Wednesday, August 14, 2013

అమరగీతం.

అమరగీతి.  (యే మేరె వతన్ కె లోగో వరస )

--------------------------------------------------------



మన దేశం హక్కులకోసం  
పోరాడే వీరులనేకం 
గుర్తించీ  వారి త్యాగం   
కన్నీరిడరే  కొంచం ॥ 

శతృవుల  గుండెలు చెండీ , 
తూటాకు బలైనారండీ 
అమరత్వం పొందిన యువత 
 నిలబెట్టిరి ఝండా ఘనత ॥

గాంధీ పోరాడిన దేశం , 
నెహ్రూజీ కోరిన సంఘం 
అందించీ మనకు స్వాతంత్ర్యం ,
అసువులనే బాసిన సత్యం ॥మన ॥  

 జాతి మతాలను వీడి ,
ఒకటై మని స్నేహం తోడి 
చిందించిన రక్తం భువిపై , 
ప్రవహించెను నదులై ఝారులై ,॥

ఒక తల్లికి మిగిలెను శోకం ,
తెగే భార్యకు మంగళసూత్రం 
అర్పించిన ఆత్మ త్యాగం ,
అది మననం చేసుకో నిత్యం ॥ మన ॥ 

ఈ భారతి ముద్దుల పంట ,
గర్వించే ఈ యువతంతా 
మనమంతా ఒకటే శక్తి , 
ప్రవహించే రక్తం ఒకటి ॥

చిరునవ్వులు మోమున నింపి , 
స్వాతంత్ర్యపు విందులు పంచీ 
నిలపెడదాం ఝండా చరితా , 
జై కొడదాం లేవండంతా ॥ మన ॥ 
-----------------------------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర .).
-------------------------












____________________________________________



Saturday, August 10, 2013

పాడవోయి విజయగీతి.

స్వాతంత్ర్య గీతి . 

------------------------
పాడవోయి విజయగీతి 
పుడమితల్లి వెలుగుకీర్తి 
అమరులైన వారి స్ఫూర్తి 
స్మరియించే వరదినం 
స్వాతంత్ర్యపు శుభదినం ॥ 

సమసమాన భావనతో కలసిపోదమీదినం 
కులమతాల భేదములను కూలద్రోయుటె ధనం 
తరతరాల చరితలకే నిలువుటద్దమీదినం  
వీరగతిని పొందు ఘనుల త్యాగఫలము ఈ దినం ॥ 

స్వాతంత్ర్యపు హక్కులనే పొందినార మీదినం 
భరతమాత కీర్తి ఘనత చాటి నిలుపు గౌరవం  
సత్య,ధర్మ , శాంతి గురుతుగా ఝండా నిలుపుదాం 
చేయి చేయి కలిపి మాత ఒడిని శాంతి నిలుపుదాం ॥ 

అహింస దారి అడుగులేసి ఆగడాలనాపుదాం 
ఆదర్శపు బాట నడచి ఆనందం పంచుదాం 
సమత మమత పంచి భరత మాత కీర్తి పెంచుదాం 
మన ఝండా ఎగురవేసి విశ్వశాంతి నిలుపుదాం ॥ 

-------------------------------------------------------------
రచన, శమతి,
పుల్లాభట్ల, జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
---------------------------------
___________________________________________


 

Sunday, July 14, 2013

నవ్వవే బంగారు పాపా ॥

నవ్వవే ఓ పాప బంగారు పాపా ....
కల్లకపటము లేని బోసి నవ్వుల మొలక
నీ నవ్వు ఏడేడు లోకాల గెలుపు
ఆనంద లోకాల విహరించు పిలుపు ॥ నవ్వవే ॥

చిదమ బుగ్గలు కారు చిక్కన్ని పాలు
లేలేత పెదవులే ముద్ద  మందారాలు
కలువ వంటీ కనులు చిలుకు వెన్నెలలు
నీలోని అందాలు విరిపారిజాతాలు ॥ నవ్వవే ॥

చిట్టి పొట్టీ నడక వయ్యారితనమొలుక
ముద్దు మాటలు తీపి తేనేల్లు చిలుక
చిన్ని అల్లరితోడ చేయు మురిపాలు
మా యింటి సందళ్ళు ,ఆనంద పరవళ్ళు ॥ నవ్వవే ॥ 

తేట తెల్లని దినుసు ,అద్దమంటీ  మనసు
ఆట,పాటల తీరు ముద్దు ముచ్చట మాకు
హాయినిచ్చే సిరులు పసిపాప పరవళ్ళు
నిన్ను వలచనివారు ఈ జగములో లేరు ॥ నవ్వవే ॥

తొందరెందుకు నీకు ఎదిగి ఏం చెస్తావు
వింత లోకపు తీరు , మర్మమెరుగవు నీవు 
ఆటు పోట్లకు నలిగి విసిగి అలసిన నీవు
ఏ ఏ టి కాయేడు నవ్వు మరచెదవీవు ॥ నవ్వవే ॥

---------------------------------------------------
-రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.( మహరాష్ట్ర ).



--------------------------------------------------
---------------------------------------------------

Tuesday, June 4, 2013

లాలి లాలి మా బాల శిశువుకు..

 ఉయ్యాల్లో బాలకు  జోల పాట.
__________________

లాలీ లాలీ ........
లాలి లాలిమా బాల శిశువుకూ
లీలా శిశువీ మోహన బాలకు ॥ లాలీ ॥

సడులుమాని గుసగుసలు మాని
ఓ.. సఖియలార ఒద్దికగా నిలువరె
కలతనిదురలో తీపికలలతో
ముసినగవుల  నిదరోయే మా బాల ॥ లాలీ ॥

ముత్తమ్మ  తొడిగిన మురుగుల ముంజేయి  
ముచ్చట గొలుపగ ముదితలు మురియగ
ముద్దుల వానలొ తడిసిన మా బాల
మురిపెపు నగవుల మురిసి నిదరోయె ॥ లాలీ ॥

తాతప్పలందరు తడవుతడవుగా
తట్టిలేపుచూ కానుకలిడగా
అమ్మా,నాన్నల అనురాగపు సిరి
అందిన మా బాల అలసి నిదరోయే ॥ లాలీ॥

తాతయ్య దీవింప తారలు దిగివచ్చె
నానమ్మ మురిపాలు వెన్నెలలు కురిపించె
అమ్మ అమ్మ ఒడి , తాత ముద్దు సడి
మరిగిన మా బాల మారాము సేయక ॥ లాలీ ॥

మేనత్త శైలజ మురిపాలు మీరగ
మేని బంగరు తొడుగులనిడగ
పుత్తడి మెరపుల అందాలు విరియగ
మా యింట వెలసిన మహలక్షికీ జోల ॥ లాలీ ॥
________________________________










 
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        

శశి పున్నమి కళలు పంచ..

బాంగారు మా పాపకు శ్రీరామరక్ష .
-----------------------------------------

శశి  పున్నమి కళలు పంచ
మృధు తారల తళుకు 
 మేని మెరుపులు కాగా
పలు వన్నెల కాంతులతో
పదునారగు కళల  వెలుగు
 పాపను కనరే ॥

పూరించిరి  శంఖములదె
భావించిన  బిరుదు
 భాగ్య ఫలముల నిడగా
పేరెంచిరి  సురలు, మునులు
దీవించిరి దేవతలదె  
దీర్ఘాయువులన్ ॥

విద్యలందు మేటిగమను
పెద్దలందు 
ప్రేమనుగొను పేరెన్నికతో
శుద్ధమైన  సంస్కారపు ,
సాంప్రదాయ  పద్ధతినిల 
శుభములు గొనుమా॥

సంగీతము, సాహిత్యము
రంజిల్లెడు నాట్యగతులు 
రసములు కాగా
సుందర  వదనారవింద-
అందములానందహేల -
నందరు గనరే  ॥

శ్రీవాణియె కరుణింపగ
సిరులతల్లి శ్రీలక్ష్మియె
 సంపదలిడగా....
శ్రీగౌరియె దీవించెను
సౌభాగ్యములిలను పొంద 
సంతోషముగా ॥

బాలభాను కిరణరీతి
వేల నుతుల కీర్తి వెలుగు 
వేడుకలిడగా....
లీలలెన్నొ  చూపించుచు
బాల వేల వసంతాల -
వర్ధిల్లెనుగా ॥

____________________________

పాపకు నామకరణ మహోత్సవ సందర్భ సమయం లో
నాన్నమ్మ (పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి)
ఆశీర్వదిస్తూ .. ప్రేమతో జల్లిన పద్యాక్షతలు .