Monday, November 6, 2023

శీర్షిక ఆరోగ్యం ఆహారం.

23/06/2023.

తపస్వీ మనోహరం  పత్రికల కొరకు ,
అంశం: ఆరోగ్యం :ఆహారం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది పెద్దలు చెప్పిన మాట.
ప్రస్తుత కాలంలో మనమందరం, కాలం మారింది ,కాలం మారింది ,అంటూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం.

ఒకప్పుడు పిల్లా, పెద్ధా ,అందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచేవారు. 

పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేవారు తర్వాతముంగిట్లో ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గులు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి , మడి బట్ట కట్టుకొని, దేవుని దగ్గర నిత్య పూజలు చేసేవారు. సూర్యోదయంతో పాటుగా ఇంట్లో , దేవుని మండపం దగ్గర కళకళ మంటూ దీపాలు వెలుగుతూ ఉండేవి .ధూప దీప నైవేద్యాలతో మధురమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉండేది. 

పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి, తదుపరి చద్దన్నం తినడం, తర్వాత స్కూలుకు వెళ్లి రావడం, హోంవర్కులు చేసుకోవడం ,సాయంత్రం పూట ఆడుకోవడం, 7-7:30 కల్లా పడుకోవడం దినచర్యంగా ఉండేది.

అల్పాహారానికి గాని, భోజనానికి కానీ, ఒక నిర్దిష్టమైన సమయపాలన జరుగుతూ ఉండేది .
సాయంత్రం 6 గంటలకి  పిల్లలు సూచిగా బట్టలు మార్చుకొని
దైవ ప్రార్థన చేసుకుంటుంటే పెద్దలు
 తిరిగి దేవుని దగ్గర దీపారాధన చేసేవారు .
 తదుపరి రాత్రి భోజన కార్యక్రమాలు అయిపోగానే 7:30 కి నిద్రకు ఉపక్రమించేవారు.
 పగటిపూట ఎవరూ కూడా నిద్రపోయేవారుకాదు .
 కట్టుబొట్టు, మాట తీరుతో, ఆడవారు చాలా సంస్కారంగా ఉండేవారు.
 ఆ కాలంలో ఇంటి భోజనం తప్ప బయట ఎక్కడా
  ఇలాగ బయట కొనుక్కుని తినడాలు కూడా ఎవరికి తెలియదు. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవారు ఆడవాళ్లు.

కానీ రాను రాను ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యే పూర్తిగా మారిపోయింది .  గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వంటి సదుపాయాలు రావడంతో ఆడవారికి పని తగ్గి ,బద్ధకం ఎక్కువైంది .టీవీలు , మొబైల్స్ . 
వాడకం ఎక్కువయ్యి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడంతో ఇంట్లో వంట చేయడం  కూడా తగ్గిపోయింది.
పానీ పూరీలు, పిజ్జా ,బర్గర్లు, ఐస్ క్రీములు, వంటి వాటికి పిల్లలు పెద్దలు కూడా అలవాటు పడ్డారు
వీటి కారణంగా ఇంట్లో వంటలు వండడం తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడంతో బయట ఫుడ్స్ తెప్పించుకోవడం , ఆన్లైన్ ఆర్డర్స్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం  ఆన్లైన్ నుండి  కూడా ఆర్డర్ చేసుకుని తినడం మొదలవ్వడంతో ,ప్రతి ఒక్కరికి పని తగ్గిపోవడం , ఒంట్లో కొవ్వు ,అజీర్తి, పెరిగి చికాకులు ఎక్కువయ్యాయి . టీవీ పెట్టుకుని 24 గంటలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం చేస్తూ, రాత్రి  12, ఒంటిగంట వరకు మేలుకోవటంతో ,పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయింది.
ఇప్పటి కాలంలో ఎవరూ సూర్యోదయం చూసిన దాఖలాలే లేవు.
ఈ రకమైన జీవితానికి అలవాటు పడి, మన శరీరం మన ఆధీనంలో లేనందు వల్ల,  ఎన్నో రోగాలకు  మన శరీరం ఆశ్రయమయ్యింది.

పిల్లలు రెండు మూడేళ్ళు రాకుండానే  రోగగ్రస్తులవుతున్నారు. 15 ఏళ్ల దగ్గరుండి ఊబకాయం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులతో అందరూ రోగగ్రస్తులై ,ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ రకమైన  అనారోగ్య ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, ప్రస్తుతం యూట్యూబ్లో వస్తున్న ప్రతీ  చిట్కాల్ని నమ్ముతూ , అన్నిటినీ ఆచరిస్తూ,   అటుకి, ఇటుకి కాకుండా   నానా ఇబ్బందులు పడుతున్నారు.
మన అలవాట్లు మార్చుకోనంతవరకు, మనం ఎన్ని మందులు వాడినా ,ఏ చిట్కాలు వాడినా వాటి ప్రయోజనం ఉండదు. మనం అన్ని వాడతాం, కానీ ఒక పద్ధతిలో మన దిన చర్య ఉండదు .భోజనానికి, టిఫిన్లకి ,నిద్రకి ,సమయపాలన ఉండదు.
మనని చూసి మన పిల్లలు కూడా అదే  విధంగా ప్రవర్తించడంతో ఇంటిల్లపాది రోగగ్రస్తులై, మానసింగా  శారీరకంగా కూడా  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు .
ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన చిట్కాలు అన్నీ మన పూర్వీకుల ఆచరించినవే . అవన్నీ మధ్యలో  "  పాత చింతకాయ పచ్చడి "అంటూ మనం వదిలేసి ,తిరిగి అవే చిట్కాలను యూట్యూబ్లో చూసుకుని అమలు చేస్తున్నాం .

ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి .మన అలవాట్లు మార్చుకుంటే ,మన ఆనందం ,మన ఆరోగ్యం- మనతోనే ఉంటాయి అన్నది నా ఉద్దేశం .

మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన మాటలు-
సమయపాలన పాటించండి .ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఈ చిన్ని వ్యాసం నా స్వీయ రచన.

                               -    శుభం -
                               -    ******

శీర్షిక : కళ్యాణి. ( చిత్రకథ)

*30/06/2023.
*తపస్వి మనోహరం కొరకు.
*అంశం : చిత్రకధ.

శీర్షిక :  కళ్యాణి.

*రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


కళ్యాణి స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చింది. 
రోజులాగే రోడ్డు చివరి వరకు చూసింది .అమ్మ వస్తున్న జాడలేదు. 
అమ్మ రోజు ఇంతే. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది.
 తన తోటి పిల్లలంతా ఇళ్లకు చేరుకుని , హాయిగా ఆడుకోడానికి వెళ్ళిపోయి ఉంటారు. తను ఒక్కతే ఇక్కడ, ఈ స్కూల్ గేటు పక్కన బెంచి మీద కూర్చుని అమ్మకోసం చూస్తూ ఉంటుంది. 
ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఇంచుమించు ఇళ్లకు వెళ్లిపోయారు. స్కూల్ వాచింగ్ అని కూడా ఒక అరగంట సేపు వెయిట్ చేసి స్కూల్ గేటుకు తాళం పెట్టి ,ఇంటికి వెళ్ళిపోతాడు.
అప్పుడైతే తనకు చాలా భయం వేస్తుంది .ఎందుకంటే తను ఆ స్కూల్ అంతటికీ  తను ఒక్కతే ఉంటుంది.
ఈ మధ్యన అయితే పది రోజులు బట్టి, ఒక అంకుల్ తనవైపు అదోలా చూస్తూ ,ఆ రోడ్డు చివరన నిల్చుని కనిపిస్తున్నాడు.
మొదట్లో అతను , వాళ్ళ పాపనో బాబునో తీసుకెళ్లడానికి అలా వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంది.
కానీ అతను పిల్లలంతా వెళ్లిపోయిన తర్వాత కూడా అలా 
నిల్చుని చూస్తూనే ఉంటున్నాడు.
ఈరోజు కూడా అతను అక్కడే ఉన్నాడు

 కళ్యాణి వాళ్ళ అమ్మ ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాది.
 కళ్యాణి వాళ్ల నాన్నగారు, కళ్యాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు.
 అప్పటినుంచి కళ్యాణి వాళ్ళ అమ్మ ,కళ్యాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ , తామిద్దరి భారం ఎవరి మీద పడకుండా ఉండడం కోసం  , 
 ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగంలో జాయిన్ అయింది.
 ఆఫీస్ ఒకవైపు, స్కూలు ఒకవైపు ,కావడంతో ఆమె వచ్చేసరికి ప్రతిరోజు లేట్ అవుతూనే ఉంటుంది.
 కళ్యాణి వాళ్ళమ్మ కళ్యాణిని ఎవరితోనో కలిసి ఇంటికి వెళ్ళొద్దని, తాను వచ్చేదాకా స్కూలు దగ్గరే వెయిట్ చేయమని రోజు చెప్తూ ఉంటుంది.
 తనకైతే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది.
 అక్కడ ఒంటరిగా కూర్చోవడానికి కూడా భయంగా  ఉంటుంది. అప్పుడు తనకు అమ్మ మీద చాలా కోపం వస్తుంది.
 ఇప్పుడైతే శీతాకాలమేమో!  సాయంత్రం అయ్యేసరికి చలి కూడా వేస్తూ ఉంటుంది. 
 కానీ అమ్మ రాగానే తన కోపం అంతా కరిగిపోతుంది
 ఎందుకంటే అమ్మ రాగానే తనను దగ్గరికి తీసుకుని,"  అయ్యో అందరూ వెళ్లిపోయారా ? ఎంతసేపటి నుండి కూర్చున్నావమమ్మా   , భయమేసిందా ? ఆకలేస్తుందా .".. అంటూ తనను  దగ్గరికి తీసుకుని తనకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. 
తర్వాత అమ్మ వచ్చిన ఆటోలోనే తను, అమ్మ ,ఇంటికి బయలుదేరుతారు.
ఇలా  ఆరేళ్ల బట్టి జరుగుతూనే ఉంది.
ఇప్పుడు తను ఏడవ క్లాస్ కి వచ్చింది.
అంతకు ముందు తనకు భయం అన్నది తెలియదు.
కానీ తను పెద్ద అవుతున్న కొద్ది మనసులో భయం చోటు చేసుకుంటున్నాది.
చాలా పుస్తకాల్లో చదివింది .చాలా చోట్ల విన్నాది కూడా.
 ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని కొందరు మగ వాళ్ళు ఏదో ఒకలా వలవేసి పట్టుకుని తీసుకుపోతారని, విదేశాలకు అమ్మేస్తారని ,వాళ్ళని పనివాళ్ళుగా ,బిచ్చగాళ్లుగా, మార్చేస్తారని ఇలా ఏదేదో  విన్నాది.
 అమ్మ కూడా చెప్పింది ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్ళతో మాట్లాడొద్దని ,వాళ్ళు ఏమిచ్చినా తీసుకోవద్దని, వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దని.
 అమ్మ కూడా అలా చెప్పేసరికి తనలో భయం ఇంకాస్త ఎక్కువైంది.
 
 కానీ ఎన్నాళ్ళు ఇలా ? తనొక్కర్తి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా... తనకు ఇల్లు తెలుసు .నడుచుకుని కూడా వెళ్లిపోగలదు ఇంటికి తాళం ఉంటుంది. కానీ ఇక్కడే కూర్చునే బదులు, తను ఇంటి దగ్గరే కూర్చుంటుందిగా ...కనీసం ఇరుగుపొరుగులతో ఆడుకోవడం కుదురుతుంది కదా. 
 ఈమధ్య ఎన్ని రోజులైందో.. తను తన స్నేహితులతో కలిసి ఆడుకుని .
 కళ్యాణి ఇలా ఆలోచిస్తుండగానే , ఎన్నో రోజుల నుంచి ఇటే చూస్తున్న ఆ అంకుల్ ,కళ్యాణవైపు రాసాగాడు.
 కళ్యాణి లో భయం ఎక్కువయింది.
 అతను వచ్చి అటూ ఇటూ చూసి మెల్లగా కళ్యాణి పక్కన కూర్చున్నాడు.
 ఏం పాపా! "ఈరోజు ఇంకా మీ అమ్మ రాలేదా" అంటూ మాటలు కలిపాడు.
 కళ్యాణికి చాలా భయం వేసింది కానీ అతను మెల్లగా నవ్వుతూ భయపడకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను.
 ఇక్కడే పక్క షాపులో పనిచేస్తూ ఉంటాను . రోజు మీ అమ్మ వచ్చేవరకు నువ్వు ఒక్కతే కూర్చుంటావని గమనించాను. అందుకే మీ అమ్మ వచ్చేదాకా నీకోసమే నేను అక్కడ అలా నిల్చుని ఉంటాను .ఎందుకంటే ఒక్కతే ఉంటావు కదా, ఎవరైనా వచ్చి నిన్ను అల్లరి పెడతారేమోనని, అసలే రోజులు బాగా లేవు.
ఎంతైనా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాను కదా. నువ్వా చిన్న పిల్లవి .అందుకే  , మీ అమ్మ రాగానే నేను వెళ్ళిపోతాను.
ఈరోజు మీ అమ్మ రావడం రోజు కన్నా, 
ఆలస్యమవుతున్నట్టుంది....
పరవాలేదు నేను అంత దాకా నీ దగ్గరే ఉంటాను లే...
ఇదిగో నీకు ఆకలేస్తుందేమో! ఈ చాక్లెట్లు తిను అంటూ అంటూ కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.
కల్యానికి అతను చెప్పింది అంతా వింటూ ఉంటే నిజమేమో , అనిపించింది. కానీ కొంతసేపటికి , "ఇతన్ని మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా , ఎప్పుడూ నేను చూడలేదే...
ఇతను అబద్ధాలు చెప్తున్నాడు "
ఇతని మాటలు నేను నమ్మకూడదు అనుకుంది.
అతను కొంతసేపు తర్వాత,  పాపా చలి వేస్తుందా.. అంటూ అతను తొడుక్కున్న కోటు తీసి,  తన మీద కప్పబోయాడు .
కళ్యాణి ఒక్కసారి విసురుగా లేచింది.
వద్ద అంకుల్ నాకేం చలివేయడం లేదు . ఆకలి కూడా వేయడం లేదు. మా అమ్మ నాకు బాక్స్ లో టిఫిన్ కట్టి ఇస్తుంది. నాకు మా అమ్మ మొబైల్ కొనిచ్చింది తను రావడం ఆలస్యం అయితే ఫోన్ చేయమంది ఇప్పుడే ఫోన్ చేశాను కాసేపట్లో మా మామయ్య నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో మా మామయ్య పోలీసుగా పనిచేస్తున్నాడు . రేపటినుండి నేను ఒక్కర్తినీ కూర్చున్నా నాకు భయం ఉండదు. ఎందుకంటే మా మామయ్య పక్క రోడ్డు పోలీస్ స్టేషన్లో  పనిచేస్తున్నాడు కనుక , నేను ఫోన్ చేయగానే వచ్చేస్తాడు కనుక. మావయ్య రాగానే నేను మా ఇంటికి వెళ్లి పోతాను.
అని కళ్యాణి ధైర్యంగా చెప్పింది. నిజానికి కళ్యాణికి వాళ్ళమ్మ మొబైల్ కొనిచ్చింది లేదు వాళ్ళ మామయ్య పక్క రోడ్డులో పోలీస్ స్టేషన్లో పని చేసేది లేదు .
కానీ కళ్యాణ్ ఎలా చెప్పగానే అతను సరేనమ్మా . నేను వెళ్లి వస్తాను అంటూ  గబగబా ఎటు వెళ్లిపోయాడో కూడా తెలియకుండా వెళ్లిపోయాడు.
కళ్యాణి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
ఇంతలో వాళ్ళ అమ్మ వస్తూ కనిపించింది.
కళ్యాణి ఆనందంగా పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది.
అమ్మడు కళ్యాణి ఈ ఉదంతం అంతా స్కూల్లో మాస్టర్లకు చెప్పింది.
దాంతో స్కూలు యాజమాన్యం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
కొన్ని నెలల తర్వాత .....
ఆ స్కూల్లో ఇప్పుడు, తల్లిదండ్రులు ఆలస్యంగా వస్తున్న పిల్లలకోసం, ఒక లైబ్రరీ స్టార్ట్ అయింది. అక్కడ బోలెడు పుస్తకాలు ఉన్నాయి చదువుకోడానికి .

అంతేకాదు చిన్న రూంలో. ఇంటర్నల్ గేమ్స్ , కూడా ఏర్పాటు చేశారు .అందులో కావాల్సినప్పుడు పిల్లలు అష్టాచమ్మా , 
చదరంగం, టేబుల్ టెన్నిస్, వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. 
ఈ రకమైన మార్పుకి  కారణమైన కళ్యాణిని , పిల్లల తల్లితండ్రులందరూ అభినందిస్తుంటే ,కళ్యాణి వాళ్ళ అమ్మకి చాలా గర్వంగా ఉంది.

అప్పుడు హెడ్మాస్టర్ గారు పిల్లలతో..
చూశారా పిల్లలూ! కళ్యాణి  ధైర్యంగా  చేసిన చిన్న పని వల్ల ఈరోజు  పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో..
"మీరు కూడా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, కళ్యాణి లాగే ధైర్యంగా, యుక్తితో మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
 ఈ కాలంలో ఇది చాలా అవసరం" అంటూంటే,
  టీచర్లంతా చప్పట్లు కొట్టారు.

**************"""*"

గృహ శోభ.

13/07/2023.
మనోహరం పత్రిక కొరకు,
అంశం  : గృహ శోభ ,
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.


ఇంటికొచ్చిన వారందరూ సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించి,
మేము ఇచ్చిన పసుపు కుంకాలు తీసుకొని వెళ్తున్నారు .
ఆ రోజు మేము కొత్తింటి గృహప్రవేశం చేసాం .
ఇది చిన్న రెండు బెడ్ రూమ్లు గల , ఇండివిడ్యువల్ హౌస్.
ఇంటిలో ఇంకా, ఫర్నిచర్ ఏమి తెచ్చుకోలేదు . వుడ్ వర్క్ మాత్రం చేయించుకున్నాం.  మామూలుగా అయితే డైనింగ్ టేబుల్ నాలుగు కుర్చీలతో పాటుగా కొనుక్కుంటారు . కానీ మేము జాగా కలిసొస్తుందని , వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే డైనింగ్ టేబులు గోడకి అటాచ్ చేసి పెట్టించేసుకున్నాం . అలాగే బాల్కనీలలో" బాక్స్ టైప్ " గ్రిల్స్ వేయించుకున్నాం . మొక్కలు వేసుకుంది కి , వేలాడుతున్న గోలేలను కొని తగిలించాను. 
.దేముడి  రూమ్ లో కూడా,  దేవుని  మంటపాన్ని లోపల  గోడలోకి పెట్టించాను . .దేముడి రూమ్ అంతా, కర్రతోనే , అందమైన డిజైన్లు చేయించి , రూమ్ కి 4 వైపులా, పెట్టించాను . ఇది నిజమైన మందిరం అన్న ఫీలింగ్ వచ్చేలా  లోపల అలంకరణ చేశాను.
 
ఇంకా పూర్తి ఇల్లంతా ,మంచి మంచి డిజైన్లతో అలంకరించాలని , నాకు పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండడంతో , ఆరోజు సాయంత్రమే మార్కెట్ ప్రోగ్రాం పెట్టుకున్నాం .
వచ్చిన వారంతా వెళ్లిపోయారు
మా కుటుంబ సభ్యులుం మాత్రమే మిగిలాం.

మేం అనుకున్న ప్రకారం ,ఆరోజు సాయంత్రం, మేమంతా కలిసి మార్కెట్ కి వెళ్ళాం. ఇంటికి కావాల్సిన వస్తువులు ఏంటేంటి, అన్నవి మా పిల్లలు నిర్ణయించేశారు ఎప్పుడో . 
నేను మాత్రం డెకరేషన్ కి కావాల్సిన సామాన్లు అన్ని, కొనుక్కు వచ్చాను. మా పిల్లలు కూడా కొన్ని డిజైన్స్. నాకు చూపించి కొనిపించారు .

మేము ముందు ఉన్న ఇల్లైతే , చీకటి చీకటిగా ఉండేది. వెంటిలేషన్ అస్సలు ఉండేది కాదు . అందుకే వెంటిలేషన్ ఉన్న ఇల్లు కోసం చూసి చూసి, చివరికి చిన్నదైనా, ఈ ఇల్లు కొనుగోలు చేశాం ,ఈ ఇల్లు చిన్నదైనా నాలుగు వైపులా వెంటిలేషన్తో కళకళలాడుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా , బాగా ఉండడంతో, మేము ఈ ఇంటిని కొనుగోలు చేసాం.
అందుకే ఈ ఇంటిలో ,అన్ని వైపులా సామాన్లతో నిండిపోకుండా ,జాగ్రత్తగా అన్ని సామాన్లు అమర్చుకోవాలని నిశ్చయించుకున్నాం.

ఇంటిలో అన్ని రూముల్లోనూ పెద్ద పెద్ద "లాఫ్ట్" లు ( అటకలు) పెట్టించుకున్నాం  .ఇంట్లో ఉన్న సామాన్లలో, మేము వాడుకుందికి  కావలసినవి తప్ప, మిగిలినవన్నీ వాటిల్లోకి ఎక్కించేసాం.

మెయిన్ హాల్లో, లామినేషన్ చేసి ఉంచిన పెద్ద వినాయకుని ఫోటో, మెయిన్ డోర్ తలుపు తీయగానే ,ఎదురుగా కనిపించేట్లు ఫిక్స్ చేసాం. 
పూర్తి ఇంట్లో,  వెంటిలేషన్ కోసం  పెట్టిన కిటికీలకు," లైట్ క్రీమ్ కలర్ " పరదాలను తగిలించాం.
మెయిన్ హాలులో ఒక మూల ఒక పెద్ద సైజు" ఫ్లవర్ వాజ్" లో అందమైన ఆర్టిఫిషియల్ గులాబీలను గుత్తులుగా అమర్చాం.
మెయిన్ డోర్  గుమ్మాలకు,   ఆయిల్ పెయింట్స్ తో అందమైన  ,చిన్న చిన్న ఫ్లవర్స్ ను వేయించి , తలుపు పై-ద్వారానికి, అందమైన తోరణాలు కట్టీ , అదే గుమ్మానికి రెండు వైపులా, అచ్చం బంతిపూల లాగా కనిపించే దండలను, పొడావుగా వేలాడదీసేం.
హాలు లో ఒక వైపు గోడకి , బృందావనంలో ఊయలపై , తన్మయత్వంతో మునిగి ఉన్న అందమైన , రాధాకృష్ణుల  బొమ్మను, ఆయిల్ పెయింట్స్ తో వేయించి , దానికి కర్ర తోనే. నాలుగు వైపులా అందమైన ఫ్రేమ్ ను చేయించాం. ఆ వచ్చిన పెయింటర్, ఆ చిత్రాన్ని ఎంత బాగా గీసాడంటే , నిజంగా రాధాకృష్ణులు ,   బృందావనంలో ఆడుకుంటున్నారా. ! అన్నట్టుగా అద్భుతంగా పెయింట్ చేశాడు .
ఇకపోతే , పిల్లల బెడ్ రూమ్ లో , సీలింగ్ పై, నిజంగా "ఆకాశం , చంద్రుడు, నక్షత్రాల కింద పడుకున్నామా ..? " అనిపించేట్టుగా డిజైన్స్ వేయించాం.
 గోడలకు చిన్నచిన్న అల్మారాలు కొట్టించి, వాటిపై పిల్లలకు ఇష్టమైన బొమ్మలను, నాలుగు వైపులా అమర్చేము.
గోడలపై ,చిన్నచిన్న ప్రేముల్లో ,  రామాయణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, ఒకదాని కింద  ఒకటిగా అమర్చాం.

మెయిన్ "మాస్టర్ బెడ్ రూమ్ "లో ,ఒక గోడపై, పెద్ద సైజు లో,  అందమైన బోసినవ్వుల పాపాయ ఫోటోను పెట్టాం. 
పడుకుని లేవగానే, సమయం  తెలిసేట్టుగా, ఎదురుగా ఒక మంచి "గోడ గడియారాన్ని" తగిలించాం .
అన్ని గదుల్లోనూ , పల్చగా ఉన్న లైట్ "క్రీం కలర్ కర్టెన్స్" ను తగిలించేమేమో , అవి గాలికి ఎగిరుతూ ఉంటే ,మనసుకు ఎంతో హాయి అనిపించింది . ప్రకృతి సిద్ధమైన గాలిని పీల్చీ ,ఎన్ని రోజులైందో...

ఇకపోతే బాల్కనీలో గ్రిల్స్ కి  హ్యాంగ్ చేసిన గోలేలలో,
అందమైన పూలు పూచే ,చిన్ని చిన్ని క్రొటన్స్ మొక్కలని 
వేసేము . వాటిలో , అయిదారు రంగుల పూలు పూసే మొక్కలున్నాయి.
గ్రిల్ కి చివరలో "మనీ ప్లాంట్ " మొక్కను వేసాము.

ఇక నాకు మెయిన్ డోర్ తీయగానే,  బాగానే ఖాళీ జాగా కూడా ఉంది.
ఒకపక్క కారు కోసం జాగా వదిలేసినా , రెండో ప్రక్క కావలసినంత మట్టి జాగా ఉంది.
నాతో పాటు మా పిల్లలకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం  . అందుకనే వారు నాతో పాటుగా సరదాగా మొక్కలు నాటడం మొదలు పెట్టారు .
వాటిల్లో మందారం ,నందివర్ధనం ,బొడ్డు మల్లి , జాజిపూల పందిరి, మల్లి , చామంతి చెట్లు ,గులాబీ చెట్లు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలను ముందువైపుకు నాటి , వాటికి వెనకాతల  ఉన్న జాగాలో. నిమ్మ , దానిమ్మ ,కరివేపాకు ,  బొప్పాయి ములగ , మామిడి చెట్లను నాటాం.
మెయిన్ గేట్ కు ఇరువైపులా బోలెడు తులసి చెట్లను నాటాం. ఎందుకంటే అక్కడ , మేము ఇల్లు కట్టించుకున్నప్పుడే, పెద్ద పెద్ద తులసి కోటలను కట్టించుకున్నాం. 
అక్కడ తులసి చెట్లు ఉండడంవల్ల ,కోటకు ఉన్న గూటీలో, దీపం వెలిగిస్తే, అది గాలికి ఆరిపోకుండా చాలా సేపు ఉంటుంది .
తులసి పూజ చేసుకున్నా , ముగ్గులు వేసుకున్నా ,  ఒక ఏర్పాటు గా ఉంటుంది . 
ఇకపోతే. గేటు దగ్గరనుంచి , ఇంటి "మెయిన్ డోర్ " వరకు, సిమెంట్ తోనే రోడ్డు లా వేయించుకున్నాం .
ఆ రోడ్డుకు రెండువైపులా, గుత్తులు- గుత్తులుగా పూలు వచ్చే, రంగురంగుల  క్రోటన్స్ మొక్కలను నాటుకున్నాం.
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తున్నాది .చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి .ఈ వర్షాలకు ,ఈ మొక్కలన్నీ , తొందరగానే పెరిగి పెద్దవవుతాయి.

రేపు మేము మళ్ళీ మా పాతింటికి వెళ్ళిపోతాం.
మళ్లీ ఆశ్వీయుజ మాసంలో ఈ ఇంటికి  వచ్చేద్దాం అనుకుంటున్నాము .  అప్పటికి మా పాత ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఎవరికైనా ఇచ్చేయడం ,ఈ ఇంటికి కొత్త ఫర్నిచర్. , (అంటే ఫ్రిడ్జ్ ,వాషింగ్ మిషన్, మంచాలు, కంచాలు మొదలైనవి) కొనుక్కోవడం కూడా అయిపోతుంది .
  నేను ,మధ్య మధ్యలో. " ఈ ఇల్లు,  మొక్కలు- చూసుకుందుకి, వస్తూ ఉంటా లేండి.
అప్పటికి ఈ మొక్కలు కూడా చక్కగా పెరిగి పూలు  పూస్తాయేమో కదూ...
అప్పుడీ ఇల్లు చూడ్డానికి ఎంత బాగుంటుందో....

మరి మేము ఇంటికి రాగానే, మీరంతా మా ఇంటికి వస్తారు కదూ ! మా ఇల్లంతా  చూసి చెప్పండి .
 మేము చేసుకున్న డెకరేషన్ ఎలా ఉందో ?
  మీరు కూడా ఏమైనా" సజెషన్స్"   ఉంటే చెప్పండి. తప్పకుండా మార్పు చేస్తాను.....
 ఓకే మరి వెళ్ళొస్తాం... బాయ్..  ..
 
*********†******************

 హామీ : 
ఈ రచన ,నా స్వీయ రచన.

మధుర స్మృతి. (మినీ కథ)

15/07/2023.
వాస్తవానికి దగ్గరగా.  నా ఆలోచనల ని మీతో. పంచుకోవాలని రాసే చిన్ని అనుభవం.



విభాగం :  పోస్ట్ కార్డ్ కథ
రచయిత్రి ,పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి ,
                 కల్యాణ్ : మహారాష్ట్ర 

          శీర్షిక : "మధుర స్మ్రుతి ".
          ------------------


హడావిడిగా  అరిచే భర్త ని ఆఫీసుకి ,
ఆరడి చేసే పిల్లలని. స్కూలు కి తరలించి ,  భారంగా ఊపిరి తీసుకున్నాను . వడలిన శరీరాన్ని     సేద తీరుస్తూ.  ఈజీచైర్ లో అలసటగా  నడుం  వాల్చేను  మరు క్షణం నా చెవులకి సోకిందొక చిరపరిచిత శబ్ధం.
టప్     ....టప్ .....టప్ ......
అంతే ...ఒక్క ఉదుటున. లేచి పరుగెత్తేను కిటికీ వైపుకి .    "వర్షం "తీసిన తలుపుల్లోంచీ  చల్లగా. , ఝల్లుగా ,   హాయిగా ......ఉత్సాహంగా.
పెరట్లోకి  పరుగెత్తేను .
వర్షం లో తడుస్తూ. నా అలసటని పారదోలుతూ. నన్నేవేవో. జ్ఞాపకాలలోకి  
తీసుకుపోతూ.... "వర్షం ".
ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నుల ముందు కదలాడే చిరుఝల్లుల
జ్ఞాపకాలు ....అవును ఇదే వర్షం లో నేనూ , నా స్నేహితురాళ్ళూ , చిలిపి గిల్లికజ్జాలూ...........

----------------
చేతుల్లో చేతులు వేసుకొని " వానా వానా చల్లప్పా "......అని పాడుకుంటూ.
అందరం కలిసి గుండ్రంగా గింగరాలు తిరిగే చిన్ననాటి చిలిపి సరదాలు .....
చెట్ల ఆకులపై పడే వర్షపు నీటి బొట్లని
నోరు పట్టి. జుర్రుకొనే ఆనంద  క్షణాలు ......
గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడుతూ చిందర వందర కబుర్లతో కలిసి స్కులుకి వెళ్ళే ఎత్తు- పల్లాల కాలిబాటలు .....
వర్షానికి తడిసిన పచ్చని పైరుబాలల తివాచీ తోరణాలు ......
చిరుజల్లు తో కలిపి వీచే చల్లని గాలులలోంచీ  వచ్చే  , తడిసిన మట్టి సుగంధాలు ...
పిల్ల కాలువల పారే నీటిలో , పోటీల కాగితపు పడవల వరుసలు ........
వేడి వేడి ఫల్లీలు తింటూ , ఉరుముల శబ్ధాన్ని. వింటూ , మెరిసే మెరుపుల్ని
వింతగా చూసే అమాయకపు.
,విస్మయ , చిన్నారి చూపులు.....
శ్రావణమాసపు  నోముల సందడిలో ,
పట్టు పరికిణీ , పావడాల  రెప రెపల తో
అమ్మ చేయి పట్టుకొనీ , అమ్మలక్కల ఇళ్ళకి. " పేరంటానికి ". వెళ్ళే తోవలో
గుడినుంచి వినిపించే. "జే గంటల " చిరు గణ గణలు ......
అట్లతదియ రోజు  ఆరు గంటలకే. ఉట్టికింద ముద్దలు తిని , ఊయలలాటలకై. , ఉత్సాహంగా పరుగులుతీసే కాలి మువ్వల గలగలలు ....
రాత్రి కాగానే. నాన్నమ్మ పక్కలో , వెచ్చగా ఒదిగి ఆమె చెప్పే చిలకమ్మ . కధలు  వింటూ ,   ఆశ్చర్యానందాల పసి హ్రుదయపు పులకరింతలు ......
ఇలా ఎన్నో. .... ఇంకెన్నో జ్ఞాపకాలు , ఇంకా నాలో మాసిపోని బాల్య స్మ్రుతులు.
ఆ రోజుల్లో ప్రతి రోజూ ఒక కొత్త వెలుగు
ప్రతి క్షణం ఒక నందనవనం .
ఆ రోజులు మళ్ళీ వస్తాయా .......అటువంటి.  పండగలు , సరదాలు. ఇప్పుడు  ఏవీ
పిల్లలలో  పసితనం వెతికినా కనపడ్డంలేదే ...

అలవోకగా ఆలోచిస్తున్న. నేను ,చెవులకి వినిపించే గంటలమోతకి. ఉలిక్కిపడి
గడియారం వైపు చూసేను .
సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ,
ఉస్సురంటూ కదిలేను .
ఆయన వస్తారు , పిల్లలు వస్తారు .
టిఫిన్ ఏమి చేయాలబ్బా ...... అనుకుంటూ వంటింటి వైపు కదిలేను
" రొటీన్ గా ".

**************************

హామీ:
ఈ చిన్ని  అనుభవం ,  నా స్వీయ రచన .

శీర్షిక : నేను చెప్తే ,నువ్వు వినాలి..

22/07/2023.
మనోహరీ మహిళా పత్రిక కొరకు,
అంశం బాలసాహిత్యం .
శీర్షిక :  నేను చెప్తే ,నువ్వు వినాలి.
రచన :  శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.
 కళ్యాణ్ : మహారాష్ట్ర.

ఆరు సంవత్సరాల నిండిన చిన్ని,  స్కూల్ కి వెళ్లడానికి ,చాలా అల్లరి పెడుతోంది .
ఎప్పుడు  తీసుకుందో వాళ్ల నాన్న మొబైల్ దాని చేతిలో ఉంది . పొద్దున లేచింది మొదలు, మొబైల్ చూడడమే దాని పని .హోంవర్క్ చెయ్యదు, టైంకి లేవదు,
 స్నానం చేయదు, కనీసం,  బ్రష్ చేసుకోదు. చిన్ని, చిన్నపిల్లప్పుడు,  చిన్ని వాళ్ళ నాన్నకి  బాక్సు చేసేందుకు  అసలు టైం దొరికేది కాదు.. తను లేవగానే ,చిన్ని కూడా తనతో పాటు లేచిపోయి, తనని వదలకుండా,
 ఎత్తుకోమని, చాలా అల్లరి పెట్టేది.
 ఆ సమయంలోసమయంలో, చిన్ని అల్లరి మానేందుకు,
  , ముందు తనే, మొబైల్ ఇచ్చి పెట్టేది . ఇప్పుడు అదే ,ఒక సమస్యగా మారింది.  
  కమల కూతురుతో నానా హైరానా పడిపోతున్నాది .
  
"చిన్నీ , మాట విను, లే . లేచీ ,  రెడీ అవ్వు..స్కూల్ టైం అయిపోతుంది" అని ప్రతిరోజు చెప్తూ ఉండడమే. 
   అంతలా తను అరుస్తున్నా , మాట వినదు సరి కదా , "నేను నీ మాట కాదు ,నువ్వే నా మాట వినాలి "అంటుంది.
  ఈరోజు అలాగే జవాబు చెప్పింది .దాంతో ,
కమల కోపం తట్టుకోలేక ,వెళ్లి చిన్ని చేతిలో ఉన్న మొబైల్ లాక్కొంది .  అంతే , చిన్ని తనని ఎవరో , నానా బాధలు పెట్టేస్తున్నట్టు ,దబ్బున కింద పడిపోయి, గట్టి గట్టిగా ఏడవడం మొదలెట్టింది .దాంతో కమలకు చెర్రెత్తుకొచ్చి, చిన్నిని బరబరా లాక్కెళ్ళి,    బ్రష్ చేయించి,  స్నానం చేయించి , స్కూల్ డ్రెస్ వేసి ,స్కూల్ బ్యాగ్ చేతికిచ్ఛి,
 పాల గ్లాసు చేతికి అందించింది.
  చిన్ని కోపంతో పాల గ్లాసు తోసేసింది .  పాలన్నీ, నేలపాలయ్యాయి. దాంతో. కమల కోపంతో, రెండు దెబ్బలు వేసింది. అంతే, చిన్ని ఆరున్నొక్క రాగంలో, ఏడవడం మొదలెట్టింది.
  
 కమల" ఓరి దేవుడా" అనుకుంటూ, చిన్నిని దగ్గరకు తీసుకుని ,మంచి-మంచి మాటలాడుతూ, మెల్లగా చిన్నీని స్కూలుకు పంపించే సరికి తల ప్రాణం తోక్కి వచ్చింది,  
 చిన్ని స్కూల్ కి వెళ్ళగానే, హమ్మయ్య అంటూ తేలిగ్గా , ఊపిరి పీల్చుకుంది.
 
***********************
ఆరోజు ఆదివారం , అందరూ ఇంట్లో ఉన్నారు.
 పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్ లేదు .ఆయనకి ఆఫీసు లేదు.
  దాంతో కమల ఏడు గంటలకు  తాపీగా లేచి, చిక్కగా కాఫీ పెట్టుకుని ,కుర్చీలో కూర్చుని   కాఫీ తాగుతూ, ఎదురుగా ఉన్న టీవీలో ఏదో సినిమా పెట్టి , మొబైల్ చూస్తూ కూర్చుంది .ఇంకా ఆయన,చిన్నీ , పడుకునే ఉన్నారు. ఎందుకంటే రాత్రి ఒంటిగంట ,రెండు దాకా టీ.వీ.లో సినిమాలు పెట్టుకుని చూసేరు . దాంతో, పడుకునేసరికి లేట్ అయింది  .    తను, " చాలారాత్రి అయిపోయింది పడుకోండి" అని అంటే ,". రేపు ఆదివారమే  కదా ! ఈ ఒక్కరోజైనా, కావాల్సినట్టు ఉండకపోతే ఎలా?" అన్నారు.
  ఏమీ  అర్థం కాకపోయినా, చిన్ని కూడా, మాతో పాటు కూర్చుని , పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని. రాత్రంతా మాతో పాటు టీ.వీ .చూస్తూనే  ఉంటుంది  .
  దాంతో తెల్లారి గట్ల పడుకొని,  పొద్దున్న. లేచేసరికి, సమయం, ఏడు, ఎనిమిది ,అయిపోతుంది
  
************

  కమల, మొబైల్ చూడడంలో ఎంత  మగ్నం అయిపోయిందంటే, చిన్ని లేచి , దగ్గరికి వచ్చి నిలబడి "అమ్మా" అని పిలవడం కూడా, వినపడలేదు.
   దాంతో చిన్నికి బలే కోపం వచ్చింది ." అమ్మా ! నాకు పాలు కావాలి. నాకు  ఆకలేస్తోందమ్మా " అంటూ  కుదుపుతూ ,పిలిచింది.
   కమల, తుళ్లిపడి ,  చిన్నిని చూసి ,"అరే లేచిపోయావా?  ,బ్రష్ చేసుకున్నావా...?, అంటూ, తిరిగి మొబైల్లో పడిపోయింది.
   చిన్నికి భలే కోపం వచ్చింది." నన్ను ఎప్పుడు చూసినా, మొబైల్ చూస్తుంటే ,వద్దు వద్దు అంటూ , నా చేతిలో మొబైల్ లాగేసుకుంటావు.  "స్కూల్ కి వెళ్ళాలి అది నీ పని" అంటావు. ,
"నాకు ఇష్టం లేకపోయినా, స్కూల్ కి పంపించేస్తావ్.
మరి ఈరోజు , నువ్వు పని చేయకుండా ,ఎందుకు మొబైల్ చూస్తూ కూర్చున్నావు.  మా అందరికీ ఆకలేస్తుంది.కదా?
తినడానికి  ఏదీ చేయవా ? అది నీ పని కదా ! 
అలా మొబైల్ చూస్తూనే కూర్చుంటావా" అంటూ పెద్ద ఆరిందాలా ప్రశ్నించింది.
    దాంతో  కమల ఒక్క క్షణం బిత్తర పోయింది.
  వెంటనే సర్దుకుని ." నువ్వు లేచినట్టు, నాకు తెలీదు కదా చిన్నీ ! అందుకే మొబైల్ చూస్తూ కూర్చున్నాను .ఎవరైనా లేస్తే కదా, అన్ని పనులు చేసి  పెడతాను"  అంటూ చిన్నీని, దగ్గరకు తీసుకుంది . చిన్ని అంది. "నువ్వు స్నానం చేయలేదు. మాకు టిఫిన్స్ చేయలేదు. నాకు పాలు కలిపి ఇవ్వలేదు .నేను పిలిస్తే వినిపించుకోలేదు. 
   నేను నీతో మాట్లాడను.."
 "  నిన్న మా టీచర్ చెప్పింది. "మొబైల్, ఎవరూ ఎక్కువగా చూడకూడదు.  "అనిఅలా కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తే కళ్ళు పాడైపోతాయని చెప్పింది " నువ్వు మొబైలు అలా కళ్లకు దగ్గరగా పెట్టుకుని చూస్తావ్ .నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా  నువ్వు నా మాట వినడం లేదు .
   మళ్లీ నాకే చెప్తున్నావ్ , "చిన్నీ..మొబైల్  చూడకు, చిన్నీ మొబైల్  చూడకు అని .
  " నువ్వు నా మాట  అస్సలు వినడం లేదని ,  రేపు నీ పని టీచర్తో చెప్తాను" అంటూ ఏడవడం మొదలు పెట్టింది.
    చిన్ని మాటలు విన్న  కమల, ఒక్క నిమిషం ,ఆలోచనలో పడిపోయింది . మరి తను అలా, పొద్దున్న లేచింది మొదలు, మొబైల్ చూస్తూ కూర్చున్నప్పుడు, చిన్ని కూడా మొబైల్ చూడడంలో తప్పేముంది ?  అసలు చిన్నికి ,ముందు మొబైల్ అలవాటు చేసింది తనే కదా!  "
    ఏమైనా సరే తను చేసేది తప్పే !  పిల్లల ఎదురుగుండా పెద్దల ప్రవర్తన, సవ్యంగా లేకపోతే, పెద్దలు ఏది చేస్తే ,పిల్లలు అదే చేస్తారు అన్నది నిజమే .తను చిన్నికి , గడిగడీకీ,  "మొబైల్ చూడకు మొబైల్ చూడకు " అంటూ, చెప్తూనే ఉంటుంది
    కానీ తనే, ఎప్పుడూ, మొబైల్ చూస్తూ కూర్చుంటూ ఉంటుంది. చిన్నీ ఎదురు గుండా,  మంచి పనులు చేయడం తనే మొదలెట్టాలి . ముందుగా చిన్ని ఎదురుగుండా, తను మొబైల్ చూడడం మానేయాలి."
  "  చిన్నపిల్ల ,చెప్పడం రాకపోయినా,  తన మనసులో ఏముందో, చెప్పకనే చెప్పింది "అనుకుంటూ ,
  కమల ,మెల్లిగా చిన్నీ ని దగ్గరికి తీసుకుని, కళ్ళు తుడిచి ,
   " అయితే , నేను, నీ మాట వినాలా"  అంటూ అడిగింది.
    చిన్నీ గొప్పగా తల ఎగరేస్తూ, " అవును, నువ్వే నా మాట వినాలి. నువ్వే మొబైల్ కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చూస్తావు.,
 నేను, స్కూల్ కెళ్ళి, మా టీచర్ చెప్పిన మాట వింటాను.
  ఇంట్లో నువ్వు నా మాట వినాలి !అంతే!" అంటూ బుంగమూతి పెట్టింది. ముద్దుగా  మాట్లాడుతున్న  చిన్నీని చూస్తూ ,మురిసిపోతూ ,కమల చిన్నీ బుగ్గ మీద ముద్దు పెట్టింది " సరే "నంటూ..

కమల మరోసారి మనసులో అనుకుంది." నిజమే!  పిల్లలకి బుద్ధులు చెప్పినప్పుడు ,తాము ముందుగా , వారి ముందు బుద్ధిగా ఉండాలి కదా ! "  అనుకుంటూ పంటింటి వైపు నడిచింది  చిన్నీకి పాలు కలిపి ఇవ్వడానికి.



హామీ:  ఈ కథ నా స్వీయ రచన