Thursday, February 29, 2024

యతి...ప్రాసలు

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.

అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
ఇ, ఈ, ఎ, ఏ, ఋ
ఉ, ఊ, ఒ, ఓ
క, ఖ, గ, ఘ, క్ష
చ, ఛ, జ, ఝ, శ, ష, స
ట, ఠ, డ, ఢ
త, థ, ద, ధ
ప, ఫ, బ, భ, వ
ణ, న
ర, ల, ఱ, ళ
పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ
ఇతర నియమములు
సవరించు
హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ"కి "జి"తో మైత్రి కుదరదు.
హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది. ఉదాహరణకు, "ద"కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ"కు "గృ"కు యతి కుదురుతుంది.
సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ"గా గానీ "రొ"గా గానీ భావించ వచ్చు.
ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ), ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న"కు "కంద" లోని "ద"కు యతి చెల్లుతుంది. ఉచ్చారణ పరంగా "కంద"ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది.
"మ"కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురుతుంది.

Wednesday, February 28, 2024

హయ ప్రచార రగడ*

హయ ప్రచార రగడ*

*లక్షణములు:-*

*1. ఇది త్రిస్ర గతికి చెందిన మూడు మాత్రల రగడ*

*2. ఇందులో మొత్తం 12 మాత్రలు ఉండును*

*3. అనగా మూడు మాత్రల గణములు నాలుగు ఉండును(3-3-3-3*

*4.ప్రాస నియమము గలదు(1.1-3.1*

*5. అంత్యప్రాస నియమము కలదు*

*6. మొదటి గణములోని మొదటి అక్షరమునకు మూడవ గణములోని మొదటి అక్షరమునకు యతిమైత్రి పొసగవలెను*

*6. ఉదాహరణకు ఒక హిమపాత వర్ణనము దిగువ చూడండి*

*1*
*తెల్లగ పడె తిన్నగ పడె*
*మెల్లగ పడె మృదువుగ పడె*

*2*
*చల్లగ పడె చక్కగ పడె*
*వెల్లగ పడె వృష్టిగ పడె*

*********************
ఒక జానపద రగడ చూడండి..

*చల్లగాలి చక్కలిగిలి!*
*మల్లెపూల మత్తున చెలి!*
*మామ రాక మరులు గొల్పె!*
*భామ చిలిపి పనులు సల్పె!*
*********************

28/02/2024.


మహతి సాహితీ కవి సంగమం.


ప్రక్రియ : హయ ప్రచార రగడ.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ , మహారాష్ట్ర.

శీర్షిక: రాధ నవ్వు.

--------------

మురళి పాట ముదమ దాయె.

స్వరము నాద స్వరమ దాయె!!

రాధ మనసు రగిలె చింత

వేదనాయె వెన్నెలంత

వేల తరుల వేడ్కసిరులె

పూల జల్లు ముచ్చటేలె.!!

చిన్ని తలపు   చిత్రమాయె

అన్ని మరచు అందమాయె.!!

వలచు చెలుడు పలుకడాయె

తలపు విడని తరుణ మాయె!!

నీలవర్ణు నీడ నవ్వె

లీల గనిన రాధ నవ్వె!!

----------------------

హయ ప్రచార రగడ.



ప్రక్రియ : హయ ప్రచార రగడ.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ , మహారాష్ట్ర.


----------------------------
"పాలు వద్దు". పలికెపాప.
బెక్కి పలికె బెట్టు చూప!!
అమ్మ తరచి  అరచి కోరె
పొమ్మనంచు పోరి కసరె !!

చిన్ని పాప చిన్న బోయె.
వన్నె లన్ని వడలి పోయె.
అమ్మ మనసు అమ్రుతముగ
చెమ్మ  కనుల చేరువవగ !!

పాప చేర పంచి ప్రేమ
పాప నొడిని పట్టెనమ్మ.
పాప నవ్వి పాలు తాగె
పాప జోల పాట కూగె !!







Sunday, February 25, 2024

నాన్న నేర్పిన చదువు: 1*

*నాన్న నేర్పిన చదువు: 1*

*తండ్రి:-*
।।ఓం నమః శివాయ।।
అబ్బాయీ! *పద్మము* అనే పదానికి పర్యాయవాచకాలను చెప్పు?

*కొడుకు:-*
కమలము, నళినము, తామరపూవు

*తండ్రి:-*
అంతేనా!?

*కొడుకు:-*
నాకంతే తెలుసు!!!

*తండ్రి:-*
నేను చెబుతాను చూడు - *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*

*కొడుకు:-*
నాన్నా! నాన్నా! ఆగు.

*తండ్రి:-*
చెప్పు.

*కొడుకు:-*
వీటన్నిటికీ అర్థం *పద్మం* అనేనా!?

*తండ్రి:-*
అవును.

*కొడుకు:-*
మరి *నిఘంటువు* (డిక్షనరీ) వెదికితే ఇవన్నీ దొరుకుతాయా!?

*తండ్రి:-*
ఆయా డిక్షనరీ కర్తల ఓపికను బట్టి ఉంటుంది. అన్నీ అన్నిట్లోనూ దొరకకపోవచ్చు.

*కొడుకు:-*
మరి డిక్షనరీలలో కూడా దొరకని పదాలు నీకెలా దొరికాయి!?

*తండ్రి:-*
నేను *అమరకోశం* చదువుకున్నాను.  అందువల్ల నేనే స్వయంగా అనేకపదాలను సృష్టించగలను. నాకు వేరే డిక్షనరీ అవసరం లేదు.  

*కొడుకు:-*
అదెలా!?

*తండ్రి:-*
*అమరకోశం* లో కొన్ని *పర్యాయపదా* లను *అమరసింహుడు* ఉపదేశించాడు. వాటికి కొన్ని *ప్రత్యయాలు* (Suffix) జోడిస్తే వేరే అర్థాన్ని బోధించే పదాలను మనం కూడా సృష్టించుకోవచ్చును.

*కొడుకు:-*
ఎలా?

*తండ్రి:-*
చెబుతా చూడు - *1. వారి, 2.నీరమ్, 3. జలమ్, 4.సలిలమ్, 5. కమ్, 6.తోయమ్, 7. ఉదకమ్, 8. పుష్కరమ్, 9.పయః, 10.అంభః, 11. అంబు...* ఇటువంటి కొన్ని పదాలను అమరసింహుడు *నీరు* అనే అర్థంలో చెప్పాడు.

*కొడుకు:-*
అయితే!?

*తండ్రి:-*
పద్మము పుట్టేది ఎక్కడ!? నీటిలో కదా!? అందువల్ల పైన చెప్పిన పదాలకు *జ* అనే ప్రత్యయం (suffix) చేరిస్తే - *పద్మము* అనేపదానికి సమానార్థకాలైన పదాలు వచ్చేస్తాయి.  మళ్లీ చెప్పనా!?  *వారిజము, నీరజము, జలజము, సలిలజము, కంజము, తోయజము, ఉదకజము, పుష్కరజము, పయోజము, అంభోజము, అంబుజము...*

*కొడుకు:-*
చివరలో *జ* - అని ఎందుకు చేర్చాలి!?

*తండ్రి:-*
*జ* - అంటే *జాతము, జన్మించినది* అని అర్థం వస్తుంది. *జలజ* అంటే *జలములో జన్మించినది* అని అర్థం. అలాగే *నీరజ* అంటే *నీటిలో జన్మించినది* అని అర్థం. అలా పదాలు పుట్టుకొస్తాయి.

*కొడుకు:-*
*జ* అనే ప్రత్యయం కాకుండా వేరే ప్రత్యయం చేర్చవచ్చా!?

*తండ్రి:-*
*"జాతము"* అనవచ్చు.

*కొడుకు:-*
అయితే నేను చెబుతాను చూడు. *వారిజాతము, నీరజాతము, జలజాతము, సలిలజాతము, కంజాతము, తోయజాతము, ఉదకజాతము, పుష్కరజాతము, పయోజాతము, అంభోజాతము, అంబుజాతము...*

*తండ్రి:-*
భలే! నీకు కూడా పదాలను సృష్టించే కళ వచ్చేసింది.

*కొడుకు:-*
*జ, జాత* మాత్రమే కాకుండా ఇంకే ప్రత్యయాలనైనా ఉపయోగించవచ్చా!?

*తండ్రి:-*
*భవ, ఉద్భవ, సంభవ* అనే పదాలను చేరిస్తే *పుట్టినది* లేదా *పుట్టినవాడు* అనే అర్థం వస్తుంది.  ఉదాహరణకు *జలభవము, జలోద్భవము, జలసంభవము* అంటే *జలంలో పుట్టినది* అని అర్థం.  అలాగే తృతీయ *నీరభవము, నీరోద్భవము, నీరసంభవము* అని చెప్పవచ్చు. అలాగే *రుహ* అనే ప్రత్యయం చేర్చవచ్చు. *రుహము* అంటే *పెరిగేది.* 

*కొడుకు:-*
అయితే నేను చెబుతా దానితో పేర్లు - *వారిరుహము, నీరరుహము, జలరుహము, సలిలరుహము, కంరుహము, తోయరుహము, ఉదకరుహము, పుష్కరరుహము, పయోరుహము, అంభోరుహము, అంబురుహము...*

*తండ్రి:-*
బాగా చెప్పావు. ఏకసంథాగ్రాహివి. వీటన్నిటికీ కూడా *పద్మము* అనే అర్థం. ఇంతకూ ఎన్ని పదాలను సృష్టించగలవో అర్థమైందా!?

*కొడుకు:-*
నీటికి *11* పర్యాయవాచకాలు చెప్పావు. వాటికి *జ* అనే ప్రత్యయం చేర్చి, *పద్మం* అనే అర్థంలో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *జాత* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *రుహ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు సృష్టించగలను. *భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *ఉద్భవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను, *సంభవ* అనే ప్రత్యయం చేర్చి మరో *11* పర్యాయవాచకాలు చెప్పగలను. అంటే, మొత్తానికి *పద్మము* అనే అర్థంలో ఇప్పటికిప్పుడు *66* పదాలను చెప్పగలను.

*తండ్రి:-*
మరి మొదట అడిగితే మూడే మూడు పదాలు చెప్పి, ఇంతకంటె మరేమీ చెప్పలేనన్నావు!?  ఇప్పుడేమో ఏకంగా *66* పదాలు చెప్పగలనంటున్నావు!?

*కొడుకు:-*
నువ్వు ఇలా విడమరచి చెబితే ఎందుకు చెప్పలేను!?

*తండ్రి:-*
ఇంతే కాదు, వీటితో ఇంకా ఎన్నో అర్థాలలో ఎన్నెన్నో పదాలను సృష్టించవచ్చు.

*కొడుకు:-*
అదెలా నాన్నా!?

*తండ్రి:-*
పద్మంతో సంబంధం ఉన్న పౌరాణికవ్యక్తులెవరైనా ఉన్నారా చెప్పు!?

*కొడుకు:-*
పద్మాన్ని హస్తంలో ధరించే *విష్ణువు* ఉన్నాడు. పద్మాన్ని నాభిలో ధరించిన అదే *విష్ణువు* ఉన్నాడు. పద్మంలో జన్మించిన *బ్రహ్మదేవుడు* ఉన్నాడు.  *క్షీరసాగర* మధ్యంలో *పద్మం* లో జన్మించిన *లక్ష్మీదేవి* ఉన్నది. 

*తండ్రి:-*
మంచి పురాణజ్ఞానం ఉన్నదే నీకు!? సరే, ఇప్పుడు చూడు.  *పద్మం* అనే అర్థంలో నీవు *66* పదాలు చెప్పగలవు కదా!?  వాటికి చివర *హస్తుడు* అని చేర్చు. వాటన్నిటికీ *పద్మాన్ని చేతిలో ధరించినవాడు* అనే భావంలో *విష్ణువు* అనే అర్థం వస్తుంది.  అంటే ఈ క్షణంలో నీవు *విష్ణువు* అనే పదానికి పర్యాయవాచకాలు *66* చెప్పగలవు.

*కొడుకు:-*
ఓహో. బలే! అర్థమైంది. *వారిజహస్తుడు, నీరజహస్తుడు...* ఇలా అన్నమాట.  

*తండ్రి:-*
అవును.

*కొడుకు:-*
అయితే నాన్నా, *హస్తం* అనే పదంతో పాటు *కరము, పాణి* అనే పదాలను కూడా *చేయి* అనే అర్థంలోనే ప్రయోగిస్తాం కదా! వాటిని కూడా ప్రత్యయాలుగా ఉపయోగించవచ్చా!?  

*తండ్రి:-*
హాయిగా ఉపయోగించవచ్చు.  ఆవిధంగా *హస్తుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి *66*, *కరుడు* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66*, *పాణి* అనే ప్రత్యయాన్ని చేర్చి మరో *66* మొత్తం *198* పదాలను నీవు స్వయంగా సృష్టించగలవు.

*కొడుకు:-*
అయ్యో నాన్నా, డబుల్ సెంచురీకి రెండు తక్కువైనాయే!?

*తండ్రి:-*
నీటికి ఇంకా *కబంధము, వనము, భువనము, అమృతము, అప్, సర్వతోముఖము, పానీయము, క్షీరము, శంబరము...* ఇట్లా చాలా పర్యాయవాచకాలు ఉన్నాయి. నీవు అన్నీ గుర్తుంచుకోలేక కంగారుపడతావని మొదట్లో ఓ పదకొండు మాత్రమే చెప్పాను. ఆ పదాలతో *పద్మం* అనే అర్థం సాధించి, మరలా ఆ *పద్మాన్ని చేత ధరించినవాడు* అనే అర్థంలో ఇంకెన్ని *విష్ణుపర్యాయవాచకాల* ను సృష్టించవచ్చో చూడు. 

*కొడుకు:-*
బలే నాన్నా! బలే.  అలాగే *పద్మంలో పుట్టిన బ్రహ్మ* అనే అర్థంలో - పద్మం యొక్క *66* పర్యాయవాచకాలకు *జ, జాత, భవ, సంభవ, ఉద్భవ,  రుహ* అనే ఆరు ప్రత్యయాలు చేర్చితే మొత్తం *396* (66x6) పదాలను ఈ క్షణంలోనే పుట్టించగలను.

*తండ్రి:-*
ఓహో! సమస్తప్రపంచాన్ని పుట్టించిన బ్రహ్మకే అన్ని పదాలు పుట్టించావా!?  *పద్మజుడు, పద్మసంభవుడు* అంటూ వాటిని పుంలింగాలలో ప్రయోగిస్తే *బ్రహ్మ* అనే అర్థం వస్తుంది. వాటిని *పద్మజ, పద్మసంభవ* అంటూ స్త్రీలింగాలలో ప్రయోగిస్తే *లక్ష్మీ* అనే అర్థం వస్తుంది. మరి ఆ *బ్రహ్మకు తండ్రి విష్ణువు* అనే అర్థంలో మరెన్ని పుట్టించగలవో చెప్పు!? 
 
*కొడుకు:-*
*పద్మంలో పుట్టినవాడు బ్రహ్మ* అనే అర్థంలో *396* పదాలు సిద్ధంగా ఉన్నాయి కదా! *తండ్రి* అనే అర్థాన్నిచ్చే *జనక, గురు, పితా, జన్మద* అనే నాకు తెలిసిన ఓ నాలుగు ప్రత్యయాలను ఆ *396* పదాలకు చేరిస్తే (396x4) *1584* పదాలను *విష్ణువు* అనే అర్థంలో సృష్టించగలను.

Sunday, February 11, 2024

నాన్నగారి నిర్యాణం.

ఈరోజు 12:50 గం!!కి మా నాన్నగారు , "పంతుల  రామారావు గారు " శివ సాన్నిధ్యం చేరుకున్నారు.  , (ఆగష్టు -ఆరు -2023.)

Sunday, February 4, 2024

నా పాటల పుస్తకానికి సదయ్య గారు , కుందారపు గురుమూర్తిగారు, వేణుగోపాల్ గారు రాసిన ముందుమాటలు

అభినందనలు

         శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు సమకాలీన కవయిత్రులలో పేరుపొందిన కవిశిఖామణి.సంగీతజ్ఞులు.వీరు మా మహతీ సాహితీ కుటుంబ సభ్యులైనందుకు మాకు గర్వకారణం.వీరు నాకు మాతృసమానులు.వీరి పుస్తకానికి పిన్నవాడినైన నేను అభిప్రాయం రాయడం నా పురాకృతపుణ్యంగా భావిస్తాను.మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం యొక్క "వంద కవితల పండుగ"లో  పాల్గొని "శతకము"ను పూర్తి చేసిన సందర్భంగా జగదీశ్వరీమూర్తి గారికి శుభాకాంక్షలు.
       శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు గతంలో మహతీ సాహితీలో తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ క్రమం తప్పకుండా క్రమశిక్షణగా ఎన్నో రచనలు చేసారు.వీరు మహతీ సాహితీ ద్వారా ఎన్నో ప్రశంసాపత్రాలు,సన్మానాలు,బిరుదులు పొందారు.వీరు నా ఇష్టపది ప్రక్రియకు వన్నెతెచ్చారు.వీరు ఇష్టపది ప్రక్రియలో "భగవద్గీత" మరియు "రామాయణం" రాయడం జరిగింది.
      శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకం ఒక సంగీత కళాఖండం.నాకు సంగీతంపై పరిజ్ఞానం లేకపోయినా కానీ వారి పాటలలోని మాధుర్యాన్ని, ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని ఆస్వాదించాను.ఇందులో శ్రీ కృష్ణ గానామృతం ఒక మధురాతిమధురమైన పాటలసంపుటి,జయదేవుని అష్టపదుల వలె నిజంగా గానామృతంలో ఓలలాడిస్తుంది.ఇంకా పెళ్ళిపాటలు,వియ్యాలవారి కయ్యాలు,దేశభక్తి గీతాలతో ఈ పుస్తకం విభిన్నతను సంతరించుకున్నది.గోదాదేవి తిరుప్పావై పాశురాలు అద్భుతంగా జగదీశ్వరీమూర్తి అమ్మవారి పాటల్లో కుదురుకొని ఆ పాశురాల భావాలు తెలుగు పాఠకులకు అవగతమయ్యాయి.
    శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకరాజం తన కవిత్వం మరియు సంగీతం ద్విగుణాలతో  పాఠకలోకాన్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను.వీరు తమ కవితాప్రతిభను ప్రదర్శిస్తూ మరిన్ని కవితాసంపుటులు వెలయించాలని ఆకాక్షిస్తూ...


మీ సాహితీ పిపాసి

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం


*మనసు పలికిన మాట*
*********************

*వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే*
*జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరమ్*

*పాఠక మహాశయులందరికీ నమస్సులు.*

*శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరి మూర్తి గారు.. ప్రఖ్యాత రచయిత్రి, కవయిత్రి, సంగీత సరస్వతి, గాయని, ఆధ్యాత్మికవేత్త... వారు గత కొన్నేళ్లుగా మహతీ సాహితీ కవిసంగమం సమూహం ద్వారా పరిచయం.. చక్కటి పదాలను ఉపయోగించి చిక్కటి కవిత్వాన్ని ఒలికించడంలో వారు అందెవేసిన చెయ్యి. సాధారణ కవులు, కవయిత్రులకు భిన్నంగా.. రాగ,తాళ, లయలకు అనుగుణంగా పదాలను పేర్చడంలో.. కూర్చడంలో వారు దిట్ట. నేడు ఈ పుస్తకానికి ముందుమాట రాసే అవకాశం నాకు లభించడం ఆ సరస్వతీదేవి వరప్రసాదం గా భావిస్తున్నాను.*

*సహజంగా శ్రీకృష్ణుని భక్తురాలు అయిన శ్రీమతి జగదీశ్వరి గారు.. వారిపై అద్భుతమైన పది పాటలతో ఈ సంపుటిని ప్రారంభించారు.. కృష్ణుని యందు అమితమైన భక్తి, వారి రచనలకు ఒసగింది అమితమైన శక్తి.. వారికి ఆ వేణుగోపాలుని యందు ఉంది కదా అమితమైన అనురక్తి..*

*మధురా నగరిలో.. ఏడే మాధవుండు.. బృందావన మది అందరిదీ.. ఒక్కొక్క పాట ఒక్కో రసగుళిక.. అని చెప్పవచ్చు*
*శ్రీకృష్ణ గానామృతం పేరుతో వీరు నిజంగా చదివిన వారికి హృదయాలకు విందు చేశారని చెప్పాలి*

*పిమ్మట పెండ్లి పాటలను ఎంచుకున్నారు.. పెండ్లికొడుకు రాక నుండి అమ్మాయిని అప్పగింతలు పెట్టి అత్తవారింటికి సాగనంపే వరకు ప్రతి ఘట్టానికి ఒక పాటను కట్టారు.*
*చాలా అద్భుతంగా సాగిన ఈ గానప్రవాహినిలో తదుపరి అంశాలుగా దేశభక్తి, దైవభక్తి తీసుకున్నారు.. భారతమాతకు నీరాజనం ఒకవైపు.. విశ్వశాంతికై మరోవైపు పిలుపు.. చాలా బాగున్నాయి.*

*చివరగా ధనుర్మాస ప్రాశస్త్యం వివరిస్తూ ముప్పై రోజులకు ముప్పై పాశురములను చక్కటి భావంతో వివరణాత్మకముగా.. పాడుకోవడానికి అనుకూలంగా రచించారు.. చదువుతుంటే.. భక్తి పారవశ్యంతో తనువు మనసు పులకించిపోతాయి.*

*ఇటువంటి పాటల పుస్తకం బయట దొరకడం చాలా అరుదు.. సాహితీ సౌరభాలను వెదజల్లే ఈ గీతాసుమాలను ఒక మాలగా కూర్చడంలో శ్రీమతి పుల్లాభట్ల వారు కృతకృత్యులయ్యారనే చెప్పాలి.. వారు ఇటువంటి పుస్తకాలను మరెన్నో వెలువరించాలని.. తెలుగు పాఠకులను మరింతగా అలరించాలని కోరుకుంటూ.. ఈ అవకాశం లభించినందుకు మరోమారు ధన్యవాదాలు మరియు అభినందనలు తెలుపుకుంటూ..*

*మీ*
*వేణుగోపాలుడు*
🙏🌹🙏🌹🙏

'పాట పాటలో పరమాత్మ పరవశించె'

సీ: మధురానగరితో సుమధురముగ మొదలై
           మురళి గానముతోడ ముగిసి  మురిసె
     మధురాధి పతియైన మంగళకరుడైన
           మాధవు రూపంబు మదిని వెలిగె
     గోపాల బాలుడా! గోవిందుడా!యని
          పాడుగ మెనెల్ల  భక్తి నిండె
    శ్రీకృష్ణ లీలలు చిత్తమున నిలచె
            గాత్రంబునన్ సరిగమలు వలికె
తే: పాట పాటలో పరమాత్మ పరవశించె
     పదము పదములో సాహిత్య పటిమ తెలిసె
      పదును గలిగిన పాటలు పాడుచుండ
      నాదు మానసంబు మిగుల హ్లాదమొందె

కం వియ్యాల వారి పాటలు
     కయ్యాలననేల? వినగ  కమ్మని విందుల్
     సయ్యాటలేగద జనుల
     నెయ్యములనుబెంచుచుండు నేర్పున భువిలో
కం: శ్రీ పుల్లాబట్ల కలము
      ప్రాపకమయి నిల్చె భక్తి పాటలకెల్లన్
      రూపము భగవద్భక్తికి
      నీ పొత్తము. గణుతి కెక్కు నిదియునొకటిగాన్

కుందారపు గురుమూర్తి
భాషారత్న, పద్యకవి.
పాఠశాల సహాయకులు తెలుగు,
బలిజపల్లి,
కలసపాడు మండలం
వై.యస్.ఆర్ కడపజిల్లా.
ఆంధ్రప్రదేశ్.
7780656292

నా అభిప్రాయం.

పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు నాకు మహతి సాహితీ కవి సంఘమం ద్వారా పరిచయం. నాకు సోదరీ సమానులు.

 వారు ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయమనడం నా భాగ్యంగా భావిస్తున్నాను . 

మహతి సాహితీ కవి సంగమం బృందంలో 100 కవితలు పండుగలో పాల్గొని శతకమును పూర్తి చేసిన సందర్భంగా జగదీశ్వరీ మూర్తి గారికి శుభాభినందనలు .


 ఒక గొప్ప రచయితగా కవయిత్రిగా ఎన్నో వివిధ ప్రక్రియలను అలవోకగా వ్రాస్తూ ఒక విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకొని అక్షరాల అమృత ధారలు కురిపిస్తూ ఆ అమృత వర్షిణిలో ఓలలాడుతూ ,తన మనోభావాలను కవితాత్మకంగా చిత్రించి మంచి పదబాణిని ప్రయోగిస్తూ అలతి పదాలలో, అనంతమైన అర్థాలను ఇనుమడిస్తూ వ్రాసిన తెలుగు సంస్కృతి సంప్రదాయాల కలబోతయే మంగళకరమైన ఈ రాగామృతం.


"మధురా నగరిలో" మాధవుని గీతాలు, పిల్లన గ్రోవిలో మోహనరాగం మధురంగా వినబడుతుందని, మురళీ రాగమే కోకిల సంగీతం గా వినపడుతున్నదని వ్రాసిన ఉపమానం చక్కగా ఉన్నది .

విరహపు వేదనను వీనుల విందుగా అందంగా మెరిపిస్తూ, మురళీధరుని మోహన రూపము మనసంతా నిండిందని, ఆనందంగా మురిసిపోతూ, మాధవగీతమై మధురానగరిలో నిలిచిన  వైనం,  శ్రీకృష్ణ గానామృతానికి నిలువుటద్దమై నిలిచింది.


"ఏడే మాధవుడు" పాటలో, రాధ, శ్రీకృష్ణుని తోడుకోసం పరితపించినటువంటి విధానం ,విరహ వేదనతో  మూగవోయిన మనసులోని భావాలు సఖులుకు చెబుతున్నట్లుగా చక్కటి భావావేశం ప్రకటతమయింది


గోప బాలుడు గొల్లవాడు మోహన రూపుడు బృందావన వాసుడు ఆయన శ్రీకృష్ణుడి లీలల చేష్టలను తెలుపుతూ, గోపికల మనసు దోచిన విధానము ,నవరస మోహనా కారుడి స్తుతి అద్భుతంగా ఉన్నది.


"రాధా మాధవ మోహన " గీతాలాపనలతో, మధుర సుగంధాల మేలి ముసుగులతో, రాధమ్మ అందెలు ఘల్లు ఘల్లు మన కోయిల గీతాల కమ్మని తరంగాల సాగుతూ, మదిలో పన్నీటి జల్లులు కురిపించిన సప్తస్వర సుధా రాగ ఝరులను అష్టాచెమ్మల ఆటలలో అలవోకగా కురిపిస్తూ , యమునా తటిలో , మృదు మురళీరవముల లలిత భావనలలో, ఊయల లూగుతూ, సృష్టిలో రాధాకృష్ణుల ప్రేమకు అర్థం చెబుతూ, అజరమైన ప్రేమకు అద్భుతమైన సుధారస రాగాల పరవశంతో మంజుల మురళీరవ గీతాలు ,రాత్రి మురళి గానము పేరుతో మనసుకు స్వాంతన చేకూరుస్తూ ,మధురనాదమై సుధారస సారమై పరవశింపజేస్తూ , "గోపాల బాలుడమ్మ " శీర్షికతో గోపబాలుని అల్లరి చేష్టలు ఉదహరిస్తూ, నవరసాలు చిందిస్తూ, అజరామరమైన శ్రీకృష్ణ  లీలలతో  మురిసే యశోద లో.. అమ్మతనాన్ని చాటుతూ  వ్రాశారు .

భాషలో అమృతం కురిపిస్తూ ,అంత్యప్రాసలు పలికిస్తూ,

 అక్షరాల నందనవనంలో స్నేహ సౌగంధికాలతల "శ్రీకృష్ణ స్తోత్రం" చేస్తూ , ఆయన అభయహస్తాన్ని పొందుతూ, "వినిపించరా కన్నా" శీర్షికతో, మనసారా భగవంతుని రూపాన్ని సాక్షాత్కరిస్తూ , నుదుట కస్తూరి, పించముతో వదనాన్ని చూపిస్తూ, అక్షరాల భావాలతో మైమరపిస్తు,  కాళీయ నృత్యము, నాదరూప ఘన లీలా  మోహనుని ,నృత్య  గాన లహరిలో, గోపి ప్రియ లోలుని గురించి చక్కటి వర్ణనతో అద్భుతంగా వ్రాయడం , జగదీశ్వరీ గారి భక్తికి తార్కాణం.


"తపస్వి మనోహరం" గురించి వ్రాసిన పాటలో,  తరతరాల సాంప్రదాయాలు రంగరిస్తూ , కవయిత్రులందరికీ స్ఫూర్తి పెంచే కవులు కళాకారులతో "నిండు రస విభూషిణీ" అని చాటుతూ, చక్కటి "సమ భావలతో నిండు రస విభావరి ,తపస్వి మనోహరి " అంటూనే,  "సామూహిక రచనల కథాపీఠమై, నిత్య నూతనపు కాంతి తేజమై " సాగిపోతూ ఉంటుందని "తపస్వి మనోహరిని ". రస విభావరి అంటూ చక్కగా నిర్వచించారు.

"శ్రీ కృష్ణ గానం" శీర్షికతో "మనసే మల్లెల పూబాలై.... మరలిపోయనే బృందావనానికి, మాధవుని అందెల రవళిలా, అల్లుకుపోతిని లతనై-గతినై , పరవశి నైతిని వలపుల చెలినై, అని వ్రాస్తూ ,  భావ కవితా ఝరిలో సాగిపోతూ, కృష్ణ గానం శీర్షికలో ఊయలలూగుతూ , మధురానగరిలో మలయ మారుతంలా ,మధురమై విహరిస్తూ , గీతమై పాడుతూ, మాధుర్యం చిందిస్తూ "అందరివాడూ  ఐన అల్లరి మోహనుడిని తలచిన చాలును , అందరి మనసులు మురియునంటూ, మృదు మంజుల గానాలు ,వెన్నెల మాటున పొంచి యున్న కన్నియల మనసు దోచిన వాడు , గోవులుగాచు గోప బాలుడు, అందరి మనసులు గెలిచాడు నంద నందనుడు, అల్లరి మాధవుడు , అంటూ ,కృష్ణ భక్తిని చాటుతూ, భక్తి పారవశ్యంలో మైమరిచిపోతూ ,తన్మయత్వంతో రాసిన కృష్ణ గానామృత తరంగాలు,  కన్నయ్య గురించి మృదు మధురమైన బాణిని పలికిస్తూ, వేణువు వీణలో లతగా అల్లుకుపోతూ ,  తీగలుగా సాగిపోతూ,రాసిన  ప్రతి కవనము ఆణిముత్యమై ,అక్షరాల సొబగుల సాగుతూ ,చక్కటి పద బాణిలో పరుగులెత్తుతూ రచించిన తీరు అద్భుతం.


"పెళ్లి పాటలలో," పెళ్ళికొడుకు రాకనుండి మొదలుపెట్టి ,

ఆది శేషాద్రిపై వెలసిన మా దేవుడు, ఆపద మ్రొక్కులు తీర్చేడివాడు, అంటూ సాగిన , పెళ్లికూతురు గౌరీ పూజతో శ్రీకారం చుడుతూ, తోట సంబరం శీర్షికతో ,కర్పూరపు సుగంధాలు వెదజల్లుతూ,  జాజులు, మల్లెల మాలలు అల్లుతూ ఆట-పాటల ఆనందములతో ,పసుపు కుంకాలు పంచుతూ , పరవళ్ళు త్రొక్కుతూ, పారాణి  పాదాలతో , పన్నీటి గంధాలతో తేనెల మాటల పిలుపులతో , అంగనలిచ్చే హారతుల వంటి భావామృతాలతో విశేషం గా ఉన్నది .

ఆడవారి పెళ్లి పాటలు,  మగవారి పెళ్లి పాటలు, చక్కగా ఉదాహరిస్తూ , పెళ్లి పిలుపుతో "కళ్యాణము చూతము రారండి, శ్రీ వెంకటరమణుని " అని ఆహ్వానిస్తూ , ఇరు భార్యల నురమున నుంచి,  మురిపెపు నగవుల ముడుపుల దోచి, కరుణతో కరముల నభయమునిచ్చి , ఇడుముల బాపుటకు ఇలలో వెలసిన హరి , శ్రీ వేంకటేశ్వరుడు అంటూ,  వెంకటేశ్వరుని పాదాల చెంత అప్పగింతల పాటలతో  కన్నీరు తెప్పించారు .

చుట్టాల సందళ్లతో , దోస ఆవకాయ, గోంగూర ,నేతి పోపుల రుచుల పచ్చళ్ళతో,  గడ్డ పెరుగు, ఐస్ క్రీము ,వంటి  పెళ్లి వంటల  ముచ్చట్లు , అన్ని తినగా తిని ఆయాసాలతో తాంబూలాలు వేసుకుంటూ , కొత్త జంటను "వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ" 

 పెళ్లికూతురని అత్తగారింటికి సాగనంపుతూ , "పుట్టినింటి జ్ఞాపకాలు తీపి గుర్తులై, అత్తింటి గౌరవమే నీకు కీర్తి " అని పెళ్లికూతురుకి మంచి మాటలు చెబుతూ  వ్రాయడం చక్కటి వర్ణనలతో చిక్కటి భావవీచికల మేళవింపుతో మంచి నలభీమపాక రుచులతో విందు భోజనం లాంటి రచనలు అక్షర సుమగంధాల జల్లుల పరవశంతో అందించారు.


మాతృభూమిపై మమతను కురిపిస్తూ "తల్లి భారతి తరలివచ్చెను సప్త  జతి యతి పదముల" అంటూ,

 భారత భూమిలో పాడి-పంటలు , ప్రకృతి సోయగాలు, సూర్య-చంద్రుల కాంతి బింబాలు,  కరుణ నిండిన చూపులు,

వంటి పదాలతో, త్యాగరాయ కీర్తనల సాగుతూ, శ్రీనాధుని సీస పద్యాల రచనల కీర్తి కిరీటాలతో  , క్షేత్రయ్య పదముల అలలై సాగుతూ ,భారత ఖ్యాతి రత్నాలైన వీర పురుషుల రుధిర ధారల తడుస్తూ, మూడు రంగులకు మూలమై, శాంతి సంకేతమై ,ధర్మానికి నిలయమైన, భారత జాతి ఖ్యాతికి సంకేతమైన "పతాక"  రెపరెపలలో , ధర్మ వీచికల పరిమళాలు వెదజల్లుతూ , శాంతి సౌఖ్యాల కల్పవల్లికి స్వాగతం పలుకుతూ, విశ్వశాంతికి పిలుపునిస్తూ,  "భరతమాతకు వందనం " అంటూ,  దేశభక్తిని చాటుకుంటూ, రచించిన తీరు అక్షర జల్లుల పరవళ్ళతో  కదం త్రొక్కుతూ , భావ వీచికలై

సాగే  నదీ తరంగాలవలె  సాగుతూ , జోరుగా జంట పదముల విలసిల్లుతూ వెలువరించిన తీరు అత్యద్భుతం


"ధనుర్మాసము మొదలు,  సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది "అంటూ మనుజులకు గుర్తు చేస్తూ, ధనుర్మాసంలో నెల రోజులు గోదాదేవి, గోవిందుని స్తుతించి భర్తగా  పొందినటువంటి పుణ్య దినములను గుర్తు చేస్తూ, మొదటి రెండు పాశురాలలో,  రంగనాథుడి మేలుకొలుపులు పాడుతూ ,ముల్లోకాలను కొలిచిన త్రివిక్రముడంతటి వాడని , పొగుడుతూ ,మార్గశిర దినకరుడి గురించి ,మహిమలన్నీ తెలుపుతూ , గోదాదేవి మధురానుభూతిని, మధుర భావనలను ,తన అక్షరాల పంటలో పండిస్తూ,  మూడు వేదాలకు మూలమైన స్వామిని ,"నిత్య సత్యానందుడు, నిర్మలాత్ముడు ,నిర్వికారుడు ,అయినా సశంఖ,పద్మ,గదా చక్రాల ధరించి ,విశ్వమంతా నిండిన విశ్వంభరుడని , 

శ్రీ రంగనాథునికింపైన తులసి దళాలతో ,సొంపుగా మాలలు అల్లి ,మంగళం అర్పిస్తూ, నీ రాకకై వేచియున్నానంటూ,  ఆర్తిగా పిలిచిన గోదాదేవి ప్రార్థనలను చక్కటి పద బాణిలో కూర్చుచు, వేద-మంత్రాలు,  పల్లకి సేవలు ,మేలుకొలుపులతో,ఆ భాగవతోత్తముని ,భానుతేజస్సు నిండిన వానిని భక్తి భావాలతో కొలుస్తూ, భవ బంధాలను వదిలించుకుంటూ ,బంగారు కడియం  తొడిగిన పాదమును కొలుచుచు,  సాధు సంరక్షకుని, ముక్కోటి దేవతల భయము బాపేటువంటి భాగవతోత్తముని,  కోరినంతనే కోర్కెలు తీర్చేవానిని, సాదు సంరక్షకుని , హరి పురుషోత్తముడిని ఆశ్రయించితిని , ఆదుకొనగా రావయ్యా" అంటూ ఆర్తిగా పిలుస్తూ ,30 రోజులు 30 తీరులుగా పూజిస్తూ, చేసిన అర్చన సార్ధకములుకాగా ,కాత్యాయినీ వ్రతమును ఘనముగా చేసి, మంగళ కరుణ్ణి మనసారా పూజించి, మంగళముల నిమ్మని వేడగా , శ్రీరంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవిని కళ్యాణమాడిన ఘట్టం , అత్యద్భుతంగా వ్రాసిన విధము ఆదర్శమై నిలిచేలా వ్రాసిన విధానం చాలా బాగుంది.  మధురా నగరిలో మొదలైన భక్తి తత్పరత ,ఇంతింతై వటుడింతై అన్నట్లు మధురభావనారసపరిమాళను ఆస్వాదిస్తూ చదువరులకు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తూ వ్రాసిన అక్షరామృతాలు ఈ రచనలు . 

విభిన్న అంశాల సమ్మేళనం. వాస్తవ దృక్కోణం .సునిశిత పరిశీలన ,చదువరులందరిని కృష్ణ భక్తిలో కట్టిపడేస్తూ అక్షరాల అల్లికల జిగిబిగిలో పాఠక లోకం ఆసాంతం ఆస్వాదించి చదివేలా రచన సాగుతుంది. 

 అలాగే వీరు తమ కవితా పటిమను ప్రదర్శిస్తూ,  నలుగురికి ఆదర్శంగా నిలుస్తూ , మరెన్నో కవితా సంపుటాలు వీరి కలం నుండి జాలు వారాలని ,  మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ , మీ గీతా శైలజ.

జై శ్రీకృష్ణ




కొమరగిరి గీతాశైలజ

సి.ఆర్.పి యఫ్ పబ్లిక్ స్కూల్

తెలుగు టీచర్ (యస్ ఏ)

అల్వాల్

సికింద్రాబాద్






నా పాటలకు సదయ్య గారు రాసిన ముందుమాట

అభినందనలు

         శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు సమకాలీన కవయిత్రులలో పేరుపొందిన కవిశిఖామణి.సంగీతజ్ఞులు.వీరు మా మహతీ సాహితీ కుటుంబ సభ్యులైనందుకు మాకు గర్వకారణం.వీరు నాకు మాతృసమానులు.వీరి పుస్తకానికి పిన్నవాడినైన నేను అభిప్రాయం రాయడం నా పురాకృతపుణ్యంగా భావిస్తాను.మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం యొక్క "వంద కవితల పండుగ"లో  పాల్గొని "శతకము"ను పూర్తి చేసిన సందర్భంగా జగదీశ్వరీమూర్తి గారికి శుభాకాంక్షలు.
       శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారు గతంలో మహతీ సాహితీలో తమ విలువైన సమయాన్ని కేటాయిస్తూ క్రమం తప్పకుండా క్రమశిక్షణగా ఎన్నో రచనలు చేసారు.వీరు మహతీ సాహితీ ద్వారా ఎన్నో ప్రశంసాపత్రాలు,సన్మానాలు,బిరుదులు పొందారు.వీరు నా ఇష్టపది ప్రక్రియకు వన్నెతెచ్చారు.వీరు ఇష్టపది ప్రక్రియలో "భగవద్గీత" మరియు "రామాయణం" రాయడం జరిగింది.
      శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకం ఒక సంగీత కళాఖండం.నాకు సంగీతంపై పరిజ్ఞానం లేకపోయినా కానీ వారి పాటలలోని మాధుర్యాన్ని, ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని ఆస్వాదించాను.ఇందులో శ్రీ కృష్ణ గానామృతం ఒక మధురాతిమధురమైన పాటలసంపుటి,జయదేవుని అష్టపదుల వలె నిజంగా గానామృతంలో ఓలలాడిస్తుంది.ఇంకా పెళ్ళిపాటలు,వియ్యాలవారి కయ్యాలు,దేశభక్తి గీతాలతో ఈ పుస్తకం విభిన్నతను సంతరించుకున్నది.గోదాదేవి తిరుప్పావై పాశురాలు అద్భుతంగా జగదీశ్వరీమూర్తి అమ్మవారి పాటల్లో కుదురుకొని ఆ పాశురాల భావాలు తెలుగు పాఠకులకు అవగతమయ్యాయి.
    శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి గారి ఈ పుస్తకరాజం తన కవిత్వం మరియు సంగీతం ద్విగుణాలతో  పాఠకలోకాన్ని అలరిస్తుందని ఆశిస్తున్నాను.వీరు తమ కవితాప్రతిభను ప్రదర్శిస్తూ మరిన్ని కవితాసంపుటులు వెలయించాలని ఆకాక్షిస్తూ...


మీ సాహితీ పిపాసి

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125

సన్మానానికి సదయ్య గారి ఆహ్వానం

నమస్తే అమ్మా!

మీరు నా కార్యక్రమంనకు 18-02-2024 తప్పకుండా రావాలి.మీ సరస్వతీ ప్రార్థనతోనే కార్యక్రమం ప్రారంభం అవ్వాలని నా ఆకాంక్ష.మీకు బిరుదు ప్రదానం ఉంటుంది ఆరోజు...


మెమొంటోపై ముద్రణ కోసం ఒక మంచి ఫోటో పంపగలరు...రేపటి నుండి ముద్రణ ప్రారంభమవుతుంది...🙏🏻🙏🏻🙏🏻