శీర్షిక : శాంతి స్వప్నం -
రచన : శ్రీమతి , పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహరాష్ట్ర.
తెల్ల కాగితంపై నల్లని సిరాతో సంతకం,
యుద్ధపు గాయాలపై పూసే శాంతి లేపనం!
హస్తాలు కలిసినట్టు పైకి నటించే యత్నం.
మనసుల్లో నిండే భగభగలు దాచే ప్రయత్నం.!!
గుండెల నిండా ద్వేషం దాచిన ఘనం .
పెదవులపై చిరునవ్వులు పూయించే వనం.
"సీజ్ ఫైర్" కేవలం ఒక ఓదార్పు తాయిలం .
ఎన్నికల ముందు ఓట్ల వేటకు పనికొచ్చే సాధనం..!!
అంతర్జాతీయ ఒత్తిడి నిండిన ఫలితాల కలకలం,
సరిహద్దుల్లో నిరీక్షించే సైనికుల సహనానికి బలం.
భయంతో కొట్టుకుపోయే తల్లుల గుండెల్లో ప్రభంజనం.
కన్నీటి జ్వాలలు ఎగదోసే శోకాలకు ఇంధనం.!!
"సీజ్ ఫైర్" నిజమైన శాంతి నీయని మాయా జాలం.
మళ్ళీ మొదలయ్యే యుద్ధానికి నాంది పలికే నాటకం.
నాయకుల మనసుల్లో ఏముందో, తెలుసుకోలేరు జనం.
రక్తపు మరకల పూత , బాంబులు చేసే మోత
వారికి, వినబడవు , కనబడవు అన్నది నిజం,,!!
నాటకంలో తెర వెనుక నుండి, పన్నిన కుట్రల వేటలు
రాజకీయ రంగంలో శాంతి భాష్యాలు పలికే పాత్రలకు బాటలు.
బాధితుల ఆర్తనాదాలు వినిపించనంత వరకు,
కేవలం తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి మాత్రమే
ఈ "సీజ్ ఫైర్" మాటలు. .!!
నిజమైన "శాంతి" రావాలంటే మనసులు కలవాలి,
రాజకీయ రచ్ఛలు తగ్గి, సామూహిక చర్చలు పెరగాలి.
కులమతాల జాడ్యాలు వదలాలి .మానవత్వం గెలవాలి .
చేయీ చేయీ కలవాలి , అడుగులో అడుగేసి నడవాలి.!!
--------------------------------------------
No comments:
Post a Comment