Tuesday, October 8, 2024

అంశం: *కాత్యాయనీ దేవి!* కవి: *పొర్ల వేణుగోపాలరావు*

*మహతీ సాహితీ కవిసంగమం*
*ప్రతిరోజూ కవితా పండుగే*
అంశం:  *కాత్యాయనీ దేవి!* 
కవితాసంఖ్య: *06*
తేది: *08-10-2024-మంగళవారం*
శీర్షిక:   *కాత్యాయనీ!నమోస్తుతే*
కవి:  *పొర్ల వేణుగోపాలరావు*  
కవి సంఖ్య *(07)*
ప్రక్రియ: *పద్యము(తరళము)*
**************************
*(1)*

*సురుల క్రోధము నుండి బుట్టిన చూడచక్కని భామినీ!*
*వరలితీవు జగాన కాత్యుని వద్ద పుత్రిక రూపమున్*
*వరద ముద్రను భక్తులందరు ప్రాభవంబుగ గాంచిరే!*
*కరుణ జూపవె సింహవాహిని!ఖడ్గ ధారిణి! వందనం!*

 *(2)*

*మునివరుండట నిన్ను బెంచెను ముద్దులొల్కెడి బాలగా!*
*దినదినంబుల నీదు రూపము దీపమయ్యె నరణ్యమున్!*
*వనమునందున సాహసంబులు భక్తులందరు జూచిరే!*
*జనపదంబులు నిన్ను గొల్చెను చక్రనేత్రిణి!భద్రుకా!*

*(3)*

*యజురు వేదపు తైత్తిరీయము లందు జెప్పిన మాతవే!*
*కుజుడు నీ గ్రహ కుండలిన్ భళి!కొల్వుదీరె ఘనంబుగన్!*
*ద్విజులు గొల్తురు నిన్ను దండిగ దేవళంబుల పూజలన్!*
*విజయమీయవె తల్లి!వైభవి!వేల ప్రార్ధనలందుకో!*

*(4)*

*త్రినయనీ! నిను బూజ సేయగ తీరు కష్టములన్నియున్!*
*వనవిహారిణి! భక్తులందరి వాంఛితార్థము దీర్చవే!*
*మనసులో నిను గొల్తు శ్రద్దగ! మాతరో దీవించవే!*
*కనకదుర్గకు మిత్రురాలివి! గాంచవే మము తల్లిరో!*

*(5)*

*ఎడమ చేతిన కత్తి బట్టిన యీశ్వరీ యిదె స్వాగతం!*
*మడమ త్రిప్పని శక్తి నీయవె! మాతృకా యిదె వందనం!*
*కుడి యెడమ్ములు నీదు లీలలు!కోటి జన్మల కర్మముల్!*
*విడువనే పదమొన్నడున్! కనిపించవే! భవ నాశమౌ!*
**************************
హామీ పత్రం: *స్వీయ రచన*
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

*వేణుగోపాలుడు*

No comments:

Post a Comment