
కావాలనే తనతో ఎక్కువగా మాట్లాడుతూ
తన కుటుంబ విషయాలు అడిగి మరీ తెలుసుకున్నాడు.
అతను తన భర్త గురించి తరచి తరచి అడిగేవాడు.
తను ఏమని చెప్తుంది అతనితో ...
తన భర్త విషయంలో ,తను ఎంత అసంతృప్తిగా ఉందో అతనితో ఎలా చెప్పగలదు..?
కానీ ఒకరోజు తను కావాలనే తన భర్త ఫోటో ఒకటి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకు వెళ్ళింది.
అది ఏదో ఒక విధంగా అతని కంట పడినట్టు చేసింది.
ఆ ఫోటో తన భర్తదని తెలిసి అతనెంత బాధ పడిపోయాడనీ...
అతను చాలా బాధపడుతూ" అందమైన వాళ్ళకి దేవుడు ఇలాంటి పరీక్షలు ఎందుకు పెడతారో" ..అంటూ వాపోయాడు.
తనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ, తనపై జాలి చూపించడం వలనో ఏమో ,తను అసంకల్పితంగా అతనికి దగ్గరవుతూ వచ్చింది .
అతని గురించిన ఆలోచనలు ఎక్కువ అవ్వడంతో,
ఆనంద్ అంటే మరి కొంచెం రోత పుడుతోంది అఖిలకు.
ఆనందం మాత్రం అఖిల విషయంలో చాలా ప్రేమగా ఉంటున్నాడు ఆఫీసుకు వెళ్తున్న పిల్లలకు చాలా సాయం చేస్తున్నాడు ఏ విధంగానూ కష్టపెట్టకుండా చూసుకుంటున్నాడు.
*****************************
ఈనెల శనాదివారాలతో కలిపి ఆఫీసుకు మరో రెండు రోజులు అదనంగా సెలవులు. కలిసి వస్తున్నాయి. దాంతో ఆఫీసులో అందరూ ఎక్కడికైనా చిన్న టూర్ వేసుకుని, ఎంజాయ్ చేద్దాం అని ప్లాన్ వేస్తున్నారు.
ఎవరెవరు జాయిన్ అవుతారో వాళ్ళ అందరి పేర్లు రాసుకుంటున్నారు.
తను ఈ ఊరు తప్ప, మరెప్పుడూ, ఏ ఊరికీ వెళ్లలేదు పెళ్లైన తర్వాత కూడా హనీమూన్ కని ,ఆనంద్ తనని ఎక్కడికీ తీసుకెళ్లలేదు.
అత్త మామల్ని వదిలి, నాలుగు రోజులు పాటు బయటకు వెళ్లడమా, మానడమా, అని ఆలోచిస్తున్న తనకు
తన ఆఫీసు కోలీగ్స్,తమ బాస్ కూడా తమతో వస్తున్నట్లు తెలిపారు.
దాంతో అఖిలకు ఎక్కడలేని హుషారు పుట్టుకొచ్చింది.
వెంటనే తను కూడా తన పేరు ఇచ్చి వచ్చింది.
*****************
ఇంటికి వెళ్లిన తర్వాత ఆనంద్ తో ఈ విషయం చెప్పింది.
ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగాడు.
తను కొందరి పేర్లు చెప్పి ,బాస్ కూడా వస్తున్నట్లు తెలిపింది.
అకామిడేషన్ ఎక్కడ అని అడిగాడు .
అఖిలకు చిరాకు వేసినా, భర్తగా ఆ మాత్రం అధికారం అతని కుందిలే ....అనుకుంటూ వివరాలు చెప్పింది.
ఆనంద్ నవ్వుతూ సరే అన్నాడు.
అఖిల ప్రయాణానికి అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఆనంద్ కూడా హెల్ప్ చేశాడు.
చివరిలో దగ్గు జలుబు లాంటివి వచ్చినా ,ఒంటి నొప్పులు కలిగినా, నడిచి నడిచి అలసిపోయి, జ్వరం వచ్చినట్లు అనిపించినా ఈ మందులు వేసుకో అంటూ కొన్ని టాబ్లెట్స్ నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాడు.
అఖిల కు అతన్ని చూస్తే చాలా జాలి అనిపించింది.
ఎప్పుడు తను, అతనిపై విసుక్కుంటూనే ఉంటుంది .
కానీ అతను మాత్రం తన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు.
అనుకుంది .
మరుక్షణమే ఎందుకొచ్చిన ప్రేమ, తన మనసు గురించి గానీ తన ఇష్టాయిష్టాల గురించి గానీ పట్టించుకోనప్పుడు,.
అనుకుంటూ మూతి ముడిచింది.
************************
అఖిల ఆనందంగా ఆఫీస్ స్టాఫ్ తో కలిసి ప్రయాణం అయింది.
అందరూ తమ తమ కార్లను తీసుకొచ్చి కొంతమందిని ఎక్కించుకుంటున్నారు.
తమ బాస్ తనను, తనతో పాటుగా మరొకరిని తన కార్లో ఎక్కించుకున్నాడు. అతనితో వచ్చిన ఆమె తమ ఆఫీసులో పనిచేయడం లేదు .ఆమె ఎవరో తనకు తెలియదు.
ఏమైతానేం అందరూ కార్లో కూర్చున్నారు అఖిలకు చాలా హ్యాపీగా గాల్లో తేలిపోతున్నట్టు ఉంది.
తను, బాస్ తో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. బాస్ తనను ఫ్రెంట్ సీట్లో, తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. బాస్ తో వచ్చిన అమ్మాయి పేరు శ్రావణి అని చెప్పింది. ఆమె కూడా చాలా కలగోలుపుగా, చాలా చక్కగా తనతో మాట్లాడుతూ ఉంటే, ప్రయాణం చాలా హాయిగా సాగింది.
జోకులు వేసుకుంటూ ,పాటలు పాడుకుంటూ, చాలా సరదాగా ప్రయాణం అయ్యారు .మధ్య మధ్యలో ఆగుతూ విశాలంగా ఉన్న చెట్ల కింద ఫలహారాలు తింటూ, ప్రకృతిని ఎంజాయ్ చేశారు.
ప్రతి చోట బాస్ తనతో ఉన్న తమ ఇద్దరి మీద ,చాలా శ్రద్ధ చూపించాడు.
మొత్తానికి సాయంత్రానికల్లా రిసార్ట్ చేరుకున్నారు .బాగా ప్రయాణం చేసి ఉన్నారేమో ,అలసిపోయి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
తనది, శ్రావణీది, బాస్ వి , రూములు వేరే హోటల్ రూమ్ లో బుక్ చేసానంటూ బాస్ తమని మళ్ళీ కారు ఎక్కమన్నారు .
ఒక్క క్షణం తనకేమీ అర్థం కాలేదు చుట్టూ ఉన్నవారి వైపు చూసింది .వారు తన వేపు ,తన పక్కన ఉన్న మరొక ఆమె వైపు అదోలా చూసి, ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు.
ఆ క్షణం తనకెందుకో కొంచెం భయం వేసింది .
బాస్ తమకు వేరే హోటల్లో, రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు.
ఈ విషయం తనకు చెప్పలేదే . ఇక్కడికి వచ్చాక తెలిసింది.
అందరూ కలిసి ఒక దగ్గరే ఉండి ఎంజాయ్ చేస్తాము కదాకదా.. ఎక్కడ కూర్చుంటే ఏంటి ..? అనుకున్నది తను . బాస్ ,తమ కోసం వేరే రూమ్స్ ఎందుకు బుక్ చేసినట్టు ఇంత పెద్ద రిసార్ట్లో మరో రెండు రూమ్స్ దొరకలేదా?.
అనుకుంటూనే కారెక్కింది అఖిల .
ఆమెతో పాటుగా శ్రావణి కూడా .
తాము ఉండబోయే హోటల్ ,రిసార్ట్ కి చాలా దూరంలోనే ఉన్నట్టుంది . అందరితో కలిసి ప్రయాణించడం చాలా బాగుంది అనుకున్న అఖిల కి , ఎందుకో , ఈ విషయం నచ్చలేదు. అందరికీ అంత దూరంగా ఉంటే ఇంకా సరదాగా ఉంటుంది . అదే విషయం బాస్ ని అడిగింది .
బాస్ నవ్వుతూ, నా స్టేటస్ కి ,స్టాఫ్ అందరితో కలిసి ఉంటే బాగుండదు కదా! అందుకే నేను వేరే స్పెషల్ గా ఈ హోటల్ లో రూమ్ తీసుకున్నాను. అక్కడ చాలా బాగుంటుంది. ఏముంది , తెల్లారి లేచి, ఫ్రెష్ అయ్యి ,మళ్ళీ మనం అక్కడికి వెళ్లిపోవడమే .అందరూ కలిసి చుట్టుపక్కలంతా తిరిగి ,ఎంజాయ్ చేశాక ,రాత్రి పడుకోవడానికి మట్టుకే మనం ఈ హోటల్ కి వస్తాం . అని చెప్పాక కొంచెం రిలాక్స్ గా ఫీల్ అయింది అఖిల.
**************************"""""
రూమ్ లోకి వెళ్ళగానే , అఖిల ఫ్రెష్ గా స్నానం చేసి ,మంచి చీర కట్టుకుంది .చాలాసేపు వెయిట్ చేసింది .ఎవరైనా వచ్చి పిలుస్తారేమో ..బయటకు వెళ్దామని ..
కానీ ఎవరూ రాలేదు.
రాత్రి డైనింగ్ హాల్లో భోజనాల దగ్గర అంతా మళ్ళీ రిసార్ట్ లో కలిశారు.
అక్కడ మరుసటి , అందరూ వెళ్లవలసిన ప్రదేశాల గురించి, సమయం గురించి మాట్లాడుకున్నారు.
తర్వాత ఎవరు రూముల్లోకి వెళ్లిపోయారు . అఖిల, శ్రావణి
బాస్ తో కలిసి హోటల్ కి వచ్చేసారు. అఖిలకు ఎంతసేపటికి నిద్ర రాలేదు.
తను సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చింది అందరితో పాటు కలిసి ఉండొచ్చు అనుకుంది. కానీ అందరూ దూరంగా రిసార్ట్లో ఎవరి రూముల్లో వాళ్ళు పడుకుంటున్నారు.
పోనీ కాసేపు శ్రావణి తో కబుర్లు చెబితేనో., అనుకుంటూ
బయటి వారండాలోకి వచ్చింది.
శ్రావణి రూము లాక్ చేసీ ఉంది . "ఇంత రాత్రిపూట, శ్రావణి ఎక్కడికి వెళ్ళిందబ్బా" అనుకుంటూ, ఏమి తోచక ,మెల్లగా- బాస్ రూమ్ దగ్గరికి వచ్చి ఆగింది . పోనీ కాసేపు ఇతనితో మాట్లాడితేనో... చర్చ నిన్న రాత్రిపూట బాగుంటుందా అయినా తను ఏంటి , బాస్ రూం దగ్గరికి వచ్చి నిలబడింది.
తనకి బాస్ అంటే మనసులో ఇష్టమే. అతనితో మాట్లాడాలని కాసేపొద్దునతో గడపాలని చాలాసార్లు అనుకుంది తను. ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం తన కోసమే అన్నట్టుగా వచ్చింది .కానీ మరీ ఇంత బరితెగించినట్టు ఇలా రావడం బాగోలేదు కదా...
తనిలా తర్జనభర్జనలు పడుతూ ఉండగానే, బాస్ రూమ్ తలుపు తెరుచుకుంది . లోపల బాస్ చిన్న లాగుతో ఉన్నాడు. మరో ఆఛ్చాదన లేని శరీరం నిండా నల్లటి బొచ్చు అసహ్యంగా కనిపిస్తోంది . నోట్లో సిగార్ లోంచి గుప్ గుప్ మని పొగ వస్తోంది.
రూమ్ లోంచి విస్కీ వాసన గుప్పు మంటూ వస్తోంది.
ఇంత దరిద్రంగా బాస్ ని తనెప్పుడూ చూడలేదు.
వస్తున్న వాసనలకి కడుపు తిప్పినట్టు అయింది .
సగం రేగిన జుట్టు, సగం నలిగిన బట్టలతో శ్రావణి గాబరాగా తన రూమ్ కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది .
తను ఏంటి చూస్తున్నది. ? తన బాస్ నేనా..?
అతనికి వివాహం అయినట్టుగా విన్నాది .మరి ఇదేంటి..? ఇతను ఇలా....
శ్రావణి అతని భార్యలా తనకు పరిచయం చేయలేదే ..
మరి శ్రావణి ఎవరు ...?
ఆయనకు ,శ్రావణి కు, మధ్య ఏమైనా ఉండవచ్చు.
కానీ. అతను ఆమెతో పాటు ఈ హోటల్ కి, తనను కూడా ఎందుకు తీసుకొచ్చినట్టు..?...
అఖిలకు చమటలు పడుతున్నాయి.
తలుపు తీయగానే ఎదురుగుండా నిలబడ్డ అఖిలను చూసిన బాస్ కూడా కాస్త తడబడ్డాడు.
కానీ కొద్దిసేపట్లోనే తేరుకొని " రా అఖిలా " అంటూ లోపలికి పిలుస్తూ, వెకిలిగా నవ్వాడు.
అఖిలకు కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది.
వెంటనే వెను తిరిగి పరుగెడుతున్నట్లు తన రూమ్ కి వెళ్లి ధడాలున తలుపేసుకుంది.
అఖిల గుండెలు, ఆగిపోతాయేమో... అన్నంత స్పీడుగా కొట్టుకుంటున్నాయి.
ఏంటి తను చూస్తున్నది.? ఎవరి శ్రావణి.? ఆమెకి బాస్ కి ఉన్న సంబంధం ఏమిటి..?
ఎంతో హుందాగా , డిగ్నిటీగా ఉంటూ ,అతి తక్కువగా మాట్లాడుతూ, అందర్నీ ఎంతో గౌరవిస్తూన్న బాస్, ఇలాంటి వాడా..
ఛీఛీ.. ఇందాకల అతను ఒంటి నిండా రోమాలతో, ఎంత అసహ్యంగా కనిపించాడు.
సిగరెట్టు ,తాగుడూ కూడా, అలవాటు ఉందా..?
పైగా రాత్రి కోసం , వేరే అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడు .
అంతేకాదు...
ఆమెతో పాటు, తనని కూడా తీసుకురావడంలో, అతని ఉద్దేశ్యం ఏమిటి..?
తను కూడా ఆమెలాగే ,అతని కోసం ,అతని రూముకి వెళుతుందనా.,?
నా గురించి అతను ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడా.?
అక్కకు తల పగిలిపోతున్నట్టుగా ఉంది.
అసలు ,అతను తన గురించి ఇలా ఆలోచించడానికి కారణం కూడా ,తనే కాదు కదా..?
ప్రతీ ఆడపిల్లా కోరుకున్నట్టే , తను కూడా, తనకి అందమైన భర్త రావాలని కలలు కన్నాది.
కానీ తనకు ఆనంద్ లాంటి అందవిహీనమైన భర్త దొరకాడు.
రంగూ లేదు .పొడగరీ కాదు. కనీసం సరదాగా మాటైనా మాట్లాడడు . ఇంతవరకు ఎక్కడకూ తీసుకెళ్లలేదు కూడా.
ఆడారిలా ఇంటి పని అంతా చేస్తాడు .
*****************
నాణానికి మరోవైపు.. కథ. 2
తపస్వీ, మనోహరం ," e" బుక్ కొరకు రచన.
అంశం : నాణానికి మరోవైపు. (కథ).
రెండవ భాగం.
శీర్షిక : మౌనరాగాలు
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ :మహారాష్ట్ర.
దాంతో తనకు చాలా చిరాకు వేసి ,జీవితం మీద విరక్తి పుట్టినట్టయింది.
దాంతో ఎప్పుడూ లేనిది అందంగా ఉన్న, తన బాస్ ని గమనించడం మొదలెట్టింది.
ఎందుకంటే అతను ఆఫీసులో అందరితో చాలా క్లోజ్ గా అభిమానంగా ఉంటాడు .అందుకే ,అతని స్వభావం చాలా మంచిది అనుకుంది.
తనకు ఎలాంటి భర్త రావాలనుకుందో, అటువంటి లక్షణాలున్న బాస్ అంటే, కాస్త వ్యామోహం పెరిగిన మాట వాస్తవమే.
అతనితో కాస్త టైం స్పెండ్ చేసి, మనసు విప్పి మాట్లాడాలనుకుంది.
అంతకుమించి తన మనసులో మరి ఏ ఉద్దేశమూ,
కోరికకా లేదు.
కానీ తను తీసుకున్న చోరవను, అతను అపార్థం చేసుకున్నట్టుగా ఉంది..... తను సులభంగా అతనికి లొంగిపోతుంది అనుకున్నాడేమో ! అందుకే తన కారులో స్పెషల్ గా రూమ్ తీసుకున్నానని చెప్పి, ఇక్కడకు తెచ్చి పెట్టినట్టున్నాడు.
ఇందులో తప్పంతా తనదే కనిపిస్తున్నది. ఎందుకంటే ఇంతకుముందు కూడా తను ఆఫీసులో పనిచేసినప్పుడు బాస్ గురించి పట్టించుకునేది కాదు. తనేదో తన పనేంటో, అంతే .ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కూడా కాదు.
పెళ్లయిన తర్వాతే ఆనంద్ విషయంలోనున్న అసంతృప్తి తనను ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయట పడడం ఎలా? తను ఒక్కతే ఇంటికి వెళ్లిపోగలదా ? చూస్తే అర్ధరాత్రి దాటిపోయినట్టుంది.
ఆలోచనలతో మహతికి పది లంఖణాలు చేసినంత నీరసం వచ్చేసింధి.
ఏమీ చేయలేక మంచం మీద కూర్చునీ , ఏడవడం మొదలెట్టింది.
ఇంతలో హోటల్ బయట అలారమ్స్ మోగుతున్న చప్పుడు వినిపించింది.
అంతలోనే అఖిల రూమ్ ఎవరో దబదబా , బాదుతున్న చప్పుడు వినిపించింది.
అఖిల అదిరిపడింది .తలుపు తీయడమా .? మానడమా..?
అసలు బయట ఏం జరుగుతోంది...?.
ఆలోచనలో ఉన్న అఖిలకు , "అఖిలా! తలుపు తియ్యి" అన్నా ఆడ గొంతుక వినిపించింది.
అఖిల గబగబా వెళ్లి తలుపుతీసింది.
అక్కడ, తమ ఇంటి పక్కన ఉన్న రాధ నిల్చునుంది. ఆమె వెనక ,ఆమె అన్నయ్య పోలీస్ డ్రెస్లో నిల్చుని ఉన్నాడు.
ఇదేంటి రాధ ఇక్కడ ఉంది. అని ఏదో అడిగేంత లోపలే రాధ , అఖిల చేయి పట్టుకొని ,అఖిలా పద, ముందు బయటికి రా, తర్వాత నీకు జరిగిందంతా చెబుతాను
అంటూ కబ-గబా చేయ పట్టుకుని త్వరగా రా అంటూ,
లిఫ్ట్ దగ్గరికి లాక్కు వెళ్ళింది.
అసలే గాభరాగా ఉన్న అఖిలకి, కళ్ళు తిరిగినట్టు అయింది. ఏం జరిగిందో, ఏం చేస్తున్నాదో, ఏమీ తెలియని పరిస్థితిలోనే , రాధ తనను కారులో ఎక్కించడం, ఆ కారు డ్రైవర్ సీట్ లో ,ఆమె అన్న కూర్చుని డ్రైవ్ చేస్తూ నడపడం గమనించింది.
భయం భయంగా చూస్తూ ,మాటరాని స్థితిలో ఉన్న అఖిలను చూసి ,రాధకు చాలా జాలి వేసింది.
వెంటనే తన బ్యాగులో ఉన్న మంచినీళ్ల సీసా తీసి, మంచి నీళ్లు తాగమని అఖిలకు ఇచ్చింది.
గటగటా మంచినీళ్లు తాగిన తర్వాత, అఖిలకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది.
అటుపై రాధ చెప్పిన మాటలు విన్న అఖిల నిశ్చేష్టురాలయింది.
తను ఆఫీసు వాళ్లతో రిసార్ట్ కి వెళ్తాను , అనగానే ఆనంద్ కి అనుమానం వచ్చిందట .ఎందుకంటే అతను అంతకముందే బాస్ మంచివాడు కాదని విన్నాడట .
కానీ అఖిల మీద నమ్మకం ఉన్నందువల్ల అతను ఏనాడూ ఆమెను అనుమానించడం గాని, ప్రశ్నించడం గాని చెయ్యలేదట.
కానీ రిసార్ట్ కి వెళతానన్న దగ్గర నుండీ , ఆనందు ఆరాలు తీస్తూనే ఉన్నాడట ,.ఎక్కడికి వెళుతున్నారు ?, ఎక్కడ ఉంటున్నారు,? ఏమిటి ?,అన్న సంగతులు తెలుసుకున్నాడట .బాస్ కూడా బయలుదేరుతున్నాడని ,తనతో అఖిలను, ఇంకో అమ్మాయినీ కూడా తన కారులో కూర్చోబెట్టుకున్నాడనీ , వేరే చోటికి తీసుకెళ్తున్నాడని కూడా విన్నాడట.
అందుకే పక్కనున్న రాధ తో మాట్లాడి ,వాళ్ళ అన్నయ్య పోలీసైనందున అతని సహాయం కోరాడట.
ఆ హోటల్ కి అంత మంచి పేరు లేనందున, ఆనంద్ వేసిన ప్లాన్ ఫలించిందట.
పోలీసులు హోటల్ మీద రైడ్ చేస్తున్నారని అనిపించేంతగా, "ప్లాన్" రక్తి కట్టించారు.
అఖిల అతడి "కామానికి" బలికాకుండానే రాధ, వాళ్ళ అన్నయ్య ఆమెను రక్షించి , సేఫ్ గా ఇంటికి తీసుకు వెళుతునన్నారట....
.
నిజానికి బాస్, ఆ రాత్రి మరో నలుగురిని పిలిచి ,
వారితో పాటుగా, తనను మానభంగం చేయాలని ప్లాన్ చేశాడట.
తను , పరువుకు భయపడతానని ,అందుకే అరవడం గానీ , పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం గానీ , చేయలేనని , అందువల్ల తమ పని అయిన తర్వాత , తనంతట తానే ఏ నుయ్యో - గొయ్యో చూసుకుంటుందని , దాంతో తమ కోరిక తీరడమేకాక ,ఇకముందు ఆమె వల్ల ప్రమాదముమూ ఉండదన తలచి, ఎప్పటినుంచో ప్లాన్ వేస్తున్నాడట.
అతనికి ఈరోజు అవకాశం దొరకడంతో చాకచక్యంగా తన ప్లాన్ ని, అమలుపరిచేడట.
ఈ సంగతులన్నీ తెలుసుకున్న ఆనంద్, ముందుగానే నీకు చెప్పి, వెళ్ళొద్దంటే , నువ్వు వాళ్ళ అందరితో వెళ్లడం ఇష్టం లేక అలా చెప్తున్నాడని అనుకుంటావేమోనని,
నువ్వు వెళ్ళిన రోజు నుంచే అన్నీ కనిపెడుతూ ,
ఈరోజు ఏ ప్రమాదం జరగకుండా నిన్ను ఇంటికి చేర్చే విధంగా ప్లాన్ చేశాడని చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయింది.
ప్లాన్ విజయవంతంగా పూర్తయినందుకు ,తనకు ఎంతో ఆనందంగా ఉందని, రాధ చెప్తుతూ ఉంటే ,వింటున్న అఖిల నిర్గాంత పోయింది.
"నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఆనంద్ నాకు తెలుసు అఖిలా. ఇరుగు-పొరుగునే ఉంటున్నాము కదా!
ఒకరి కష్టం తెలుసుకునే మనసుంది .అందర్నీ గౌరవించే సంస్కారం ఉంది.
ఒక చెడు ఆలోచన గాని, చెడ్డ గుణాలు కానీ , చెడు అలవాట్లు కూడా లేని, ఆనంద్ లాంటి భర్త ,అందరికీ దొరకడఖిలా.నువ్వు చాలా అదృష్టవంతురాలివి "..
అని రాధ.
అంటూ ఉంటే , అఖిల కళ్ళలో నీళ్లు తిరిగాయి.
తన సంకుచిత మనస్తత్వానికి ,తనకే సిగ్గు వేస్తోంది ఇప్పుడు.
నిజమే !ఇప్పుడు జరిగిన సంఘటన చూస్తూ ఉంటే, ఆనంద్ లాంటి మంచి వ్యక్తి తనకు భర్తగా దొరకడం, తన అదృష్టమనే అనిపిస్తున్నాది.
లేకపోతే.. ఏంటి ? ఈ విషయాలన్నీ ఆనంద్ కు ముందే తెలుసా?
తెలిసి కూడా ,తన మీద నమ్మకం ఉండడం వల్ల , తనని అనుమానించకుండా ఊరుకున్నాడా..?
ఎప్పుడూ మౌనంగా ఉండే ఆనంద్ , తన మంచి చెడులు కూడా ఎప్పుడూ పట్టించుకోడే అనుకున్న ఆనంద్ ,
ఈరోజు ఒక రాక్షసుడి చేతిలో నుంచి, తనను రక్షించడానికి, ఇంత కష్టపడ్డాడా...?
అఖిల కంటి నుంచి కన్నీరు ధారగా కారుతోంది.
రాధ, అఖిలా! కారు దిగు. ఇల్లు వచ్చేసింది .
అనడంతో ఇంట్లోకి ఎలా వెళ్లాలా అనుకుంటూ, సిగ్గుతో తల దించు కుంది అఖిల.
రాధ, తన చేయి పట్టుకుని గుమ్మం దాకా తీసుకెళ్ళి కాలింగ్ బెల్ నొక్కింది.
ఎప్పటిలాగే ఆనంద్ తలుపు తీసి, అదే చిరునవ్వుతో ఎదురుగా నిలబడి ఉన్నాడు.
అఖిల ,ఆనంద్ ని చూడలేక ,పరుగు -పరుగున , తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.
ఆ తరువాత ఏమైందో ,ఆ రాత్రి ఎలా గడిచిందో, తను ఎంత ఏడ్చిందో..,తనకు ఎప్పుడు నిద్ర పట్టిందో ,అఖిలకు ఏమీ తెలియలేదు.
అఖిలా ,అఖిలా, అంటూ, పిలుస్తున్న ఆనంద్ పిలుపుకు, కళ్ళు తెరిచింది అఖిల.
గోడ గడియారం పగలు 10 గంటల సమయం చూపిస్తున్నాది.
ఆనంద్ చేతిలో ఉన్న కాఫీ అఖిల చేతికి అందిస్తూ ముందు కాఫీ తాగు అఖిలా! తర్వాత లేచి ఫ్రెష్ అవుదు గాని అంటున్నాడు.
అఖిల మెల్లగా కాఫీ అందుకుంది.
చిన్నగా తలెత్తి చూసింది. మేరు పర్వతంలా ఎత్తుగా కనిపించాడు ఆనంద్.
ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి అంత జరిగినా ,ఒక ప్రశ్న కూడా తనను వెయ్యలేదు.
ఏమీ జరగనట్టు తనతో మామూలుగా ఉంటున్నాడు.
అదే ఇంకొక మగాడైతే , తన గతేంకాను ..? నిజంగానే హోటల్లో రైడ్ జరిగి ఉంటే ,తను ఈసరికి జైల్లో కదా ఉండేది. ఎంత అప్రతిష్ట. అప్పుడు ఎవరికీ మొహం చూపించలేక నిజంగానే తను, ఏ నుయ్యో- గొయ్యో చూసుకో వలసి వచ్చేది కదా.....
కానీ...ఆనంద్ ... తన మనసు కష్టపడకుండా ఉండేందుకు ,తనకు తెలియకుండా ఎంత ఉన్నతంగా ప్రవర్తించాడు.
పైగా కాఫీ కూడా చేసి పట్టుకొచ్చాడు . ఆనందు ఎంత మంచివాడు.
అఖిలకు మొదటిసారిగా ,ఆనంద్ చేసిన కాఫీ, చాలా రుచిగా అనిపించింది.
ఆనంద్, అక్కడే నిల్చుని, అఖిల పెట్టి లోంచి బట్టలన్నీ తీసి, ఆమె వాడ్రోబులో సద్ధుతున్నాడు.
అఖిలకు ఈరోజు ఆనంద్ చేస్తున్న ఆ పని ,ఆడారి పనిలా అనిపించలేదు.
మొట్టమొదటిసారిగా అఖిల ఆనంద్ వ్యక్తిత్వానికి తలవంచింది.
అందంగా లేకపోతేనేం... ఆనంద్ లో ఉన్నతమైన భావాలు న్నాయి.
పొట్టిగా ఉంటేనే ఆనందులో , సభ్యత ,సంస్కారాలున్నాయి.
ఎక్కువగా మాట్లాడకపోతేనేం... ఆనందులో తనను ప్రేమించే గుణం ఉంది.
పెదాలు మోటుగా ఉంటేనేం.. ఆ నవ్వులో, నిర్మలత్వం ఉంది.
పెళ్లయిన తర్వాత ,కొన్ని రోజుల వరకు ,తను ఆనంద్ ని దగ్గరికి రానివ్వకపోయినా, ఆనంద్ ఏ ఆడదానిని కించపరిచే విధంగా, వెకిలితనంగా, ప్రవర్తించలేదు.
ఎప్పుడూ తన మంచి చెడులు చూసుకుంటూ, తను పడబోయే కష్టాన్ని, ఇష్టంగా పాలు పంచుకుంటూనే ఉన్నాడు,
"పాపిష్టిది .తనే అతన్ని ఎప్పుడూ సహృదయంతో చూడలేదు. నాణేనికి ఒకవైపే చూసింది, కానీ రెండవ వైపు కూడా ఓసారి చూద్దామని అనుకోలేకపోయింది .
అతని రూపాన్నే చూసింది గాని ,అతని గుణాన్ని గమనించలేకపోయింది.
తన అదృష్టం బాగుండి ఆనంద్ లాంటి భర్త లభించాడు .
తను అతని బాహ్య సౌందర్యానికే విలువచ్చింది, గాని అంతః సౌందర్యాన్ని గమనించలేకపోయింది.
తనే పాపిష్టిది .తన ఆలోచనలే బాగోలేవు. అనుకుంటూ, నెమ్మదిగా తలెత్తి ,కన్నీళ్ళతో ఆనంద్ వైపు చూసింది.
చిన్న బర్ముడాలో, చేతులు లేని బనీన్ లో ,ఆనంద్ ఆరోజు ఎంత అందంగా కనిపిస్తున్నాడో.... అఖిల మెల్లగా లేచి, ఆనంద్ కు దగ్గరగా వెళ్లి నిలబడింది.
"ఏం కావాలి అఖిలా "అన్న ఆనంద్ మాటలకు జవాబుగా,
అఖిల ఒక్కసారిగా ఆనంద్ పాదాలపై వాలిపోయింది.
ఆనంద్ అఖిలను మెల్లగా లేపి హృదయానికి హత్తుకున్నాడు. మొదటిసారిగా, రెండు హృదయాలు ఒకటై మాట్లాడుకుంటున్నాయి. మౌనరాగాలతో మధుర గీతాలు పాడుకుంటున్నాయి.
సుఖాంతం.
********************""********""""""""""
ఈ కథ ఏ మాధ్యమునందును ప్రచురితము కాని,
నా స్వీయ రచన.
No comments:
Post a Comment