09/03/2024.
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చాటువులు.
శీర్షిక : నేటి మహిళలు.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది.
పద్యం.
-----
ఫ్యాషనన్న పేర ఫేస్కు రంగులు పూసి
కట్టు బొట్టు మార్చి జుట్టు కోయ ,
బామ్మ లెవరొ మరియు భామ లెవ్వరొయంచు
మారు స్థితికి వగచె మహి పురుషులు !!
భావం .
-----
ఒకప్పుడు ఆడవాళ్లంటే సాంప్రదాయ పద్ధతిలో,
కట్టు బొట్టులతో, నిండుగా చీర కట్టులో
మహాలక్ష్మిలా. ఉండేవారు.
కానీ ఈనాడు, మగువలు అమ్మ తనాన్ని,
ఆడతనాన్ని మరచి, పడుచు వారితో సమంగా,
ముసలి వారు కూడా పోటీ పడుతూ
కనబడుతున్నారు.
ముఖానికి రంగులు వేయడం, జుత్తు కత్తిరించి రంగులు వేయడం, ఫేషన్ పేరుతో, చిట్టి పొట్టి బట్టలు వేయడం
వంటివి చేయడంతో, ముసలి వారెవరో పడుచు వారెవరో తెలియక, మగవారు పడుతున్న బాధ వర్ణనాతీతం.
ఇది నా స్వీయ రచన.
-------------------
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి సోదరీ గారు,
నేటి ఆధునిక పాషన్ లను
చూసి మనసు రోసి ఎటు చెప్పలేక ఒక విస్మయం వ్యక్తం చేశారేమో మీరు
అట్లే ఆధునిక ప్రక్రియలో ఎన్ని రచనలు వచ్చిన మీరు చాటు పద్యాన్ని ఎంచుకొని సమయాస పోరకంగా చక్కటి చాకచక్యమైన చమత్కారం పూరకమైన ధ్వన్యాత్మకమైన
అధిక్షేపకాత్మకమైన పద్యాన్ని మీ సృజనాత్మకత పల్లవించే నవ్యమనోహరంగా
రచించారు అమ్మా..
------------------------------
16/03/2024.
మహతి సాహితీ కవి సంగమం.
అంశం : చాటువులు.
శీర్షిక : అర్థమేమున్నది.
పద్యం ప్రక్రియ: ఆటవెలది.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
స్వీయ రచన.
అత్తవారి ఇంట అణగి మసలకున్న
అమ్మ తనము లేక అలరుచున్న
భార్య గాను నీవు భారమైన పతికి
ఆడ బ్రతుకు కింక అర్ధమేది...!!
పూర్వం ఆడదాన్ని పుట్టింటి మహాలక్ష్మి గా ,
అత్తింటి గృహలక్ష్మిగా. తలచేవారు.
అంతే కాదు భూదేవి అంత సహనం ఉంటుందని ,
అమృతమయి అని , సభ్యతకు, సంస్కారానికి స్త్రీత్వాన్ని ఉదాహరణగా చెప్పేవారు.
అత్తవారింటికి చేరిన ఆడపిల్ల, అటు పుట్టింటి
మర్యాదను కాపాడుతూ, ఇటు అత్తింటి గౌరవాన్ని
నిలుపుతూ, ఆదర్శ గృహిణిగా అందరి మన్ననలులూ.
అందుకుంటూ ఉండేది .
నేటి ఆడపిల్లలు , "పురుషులతో సమానంగా మాకూ హక్కులు కావాలి " అంటూ, అన్ని రంగాల్లో ముందంజ వేయడం వరకు బాగానే ఉంది.
చదువుకుంటున్నారు గానీ సంస్కారం మరచిపోయారు .అణకువన్న మాటకి అర్థం లేకుండా ప్రవర్తిస్తున్నారు.
పెద్దల మీద గౌరవం లేదు.
అటు , అత్తమామలను ఆదరించక, అవమానిస్తూ
వారిని వృద్ధాశ్రమాల్లో చేర్చి, వారి బ్రతుకు దుర్భరం చేస్తున్నారు
ఒక తల్లిగా పిల్లలకు మంచి చెడులను చెప్పేబాధ్యతను వహించక ,వారితో పాటుగా ఫ్యాషన్ పేరుతో ,కట్టు-బొట్టులను
మార్చి,బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు చాలామంది.
ఏదైనా, మోతాదుకు మించితే ఎబ్బేట్టుగానే ఉంటుంది.
భర్తతో,భార్యగా గల తన అనుబంధానికి విలువివ్వక
గృహిణిగా తన కర్తవ్యాన్ని , బాధ్యతను నిర్వర్తించక ,
దురుసుతనంతో , కుటుంబానికే భారమై మసలుతున్నారు
కొంతమంది ఆడవాళ్లు.
ఏ కోణంలోనూ రాణించక , .
సమాజంలో విలువ పోగొట్టుకున్న స్త్రీ బ్రతుకుకు అర్దమేమున్నది.
-----------------------------
అంశం: చాటువులు.
శీర్షిక: కుక్క తోక వంకర.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
పద్యం.
కుక్క ముద్ధటంచు కూర్చి మకుటమెట్టి.
కూడు మంచి దెట్టి గుడ్డ గట్ట.
ఎంగిలాకు జూచి ఎగబడి యది నాకు.
పుట్టు బుధ్ధి పోదు గిట్టువరకు !!
---------------------------
భావం.
------
చాలామందికి కుక్కలు అంటే ఇష్టం.
"కుక్క అంటే నాకు ముద్దు" అని, దానికి బంగారు కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టినా సరే , అది ఎంగిలాకు కనపడగానే , పరుగెత్తి పోయి దాన్ని నాకుతుంది, తప్ప నువ్వు బంగారు పళ్ళెంలో పెట్టిన విలువైన భోజనాన్ని తినదు. ఎందుకంటే కుక్కకి దాని విలువ తెలియదు.
అందుకే పూర్వం అన్నారు" కుక్క తోక వంకర" అని.
అలాగే
మనుషుల్లో కూడా కొంత మంది ఉంటారు.
మానవత్వంతో , చదువు చెప్పించి, ఒక ఉన్నతమైన స్థానంలో వారిని కూర్చోపెట్టినా, వారు దొరల్లా మసల లేరు.
దొమ్ములు చేయడం, దమ్ములు లాగడం, కొట్లాటలు పెంచి మనుషుల్ని బాధపెట్టి ఆనందించడం మాత్రమే వాళ్ళు చేయగలరు.
అందుకే , "ఎవరిని ఎక్కడ ఉంచాలో, అక్కడే ఉంచాలి."
అన్నారు పెద్దలు.
బాగుపడతారేమో , అనుకొని , అనర్హులను, అందలం ఎక్కించకూడదు.
---------------
[30/03, 9:36 pm]
JAGADISWARI SREERAMAMURTH:
అంశం : చాటువులు .
శీర్షిక: ఉన్నమాటంటే ఉలుకెక్కువ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
---------------------
కంద పద్యం .
-----------
దిటవగు పన్నులు నావని
పట పట, మని పండ్లు కొరక, పన్నే విరిగెన్
ముటముట లాడే పతిగని
నట పడి నవ్విన సతి గని నాధుడె నలిగెన్ !!
--------------------------
భావం.
------
వయసు పైబడ్డ పతితో , అతని భార్య,
"పండ్లని అలా కొరికి తినకండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇస్తాను " అన్నది .
ఆమె ఆ భర్త రోషంగా" ఏం అక్క లేదు. నా పళ్ళు ఇంకా గట్టిగానే ఉన్నాయి. నేను కొరికి తినగలను" అంటూ,
భార్య వ్యంగ్యంగా అన్నదేమో అనుకుని ముటముట లాడుతూ, భార్య మీద కోపంతో, పళ్ళు పటపటా కొరికాడు.
అంతలోనే అనుకోకుండా అతని ముందు పన్ను ఒకటి ఊడి పడింది.
అది చూసిన భార్య, నవ్వు ఆపుకోలేక పకపకా నవ్వింది.
ఆమె నవ్వు చూసిన భర్త ఉడుకు మోతు తనంతో మూతి ముడిచాడు.
-----------
No comments:
Post a Comment