Monday, May 26, 2025

కలం.. చిత్ర కవిత.

26/05/2025.( సోమవారం) 
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం :  చిత్ర కవిత..(106).
శీర్షిక : : విప్లవ జ్వాల.
ప్రక్రియ :  వచన కవిత.
కవిత సంఖ్య : 1 
రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).


కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,
అక్షర సమూహాలతో భావాలకు ప్రాణం పోస్తుంది.
సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,
కాగితంపై కవితాక్షరాలై చిందులు వేస్తాయి !!

కలం , అక్షరాలనల్లే ఓ అద్భుత సృష్టి!
ఊహల రెక్కలకు బలం చేకూర్చి,
పద బంధాలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 
కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!

కలం , అక్షర స్వరాలను పలికిస్తూ, 
మౌన గీతాలు పాడుతుంది.
సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.
పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!

కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,
అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.
నిశ్శబ్దంగా రగిలి,  నిజాలను ప్రజ్వలించి,
లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!

ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,
అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.
అక్షరం, అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,
నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!

కలం, కధాక్షరాల పోరాట భేరి,
ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.
ప్రతి పదం ఒక పిడికిలై,
అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!

కలం, కాగితంపై  కదలే జ్ఞానాక్షర ధనం.
సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.
రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 
సమ సమాజ స్థాపనకు వేసే పునాది .!!

కలం, ప్రజల భావ బీజాల చైతన్య శక్తి.
ప్రతీ రంగుకు ప్రాణం పోసే కవితా స్ఫూర్తి.
ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.
కావ్య ,కధా, కళలకు కన్నతల్లి అవుతుంది!!

 కలం, నిరాశను ఆశగా మారుస్తుంది
 అంధకారాన్ని కాంతిగా మారుస్తుంది.
నిజాల వేటతో చరిత్ర సృష్టిస్తుంది.
అదే కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!

---------------------------
ఈ కవిత నా స్వీయ రచన.

No comments:

Post a Comment