Tuesday, October 8, 2024

ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,"బతుకమ్మ" కవితోత్సవం..శీర్షిక : కొండంత అండ.

08/10/2024.

(కవి పీఠం)


ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,

"బతుకమ్మ" కవితోత్సవం..

శీర్షిక : కొండంత అండ. 

రచన :  శ్రీమతి జగదీశ్వరీ మూర్తి .

కళ్యాణ్ , మహారాష్ట్ర.

ప్రక్రియ :  పాట. 

---------------


వేములవాడలోన ఉయ్యాలో 

రాజరాజేశ్వరాలయము ఉయ్యాలో 

భక్తి గొల్చె రాజులంత ఉయ్యాలో 

తల్లి నెరనమ్మి వేడిరంట ఉయ్యాలో!!


చోళ రాజనందనుడు ఉయ్యాలో 

రాజరాజ చోళుడంట ఉయ్యాలో 

పోరు జేసి గెలిచెనంట ఉయ్యాలో- వేముల

వాడ ఓడిపోయెనంటనుయ్యాలో!!


గెలిచినంతనే  గూల్చిరి ఉయ్యాలో

రాజరాజేశ్వరీ గుడిని ఉయ్యాలో 

గుడిలోన శివుని లింగముయ్యాలో

తంజావూరు తరలించిరి ఉయ్యాలో!!


లింగమునకు గుడి కట్టిరి ఉయ్యాలో 

లింగ ప్రతిష్టను చేసిరచట ఉయ్యాలో

"బృహదీశ్వర" ఆలయమదె  ఉయ్యాలో 

ముక్తి నిచ్చు  ధామమదే ఉయ్యాలో !!


వేములా వాడలోన ఉయ్యాలో 

"భీమేశ్వరా"లయమ్ము ఉయ్యాలో

శివుడు లేని గుడిగ మారెనుయ్యాలో

"బృహదమ్మ" ఒంటరాయెనుయ్యాలో !!


ఊరు వాడ తరలివచ్చిరుయ్యాలో

"తల్లి" గానరాక తల్లడిల్లి రుయ్యాలో

తలపులోన" తల్లి" దలచి ఉయ్యాలో

"పూల గౌరమ్మ"ను జేసి గొలచిరుయ్యాలో!!


ఏటేటా తెలంగాణనుయ్యాలో 

పూల బతుకమ్మకు సంబరాలు ఉయ్యాలో 

ఆట,పాట,లాడి ,పాడి ,ఉయ్యాలో 

"అమ్మ" గొల్చు తీరు అద్భుతమే ఉయ్యాలో !!


కష్టాలు కడతేరగనుయ్యాలో

గొల్చి ,సంబరాలు జేతురంత ఉయ్యాలో 

బంగారు బతుకమ్మకు ఉయ్యాలో 

బోనాల భోగమిత్తురుయ్యాలో.!!


కోర్కెలన్ని దీర్చు తల్లి ఉయ్యాలో 

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..

మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..!!

------------------------------

ఈ పాట నా స్వీయ రచన. 








No comments:

Post a Comment