Thursday, December 13, 2012

ఖండయోగమున

ఓం శ్రీ సాయి రాం .
---------------------
భాగేశ్వరి రాగం .
--------------------
పల్లవి:అనుపల్లవి.
--------------------
ఖండ యోగమున ఖండములైనట్టి
తనువు  నీదిగని   నివ్వెరపడితి-న -
ఖండ దివ్యమౌ  మహిమను జూపుచు
ప్రత్యక్షమైతివి   ఈ  లీలలేమీ ....?

మిత్రం :(బృందం )
-------------------
సాయీ సద్గురు సన్నుత చరితా
ఏమని  పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాది సద్గురు
సదమల హృదయా  సాదుస్వరూప || ||

1.చరణం .
-----------
కడుపున  ప్రేగుల  నోటను గ్రక్కీ
నీట కడిగి  నేలెండారబెట్టి
కడు వింత గొలుపుచు తిరిగి దాల్చితివి
ఈ వింత ఏమీ  శ్రీ సాయీశా  ||

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప  ||

2.చరణం .
--------------                          

చెక్క బల్లోకటి గని   శ్రద్ధ నూయల గట్ట
ముక్కలుగ  చేసేవు  ముతక బట్టొకటి
ఒక్క వైపుగ నింటి   చూరు నూయల గట్టి
చక్కగ పరుండేవు    ఆ మర్మమేమీ ..?

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప || ||

3.చరణం .
------------                                  

యోగముచే మా యిడుముల కనుగొని  
యాగముచే  మము కాచేవు శ్రమగొని 
త్యాగము నీ జన్మ మా భాగ్య దాయి
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ, అను
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ ||

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ  సాధు స్వరూప || ||
                                       
                                              || ఖండ ||
----------------------------------------------
-------------------------------------------------  




         ||


















శ్రీ సాయి సుప్రభాతం.

ఓం శ్రీ సాయి రాం . (Sai Suprabhatam)
---------------------

మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా ,
మేలుకొని మమ్ము దయనేలుకొవయ్యా |
మేలుకో | మేలుకో ||

ఉదయభానుని కాంతికిరణమ్ము పొడచూపె ,
నిదురమేల్కొనుమనుచు , అరుణకాంతులు విరిసే ,
హృదయద్వారము తెరచి , భక్తివాకిట నిలచి ,
భజన,కీర్తనలతో నిను సన్నుతించేను || మేలుకో ||

మందభాగ్యను నేను , మంత్ర, తంత్రములెరుగ ,
వందనములేసేతు , భక్తి , భావము పరగ ,
చంద్రవదనా మందహాసమ్ముతో నీవు -
అండనుండీగావు , అన్యమెరుగను బ్రోవ   || మేలుకో ||

పన్నీటిస్నానాల, పాలనభిషేకింప ,
పట్టువస్థ్థ్రములిడగ , భరణాలుతొడగా ,
సద్దుసేయక నీదు వాకిటనునిలిచేను ,
బెట్టుసేయక రాజ-రాజాధి సద్గురూ ....|| మేలుకో ||

తులసి, మరువము చేర్చి ,పూలమాలలు గుచ్చి
శీలసుందరరాయ ,సార చందనమిడగ ,
ఫాలలోచన పొద్దు వేసారి గడపితీ ,
జాలమేలరయింక , ద్వారకామయిజేజ || మేలుకో ||

పాలు, ఫలములు ,తేనె , పరమాన్నములు -
మేలు భక్ష్య, భోజ్యములివిగొ ,తాంబూలమిదిగో ,
ఆరగించవెస్వామి ఆలసింపకయింక ,
నీరజాక్షా నీకు నీరాజనములిడెద .....|| మేలుకో ||

భక్తవరదా నీకు వింజామరమువీచి ,
చక్కనైనాపక్క, వేసి పాదములొత్తి ,
నృత్య, గీతపు సేవ ,సంతోషముగ సేతు ,
పవ్వళింతువు తిరిగి, పంతమిప్పుడు వీడి || మేలుకో ||

ప్రక్రుతి నిండిన పరమాత్మ

ఓం  శ్రీ  సాయి  రాం. 
-----------------------
రాగమాలిక .
---------------
వసంతరాగం .
-----------------
ప్రకృతి  నిండిన  పరమాత్మ నీవని
పరమేశ్వర శ్రీ  సాయీశా ....
సుకృతంబునను  తెలుసుకొనీ ,  నే
ధన్యత నొందితి  జగదీశా ... || ప్రకృతి ||

కానడరాగం .
------------
సక్రమమున ఋతు , పవన ,కాంతులు
భూ , నీళాదులు       పంచ భూతములు
సృష్టి క్రమములు     చావుపుట్టుకలు
సంకల్ప రచనలు      సాదుస్వరూప ..||

అమృతవర్షిణి రాగం .
--------------------
కామ ,క్రోధ ,మద ,   మత్సర్యమ్ములు
పాప,దుఃఖ ,వైరాగ్య  చింతనలు
కర్మానుసారపు       బుద్ధి ,మాంద్యములు
మా కర్మఫలములు   మహి సాయీశా ||

హిందోళ రాగం .
----------------
జ్ఞ్యానము ,దానము ,  ధర్మనిరత  ఘన
యాగము, యోగము, జపము ,తపము
భావము , భక్తియు  ,  ముక్తి , మోక్షములు
మాకిల నీవిచ్చు        కోటి వరములు  ||

సురటిరాగం .
---------------
తల్లియు ,తండ్రియు , దారా,పుత్రులు
స్నేహ ,బాంధవులు , ప్రేమపాశములు
తన-పర భేదపు        తారతమ్యములు
నీ లిఖితములే          నీరజనయన ||

కల్యాణి రాగం.
------------------
అన్నియు నీవే      అంతయు నీవే
అణువు మొదలు  బ్రహ్మాండము నీవే
యాగమునీవే      యోగమునీవే
సాయినాధ  పర:  బ్రహ్మమునీవే ||   ప్రక్రుతి ||
--------------------------------------------
---------------------------------------------+++
























శ్రీ సాయి సద్గురుని

ఓం శ్రీ సాయి రాం .
--------------------
శ్రీ  సాయి  సద్గురుని  శరణంటిర , సాయి
చరణాలు పట్టి  నే  విడనంటిర ,
ద్వారకా మయి చాయ  మనదంటిర , షిరిడీ
ధామమే  మన పుణ్య భూమంటిరా .............|| శ్రీ  ||

మా సాయి మనసులో సమత మమతల విందు
సరి ప్రేమ కురిపించు    సిరులు మెండు ...
జాతి ,బేధము  విడచి   మసలుచుండు , జనులు
ఆ తీరు పాటించీ           తరలిరండూ ......      || శ్రీ ||

ఏ యుగము నందైన    ఆది అంత్యము లోకటె
జీవులోక్కటే .....          జీవాత్మ ఒక్కటే
ప్రాణు లొక్కటే              ప్రాణి కోటులోక్కటే , యనుచు
సరిజూచి  బ్రోచేదీ          సాయి ఒక్కడే ....      || శ్రీ ||

మనిషి  మనిషి వేరైనా  మనసులోక్కటే , వారి
ఆత్మలందుండేదీ           మాధవోక్కడే ,  పంచ
భూతాలకు నెలవైన      దేహమొక్కటే , మదిని
మాత్సర్యము విడచి చూడు    దైవమొక్కటే   || శ్రీ  ||
-------------------------------------------------
-----------------------------------------------------






మమ్మేలు మా నాధ

ఓం శ్రీ సాయి రాం .
-----------------------
ఆనందభైరవి రాగం .
---------------------

మమ్మేలు మా నాధ     శ్రీ సాయి నాధా
మా ఇంటి వెలుగువూ   నీవు కాదా ......
కమ్మేటి  చీకటుల        తొలగింపగా నీవు
నమ్మేటి దైవమై           మమ్మేలరాదా ....
                                 శ్రీ  సాయి నాధా ....||

అంబ కృప  నీ పైన       అది నీకు వరమూ
నింబ వృక్షము క్రింద    నిత్యమ్ము జపము
లోకాలు గాచుటకు       చేసేటి   తపము
ఫలియించి  పొందేవు     దైవత్వము            || మమ్మేలు ||

కన్నీరు తుడిచేవు        పన్నీరు చిలికేవు
నోట నెంగిలి నీట          దీపాలు నిలిపేవు
గంగ ,యమునల నీరు  పాదాల పుట్టించి
పాపాలు కడిగి మము    పావనుల జేసేవు   || మమ్మేలు ||

ఉప్పు నీటిని  తేట  తీయన్ని నీరుగా
మార్చేవు మహిమతో ,మధురాతి మధురముగ
ప్లేగు ,కలరా వ్యాధి       బాప గోధుమ పిండి
ఊరంత  చల్లేవు          పురజనుల కాచేవు   || మమ్మేలు ||

గీతార్ధ సారమును       బోధించినావూ 
నిస్వార్ధ  సేవలను       అందించినావూ
పరమార్ధమును దెల్పి  పావనుల గావింప
పదకొండు సూత్రాల     నెరిగించినావూ ...
                                పరమాత్మ నీవూ ......|| మమ్మేలు ||

---------------------------------------------------------------
----------------------------------------------------------------