14/10/2024.
మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : చిత్ర కవిత.
శీర్షిక :బ్రతుకు తక్కెడ.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ మహారాష్ట్ర
బేలన్స్ కాని బతుకు తక్కెడ లో జరిగే
వింత పరిణామాలను ప్రశ్నించలేక ,
, అధికారిక ఆక్రమణలకు తలవాల్చిన
నా కళ్ళు, బ్రతుకు భయంతో, బావురుమంటూ,
కన్నీటి గుటకలు మింగుతున్నాయి!!
ఓటు కోసం నోటుతో చేసే దురాగతాలకు,
మనసు నింగిలో ముసురుకున్న ఆశలు,
వాడి అన్యాయాల వేడి తాకిడికి "భగ్గు" మంటున్నాయి.
సంయమనం కోల్పోయిన సామాన్యుడి అసమర్థతలా.....!!
పెరుగుతున్న కామానికి పెట్టుబడి పెడుతున్న
రాజకీయపు,విషపు జ్వాలల వేడి తాకిడికి
మల్లె తీగల చాటు దాగిన లేత మొగ్గలు,
వాడి వడలిపోతున్నాయి, వనితల జీవితాల్లా....!!
అధికార బలం,చేసే ఆగని దురాగతాలకు
వీధిని పడిన విశ్వ కార్మికులు, ముందుకు
అడుగేయలేని అసమర్థత తో,మారని
బతుకులకు మసిపూసుకుంటున్నారు.!!
ధర్మ రక్షణ పేరుతో దారుణాలు చేస్తూ,
జాతి మతాల జాలంతో , ప్రజల మనసుకు
గాలం వేస్తున్న. ఘనాపాటీలు
తడంటని చేతులతో తల రాతలు రాస్తున్నారు.!!
బ్రతుకు భయంతో బాంచనంటున్న
బడుగు బతుకులు , బలిపశువుల్లా
ఐదు కిలోల గ్రాసానికి ఆవురావురు మంటూ,
"నోటు"కు "ఓటు"నమ్ముకుంటున్నారు
గొర్రెల మందలా..!!
-----------
No comments:
Post a Comment