Sunday, May 25, 2025

శీర్షిక : : విప్లవ జ్వాల. ( కలం).

26/05/2025.( సోమవారం) 

మహతీ సాహితీ కవి సంగమం.

అంశం :  చిత్ర కవిత..(1).

శీర్షిక : : విప్లవ జ్వాల.

ప్రక్రియ :  వచన కవిత.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38.).



కలము, ఓ నిశ్శబ్ద  కళాకారిణి,

అక్షరాల రంగులతో భావాలకు ప్రాణం పోస్తుంది.

సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,

కాగితంపై భావాక్షరాలై చిందులు వేస్తాయి !!


ఊహల రెక్కలకు బలం చేకూర్చి,

తన రచనలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది, 

కలం , కవితలల్లే ఓ అద్భుత సృష్టి!

కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!


కలం , పదాల స్వరాలను పలికిస్తూ, 

మౌన గీతాలు పాడుతుంది.

సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.

పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!


కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,

అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.

నిశ్శబ్దంగా రగిలి, ప్రజ్వలించి,

లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!


ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,

అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.

అక్షరం అక్షరంతో  కలిసి అణ్వాస్త్రమై,

నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!


కలము, ఇది అక్షర పోరాట భేరి,

ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.

ప్రతి పదం ఒక పిడికిలై,

అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!


కలం, కేవలం కాగితంపై గీతలే కాదు,

సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.

రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి , 

నూతన సమాజ స్థాపనకు పునాది వేస్తుంది.!!


కలం, ప్రజల భావ బీజాలకు చైతన్య శక్తి.

ప్రతీ రంగుకు ప్రాణం పోస్తుంది.

ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.

కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!


---------------------------

ఈ కవిత నా స్వీయ రచన.

No comments:

Post a Comment