Tuesday, April 15, 2025

అంశం: జాతర : గేయం.

15/04/2025.
మహతీ సాహితీ కవి సంగమం -
ప్రతిరోజు కవితా పండగే...

అంశం:  జాతర : గేయం.
శీర్షిక : సాంప్రదాయ పండుగలు.
రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .(43).
కవిత సంఖ్య..1.

---------------------

గిరగిర తిరిగే రంగుల రాట్నాలు
సందడి నిండిన జాతర  హోరులు
పెద్దల మదిలో భక్తి  భావాలు
చిన్నారి  పాపలు చిందేటి నవ్వులు !!

అంగడి నిండిన బొమ్మల కొలువులు
గాజుల గలగల నిండిన భామలు
పట్టు పావడల రేపరెపల కళలు
కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!

చల్లని పానీయాలు పంచేటి దాతలు
అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు
బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు
నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!

కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు
ఇంపైన భజనలు ,. భక్తి పాటలు 
నాగస్వరాల నాడే పాములు
భక్తిశ్రద్ధలతో   కొలువుల పూజలు !!

గుడిలో దేవుని దర్శన భాగ్యం
నమ్మిన జేజికి బోనాల భోగం.
మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!
తీర్థ ప్రసాదాలనందే యోగం.!!

పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు. 
జనాల మోమున వెలిగే కాంతులు.
జాతర నిండిన ఆనంద దీపాలు
కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!

జాతర, సందళ్లు  జయమైన కోర్కెలు
గుండెలు నిండిన  అతి మధుర స్మృతులు
దేవుని మహిమల  కీర్తులే పాటలు
ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!
----------------------------

ఈ గేయం నా స్వీయ రచన.

Monday, April 14, 2025

తత్త్వ బోధ కీర్తన (..సేకరణ.).

తత్త్వ బోధ కీర్తన .

శివ శివా శివ శివా శివ శివ శివ యనరా
హర హారా హర హారా హర హారహర యనరా

శివ శివ యని అనగా శమియించును పాపములు 
హరి నామము  తలచినంత  అందునులే అభయములు ॥

ముాడు లోకాలవే  ముక్కంటిలో లయము
లోకుల కర్మల ఫలముకు కర్త ఆ శ్రీహరీ 
ఆ సుాత్ర ధారులా తోలు బొమ్మ లాటలో 
బొమ్మలముా మనముా ఆడేము మనుముా ॥

సృష్టి కర్త బ్రహ్మకుాడ మార్చలేని రాతలు- వి
ధాత రాయు రాతలే విశ్వమందు చరితలు..
బుద్ధి జ్ఞాన కర్మలుా ఘనమౌ యొాగంబులు- ఆ
 తత్త్వ  మెరిగి మసలుటలే జన్మ మొాక్ష ఫలములు ॥

తత్త్వ మెరుగు బుద్ధి జీవి తనకు తానె మిత్రుడు
 జ్ఞాని గాని నరుడు తనకు తానె శతృవు.
 పాప కర్మునాత్మ తిరిగి జన్మనొందు తథ్యము
 పుణ్యాత్ముల ఆత్మ జేరు తుదికి వైకుంఠము ॥
 
 తెలిసీ తెలిక జేసిన పాపము శిక్షార్హము.
ధర్మ బాట నడవు మదే ముక్తికి సోపానము .
జీవులంత ఒక్కటన్న భావమదే సత్యము
జీవాత్మయె పరమాత్మగ తలచ నదే తత్త్వము ॥

శివ శివ శివ శివ శివ శివ శివ శివ యనరాదా 
ఆ శివ తత్త్వ ము నెరిగీ ఇలలో మనరాదా..
హర హర హర హర హర హర హర హరాయనీ అనరా
ఆది నారాయణుని ఆత్మ నందె  తలవరా ॥

Wednesday, April 9, 2025

శీర్షిక : నా దేశం ..

09/04/2025.


శీర్షిక : నా దేశం .

రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహరాష్ట్ర .




భారతీయ కావ్యమా , భాషా సౌందర్యమా

భరత  దేశ కావ్యమా దివ్యమైన తేజమా !!


కోటి ద్యుతుల కలయికలా, కొల్లలైన. జాతులు

కట్టు బొట్టు తీరులు కనగ వలయు భాషలు

ధర్మ , కర్మ బాటలు సాంప్రదాయ కోటలు

గుండె  లయల పాటకు, పల్లవైన చరితలు !!


గర్వించే హిమాలయాల మెరయు  మేటి శిఖరాలు ,

 గంగా యమునా, సరస్వతీ , పవిత్రత, సింధు ఘోషలు

పచ్చని చేలిడు నవ్వులు, బంగారు పంటల మెరుపులు

ఎడారి శ్శబ్ద గానాలు ,  గుబురు నిండు యడవులు !!


నెమలి చేయు నాట్యాలు, కోయిలమ్మ పాటలు , 

ప్రకృతి ఒడిని  సౌందర్యం, ప్రతి దృశ్యమొక కావ్యం.

వేద జ్ఞాన వెలుగులు, ఉపనిషత్తు  బోధలు

శాంతి  నిండు వచనాలు,  అహింస  శాంతి మార్గాలు !!


 శిల్ప కళల శోభలు  యనంత వేల నిధులు

సంగీత నాట్య స్వర జతులు, సాహితీ సుగంధాలు 

 వీర సుతుల త్యాగాలు, స్వాతంత్ర్య భరత గాథలు

భిన్నత్వంలో ఏకత్వం , నీ సహనానికి సాక్ష్యాలు !!


ప్రతి శ్వాసలో సంస్కృతి.  మట్టి రేణువున ప్రగతి

తరతరాల వారసత్వమేలు  తరగని విఖ్యాతి

మా తల్లివి నీవు, మా నేలవు  నీవు, 

మా భవితవు నీవే మా జీవము నీవే ...!!


నీ చల్లని చూపులే,  ధైర్య మిడెడు ప్రతి గెలుపు

నీ చల్లని ఒడిలో సమత మమతలే నిలుపు

  నేడు మరచిపో నీయకు  నిన్నటి  నీ వైభవం , 

నీ కీర్తిని నిలుపుటకై. అహర్నిశలాత్మార్పణం!!

------------------------------------






Tuesday, April 1, 2025

శీర్షిక: కళ్యాణ రాముడు.

మహతీ సాహితీ కవిసంగమం.

*ప్రతిరోజూ కవితా పండుగే*

అంశం:చిత్రకవిత

కవితాసంఖ్య: 1

31/ 03/ 2025 .  ( సోమవారం)

శీర్షిక: కళ్యాణ రాముడు.

శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర . 43.

ప్రక్రియ: వచన కవిత. 

------------------


నింగి నిండా భానుడి ప్రతాపం,

నేలంతా సీతారాముల కళ్యాణ మేళం..

వేద మంత్రాల ధ్వనులతో నిండిన ఆకాశం,

దేవతలు చల్లే పుష్పాలతో భువి నిండిన సుగంధం !!

 

సీతా , రాముల నుదుట మెరిసే బాసికం .

అగ్ని సాక్షిగా ఏకమైన వారికి తోడైన తారాబలం.

భక్తుల హృదయాలలో వెలిగించిన ఆనంద దీపం.

సూర్యుని వేడిమి కూడా కరిగి ,

 చల్లని అనుభూతిగా  మారిన  క్షణం.!!,


 కళ్యాణ ఘట్టంలో నిండిన మన  దివ్య సంస్కృతి.

చరిత కెక్కిన సీతారాముల ఘనమైన దివ్య కీర్తి .

మంగళ వాయిద్యాల మధ్య  నాదలోలుల ఆనంద గీతి.

మన సభ్యత , సంస్కరాలకు పట్టిన నిండైన ఆరతి.!!.


సీతారాముల కళ్యాణ గాధ, సుగంధ పరిమళ పూదోట.

కుటుంబ విలువలు పెంచే బంధాలకు బాట.

తల్లి,తండ్రుల మాటలకు విలువిచ్చిన పుత్రుని కధ.

రామరాజ్యాన్ని భువిలో నిలిపిన వేద-వేద్యుడతడట.!!


అన్నదమ్ముల ఆదర్శానికి ప్రతీక అన్నది నిజం.

ఆలు,మగల అన్యోన్యానికి ఆతడే నిదర్శనం.

గుణగణాలకు తగిన అందమైన రూపం. 

ఆతని తలపే భక్తుల మదిలో ఆనంద దీపం. !!

-----------------------------------

ఈ కవిత నా స్వీయ  రచన.