Sunday, May 25, 2025

అంశం : అణుబాంబు: ఒక సామాజిక ఆర్తనాదాం.

అంశం : అణుబాంబు: 

శీర్షిక : ఒక సామాజిక ఆర్తనాదాం.


రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. (38).

వచన కవిత : సంఖ్య.. 3 



ఎదలో రగిలే అగ్ని కీల,

మానవత్వపు గుండెకోతల జ్వాల.

అణుబాంబు, పేరులోనే ఒక శూన్యం,

భవిష్యత్తుకిది భయంకర సంకేతం.!!.


క్షణంలో  కాలాన్ని కరిగించి

వేల ప్రాణాల భస్మరాశిని పెంచి

భూమి గుండె బీటల్లో మిగిల్చి

మానవ బంధాల్లో చీలికలు నింపేది.!!


పట్టపగలే  చీకటి కమ్మినా,

ఆకాశం  ఎర్రగా మారినా

నిశ్శబ్దం నిక్కి నిక్కి దాగినా

వినిపిస్తున్న ఒక విషాద గీతం !!


పిల్లల నవ్వులు ఆవిరై,

తల్లుల కన్నీరు బూడిదై

ఆశలు సన్నగిల్లిన ఆక్రోశాలతో,

ఒక తరం అంతమైపోతోంది.!!


శక్తి పేరిట విధ్వంసపు ముళ్ళు

జ్ఞానం పేరిట అజ్ఞానపు రాళ్లు

అభివృద్ధి పేరిట వినాశనపు వేళ్లు,

 సృష్టికలో పాకుతున్న శాంతి లేని బీజాలు.!!


అణుబాంబు సృష్టించిన నరకం.

తరతరాలకీ మానని గాయాల కూపం.

గుండెల్లో రగిలే దుఃఖం,

ఆరని మంటల్లో చితులు నిండిన శాపం !!


శాంతిని కోరే హృదయాల వేదన

యుద్ధం వద్దు అన్న  ఆక్రోశాల ప్రార్థన

అణు విస్ఫోటనం ఆపాలన్న తపన

ఆర్తి నిండిన గొంతుల్లో ఉద్వేగపు నిరీక్షణ !!

అణుబాంబు కేవలం ఒక ఆయుధం కాదు,

మానవ సమాజానికి ఓ కనువిప్పు,

ఎవరి స్వార్థం కోసమూ దాగని నిజం,

శాంతి స్థాపనకై పోరాడాలి ఈ సమాజం.!!


అందరూ ఒక్కటై నిలబడి యోచించి

అహింసా మార్గాన్ని అనుసరించి,

అణుయుద్ధ భయాన్ని తొలగిద్దాం,

శాంతియుత ప్రపంచాన్ని నిర్మిద్దాం.!!


భవిష్యత్ తరాలకు బతుకు బాట వేద్దాం.

మన వారసత్వాలకు మానవత్వం నేర్పిద్దాం.

విశ్వ కళ్యాణం కోసం  విధ్వంసాల నాపేద్దాం

 అందరం ఒక్కటై ఆనంద గీతం పాడేద్దాం. !!. 

---------------------------------


ఈ కవిత,  నా స్వీయ రచన.





శీర్షిక : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

శీర్షిక  : వెలుగు పూల తోట.(పాజిటివ్ థింకింగ్ .)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. 



మనసు వాకిట మెరిసే వెన్నెల కిరణం,

ప్రతి అణువులోనూ ఆశల నవగానం.

నైరాశ్యపు చీకటి కమ్మిన వేళలో,

అంతరంగంలో మెరిసే వెలుగు పూదోట.!!

(పాజిటివ్ థింకింగ్ .)


ఉదయ, సంధ్యా కిరణంలా,

ప్రతి ఆలోచనా నవజీవనం.

గతపు గాయాలెన్ని ఉన్నా,

రేపటి "పై చిరునవ్వుల "సంతకం.!!

(పాజిటివ్ థింకింగ్ .)


సంద్ర గర్భాన దాగిన ముత్యంలా,

సవాళ్ళ లోతుల చిరు నవ్వులు.

ఎగిసే కెరటాల కల్లోలంలో,

స్థైర్యపు తీరం చేర్చే నావ !!

(పాజిటివ్ థింకింగ్ .)



పూచే గులాబీ సువాసనలా,

ప్రతి శ్వాసలోనూ ప్రశాంతత.

ముళ్ళబాటలో నడుస్తున్నా,

మధురానుభూతిని పంచే వరం !!

(పాజిటివ్ థింకింగ్ .)


జీవితం ఒక అద్భుత చిత్రం.

ప్రతి అడుగూ ఒక నృత్యం,

సానుకూల దృక్పథంతో చూడు,

ప్రతి క్షణం ఒక మధుర గీతం.!!

-----------------------

ఈ కవిత నా స్వీయ రచన

శీర్షిక : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

శీర్షిక  : ఆంతరంగిక ఘోష. (.అసలైన కవి)

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర. ( 38).


--------------------


అక్షరాల వేదికపై, ఆలోచనల స్ఫూర్తితో,

సత్య దీపాలు వెలిగించేవాడే కవి.

లోకానికి అద్దం పట్టే, నిజాలను

 నిర్భయంగా చాటి చెప్పేవాడే కవి.!!


కాగిత రణరంగంపై, కలాన్ని ఖడ్గంగా మార్చి,

అన్యాయంపై పోరాడే  అక్షర వీరుడే కవి.

కష్టాల కడలిలో, కన్నీటి అలలపై,

ఆశల తీరం చూపే నావికుడు కవి.!!


భయమన్నది లేక, పక్షపాతమన్నది ఎరుగక,

పలుకుబడికి తలొగ్గని ప్రవక్తే కవి.

మానవత్వం మంటగలిసినప్పుడు,

మనసున్న మనిషిలా మేల్కొనేవాడే కవి.!!


అంధకారం ఆవరించిన వేళ,

వెలుగు కిరణం చూపించే ధైర్యమే కవి.

నిజాన్ని నిగ్గదీసి, నిర్భయంగా నిలదీసి,

నిత్య సత్యాన్ని నిలబెట్టేవాడే కవి.!!


అక్షరాల ఆయుధాన్ని  ఝళిపిస్తూ

విభేధాలను సృష్టించే వారిని ప్రశ్నిస్తూ

మానవత్వానికి  మన్నననిస్తూ

మనుగడని ప్రశ్నించేవాడే కవి. !!.


నోళ్ళు మూగబోయిన చోట,

వారధిగా నిలిచే వాగ్ధాటి కవి.

అణగారిన గొంతులకి స్వరమై,

 పోరాడే అక్షర నినాదమే కవి.!!


భయం తెలియని

 భావనా సాగరం కవిత్వం,

పలుకుబడికి తలవంచని 

ప్రళయ ఘోష కవిత్వం.!!


నివురు గప్పిన నిజాలకు ,

అతని కవిత్వం ఒక కరదీపిక,

అది సమాజానికి  అవ్వాలి

దారి చూపే సరికొత్త మార్గదర్శిక.!!

-----------------------




Wednesday, May 21, 2025

శీర్షిక : ముల్లోక సంచారుడు.

19/05/2025.

(సోమవారం)

మహతీ సాహితీ కవి సంగమం

అంశం :  (చిత్ర కవిత. 105.)

వచన కవిత .

శీర్షిక : ముల్లోక సంచారుడు.


రచన , శ్రీమతి , పుల్లభట్ల జగదీశ్వరీమూర్తి . 

కళ్యాణ్ :  మహారాష్ట్ర.



ముల్లోక సంచారి ముని నారదుండు,

మదిని నిరంతర నారాయణ ధ్యానముండు.

లోక కళ్యాణమే అతని నిత్య జీవితము,

అందరిలో వెలుగు నింపు దివ్య తేజము.!!


ముల్లోకముల దారి ముని దివ్య తేజము,

పరికించ లోకముల పయనించు నిత్యము.

కలహ ప్రియుడంచు లోకులు వచియించిన

అంతరంగమున లోక  విలువలవనంతము !!


కయ్యాలు రేపేట్టు కనిపించు క్షణములో,

లోతైన అర్థమే   దాగియుండు నందులో

ఘర్షణలు  ఎన్నైన  శాంతి నిడు భువిలో

లోక కల్యాణమే,  లక్ష్య మాతని మదిలో.!!


అపార్థపు నీడలు కమ్మేటి మనసులకు,

కొత్త  ప్రణాళికల కోరు శాంతిని గూర్చు.

 మహతి మీటుచు నతడు మంచి చేసెడు వాడు

సందేహ చీకట్లు తొలగించు వాడు !!


కలహప్రియుడను పేర కలిగించు న్యాయము !!

నారదుని  చర్యలో నుండు పరమార్థము,

ముల్లోకముల మేలు కోరు మునిశ్రేష్ఠులు.

కేలుమోడ్చీ జేతు నే కోటి వందనములు


Tuesday, May 20, 2025

' పెళ్లి " గేయం.

20/05/2025.


తపస్వీ మనోహరం "e" book పత్రిక కొరకు ,

అంశం : పంచమ వేదం.

శీర్షిక : అమృత నాదం.

రచన :  శ్రీమతి :  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .

కళ్యాణ్ :  మహారాష్ట్ర.




అనాదిగా ప్రవహించే సనాతన ధర్మం,

వేదాల దివ్యనాదం, ఋషుల తపో ఫలం.

శ్రుతులు, స్మృతులు, ఇతిహాసాల మౌన గంభీరత,

మానవాళికి మోక్ష మార్గం చూపిన దివ్య తేజం.!!


ధర్మం, అర్థం, కామం, మోక్షం - నాలుగు తీరాల నది,

వేద నాదం ప్రతి తీరాన అమృత బిందువై ఒదిగింది.

 కాల గమనంలో మరుగున పడిన సత్యం .

పునరుద్ధరించగ వచ్చింది "పంచమ వేదం "!!


వ్యాసుని లేఖినిలో మహా భారతం పురుడు పోసుకోగా,

"భగవద్గీత సారం" విశ్వానికి వెలుగు పంచింది.

రామాయణ,భారత, భాగవతాది, పురాణాల పవిత్ర గానం,

"పంచమ వేదమై", లోకానికి నవ చైతన్యం తెచ్చింది.!!


పంచము వేదం , కేవలం శ్లోకాల సంపుటి కాదు,

ప్రతి హృదయంలో జ్వలించే జ్ఞాన దీపం.

కుల, మత, వర్గ భేదాలు లేని విశ్వ ప్రేమ స్వరూపం.

మానవత్వమే మహోన్నతమని చాటే శాంతి సందేశం.!!


భక్తి, జ్ఞానం, కర్మల - త్రివేణి సంగమం .

పురనేతిహాసాలిడు ఆత్మ సాక్షాత్కారాలకు గమ్యం.

ప్రతి జీవిలోనూ దైవత్వాన్ని దర్శించే దివ్య దృష్టి,

పంచమ వేదం నేర్పే నిత్య జీవన సత్యం.!!


అందుకే ఈ ధర్మం సనాతనం, సజీవం,

యుగయుగాలకూ మార్గదర్శనం.

అంధకారాన్ని చీల్చే జ్ఞాన భాస్కరం,

మానవాళికి నిత్య వసంతం, "పంచమ వేదం".!!