1 నుండి 30 వరకు పుార్తి పాశురములు తెలుగులో...ప్రక్రియ :"ఆటవెలది"లో..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
1. పాశురము.
** **********
చెలియలార రారె చేయంగ వ్రతమును
మేలుకొల్పు లిడుచు మేలు పుాజ
రమణులార పాడి రమ్యమౌ గీతములు
విధిగ పాడి నుతుల విభుని కొలువ ॥
శేషశయను డతడశేష మహిమ లేలు
సిరికి పతి యతడు శ్రీకరుండు
వైభవమ్ము లేలు వైకుంఠ నాధుండు
రక్ష మనకు నిడెడు రంగ విభుడు ॥
సర్గ ద్వారములవె సరి తెరచి యుండు
మార్గశీర్ష మందు మహిమ యదియె
దుర్గమౌ నఘములు దుారమౌ దురితాలు
దీర్ఘ యశము లిచ్చు దివ్య వ్రతము ॥
2.వ పాశురము.
***************
పాల సంద్ర మునదె ఫణిశేష తల్పాన
పద్మ నాభు డతడె పవ్వళించె
మేలుకొల్పు లిడుచు మేటి కీర్తుల వేడి
శ్రీశు పదము లిడక శరణ మనరె ॥
కురుల పుాలిడ కండి కులుకు బోణులాల
పరుల బాధ బెట్టు పలుకు లొద్దు
సత్య భాషణమ్ము సరిదాన ధర్మమ్ము
నిత్య వ్రతము జేయ నియమ మండి ॥
గురులు జ్ఞాన ధనుల గుాడి సేవలుజేసి
ఐకమత్య మెరిగి హరిని గొలచి
దీక్ష తోడ వ్రతము దివ్యమ్ము గనుజేయ
మార్గ శీర్ష మిదియె మంచి దండీ ॥
3.వ పాశురము.
**************
మూడు లోక ములను ముప్పాద ములగొల్చి
బలిమి బలిని అణచు బాలు డతడు
విష్ణుర రుాపు డతడు వినరారె సఖులార
వటువు వామ నుండు వాని కొలువు ॥
కోడి కుాసెను చెలి కొలువంగ రంగనీ
తెమిలి తాన మాడ తెరలి రండే
నెలకు ముాడు సార్లు నేల వర్షము లుండు
పసిడి పంటల సిరి, పాడి నిండు ॥
నిత్య ముగను భువిని నీరముల్ కురియగా
జారు గిరుల ఝరులె జలజలయని
నదిని మీన ములవె నడుమనా ట్యములేలు
నదుల కలువ లెన్నొ నతిగ విరియు ॥
4.పాశురము.
వేగ వచ్చె తానె వెతలు దీర్చ
మెరయు మేని పోలు మెరపులే మెరయంగ
వర్ష ధారలు కురిసె వరుస భువిని ॥
నాద శంఖ మొాలె నానింగి గర్జించె
రామ శరము వోలె రాలె చినుకు
నమ్మి రండె చెలులు నది స్నానముల నాడ
రంగ పుాజలవియె రక్ష సుండీ ॥
5.పాశురము.
************
మధు రపురి నేలు మధుర మంగళ ముార్తి.
ఆ యశోద సుతుడు అతడు సుండి
నల్లనైన వాడు నరునిరుా పములోన
అవని నేలు ఘనుడు ఆది విష్ణు ॥
వేద వంద్యు డతని వేడుకొ నగరారె
పట్టు వస్త్రము లిడి పలుక మనుచు
పాద పుాజ లిడరె పరమేశు డతడేగ
పాపములను దృంచు పతియు నతడె ॥
6.పాశురము
*************
గరుడవాహనుడదె ఘన ఆలయమ్మున
సుర శంఖ నాద సుఖము లేలె
పుాత నసురి జంపి పుణ్య భుామిని గాచు
మొాక్ష మిచ్చు విభుడు మొాహ నుండు ॥
యొాగనిద్ర నేలు యొాగిహృన్నిలయుడు
దాస పోషకుండు దాన వారి.
మేలుకొల్పు లిడగ మేల్గాంచు వరదుండు
యశము లిచ్చి బ్రోచు హరి ఘనుండు ॥
పద్మనాభు డతడు పరమేశ్వరుడు హరి
శంఖ చక్ర ములిడు శాంత ముార్తి
పరమ పావనుండు పరనిచ్చి పాలించు
పట్టి పదము లతని పాహి యనరె ॥
7.పాశురము.ఆమ ధుర రవము
************
పక్షి రవములు వినవె పాడెనాలాపనలు
మేలుకొల్పు లవియె మెరుపు బోడి
వెన్న పాల దొంగ వేంచేయు వేళాయె
కేశి నిదుని మేటి కేశవుండు ॥
విద్య లెరిగు మీరు విజ్ఞతలే ఎరుగరా
వంద్యమాను కొలువ వడిగ రాగ
తాత్సారమ్ము మీకు తగదుత గదులేమ్మ
తడయుటలవె మాని తరలి రమ్మా॥
8.వ కీర్తన .
*********
ఉదయ భాను డదిగొ ఉదయించె నభమున
పొన్న పుాల వన్నె పోలు కాంతి
మేలుకొని పశువులు మేతకై పరుగిడె
మేలి మువ్వల సడితొ మేచ కాంగి ॥
చక్కనైన చెలియ చన్నీటి స్నానాలు
చేసి హరిని కొలువ చేర రావె
కీర్తి నేలు వాడు, కీర్తింప పరనిచ్చి
సేవ జేయ మురిసి సేద దీర్చు ॥
9.వ పాశురము.
*************
రత్నాలు పొదిగేటి రమణీయ మేడలో
దీప కాంతి కురిసె దివ్య ప్రభలు
సాంబ్రాణి పొగనిండి సార గంధము జిమ్మ
మత్తు విడచి తరుణి మమ్ము జేరు ॥
ఏలికైన వాని ఎలుగెత్తి పిలచేము
ఏల వినవు నీవు ఏమి నటన..
నిదుర మాని నీవు నిత్య పుాజలు జెేయ
సఖుల గుాడి రమ్మ సార సాక్షి ॥
అత్త కుాతురివిగ అందాల నాచెలీ
చిత్తచోరుని గన చిరున గవున
పరమపదమునేలు పన్నగ శయనుని
పాద సేవ జేయ పదవె కదలి ॥
10.వ పాశురము .
****************
ఇంత విన్న కుాడ ఇంతి పలుకవేమి
నోము నోచితివిగ నోర్మి నీవు
కుంభకర్ణుని వలె కులుకు నిద్రది ఏల
కలికి కనులు తెరువు కంబు కంఠి ॥
ఇచ్ఛ తులసి మాల నింపుగా ధరియించి
సొంపు నేలె నిలను శోభ నుండు
పుణ్యపురుషు డతడు పురుషార్ధముల నిచ్చు
శంఖ చక్ర ధరుని శరణు కోరు ॥
బంధు జనుల గుాడి భవుని కొలువంగ
పోవు చుంటి మనుచు, పోరి పిలువ
వాలు కనుల దోయి వంపు నడుము దాన
కోమ లాంగి రావె కొలువ హరిని ॥
11.వ పాశురము.
***************
నంద నందను నదె నావేద వంద్యుని
కనగ రావే మమ్మ కలికి కొమ్మ
గొల్ల పట్టివి గదా గోవిందు కొలువగా
నెమలి నడక దాన నెలత రమ్మ ॥
పుణ్యవతిగ నీకు పురము నదెపేరు.
అలసితిమిగ పిలచి ఆట కాదు...
పెక్కు రీతులేలు పెద్దింటి పడతివీ
పరమ పావనునదె పాడి వేడ ॥
తిరునామ మహిమ తిరువైభ వముపాడి
శ్రీశు కృష్ణు కొలిచి శ్రీలు బడయ
నమ్మి కొలువరాగ నటన నిద్దురలేల..?
పరము లిచ్చు వాని పదము కొలువ ॥
12వ పాశురము
*************
లేగ దుాడలవియె లేచి పొదుగుచేర
పొదుగు నిండు ప్రేమ పొంగి పొరలె
పాడి ఏరులాయె పాల నిండెను పల్లె
వాదు లాట లేల వనజ నేత్రి॥
రావణాంతకుండు రామచందృని వేడు
నామ జపము కన్న నమ్మి కేది..
మత్తు నిదుర మాని మావెంట రావమ్మ.
మాధ వునదె వేడి మరలి పొమ్మ ॥
రారె సఖియ లార రంగనీ కొలువంగ
పరమపురుషుడతడు పావనుండు
మార్గశీర్ష మందు మంచి తానము లాడి
ముదము భక్తి కొలువ ముక్తి నిచ్చు ॥
13. వపాశురము.
****************
పక్షి రుాపి బకుని పట్టి ఛెండాడేను
రావణాసురు నదె రణము నందు
జగము లేలు పతిని జగదభి రాముని
కీర్తనల కొలువగ కినుక వలదు ॥
శుభము పలుక మనకు శుకృుడే ఉదయించె
పక్షి కుాత లిడుచు పలికె పాట
ఆభయ హస్తుని గన ఆలసింపక రమ్మ
సమయము మరువకుమ సుంద రాంగీ ॥
తేనె తాగి మత్తు తేలు తుమ్మెద వంటి
కన్నులున్న కలికి కనులు తెరువు
చాలు సాకు లిడుట చాలించు విరతిని
తాన మాడ మత్తు తరలి పోవు ॥
14. వపాశురము.
**************
మమ్ము లేపెదనని మాటిచ్చి మరచేవు.
నమ్మమమ్మ నిన్ను నళిన నేత్రి.
సీమ నేలు సిరివి సిగ్గులే దటెనీకు
శమము దీరి రావె సమయ మునకు ॥
మునులు వేద విదులు ముందుగా నెతెమిలి
దేవళముల జేరె దేవు దరికి .
ధవళ దంత ద్యుతుల ధరణీధవుని
కన్ను లార కనగ కదలి రావె ॥
15. వ పాశురము.
మునుపు తెలియ లేదు ముద్దు మాటలు నీవి
ఓర్మి వేచితి మిక నోప లేము .
కమ్ము నిద్దుర వీడి కదలిరా కలకంఠి.
గోష్టి కలియ రావె గోప కాంత ॥
గోపకాంతలార గోవిందు కలియంగ
తెల్లవారమున్నె తెమిలి వత్తు.
విదిత మాయె తప్పు విసుగింక మానరో
జాప్య మింక లేదు జాణ లార ॥
దుష్ట అసురు కంసు దునిమినట్టి ఘనుడు
నంద గోప ప్రియుడు నంద సుతుడు
గొల్ల భామల సరి కొల్లలాడెడు వాని
మాయ జేయు వాని మదిని కొలతు ॥
*********************************
16. వ పాశురము.
**************
రేడు వనుచు మురిసె రేపల్లె కన్నెలుా
పరనిత్తు వనుచు పరవసించి
తెమిలి వచ్చి నారు తెరుమయ్య తలుపులు
నీదు వాకిట నదె నిలచి నారు ॥
విస్మయంపు పనుల విజ్ఞతెరుగు వాని .
మేల్కొలుపగ వస్థి మేము నుతుల
వన్నెకాని లేపి వలపు మాటలు జెప్పి
తలుపు తెరువ మనవె తరుణి నీళ ॥
నీలవర్ణముగల నీలకాయుడ వీవు
హేమ మందిరమున హేల చాలు
లీల చుాప రావ లీలామానుష వేష
నిత్యపుాజ లందు నీరజాక్ష ॥
17.వ పాశురము.
***************
అక్కసమున పిలచి అన్న పానము లిచ్చు
చక్కనైన సామి చంద్రముఖుడు
మలయు నుతుల పాడ ముందుగా వచ్చేము
నిర్గమించు రంగ నిర్మలాంగ ॥
అతులితబలముగల అన్నవు బలరామ
పట్టు పుట్ట మిడెద పలుక రావ
మహితు డౌఅనుజుని మన్నించి గొనిరావె
మాదు కోర్కె మరచె మాధ వుండు ॥
విష్ణు నీ మహిమలు వివరింప లేనయా
పసరె నీదు ఖ్యాతి పదుమ నాభ .
చెలియ లార రండె చేరి కొలువగను
రంగనాధు డతడె రమణు లార ॥
18.వ పాశురము.
****************
విరతి నేలు వాని విడుమ సాగర పుత్రి
అలవటమ్ము నొదలి ఆదుకోమ్మ
వేద విదుని హరిని వేడుకొనెదమమ్మ
వేగ తెరువు తలుపు వేద గాత్రి ॥
పరమ పావను పద పంకజముల వీడి
తడయుటిక వలదని తరచి జెప్పి
నగవు మొాము తోడ నాధుని పంపమ్మ
కురుల కమలికవుగ కలుకు కొమ్మ ॥
కోడి కుాసె నదివొ కోయిలమ్మలు కుాసె
మల్లె జాజులు విడె మధుర ముగను
లలిత కోమల కలికి లలిత రాగపు కంఠి
కలల రేని లేపి కదలి రమ్మ ॥
19. వ పాశురము
****************
మణి రత్నములవె మంచిగా పొదిగున్న
పంచ గుణపు మేటి పరుపు పైన
నీళ వక్షమునదె నిదురించు మాసామి
తలిరు బోడిని విడి తరలి రావ ॥
విమలయశుని వీడి విరతి చాలించవే
నాధు విడువ నిదుర నటన లేల..?
మరుగు సదనము విడి మాటాడ నీయవే ॥
వరుస వెన్నునెడల వలపు చాలు ॥
20. వ పాశురము.
***************
భక్తి తోడ కొలువ భయము బాపెడు దేవ
శక్యమౌన నీదు శక్తి తెలియ
అక్కసమ్ము తోడ ఆదుకో మమ్మీవు
నీళను విడుమింక నీరజాక్ష ॥
ఎర్రనీ పెదవుల ఏపు గుబ్బల దాన
సన్ననీ కటిగల సతివి నీళ
నీదు నాధు విడము నీరాడ నళినాక్షీ
అలరు సింగారముల -కద్ద మిడుము ॥
ముాడు లోకములకు ముాలమైన విభుని
కోటి దేవతలదె కొలచు వాని
కోరి నట్టి కోర్కె కొలువంగ తీరును
మార్గ శీర్ష మాస మహిమ ఘనము ॥
*******************************
21.వ.పాశురము.
****************
గోవులనదె కాయు గోపాల బాలుడా
నంద గోప బాల నటన చాలు
శీల సద్గుణ ధన శ్రీకృష్ణ లేవయ్య
జాల మేలనయ్య జాగుసేయ ॥
ఆశ్రయించి నాము ఆదుకొనగ రావె
విరతి చాలు చాలు విశ్వ వంద్య
నీదు వాకిట నదె నిలచి యుంటిమి సామి.
మంగళములు పాడ మాధవ ఘన ॥
చెలుల తోడ్కొనుచును తెమిలి వచ్చేమయ్య
తొలి పొద్దు పొడిచె తొందరించు.
మార్గశీర్ష వ్రతము మనసుతో జేయంగ
మేలుకొలుపు లిడుచు మేలు రీతి ॥
22. వ పాశురము.
****************
రణము నందు వీర రాజాధి రాజులుా
పణము నొడ్డి పోరి రణము నోడి
దర్పమునదె వీడి దాసులై నినుజేరు-
నట్టి నిన్ను మేము నమ్మి నాము ॥
నామ కీర్తి పలుక నాధు మా తరమా
డెప్పరములు అవియె జెప్ప మాకు
భక్తి తోడ నిన్ను భజన చేయగ వచ్చి
నిన్ను జుాడ నిచట నిలచి నాము ॥
సుార్య చంద్రులంటి శుభనయనునకునుా
శంఖ చక్ర ముగల శక్తిధరుకు
పుష్పహారము లేయ పులకరించును మేని
పావ నుండతండు పాప హారి ॥
23.వ పాశురము.
****************
వర్ష ఋతువు నందు వర్షించు మేఘాల
సవ్వడులకు లేచి సందడించి
భీకరాకృతినిడి భీషణ ఘర్జన జేయు
కదన సింగమొాలె కదలి రమ్ము ॥
నిర్గమించుమయ్య నీల మేఘశ్యామ
పాదుకొన్న వేల్ప పరమపురుష.
మందిరమ్ము వీడి మమ్ము బ్రోవగదయ్య
శ్రీశ రంగ నాధ సిరిపురీశ ॥
విరియు తామరవలె విచ్చు కనుల తోడ
నిచ్ఛమమ్ము గావు నీరజాక్ష..
విజయపీఠ మెక్కి విను విన్నపాలనుా
సామిసన్ను తింప సమ్మ తీయ ॥
24.వ పాశురము.
***************
ముాడడుగుల తోడ ముల్లోకముల గొల్చ
మలయు పాదములకు మంగళమ్ము .
మహి నసురుల గుాల్చి మడియించు శక్తికీ
మంగళమ్ము లివియె మాధవునకు ॥
పుాతనాదు లగుాల్చి పురము గాచిన వాని
గో గొపాలు నేలు గొల్ల వాని
గోటి తోడను గిరి గోవర్ధనము నెత్తు
గోపికృష్ణు నెపుడు గొల్తు మేము ॥
వేదవిదుని చేతి వేలాయుధమునకు
మహిత సద్గుణ శీలు మాధవునకు.
పరను యిచ్చు వాని పరమాత్మ కృష్ణకుా ..
జగద ధీశు నకును జయము జయము ॥
25. వ పాశురము.
***************
దేవకీ సుపుత్ర దేవ దేవుడవీవు
రెప్పపాటు నదిని రేయి దాటి
నందు నింట జేరి నమ్మువారిని గాచి
కంసు జంపి నట్టి ఘనుడవీవు ॥
సిరుల లక్ష్మిని హృది స్థిరముగా నిలిపేవు
వరము గాను కలిమి ధరను పంచి
పుణ్యపురుష మాకు పురుషార్ధముల నిచ్చి
అండ నుండ మాకు ఆప దేల ॥
వరలు భక్తి తోడ వచ్చి కీర్తులుపాడు
నామ జపమె మాకు రామ రక్ష .
వంద్య మమ్ము గావ వదలు విరతి నింక
మహితమాయె మీదు మహిమ,యశము ॥
26 .వ కీర్తన.
************
పుార్వికులదె నోచు పుాతమైన వ్రతము
మాస మార్గశిరపు మహిమ నెంచి
సఖులు తతిగ గుాడి సంకల్ప సిధ్ధితో
తానమాడి వచ్చె తమను కొలువ ॥
పాంచజన్య మట్టి పాలసంద్రముపైన
పవ్వళించు సామి పలుకవయ్య ॥
వలయు సాధనలిడి వర్ణింప నినుజేరి
శంఖనాదములిడె శాస్త్ర ముగను ॥
మేటి దివ్వెల గొని మేలుకట్ల నమర్చి
మంగళములు పాడె మహితముగను
తప్పు లెరుగమయ్య తల్లితండ్రివి నీవె
మన్ని కమము గనుమ మార జనక ॥
27. వ పాశురము.
****************
కల్యాణగుణ రామ కామితార్ధ సుధామ
పుణ్య లీలలు విని పులకరించి
పట్టు వస్త్రములిడ పరమాత్మ వచ్చేము
కట్టు కొనుము శ్రీశ కరుణ నేల ॥
గోఘృత పరిమళపు గొప్ప క్షీరాన్నముా
పసిడి గిన్నె లోన పంచి నాము
విమల యశుని హరిని విధిగచే కొనిరమ్మ
తడయుటలిక మాని తరలు నీళ ॥
28 .వ పాశురము.
*************:**:
గోవు లెనుము లేలు గొల్లవారము మేము.
మడువుటలు తెలియని మందమతులము
అలరు జ్ఞాన మునిడ అవతరించినదేవ
పుణ్య ఫలము మాదు పుణ్య ముార్తీ ॥
లోక నాధుడవుగ లోపముల సవరించ
మాలొ నొకడివిగను మసలి నావు ॥
మా సఖుడవు నీవు మిమ్ము నమ్మితిమయ్య
ఆగ్రహింపకయ్య ఆది దేవ ॥
సఖుడ వీవ నెంచి సరి మాటలవి మీర.
మన్ననలిడుమయ్య మాదు సఖుడ ॥
తప్పు లెరుగమయ్య తరలిరా క్రిష్ణయ్య
నీదు లీల చాలు నిదుర లెమ్ము ॥
29.వ పాశురము.
***************
అరుణ కాంతి విరియ అతులితోత్సాహాన
నీదు సేవ జేయ నిలచి నాము.
పరము ఫలము లనెడు పరమార్ధ మెరుగము
అంతరంగ సేవ కనుమ తీయు ॥
పట్టెడన్నము తిని పశువుల మేపేటి
గొల్ల వంశ మందు గొంటి జన్మ
జన్మ జన్మ బంధు జనులముా మేమంత
నిన్ను వీడ లేము నిజము క్రిష్ణ ॥
నీదు మందిరమున నీ సేవ జేయంగ
మాస మార్గశిరము మేలు యనుచు
చలిని స్నానములిడి చక్క దీక్షను పుాని
నిన్ను కొలువ వస్థి నిదుర విడుమ ॥
30.వ పాశురము.
***************
నిదురలింక చాలు నీలమేఘశ్యామ
మధుర మంగళ రవమదియె వినుమ
మేలుకొలుపులు విని మేలుకోవేమయ్య
శ్రీశ తలుపు తెరువు శ్రిీనివాస॥
పాల సంద్రపు సిరి పడతిలక్ష్మిని బట్టి
వేల నామములతొ వెలయు సామి
గో గొపాలు రెల్ల కోరు గోకుల బాల
నీదు లీల జుాపు నీల వర్ణ ॥
విష్ణుచిత్తు పుత్రి విమల యశసుగాత్రి
పరమ భక్తి పాడె పాశురములు.
సార్ధకమ్ము లాయె సారమౌ కీర్తులుా
అట్టి భాగ్యమిమ్మ ఆర్క తేజ ॥
****************************
జయము నీయుమయ్య జగదీశ్వరికినీవు
పాడె భక్తి తోడ పాశురములు
తెలుగులోని రాయ తెనిగించె చుాడయా
తప్పులెంచకయ్య తలచి భక్తి ॥
మంచి చెడుల జ్ఞానమన్నదే లేదయా
వేద పుాజ లేవి వెరసి రావు.
కోర్కె నీదు భక్తి కోరెనీశ్వరిలను
ఈప్సితమ్ము లిడుచు ఇమ్మ ముక్తి.
*****************************
=====ఓం..తత్సత్ ...========
ఓం...శాంతి......శాంతి.......శాంతిః.
****************************