Sunday, March 17, 2024

మా ఊరి కథలు ..

మా ఊరి కథలు .

బుర్రప్పడు, గుర్రం కధ .

రచన : శ్రీమతి  : జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ : మహారాష్ట్ర.

ఆ ఊర్లో బుర్రప్పడిని. ఎరుగని వాళ్ళు అంటూ లేరు.

వాడి తాతల సమయం నుంచి, వాళ్ళందరూ అక్కడే పుట్టి పెరిగి,  పోయేరు కూడా.

వాళ్ళందరూ కూడా గుర్రబ్బండి తోలుకునే బతికారని వినికిడి.

అప్పట్లో కారులు గానీ ,బస్సులు గానీ  ఉండేవి కావు.

కాస్త డబ్బున్న వాళ్ళు ,షావుకారులు అందరూ కూడా గుర్రపు  బండిలోనే ప్రయాణం చేసేవారు.

మిగిలిన వారంతా పట్నం వెళ్లాలంటే, ఎడ్లబండిలో వెళుతూ ఉండేవాళ్ళు.

బుర్రప్పడు వాళ్ళ నాన్న కూడా గుర్రపు బండి తోలుకొనే బతికాడు.

వాడి కొడుకే  వీడు . వాడి పేరు అప్పడు .వాడు  చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి పక్కన  గుర్రబ్బండి లో కూర్చుని , తానే గుర్రం తోలుతాననేవాడు  . వాడి తండ్రి వాడి చేతితో చిన్న కర్ర ఇచ్చి , ముందు నువ్వు కూర్చోబెట్టి ,వెనకాతల నుండి తను  బండిని తోలుతూ ఉండేవాడు.

. అప్పడు మాత్రం, తండ్రి తనకిచ్చిన కర్రతో గుర్రాన్ని కొడుతూ. బౄ.  బౄ......ట ట   ట  అంటూ ,బండి తోలుతుతూ ఉన్నట్లు ,సంబరపడిపోతూ ఉండేవాడు.

అప్పుడు చిన్నపిల్లాడు కదా" ఏదో నోరు పలకక అలా అంటున్నాడేమో" ,అని అనుకునే వారు ఊరు వాళ్ళు.

కానీ రాను రాను , వాడికి మాటలు వస్తున్న కొద్ధీ వాడికి, " గ ; ల" అన్న. రెండు అక్షరాలు పలకవు అని తెలిసింది అందరికీ.

గుర్రం కి , బుర్రం అనేవాడు. "ల "పలకవలసి వచ్చినప్పుడు "ర" అంటూ ఉండేవాడు.

దాంతో వాళ్ళందరూ అప్పటినుంచి వాడిని "బుర్రప్ప"డని పిలవడం మొదలెట్టారు.

వీడు పెద్దయేసరికి వీడి తండ్రి చచ్చిపోయాడు. 

తండ్రి దగ్గర ఉన్న గుర్రం బాగా ముసలిది అయిపోవడంతో ,

నలుగురిని కాస్త సహాయం చేయమని అడిగి ,ఒక మగ గుర్రాన్ని కొని తెచ్చింది వాళ్ళ అమ్మ. ఈ గుర్రాన్ని నడపడం నేర్చుకుంటే కొడుకు నాలుగు రాళ్లు సంపాదించుకుని వాడి బతుకు వాడు బతుకుతాడని అనుకునేది.

బుర్రప్పడు గుర్రం ఎక్కడం అయితే నేర్చుకున్నాడు, గాని బగ్గీ కట్టి తోలడం మాత్రం రాలేదు. దాన్ని ఎక్కి కూర్చున్నప్పుడల్లా

హబౄ...భౄ.... అని దాని తోలుకుంటూ .ఊరంతా తిరిగి వస్తాడు. ఇంక, ఆ ముసలి తల్లి ఏమి చేయలేక

 ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ , వీడిని పోషిస్తూ తన జీవితం వెళ్ళబోసుకుంటున్నాది . ఊర్లో అందరి దగ్గర మంచిగా ఉంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నాది.

బుర్రప్పడు చాలా అమాయకుడు.  ఊర్లో , ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ ఉంటాడు.

దాంతో అందరికీ బుర్రప్ప మీద ఒక రకమైన అభిమానం ఏర్పడింది. 

బుర్రప్పడు , పొద్దున్న ,సాయంత్రం కూడా గుర్రాన్ని మేతకు తీసుకెళ్తూ ఉంటాడు. 

అప్పుడు గుర్రం ఎక్కి కూర్చున్న అప్పడు, తనేదో , పెద్ద రాజులా "ఫీల్" అయిపోతుంటాడు.

అప్పుడప్పుడు వాడు , గ.. ల  అన్నా అక్షరాలకు బదులుగా" ర" ఉపయోగించి మాట్లాడుతున్నప్పుడు, వాడి మాటలకి ఊళ్లో వాళ్లంతా తెగ నవ్వుకుంటూ ఉంటారు కూడా...

గుర్రప్పడితో పాటే గుర్రం కూడా పెద్దదయింది.

మారుతున్న రోజులతో పాటు, ఆ ఊర్లో కూడా వారానికి ఒకసారి. బస్సు వస్తోంది .

పట్నంలో వారానికి ఒకసారి జరిగే సంతకు, అందరూ ఆ బస్సులోనే వెళ్లడంతో, గుర్రపు బగ్గీలు తిరగడం  పూర్తిగా తగ్గిపోయాయి.

అప్పుడప్పుడు  ఆటోరిక్షాలు కూడా వస్తూ ఉండడంతో,

గుర్రప్పడి గుర్రం తప్ప ,గుర్రాలు కూడా కనపడటం మానేశాయి.

-------

కొన్ని రోజులుగా గుర్రప్పడి మొహం లో  , ఏదో విచారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది . అది చూసి అందరూ ఏమైందిరా అని అడుగుతే ఏమి చెప్పలేకపోతున్నాడు.


గత కొన్ని రోజులుగా  గుర్రప్పడు గుర్రం ఇదివరకులా సిటీలోకి  తిన్నగా పరుగెట్టి వెళ్లడం లేదు.

 ఒక పర్లాంగు దూరం వెళ్ళిన తర్వాత, కుడివైపు సందులోకి తిరిగిపోతున్నది. అప్పడు ,దాన్ని వెనక్కి మళ్ళించడానికి ఎంత ప్రయత్నించినా, అది అక్కడే రెండు కాళ్ళ మీద నిలబడి లేచి సకలిస్తున్నాది తప్పితే ,వెనక్కి రావడానికి కూడా ఒప్పుకోవడం లేదు. తన గుర్రం తన మాట వినటం లేదని గుర్రప్పడి బాధ.

అందుకు కారణం ఏంటో అప్పడు ఎంత ప్రయత్నించినా ,   తెలుసుకోలేకపోయాడు.

అడగ్గా ,అడగ్గా  విషయం తెలుసుకున్న పెద్దలు కొందరు, అసలు ఆ కుడివైపు సందులో ఏముందో అని చూడ్డానికి బయలుదేరారు ఒకరోజు.

ఆ సందులోకి ,కొంత దూరం నడిచిన తర్వాత, ఒక ఇంట్లో నుంచి గుర్రపు సకిలింపు వినబడింది. అది ఆ ఇంటి వెనకవైపు మూలగా ఉన్న ఒక గుర్రపు శాలలోంచి వస్తోంది. ఆ విషయం గురించి అక్కడ చుట్టుపక్కల వారిని అడిగితే ,అక్కడున్న షావుకారు పట్టణంలో ఇల్లు కట్టుకు వెళ్లిపోయాడని ,ఎవరికో ఈ ఇల్లు అమ్మేసాడని , వాళ్ళు ఒక ఆడ గుర్రాన్ని తమతో పాటు తెచ్చుకున్నారని అది ఆ శాలలో ఉందని చెప్పారు.

దాంతో ఊర్లో వాళ్ళకి విషయం బోధపడి ,గుర్రప్పడితో  

"రేయ్ నీ గుర్రం కి పెళ్లి మీదకి దృష్టి మళ్ళింది .దాంతోపాటే నువ్వు కూడా పెళ్లి చేసేసుకో. లేకపోతే అదీ ముసల్ది అయిపోతుంది, దానితో పాటు నువ్వూ ముసలాడివి అయిపోతావ్ అంటూ హాస్యాలాడడం మొదలెట్టారు.

దాంతో బుర్రప్పడు  సిగ్గుతో తల అటు ఇటు ఊపుతూ.

"నా బుర్రంకి. పెర్రి  సేయను. నేను పెర్రి సేసుకోను...

ఏం ? నాకు మీరంతా నేరేటి..."

అంటూ మాట  దాటించేసేవాడు.


నిజం చెప్పాలంటే గుర్రప్పడికి పెళ్లి చేసుకోవాలనే ఉంది . కానీ తనకు పిల్లని ఎవరు ఇస్తారు. ? ఇచ్చినా తను ఆ పిల్లని ఎలా పోషిస్తాడు ..? తర్వాత  తనకు పిల్లలు పుడితే ఎలా?

ఇటువంటి ఆలోచనలతో పెళ్లి మాట పక్కన పెట్టాడు.


గుర్రప్పడికి , ఇప్పుడు తన గుర్రంతో చాలా ఇబ్బందిగా ఉంది.

అది తన మాట వినకుండా ,అడ్డంగా తోవ మార్చి తిరగడంతో ,గుర్రప్పడికి సిటీ వెళ్లడం అవడం లేదు.

తను సిటీ వెళ్ళినప్పుడల్లా, పార్కుల దగ్గర ఆగితే , ఆ గుర్రం ఎక్కడానికి పిల్లలు సరదా పడేవారు . ఆ పిల్లల తల్లిదండ్రులు గుర్రప్పడి దగ్గరికి వచ్చి పిల్లల్ని  , గుర్రం ఎక్కించ మని అడిగే వారు.   గుర్రప్పడు ఆనందంగా పిల్లల్ని దానిమీదకి ఎక్కించుకొని అటు ఇటు తిప్పేవాడు . 

పిల్లల ఆనందాన్ని చూసిన తల్లిదండ్రులు ,గొర్రప్పడికి ,

త్రుణమో ప్రణమో చెల్లించేవారు.   ఆ సంపాదనతో 

గుర్రప్పడికి ఆ పూట గడిచిపోయేది . గుర్రం కూడా ఖాళీ సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎండు గడ్డి తిని వచ్చేది.

పిల్లలు పెద్దలు కూడా సరదాకి అరటి పండ్లని, ఆపిల్ పండ్లని ,

చిలకడదుంపలను, ఇలా ఏవో పెడుతూ ఉండేవారు .అది గుర్రం తినేది కాదు కానీ తనకు పనికొచ్చేవి.

దాంతో తనకు, గుర్రానికి ,కావలసిన తిండి గురించి, గుర్రప్పడు ఎప్పుడూ బాధపడలేదు

కానీ, ప్రస్తుతం తన తిండికే కాదు, గుర్రం దాణాకి కూడా తన దగ్గర డబ్బులు లేవు. 

దాంతో గుర్రప్పడు విచారంలో పడిపోయాడు.

గుర్రప్పడి పరిస్థితి చూసిన ఆ ఊరి వాళ్లు , 

వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముందే పెరగడంతో ,వాడు  

పస్తులు ఉంటే చూడలేక, తినడానికి ఏవేవో తెచ్చి ఇస్తూ ఉండేవారు . గుర్రప్పడి గుర్రం, ఆ ఊర్లోనే చుట్టుపక్కల  ఎండు గడ్డి మేసి వస్తూ ఉండేది.

రోజులు గడుస్తున్నాయి.

గుర్రప్పడికి రోజు రాత్రి , పడుకునే ముందు తనున్న ఇల్లు ,గుర్రం పడుకునే చోటు శుభ్రంగా  తుడవడం  అలవాటు.

అలవాటు ప్రకారం గొర్రప్పడు గుర్రాన్ని కొయ్య నుంచి విప్పి, కొంచెం దూరంగా నిలబెట్టి ,చావడంతా శుభ్రంగా తుడిచి, కల్లాపి చల్లాడు. తర్వాత ఇరుగుపొరుగులు ఇచ్చిన దాన్ని కాస్త ఎంగిలిపడి , గుర్రానికి ఎండు గడ్డి వేసి , అలసటగా కుక్కి మంచంలో వాలాడు.

ఆ రోజు  రాత్రి గుర్రప్పడు గుర్రాన్ని తాడుతో కట్టేయడం మర్చిపోయాడు.

అలసటతో బాగా నిద్రపోయిన గుర్రప్పడికి , తెల్లారి లేచేసరికి గుర్రం కనబడలేదు.

అంతే ! గాబరాగా ఇటు అటు వెతకడం మొదలెట్టాడు .

ఆ మాట ఊర్లో అందరికీ తెలిసింది.

దాంతో కొంతమంది వచ్చి , వాళ్లు కూడా గుర్రం కోసం వెతకడం మొదలుపెట్టారు.

విషయం నిన్న కొంతమంది పెద్దలు , గుర్రప్ప గుడి గుర్రం

పర్లాంగు దూరం వెళ్ళాక అక్కడ ఉన్న కుడి సందులోకి వెళ్లి ఉంటుంది చూడండి ,అంటూ నవ్వుతూ వెటకారంగా చెప్పారు.

ఆ మాట విన్నా గుర్రపుడు అటువైపుకి బాణంలా దూసుకుపోయాడు . ఆ ఊరి వాళ్ళు కూడా కొంతమంది అటువైపు కి పరిగెత్తారు.

ఇంకేముంది .అక్కడ కూడా కొంతమంది , ఆ పెంకుటింట్లో ఉన్న గుర్రం కనబడటం లేదని , గుర్రం కట్లు తెంచుకు పారిపోయిందని ఆ ఇంటి వాళ్ళు, పొద్దున్న నుంచి లబోదిబో మంటున్నారని మాట్లాడుకుంటున్నారు.

 ఆ మాటలు విన్న ఊరు వాళ్ళు సంగతి తెలిసి , 

పక్కున నవ్వేరు.

 గుర్రప్పడు నిలువు గుడ్లు వేసాడు.


-----------------------------------------







No comments:

Post a Comment