Monday, November 6, 2023

ప్లాస్టిక్ లోకం

15 /06/ 2023

మనోహరీ మహిళా పత్రిక కొరకు రచన .

శీర్షిక :  ప్లాస్టిక్ లోకం.
వచన కవిత.
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 
కళ్యాణ్  : మహారాష్ట్ర.

ఊపిరాడని గదిలో ఉక్కపోతల జీవితం
ప్లాష్టిక్ నిండిన రంగులతో ఇల్లు నిండిన సంబరం

ఇటుక  గోడల చల్లదనం ముాత వేసిన నేరానికి
వేడెక్కన రంగు గోడలు వేస్తున్న శిక్షకు, కమిలిన
 దేహం కారుస్తున్న చమట చుక్కల ప్రవాహం ॥

గదికున్న షొికేస్ లో వాసన లేని ప్లాష్టక్ పుాలకు 
 రోజుా జల్లుతున్న సెంటు ,గంధం కలబోసిన
 ప్లాష్టిక్ దుర్గంధం  రోత పుట్టిస్తోంది!
 
బాత్ రుామ్  కొళాయిల కింద 
బావురు మంటున్న ప్లాష్టిక్  బాల్ఛీల్లో
రెండు రోజులకో సారి వచ్చే కొళాయినీళ్ళ
పాకుడుతో  నాచు బట్టిన బాల్చీల్లో 
బంక నిండిన జిగురు , డోకు పుట్టి స్తోంది.! 

పక్కనున్న పాకావిలాస్ లో ప్లాష్టిక్  ప్రేట్ల లో 
వేసున్న వేడి వేడి ఇడ్లీలను ఆవురావురుమని 
తింటున్న జనం ,కరుగున్న ప్లాష్టిక్ రుచిని 
ఆనందంగా ఆస్వాదిస్తుా పొట్టలోకి కుక్కుతున్నారు.!

ఆకలికి ఆగలేని ఆవొకటి  పక్కనున్న పెంటకుప్పలోకి
విసిరేసిన ప్లాస్టిక్ కవర్  మూటలో,  
మురికి కంపు కుడుతున్న  ఆహారాన్ని  ఆబగా ,
 ప్లాస్టిక్ కవరుతో పాటే తినేసీ,
మింగలేక మిడి గుడడ్లేసింది.!

ఓ మూల కూర్చుని ఉన్న గజ్జి  కుక్క,
 ఆకలికి , మింగిన ప్లాస్టిక్ కవరును లోపలికి మింగ లేక ,
పైకి కక్కలేక నానా అవస్తవలు పడుతోంది.!

రోడ్డు చివర కంపు కొడుతున్న  కాలువలో 
పారుతున్న నీటిని,మూడేళ్లు నిండని ముష్టి బాలుడొకడు, దాహం తీర్చుకోడానికి  , మురికి నిండిన ప్లాస్టిక్ కవర్లో కి 
నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.!

 ఇంట్లో నిండిన చెత్తా-చెదారాన్ని 
  బయట పారవేయడానికి , ప్లాస్టిక్ కవర్లు
 కొన్న నేను. ఉసూరు మంటూ ఇంటిదారి పట్టేను.
 
తలుపు తీసిన మా శ్రీమతి చేతిలో ప్లాస్టిక్ చీపురు , 
ముఖం, మండుతున్న ప్లాస్టిక్ లా ఉంది...

వాళ్ళు చేస్తున్న అల్లరికి ,అదే చీపురుతో 
కొట్టినట్లుంది,
ఇంటి మధ్యలో గోలగోలగా అరుస్తూ ప్లాస్టిక్ బొమ్మలు
చిందర వందర చేస్తూ , బే,.అని ఏడుస్తూ పిల్లలు .

ఎదురుగా , గోడకున్న గూటిలో మా ఆవిడ ప్రేమతో చేయించుకున్న , పరలోకమేగిన వాళ్ళ నాన్నగారి ప్లాస్టిక్ విగ్రహం...వింత నవ్వుతో...
 రేపొద్దున్న నీ గతి కూడా ఇంతే ! అన్నట్టుగా...
 
అనుకోకుండా చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ల వైపు చూశాను.
 అవి నన్నే చూస్తూ , ఎన్ని అనర్ధాలు జరిగినా మమ్మల్ని మాత్రం నువ్వు వదల లేవులే అంటూ, నవ్వుతున్నట్లుగా...
 వెక్కిరిస్తున్నట్లుగా...
 
నన్ను ప్రశ్నిస్తున్న నా మనసుకు, సమాధానం ఇయ్యలేక ,
గుడ్లు తేలేశాను .


 
ఈ కవిత నా స్వీయ రచన.



,

జగన్నాథపురి ఆలయ చరిత్ర

తపస్వీ మనోహరి పత్రిక కొరకు ,
విభాగం : దర్శనీయ స్థలాలు , ఆధ్యాత్మిక విశేషాలు.
రచన :  శ్రీమతి :  పుల్లభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
శీర్షిక :    జగన్నాథ పురీ ఆలయ చరిత్ర.

మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి.

ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని,, శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారట. ఈ పట్టణంలో శ్రీ మహా  విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు

ఈ  ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనదే కాక హిందువులు అతి పవిత్రంగా భావించే " చార్ ధాం " పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెపుతారు.

ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి అరవై  కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ఆలయాన్ని ప్రధమంగా ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు.
తదుపరి  శిథిలావస్థకు చేరుకున్న ఈ  ఆలయాన్ని కళింగ పాలుకుడైన అనంత వర్మ చోడగంగాదేవ ప్రారంభించగా , తదుపరి ఆయన మనవడైన రాజా అనంత భీమ్రావు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాడని చెబుతారు.

ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ, నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం.

.అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. 

విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, 
ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపగా అతడు. విశ్వావసుడి కూతురైన లలితను  ప్రేమించి పెళ్ళాడీ , ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతూడంతో అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్లేడట. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడచగా, . కొన్నాళ్లకు అవి మొలకెత్తడంతో, దారి స్పష్టంగా తెలిసిందట., వెంటనే  ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడట్టగా , ఇంద్రద్యుమ్నుడు
ఇప్పటికప్పుడు అడవికి బయలుదేరాడట.
కానీ అక్కడ చేరే సరికి అక్కడ విగ్రహాలు మాయమవడంతో    ఇంద్రద్యుమ్నుడు నిరాశకు గురై  ,  అప్పటికప్పుడు అక్కడే అశ్వమేధ యాగం చేయడమే గాక, , 
నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, అక్కడే నిద్రించేవాడట.
.

ఒక  రోజు   నిద్రిస్తున్న ఇంద్రద్యుమ్నుని   కలలో  జగన్నాథుడు  కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశించాడట.. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాఠపపోవడంతో,.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్ఛి, తానొక్కడే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ,  21 రోజుల వరకు  అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధించాడట. 
 రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాకపోవడంతో ,.  రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపించాడట..
షరతు తప్పిన రాజుకు అక్కడ శిల్పి కనిపించలేదు కానీ ,
చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిచ్ఛేయట. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థించగా , చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిచ్ఛి. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడట. 
అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి.దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి ,నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు .దీనిని నవ కళేబరోత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది ఈ జగన్నాథ రథయాత్ర.
" జగన్నాధ రధ యాత్ర " గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో  అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి ఒక రహస్యమే. అందుకే పూరీ జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు. ఇంతకీ పూరీ జగన్నాథ్ ఆలయంలో ఉన్న అంతు పట్టని రహస్యాలేంటో ఓసారి తెలుసుకొందామా !

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న 65 అడుగుల ఎత్తయిన పిరమిడ్ నిర్మాణం. అక్కడ ఉండే స్తంభాలు, గోడలు.. అన్నీ ప్రత్యేకతతో కూడుకున్నవే.


పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి

ఈ ఆలయ గోపురం పైన ఉండే  ఈ జెండాలకు ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే.. గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఎగురుతుంది. కానీ.. ఇక్కడి జెండా మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా.. వ్యతిరేక దిశలో  ఎగురుతుంది.
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు.

చాలా ఎత్తుగా ఉండే పూరీ జగన్నాథ్ ఆలయం  గోపురం పైన   20 టన్నుల బరువు గల సుదర్శన చక్రం ఉంటుంది.  . ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

సాధారణంగా అన్ని చోట్ల  గాలి సముద్రం నుంచి భూమి వైపునకు  వీస్తుంది. సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ.. పూరీలో మాత్రం  అందుకు విరుద్ధంగా విభిన్నంగా గాలి వీస్తుంది.

జగన్నాథ ఆలయం పైన పక్షులు కూడా ఎగరవు.  " ఎందుకు ఎగరవు.." అనే విషయం మాత్రం, ఎవ్వరికీ అంతు పట్టడం లేదు.  దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.

జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలు అయినా.. సాయంత్రం అయినా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. అంత అద్భుతమైన నిర్మాణమా , లేక దేవుడి మహిమా...?   అన్నది మాత్రం అంతు చిక్కడం లేదంటారు..
సింహద్వారం నుంచి ఆలయంలోకి  ఒక్క అడుగు  లోపలికి పెట్టగానే.. సముద్రంలో నుంచి వచ్చే  అలల శబ్దం వినిపించదు. కానీ.. అడుగు బయటపెట్టగానే అలల శబ్దం   హోరు మని  వినిపిస్తుందట.

ఇకపోతే పూరీ జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది  రథయాత్ర. ఈ రథ యాత్రలో రెండు రథాలనుపయోగిస్తారు. 
 మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకెళ్తుంది. అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతారు. అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజా ఆలయానికి తీసుకెళతారు.

పూరీ వీధుల్లో శ్రీకృష్ణుడు, బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు. ఆ రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి.
రథ యాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.
ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు.

ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో విశిష్టత ఏంటంటే.. గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే.. రథం తనంతట తానే ఆగిపోతుందట.. దాన్ని ఎవ్వరూ ఆపరు. ఇది కూడా ఇప్పటికీ ఒక మిస్టరీలాగానే ఉండిపోయింది.
 
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది. ఆలయ సంప్రదాయం ప్రకారం.. వాటిని మట్టి కుండల్లో వండుతారు. దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన కానీ, రుచి కానీ ఉండదు . కానీ.. దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలన్నీ ఘుమఘుమలాడుతూ, ఎంతో మధురంగా ఉంటాయి .
విచిత్రం ఏమిటంటే
ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో  ఆలయంలో.   ప్రసాదాన్ని తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం,  ఎంతమంది భక్తులు వచ్ఛినా సరిపోయే విధంగా సమకూరడం  ఆశ్చర్యకరమైన విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

పూరీ జగన్నాథ్ ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృథా చేయరట .

, ఇన్ని అద్భుతాలు నిండిన ఈ పవిత్ర పూరీ క్షేత్రాన్ని దర్శించేందుకు
దేశంలోని ప్రధాన నగరాల నుంచి పూరీకి రైలు సర్వీసులు నడుస్తున్నాయి.

భువనేశ్వర్‌, కోల్‌కతా, విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యముంది.

కోల్‌కతా-చెన్నై ప్రధాన రైలుమార్గంలోని ఖుర్ధారోడ్‌ రైల్వేస్టేషన్‌ ఇక్కడ నుంచి 44 కి.మీ. దూరంలో ఉంది.


గూగుల్ సేకరణ.

పూర్తి ప్రదాతలు.

21 /06 /2023.
తపస్వీ  మనోహరం పత్రిక కొరకు ,
 అంశం : స్ఫూర్తి ప్రదాత. 

రచన :  శ్రీమతి :  పులాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్  : మహారాష్ట్ర .

మనం పుట్టిన దగ్గరనుంచి ఎవరో ఒకరి స్ఫూర్తితోనే మన
ఎదుగుదల ప్రారంభం అవుతుంది .
మాట్లాడడానికి స్ఫూర్తి అమ్మ  అయితే ,  ప్రపంచంలో ముందడుగు వేయడానికి స్ఫూర్తి నాన్న ,
అక్షర  జ్ఞానానికి స్ఫూర్తి గురువైతే , మన ఆదర్శాలకు స్ఫూర్తి నాటి సభ్యత , సంస్కారాలు.

ఐతే పెరుగుతున్న మనలో అంతర్లీనంగా దాగి ఉన్న కొన్ని కళలకు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం ,గీతం, ఆటలు ఇలాంటి కళలకు మాత్రం , కొంతమంది  మాత్రమే మనకు స్ఫూర్తిదాయకులౌతారు.

ఇక ,నా విషయానికొస్తే,నాకు పాటలు  అంటే మహా పిచ్చి .
40 ఏళ్ల క్రితం రేడియో తప్ప ,పాటలు వినడానికి మరో   సాధన సదుపాయం ఉండేది కాదు.
నేను 24 గంటలు రేడియోలో పాటలు వింటూ అవే పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆనందపడుతూ ఉండేదాన్ని.

అయితే మా ఇంట్లో ఎప్పుడూ  పొద్దున్న సాయంత్రం కూడా సంగీత సాధన జరుగుతుండేది కారణం , మా అమ్మమ్మ గారు, మా అమ్మ
గారు, మా పిన్నమ్మ గారు ,మా పెద్దమ్మ గారు, వీళ్ళందరూ కూడా సంగీతంలో డిప్లమోలు చేసి,  టీచర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పిల్లలకి  , తెల్లారి నాలుగు  గంటల నుంచి ఆరు గంటల వరకు, సాయంత్రం కూడా అదే సమయంలోనే ట్యూషన్లు చెప్తూ ,ఉండేవారు  .  చాలా మంది పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటుటూ , సంగీత సాధన చేస్తూ ఉండేవారు .
ఆ సమయంలో నాకు, పడుకోవడానికి గానీ, రేడియో వేసుకోవడానికి గానీ వీలుండేది కాదు.
 
మా అమ్మగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు వాళ్లతో పాటు కూర్చొని సంగీతం నేర్చుకో అమ్మా . ఇది చక్కగా అందరూ ఆదరించే విద్య అని .
 వినేదాన్ని కాదు. సరి కదా సినిమా పాటలు మీదే నా ధ్యాస ఉంటుండేది


రాను రాను మరో దారి లేక,  ఆ పిల్లలతో పాటు కూర్చుని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని  . మా అమ్మగారు, పిల్లలకి సంగీతంలో మెళకువలు అన్నీ నేర్పుతూ ,   వాటితో పాటు, శృతి, లయ, రాగలాపన ,స్వర కల్పన, లాంటి వెన్నో మెళకువలు చెప్తూ ఉండేవారు  
కొన్నాళ్లు పోయేసరికి,  చిత్రంగా నాకు సంగీత మీద ఆశక్తి పెరిగి సినిమా పాటలు మీద ఆశక్తి తగ్గింది.
సంగీతంలో నేర్పుతూన్న మెళకువలన్నీ ప్రశ్నల రూపంలో మా అమ్మగారు అడిగేసరికి , "ఆ పిల్లలకన్నా ముందుగా నేనే జవాబు చెప్పాలి" అన్న పట్టుదల ఎక్కువ అయ్యేది.
ఆ విధంగా సంగీతం నేర్చుకున్నాను  . దానికి స్ఫూర్తినిచ్చిన వారు మా అమ్మగారు, ఆ పిల్లలే కదా..!

ఇక సాహిత్య విషయానికొస్తే, ఆ కాలంలో టెన్త్ పాస్ అయ్యేసరికి పెళ్లిళ్లు చేసేసేవారు. నాకూ అదే జరిగింది అయితే మెట్టినింఇంటికి వచ్చిన తర్వాత ,మా అత్తయ్య గారికి నాకన్నా ఎక్కువ పాటలు  , భజనలు ,సంగీతమే కాక సాహిత్య పరంగా కూడా చాలా అభిరుచి ,ఆశక్తి ,ఉండేది.
అంతేకాక ఆవిడ 500 వరకు హరికథలు చెప్పి, "హరికథా శిరోమణిగా " పేరు తెచ్చుకున్నారు. పురాణ ప్రవచనాలు చెప్పడం ,భజనలు చేయడం , స్వయంగా రాసిన భజన పాటలను ,ఆవిడకు వచ్చిన రాగాల్లో పెట్టి పాడుతూ, అందరి చేత పాడించడం చేస్తూ ఉండేవారు,.
దాంతో నేను కూడా ,నాకు వచ్చిన  రాగాల్లో, చిన్న చిన్న  భజన పాటలు రాస్తూ, రాగాల్లో పెడుతూ పాడడం మొదలెట్టేను.
దాంతో నాకు సాహిత్యంలో కాస్త పట్టు దొరికింది . పాటలు రాయడం రాగాల్లో పెట్టడం ,    స్వర కల్పన చేయడం కూడా నేర్చుకున్నాను.
ఈ విధంగా మా అత్తయ్య గారే నాకు సాహిత్య స్ఫూర్తి.
అయితే నేను రాస్తున్న పాటలను, స్వరకల్పనను మొట్టమొదటిగా గమనించింది ,   స్వర్గస్తులైన గౌరవనీయులు "శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్" గారు.
వారు నాచే ,నేను రచించిన లలిత సంగీతం పాటలను నలుగురులో ప్రదర్శింప జేసి , నన్ను పాటల రచయితగా స్వరకర్తగా ప్రోత్సహించారు .
.
 తదుపరి గురువుగారు గౌరవనీయులు ఐన " శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు "
వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో  పాటలు రాసి , 
స్వరపరచేను  . గురువుగారైన "షణ్ముఖ శర్మ "గారు రాసిన శివ పదం లో 16 కీర్తనలను , నాచే కంపోజ్ చేయించి  వాటిని  రెండు సి.డి.లుగా విభజించి , ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించడం కూడా జరిగింది.   ఈ విధంగా
 వీరిరువురురూ ,నా స్వర రచనకు స్ఫూర్తి. కారకులయ్యారు .

ఇక నేను రాస్తున్న కథలకు, కవనాలకు, నన్ను ప్రోత్సహపరిచి ,  నన్ను ముందుకు నడిపించినది 
గౌరవనీయులు "శ్రీ సంగివేని రవి "గారు.

కొత్త కొత్త ప్రక్రియలకు , గౌరవనీయులు" శ్రీ అడిగొప్పుల సదయ్య "గారి ద్వారా ప్రేరణను పొందాను.

ఈ విధంగా మనల్ని  ప్రోత్సహించేందుకు, వారు మనకి ఇచ్చే ప్రశంసా పత్రాలకై ,వారు పడుతున్న శ్రమ అత్యధికం.

ఇలా చెప్పుకుంటూ పోతే ,చాలా మంది మన వెనుక నిలబడి, మనకు సహాయ ,సహకార, ప్రోత్సాహాలు అందించడం వలన- మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు మనం కవులుగా , రచయితలుగా  , గాయకులుగా  గుర్తించబడుతున్నాము అంటే ,వీరందరూ  మనకిచ్చిన చేయూత, ప్రోత్సాహమే  కారణమని నమ్ముతున్నాను.

ఇలా గౌరవనీయులైన వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన""తపస్వీ మనోహరం" సంస్థ_- సభ్యులకు ,  నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

రచయిత్రి : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

🙏🙏🙏🙏🙏
,--------------------------------
,

శీర్షిక ఆరోగ్యం ఆహారం.

23/06/2023.

తపస్వీ మనోహరం  పత్రికల కొరకు ,
అంశం: ఆరోగ్యం :ఆహారం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది పెద్దలు చెప్పిన మాట.
ప్రస్తుత కాలంలో మనమందరం, కాలం మారింది ,కాలం మారింది ,అంటూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం.

ఒకప్పుడు పిల్లా, పెద్ధా ,అందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచేవారు. 

పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేవారు తర్వాతముంగిట్లో ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గులు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి , మడి బట్ట కట్టుకొని, దేవుని దగ్గర నిత్య పూజలు చేసేవారు. సూర్యోదయంతో పాటుగా ఇంట్లో , దేవుని మండపం దగ్గర కళకళ మంటూ దీపాలు వెలుగుతూ ఉండేవి .ధూప దీప నైవేద్యాలతో మధురమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉండేది. 

పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి, తదుపరి చద్దన్నం తినడం, తర్వాత స్కూలుకు వెళ్లి రావడం, హోంవర్కులు చేసుకోవడం ,సాయంత్రం పూట ఆడుకోవడం, 7-7:30 కల్లా పడుకోవడం దినచర్యంగా ఉండేది.

అల్పాహారానికి గాని, భోజనానికి కానీ, ఒక నిర్దిష్టమైన సమయపాలన జరుగుతూ ఉండేది .
సాయంత్రం 6 గంటలకి  పిల్లలు సూచిగా బట్టలు మార్చుకొని
దైవ ప్రార్థన చేసుకుంటుంటే పెద్దలు
 తిరిగి దేవుని దగ్గర దీపారాధన చేసేవారు .
 తదుపరి రాత్రి భోజన కార్యక్రమాలు అయిపోగానే 7:30 కి నిద్రకు ఉపక్రమించేవారు.
 పగటిపూట ఎవరూ కూడా నిద్రపోయేవారుకాదు .
 కట్టుబొట్టు, మాట తీరుతో, ఆడవారు చాలా సంస్కారంగా ఉండేవారు.
 ఆ కాలంలో ఇంటి భోజనం తప్ప బయట ఎక్కడా
  ఇలాగ బయట కొనుక్కుని తినడాలు కూడా ఎవరికి తెలియదు. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవారు ఆడవాళ్లు.

కానీ రాను రాను ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యే పూర్తిగా మారిపోయింది .  గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వంటి సదుపాయాలు రావడంతో ఆడవారికి పని తగ్గి ,బద్ధకం ఎక్కువైంది .టీవీలు , మొబైల్స్ . 
వాడకం ఎక్కువయ్యి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడంతో ఇంట్లో వంట చేయడం  కూడా తగ్గిపోయింది.
పానీ పూరీలు, పిజ్జా ,బర్గర్లు, ఐస్ క్రీములు, వంటి వాటికి పిల్లలు పెద్దలు కూడా అలవాటు పడ్డారు
వీటి కారణంగా ఇంట్లో వంటలు వండడం తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడంతో బయట ఫుడ్స్ తెప్పించుకోవడం , ఆన్లైన్ ఆర్డర్స్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం  ఆన్లైన్ నుండి  కూడా ఆర్డర్ చేసుకుని తినడం మొదలవ్వడంతో ,ప్రతి ఒక్కరికి పని తగ్గిపోవడం , ఒంట్లో కొవ్వు ,అజీర్తి, పెరిగి చికాకులు ఎక్కువయ్యాయి . టీవీ పెట్టుకుని 24 గంటలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం చేస్తూ, రాత్రి  12, ఒంటిగంట వరకు మేలుకోవటంతో ,పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయింది.
ఇప్పటి కాలంలో ఎవరూ సూర్యోదయం చూసిన దాఖలాలే లేవు.
ఈ రకమైన జీవితానికి అలవాటు పడి, మన శరీరం మన ఆధీనంలో లేనందు వల్ల,  ఎన్నో రోగాలకు  మన శరీరం ఆశ్రయమయ్యింది.

పిల్లలు రెండు మూడేళ్ళు రాకుండానే  రోగగ్రస్తులవుతున్నారు. 15 ఏళ్ల దగ్గరుండి ఊబకాయం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులతో అందరూ రోగగ్రస్తులై ,ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ రకమైన  అనారోగ్య ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, ప్రస్తుతం యూట్యూబ్లో వస్తున్న ప్రతీ  చిట్కాల్ని నమ్ముతూ , అన్నిటినీ ఆచరిస్తూ,   అటుకి, ఇటుకి కాకుండా   నానా ఇబ్బందులు పడుతున్నారు.
మన అలవాట్లు మార్చుకోనంతవరకు, మనం ఎన్ని మందులు వాడినా ,ఏ చిట్కాలు వాడినా వాటి ప్రయోజనం ఉండదు. మనం అన్ని వాడతాం, కానీ ఒక పద్ధతిలో మన దిన చర్య ఉండదు .భోజనానికి, టిఫిన్లకి ,నిద్రకి ,సమయపాలన ఉండదు.
మనని చూసి మన పిల్లలు కూడా అదే  విధంగా ప్రవర్తించడంతో ఇంటిల్లపాది రోగగ్రస్తులై, మానసింగా  శారీరకంగా కూడా  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు .
ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన చిట్కాలు అన్నీ మన పూర్వీకుల ఆచరించినవే . అవన్నీ మధ్యలో  "  పాత చింతకాయ పచ్చడి "అంటూ మనం వదిలేసి ,తిరిగి అవే చిట్కాలను యూట్యూబ్లో చూసుకుని అమలు చేస్తున్నాం .

ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి .మన అలవాట్లు మార్చుకుంటే ,మన ఆనందం ,మన ఆరోగ్యం- మనతోనే ఉంటాయి అన్నది నా ఉద్దేశం .

మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన మాటలు-
సమయపాలన పాటించండి .ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఈ చిన్ని వ్యాసం నా స్వీయ రచన.

                               -    శుభం -
                               -    ******

శీర్షిక : కళ్యాణి. ( చిత్రకథ)

*30/06/2023.
*తపస్వి మనోహరం కొరకు.
*అంశం : చిత్రకధ.

శీర్షిక :  కళ్యాణి.

*రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


కళ్యాణి స్కూల్ గేట్ దాటి బయటకు వచ్చింది. 
రోజులాగే రోడ్డు చివరి వరకు చూసింది .అమ్మ వస్తున్న జాడలేదు. 
అమ్మ రోజు ఇంతే. ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది.
 తన తోటి పిల్లలంతా ఇళ్లకు చేరుకుని , హాయిగా ఆడుకోడానికి వెళ్ళిపోయి ఉంటారు. తను ఒక్కతే ఇక్కడ, ఈ స్కూల్ గేటు పక్కన బెంచి మీద కూర్చుని అమ్మకోసం చూస్తూ ఉంటుంది. 
ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఇంచుమించు ఇళ్లకు వెళ్లిపోయారు. స్కూల్ వాచింగ్ అని కూడా ఒక అరగంట సేపు వెయిట్ చేసి స్కూల్ గేటుకు తాళం పెట్టి ,ఇంటికి వెళ్ళిపోతాడు.
అప్పుడైతే తనకు చాలా భయం వేస్తుంది .ఎందుకంటే తను ఆ స్కూల్ అంతటికీ  తను ఒక్కతే ఉంటుంది.
ఈ మధ్యన అయితే పది రోజులు బట్టి, ఒక అంకుల్ తనవైపు అదోలా చూస్తూ ,ఆ రోడ్డు చివరన నిల్చుని కనిపిస్తున్నాడు.
మొదట్లో అతను , వాళ్ళ పాపనో బాబునో తీసుకెళ్లడానికి అలా వెయిట్ చేస్తున్నాడేమో అనుకుంది.
కానీ అతను పిల్లలంతా వెళ్లిపోయిన తర్వాత కూడా అలా 
నిల్చుని చూస్తూనే ఉంటున్నాడు.
ఈరోజు కూడా అతను అక్కడే ఉన్నాడు

 కళ్యాణి వాళ్ళ అమ్మ ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాది.
 కళ్యాణి వాళ్ల నాన్నగారు, కళ్యాణికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయారు.
 అప్పటినుంచి కళ్యాణి వాళ్ళ అమ్మ ,కళ్యాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ , తామిద్దరి భారం ఎవరి మీద పడకుండా ఉండడం కోసం  , 
 ఒక చిన్న ఆఫీసులో ఉద్యోగంలో జాయిన్ అయింది.
 ఆఫీస్ ఒకవైపు, స్కూలు ఒకవైపు ,కావడంతో ఆమె వచ్చేసరికి ప్రతిరోజు లేట్ అవుతూనే ఉంటుంది.
 కళ్యాణి వాళ్ళమ్మ కళ్యాణిని ఎవరితోనో కలిసి ఇంటికి వెళ్ళొద్దని, తాను వచ్చేదాకా స్కూలు దగ్గరే వెయిట్ చేయమని రోజు చెప్తూ ఉంటుంది.
 తనకైతే చాలా ఆకలి వేస్తూ ఉంటుంది.
 అక్కడ ఒంటరిగా కూర్చోవడానికి కూడా భయంగా  ఉంటుంది. అప్పుడు తనకు అమ్మ మీద చాలా కోపం వస్తుంది.
 ఇప్పుడైతే శీతాకాలమేమో!  సాయంత్రం అయ్యేసరికి చలి కూడా వేస్తూ ఉంటుంది. 
 కానీ అమ్మ రాగానే తన కోపం అంతా కరిగిపోతుంది
 ఎందుకంటే అమ్మ రాగానే తనను దగ్గరికి తీసుకుని,"  అయ్యో అందరూ వెళ్లిపోయారా ? ఎంతసేపటి నుండి కూర్చున్నావమమ్మా   , భయమేసిందా ? ఆకలేస్తుందా .".. అంటూ తనను  దగ్గరికి తీసుకుని తనకు బిస్కెట్లు చాక్లెట్లు ఇస్తుంది. 
తర్వాత అమ్మ వచ్చిన ఆటోలోనే తను, అమ్మ ,ఇంటికి బయలుదేరుతారు.
ఇలా  ఆరేళ్ల బట్టి జరుగుతూనే ఉంది.
ఇప్పుడు తను ఏడవ క్లాస్ కి వచ్చింది.
అంతకు ముందు తనకు భయం అన్నది తెలియదు.
కానీ తను పెద్ద అవుతున్న కొద్ది మనసులో భయం చోటు చేసుకుంటున్నాది.
చాలా పుస్తకాల్లో చదివింది .చాలా చోట్ల విన్నాది కూడా.
 ఇలా ఒంటరిగా ఉన్న ఆడపిల్లల్ని కొందరు మగ వాళ్ళు ఏదో ఒకలా వలవేసి పట్టుకుని తీసుకుపోతారని, విదేశాలకు అమ్మేస్తారని ,వాళ్ళని పనివాళ్ళుగా ,బిచ్చగాళ్లుగా, మార్చేస్తారని ఇలా ఏదేదో  విన్నాది.
 అమ్మ కూడా చెప్పింది ఎవరు నీ దగ్గరికి వచ్చినా వాళ్ళతో మాట్లాడొద్దని ,వాళ్ళు ఏమిచ్చినా తీసుకోవద్దని, వాళ్ళతో ఎక్కడికి వెళ్ళొద్దని.
 అమ్మ కూడా అలా చెప్పేసరికి తనలో భయం ఇంకాస్త ఎక్కువైంది.
 
 కానీ ఎన్నాళ్ళు ఇలా ? తనొక్కర్తి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా... తనకు ఇల్లు తెలుసు .నడుచుకుని కూడా వెళ్లిపోగలదు ఇంటికి తాళం ఉంటుంది. కానీ ఇక్కడే కూర్చునే బదులు, తను ఇంటి దగ్గరే కూర్చుంటుందిగా ...కనీసం ఇరుగుపొరుగులతో ఆడుకోవడం కుదురుతుంది కదా. 
 ఈమధ్య ఎన్ని రోజులైందో.. తను తన స్నేహితులతో కలిసి ఆడుకుని .
 కళ్యాణి ఇలా ఆలోచిస్తుండగానే , ఎన్నో రోజుల నుంచి ఇటే చూస్తున్న ఆ అంకుల్ ,కళ్యాణవైపు రాసాగాడు.
 కళ్యాణి లో భయం ఎక్కువయింది.
 అతను వచ్చి అటూ ఇటూ చూసి మెల్లగా కళ్యాణి పక్కన కూర్చున్నాడు.
 ఏం పాపా! "ఈరోజు ఇంకా మీ అమ్మ రాలేదా" అంటూ మాటలు కలిపాడు.
 కళ్యాణికి చాలా భయం వేసింది కానీ అతను మెల్లగా నవ్వుతూ భయపడకు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను.
 ఇక్కడే పక్క షాపులో పనిచేస్తూ ఉంటాను . రోజు మీ అమ్మ వచ్చేవరకు నువ్వు ఒక్కతే కూర్చుంటావని గమనించాను. అందుకే మీ అమ్మ వచ్చేదాకా నీకోసమే నేను అక్కడ అలా నిల్చుని ఉంటాను .ఎందుకంటే ఒక్కతే ఉంటావు కదా, ఎవరైనా వచ్చి నిన్ను అల్లరి పెడతారేమోనని, అసలే రోజులు బాగా లేవు.
ఎంతైనా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటాను కదా. నువ్వా చిన్న పిల్లవి .అందుకే  , మీ అమ్మ రాగానే నేను వెళ్ళిపోతాను.
ఈరోజు మీ అమ్మ రావడం రోజు కన్నా, 
ఆలస్యమవుతున్నట్టుంది....
పరవాలేదు నేను అంత దాకా నీ దగ్గరే ఉంటాను లే...
ఇదిగో నీకు ఆకలేస్తుందేమో! ఈ చాక్లెట్లు తిను అంటూ అంటూ కొన్ని చాక్లెట్లు ఇచ్చాడు.
కల్యానికి అతను చెప్పింది అంతా వింటూ ఉంటే నిజమేమో , అనిపించింది. కానీ కొంతసేపటికి , "ఇతన్ని మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడా , ఎప్పుడూ నేను చూడలేదే...
ఇతను అబద్ధాలు చెప్తున్నాడు "
ఇతని మాటలు నేను నమ్మకూడదు అనుకుంది.
అతను కొంతసేపు తర్వాత,  పాపా చలి వేస్తుందా.. అంటూ అతను తొడుక్కున్న కోటు తీసి,  తన మీద కప్పబోయాడు .
కళ్యాణి ఒక్కసారి విసురుగా లేచింది.
వద్ద అంకుల్ నాకేం చలివేయడం లేదు . ఆకలి కూడా వేయడం లేదు. మా అమ్మ నాకు బాక్స్ లో టిఫిన్ కట్టి ఇస్తుంది. నాకు మా అమ్మ మొబైల్ కొనిచ్చింది తను రావడం ఆలస్యం అయితే ఫోన్ చేయమంది ఇప్పుడే ఫోన్ చేశాను కాసేపట్లో మా మామయ్య నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు.
పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో మా మామయ్య పోలీసుగా పనిచేస్తున్నాడు . రేపటినుండి నేను ఒక్కర్తినీ కూర్చున్నా నాకు భయం ఉండదు. ఎందుకంటే మా మామయ్య పక్క రోడ్డు పోలీస్ స్టేషన్లో  పనిచేస్తున్నాడు కనుక , నేను ఫోన్ చేయగానే వచ్చేస్తాడు కనుక. మావయ్య రాగానే నేను మా ఇంటికి వెళ్లి పోతాను.
అని కళ్యాణి ధైర్యంగా చెప్పింది. నిజానికి కళ్యాణికి వాళ్ళమ్మ మొబైల్ కొనిచ్చింది లేదు వాళ్ళ మామయ్య పక్క రోడ్డులో పోలీస్ స్టేషన్లో పని చేసేది లేదు .
కానీ కళ్యాణ్ ఎలా చెప్పగానే అతను సరేనమ్మా . నేను వెళ్లి వస్తాను అంటూ  గబగబా ఎటు వెళ్లిపోయాడో కూడా తెలియకుండా వెళ్లిపోయాడు.
కళ్యాణి హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.
ఇంతలో వాళ్ళ అమ్మ వస్తూ కనిపించింది.
కళ్యాణి ఆనందంగా పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది.
అమ్మడు కళ్యాణి ఈ ఉదంతం అంతా స్కూల్లో మాస్టర్లకు చెప్పింది.
దాంతో స్కూలు యాజమాన్యం అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు.
కొన్ని నెలల తర్వాత .....
ఆ స్కూల్లో ఇప్పుడు, తల్లిదండ్రులు ఆలస్యంగా వస్తున్న పిల్లలకోసం, ఒక లైబ్రరీ స్టార్ట్ అయింది. అక్కడ బోలెడు పుస్తకాలు ఉన్నాయి చదువుకోడానికి .

అంతేకాదు చిన్న రూంలో. ఇంటర్నల్ గేమ్స్ , కూడా ఏర్పాటు చేశారు .అందులో కావాల్సినప్పుడు పిల్లలు అష్టాచమ్మా , 
చదరంగం, టేబుల్ టెన్నిస్, వంటి ఆటలు కూడా ఆడుకోవచ్చు. 
ఈ రకమైన మార్పుకి  కారణమైన కళ్యాణిని , పిల్లల తల్లితండ్రులందరూ అభినందిస్తుంటే ,కళ్యాణి వాళ్ళ అమ్మకి చాలా గర్వంగా ఉంది.

అప్పుడు హెడ్మాస్టర్ గారు పిల్లలతో..
చూశారా పిల్లలూ! కళ్యాణి  ధైర్యంగా  చేసిన చిన్న పని వల్ల ఈరోజు  పిల్లలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో..
"మీరు కూడా కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు, కళ్యాణి లాగే ధైర్యంగా, యుక్తితో మిమ్మల్ని మీరు రక్షించుకోండి.
 ఈ కాలంలో ఇది చాలా అవసరం" అంటూంటే,
  టీచర్లంతా చప్పట్లు కొట్టారు.

**************"""*"