*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం: *సిద్ధి దాత్రి!*
కవితాసంఖ్య: *09*
తేది: *11-10-2024-శుక్రవారం*
శీర్షిక: *సిద్ధి దాత్రీ!నమోస్తుతే*
కవి: *పొర్ల వేణుగోపాలరావు*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*(1)*
*నవవిధంబుల రూపు దాల్చిన నైపుణీ! యిదె స్వాగతం!*
*నవ దినంబులు బూజలందిన నవ్య రూపిణి! వందనం!*
*నవశకంబును పాదుగొల్పగ నైతికోన్నతి నీయవే!*
*యువతరంబున భక్తి వాంఛను యుక్తిగా కలిగించుమా!*
*(2)*
*రణములందున రాక్షసాంతకి! రక్షసేయుము విశ్వమున్!*
*మణుల ద్వీపము నీ ప్రపంచము! మంత్రరూపిణి! మాతరో!*
*అణిమ యాదిగ యష్టసిద్ధుల నన్ని యిచ్చెడు తల్లివే!*
*గణము లన్నియు గొల్చు దేవివి! కావు మమ్ము పరాత్పరా!*
*(3)*
*భవుని దేహము నందుభాగము బంచుకొంటివి భార్యవై!*
*నవమి యందున సిద్ధి దాత్రిగ నాకు బుద్ధినొసంగుమా!*
*భువనమంతయు నీకటాక్షము! పూజలందుము!దాత్రివై!*
*కవనమందున స్తోత్రమున్ గని కన్నబిడ్డను బ్రోవుమా!*
*(4)*
*అఘటనా ఘటనాదిశక్తివి! యాదరించవె భక్తులన్!*
*విఘటనంబగు పాపమంతయు వీక్షణంబులు సోకగన్!*
*లఘిమయాదిగ యష్టసిద్ధుల లబ్ధి గూర్చెడు మాతరో!*
*అఘములన్నియు నంతరించును నమ్మవై కరుణించుమా!*
*(5)*
*పిలచి నంతనె బల్కు తల్లివి! బిడ్డలందరి క్షేమముల్*
*తలచుకొందువు మాతగా మము దారితప్పక జూచుచున్!*
*కొలిచినంతనె కోర్కెదీర్తువు!కొంగుబంగరు రాణివే!*
*మలచవే మము మంచిగా! మది మందిరంపు ప్రతిష్టితా!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
*వేణుగోపాలుడు*
No comments:
Post a Comment