Tuesday, November 20, 2018

కరచాలనం.

కరచాలనం
-----------
పలక బలపము పట్టి , ఓ,న,మా ,లను దిద్ది
వలయు విద్యల తీర్చి  దిద్దు చేయి.
గురువు పెద్దల పదము లంటి దండములెట్టు ,
చనవు నాశీర్వచనమిచ్చు చేయి. ||
కార్య భారములెల్ల ఇంపుగా సవరించి
నవ్య స్నేహపు పాలు పంచు చేయి.  
కావ్య రచనలు చేసి కీర్తి. బడసిన చేయి
దివ్య జ్యోతుల నింట వెలిగించు చేయి ||
అతిధి సత్కారముల నందెవేసిన చేయి
ఆదరించీ అన్నమెట్టు చేయి.
అడిగినంతనె లేదు లేదన్న మాటొదిలి
కలిగినంతయె  దాన మొసగేటి చేయి. ||
గుడిలోన జేగంట మోగించి వేల్పులను
మనసార ధ్యాన్నించి మొక్కు చేయి.
దడిలోన పూలన్ని దెచ్చి మాలలు గుచ్చి
తగు భక్తి గురుసాయి సేవించు చేయి. ||
ఇష్ఠాల విందులను ఇచ్చి మురిసెడు చేయి
కష్ఠాల కన్నీరు తుడుచు చేయి.
నష్ఠాల నగుబాట్ల. తట్టి ధైర్యము నిచ్చి
శ్రేయమౌ శుభములను ఒసగేటి చేయి ||
గట్టి మేలును చేయు ఘనమైనదాచేయి
అట్టిదానిని పట్టి ఆదరింపగదోయి.
జట్టు సేయగ వచ్చి. కరచాలనము చేసి
మేటి సంస్కారములనందుకోవోయి ||
---------------------------------
రచయిత్రి  
శ్రీమతి
పుల్లాభట్ల  జగదీశ్వరీ మూర్తి.
కల్యాణ్

రాజకీయ చదరంగం.

చదరంగం
----------
రాజకీయ "చదరంగంలో" పావులైన
"సిపాయి" ప్రజానీకానికి. " రాణీ "
మాయ మసి పూస్తోంది ॥

మారే మంత్రులతో మంతనాలు జరిపే
సత్తా " గుర్రాలు" ,దాట్ల దారుల్లో
సంధి కుదుర్చుకుంటున్నాయి. ॥

రాజకీయపుటెత్తుల్లో
రంగులు మార్చిన
గుంట నక్కలు  ,  
-"ఏనుగు" ముసుగుల్లో
అంబారీలు ధరించేయి. ॥

సత్తా తొత్తులుగా మారిన
సత్తు "శకటాలు , "
సామాన్యుణ్ణి  దోచుకునేందుకు
అడ్డ తోవలు పడుతున్నాయి. ॥

మాటకి నీతికి కట్టుబాటు లేని
మహామహులమధ్య
మాటి మాటికి మారే సత్తా
రాజ్యాంగాన్ని "  చెక్ " చేస్తూ
సవాలుగా నిల్చుంది. ॥

నల్ల నుడి తెల్ల గడుల రాజకీయ
రహదారుల్లో దాగు ఉన్న
అణుబాంబుల ఆకస్మిక పేలుళ్ళకు
ఆహుతయ్యే " సిపాయి"  జనాల్ని
అలవకగా అడ్డు తొలగించి
ఆటలు సాగిస్తున్న. హేయమైన
హింసా రాజకీయ ఎత్తుగడలకి
ప్రజా   " పావులు ",
పాడెకెక్కుతున్నాయి. ॥

-----------------------------------
రచన  , శ్రీమతి,
పుల్లాభట్ల జ్గదీశ్వరీమూర్తి
                             కల్యాణ్.


కవితోత్సవం కొరకు.
------------------------------.

చిలకమ్మ కధ.

చిలకమ్మ కధ
------------
అందాల ఓ చిలుక  
ఆకాశమందునా
గూడు కట్టగ తలచి
నింగి నెగిరీ పోయె ||

చెట్లు చేమలు నిండు
ఓ చిన్ని అడవిలో
గుబురు నిండిన
ఆకు చివురు కొమ్మల నడుమ
ఏరి చేర్చెను
ఎండు పుల్లలెన్నో వెదికి
గూడు వెలసెను తుదికి
సేద తీరగ మదికి ||

ముద్దు ముచ్చటవలసి ,
కోరి తానే వలచి
గోరింక తోడుగా. ,
చిరు కూనలను సాకె ॥

కిచ  కిచలు అవి పలుక
చిన్ని రవముల తోడ
చిందులేసెను చిలుక
గోరింక జత కలుప ||

ఏఏటి కా ఏడు
తీరనీ భయమంట
తరుల గూల్చెడి నరుల ,
మ్రొక్కి వేడెడిదంట ॥

ఎగరలేని కూన ,
ప్రాణాలె పణమంట
చిలకమ్మ కంటిలో ,
కన్నీటి వరదంట ||॥

నమ్మలేనీ వింత ,
మరుగాయె వనమంత
నీడ నిచ్చెడి జాడ
కానరాలేదంట ॥

తరుల జాడలు తరిగె.
కొండ చరియలు విరిగె
చిలకమ్మ గూటికై  ,
చిరునీడ కరువాయె ||

( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )

--------------------------------------
       రచన. శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
     కల్యాణ్  ( మహరాష్ట్ర  ).

స్వాతంత్ర్య గీతం.

స్వాతంత్ర్య  గీతం
----------------
పాడవోయి విజయగీతి
పుడమితల్లి వెలుగు కీర్తి
అమరులైన వారె స్ఫూర్తి
స్మరియించే శుభదినం
స్వాతంత్రపు వరదినం ||

సమసమాన భావనతో
కలసినారమీదినం
కుల మతాల భేదములను
కూలదోయుటే ధనం ||

తర తరాల చరితలకే
నిలువుటద్దమీదినం
వీరగతిని పొందు ఘనుల
త్యాగ ఫలపు సత్ దినం ||

స్వాతంత్ర్యపు హక్కులనే
పొందినార మీదినం
భరత మాత కీర్తి ఘనత
చాటి నిలుపు గౌరవం ||

సత్య,ధర్మ, శాంతి గురుతుగా
ఝండా నిలుపుదాం
చేయి చేయి కలిపి మాత
ఒడిని శాంతి నిలుపుదాం ||

అహింస దారి అడుగులేసి
ఆగడాలనాపుదాం
ఆదర్శపు బాట నడచి
ఆనందం పంచుదాం ||

సమత మమత పెంచి
భరతమాత  కీర్తి పెంచుదాం
మన ఝండా ఎగురవేసి
విశ్వ శాంతి నిలుపుదాం. ॥
------------------
      రచన.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
                      కల్యాణ్.

తెలుగు తల్లికి వందనం .

తెలుగు తల్లికి వందనం
----------------------
తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం.
తెలుగు వెలుగై తరలి వచ్చెను
పలుకు తేనెల సుధలతో
మల్లె మాలల మధుర సౌరభ
మొప్పు మాటల  కళల తో ||
వేద ఘోషలు పుణ్య గాధలు
తల్లి   నడిచెడు  పథములు
తెలుగు  తల్లికి  వెలుగునిచ్చే
కీర్తి చంద్రిక తారలు ||
తేటగీతులు , ఆటవెలదులు
కంద సీసపు మాలలు
తెలుగు పద్యపు పాదములనిడు
మేలి సిరి సిరి మువ్వలు ||
విజయనగర  కాకతతీయుల
ఖ్యాతి ఆమెకు వైభవం
రత్నగర్భ గ పేరు తెచ్చెను
కోటి నిధుల ప్రాభవం ||
జాతి కవులుగ పేరు గాంచిన
సుతుల కీర్తులె తేజము
ఆంధ్ర కేసరి వంటి సుతులకు
మాత ఒడి తరు కల్పము ||
మేలు సంస్క్రుతి నిండు ధనమే
తెలుగు తల్లికి భరణము
సంప్రదాయ సంగీత గీతులె
వన్నె తెచ్చెడి సద్ధనం ||
కూచిపూడి నాట్య సంపద
కొలువు  దీరిన  వైభవం
తెలుగు దనమే మనకు అభయం
తెలుగు బాట అదే స్వర్గం.
-----------------------------
                రచన.  శ్రీమతి
                  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.