Monday, May 26, 2025
కలం.. చిత్ర కవిత.
Sunday, May 25, 2025
శీర్షిక : : విప్లవ జ్వాల. ( కలం).
26/05/2025.( సోమవారం)
మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : చిత్ర కవిత..(1).
శీర్షిక : : విప్లవ జ్వాల.
ప్రక్రియ : వచన కవిత.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర. (38.).
కలము, ఓ నిశ్శబ్ద కళాకారిణి,
అక్షరాల రంగులతో భావాలకు ప్రాణం పోస్తుంది.
సిరా చుక్కలు, రంగులద్దిన స్వప్నాలై,
కాగితంపై భావాక్షరాలై చిందులు వేస్తాయి !!
ఊహల రెక్కలకు బలం చేకూర్చి,
తన రచనలతో కొత్త లోకాలను సృష్టిస్తుంది,
కలం , కవితలల్లే ఓ అద్భుత సృష్టి!
కాలంతో పాటు నడిచే సత్య ప్రభోధిని !!
కలం , పదాల స్వరాలను పలికిస్తూ,
మౌన గీతాలు పాడుతుంది.
సూక్ష్మమైన ఆలోచనలకు ఆకృతినిస్తుంది.
పదునైన కొనతో, పదాలు చెక్కుతుంది.!!
కలము, చేతిలో ఒదిగిన ఒక నిప్పుకణం,
అక్షర జ్వాలలతో అన్యాయాన్ని దహిస్తుంది.
నిశ్శబ్దంగా రగిలి, ప్రజ్వలించి,
లోకంలో మార్పుకు నాంది పలుకుతుంది.!!
ఇందులో ఉన్నది కేవలం సిరా చుక్కే కాదు,
అణగారిన గొంతుల నుండి పెల్లుబికిన ఆగ్రహం.
అక్షరం అక్షరంతో కలిసి అణ్వాస్త్రమై,
నిరంకుశత్వపు కోటలను కూల్చివేస్తుంది.!!
కలము, ఇది అక్షర పోరాట భేరి,
ప్రజల ఆవేశానికి, అస్త్ర మౌతుంది.
ప్రతి పదం ఒక పిడికిలై,
అణచివేతలపై తిరుగుబాటు చేస్తుంది, !!
కలం, కేవలం కాగితంపై గీతలే కాదు,
సంకెళ్ళను తెంచుకునే సంకల్ప బలం.
రాతిలో నిండిన భక్తి , రాతలో దాగిన శక్తి ,
నూతన సమాజ స్థాపనకు పునాది వేస్తుంది.!!
కలం, ప్రజల భావ బీజాలకు చైతన్య శక్తి.
ప్రతీ రంగుకు ప్రాణం పోస్తుంది.
ప్రతీ భావానికి చిత్రం గీస్తుంది.
కలం కదిలితే, చరిత్రే మారుతుంది.!!
---------------------------
ఈ కవిత నా స్వీయ రచన.
శీర్షిక : శ్రీరామ నామ మహిమ.
శీర్షిక : శ్రీరామ నామ మహిమ.
(గేయ కవిత).
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర. 43.
---------------------------
అనంతమైనది రామ నామము
శక్తి నిండిన నామము
జగతికిది ఆధార భూతము.
జయము మంగళ నామము !!
పలికినంతనే పులకరింతల
మనసు నిండిన నామము
తొలగు కర్మల మలిన మంతయు
ధర్మ పథమిడు నామము !!
ధర్మ రూపుడ యోధ్యరాముడు,
నీతి , నియమము కద్దము
ఆతని నామము నమృత ధారలు
త్రాగు వారికి మోక్షము !!.
ఎన్ని యుగములు గడచినా ఘన
మహిమ తరగని నామము.
భక్తి వేడిన ముక్తి నొసగును.
కరుణ నిండిన నామము!!
మార్గ దర్శన మిడును నిత్యము.
నామ జపమొక ఒక యజ్ఞము
కథలు వినుటయె పరమ మోదము
జన్మ జన్మల భాగ్యము.!!
----------------------
ఈ గేయ కవిత నా స్వీయ రచన.
అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.
డా బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి* సందర్బంగా కవిత.
అంశం : డా బి.ఆర్.అంబేద్కర్.
శీర్షిక : నిత్య చైతన్య స్ఫూర్తి .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
--------------------------
నలుపు తెరల వెనుక దాగి,
నలిగిన గుండె చప్పుడు విన్నావా?
భీముని పిలుపులో, అణగారిన
ఆత్మల ఆక్రందన విన్నావా?
పుట్టిన నేలపైనే పరాయివాడై,
నీరు సైతం నిరాకరించబడిన ,
ఒక బలహీనని భవిత కథ విన్నావా?
నీడ లేని బాల్యం, నిప్పుల కొలిమి వంటిది,
అంటరానితనపు ముల్లు గుచ్చినా, ఆత్మ నిబ్బరం చెదరనిది.!!
జ్ఞానపు జ్యోతిని వెలిగించి, చీకటిని
పారద్రోలాలనే తపన నిండిన ఘనతతనిది.!!
బడి గడప తొక్కనివ్వకపోయినా, పట్టుదల వీడని దీక్షా దక్షుడు,
పుస్తకాలే ప్రాణమిత్రులు కాగా ,అక్షరాలనే ఆయుధంగా, చేసుకున్నాడు.!!
కోట్లాది గొంతుల సింహ గర్జనై ,హక్కుల కోసం
ఉప్పెనలా ఉద్యమించాడు,
రాజ్యాంగ నిర్మాతగా శిఖరంలా నిలచి ,
ధృవతారలా జాతికి దిక్సూచి అయ్యాడు,!!
కులమతాల కట్టుబాట్లను తెంచి
పౌర హక్కులను కవచంలా కాపాడాడు,
రాజ్యాంగపు చుక్కానియై,
నవభారతానికి దిశానిర్దేశం చేసాడు.
సమానత్వం, సౌభ్రాతృత్వం నినదించి,
జాతిని వెలుగుబాట పట్టించాడు..
భారతీయ సమాజానికి భాస్కరుడిలా,
వెలుగునిచ్చే మార్గదర్శకుడయ్యాడు .!!
అతని ఆశయాలే మనకు స్ఫూర్తి,
ఆతని అడుగుజాడలే మనకు గమ్యం,
ఆతని పోరాటమజరామరం,
అణగారిన వర్గాలకు ఆయన, నిత్య చైతన్య స్ఫూర్తి .
భారత జాతి గుండెల్లో కొలువై ఉన్న
"డాక్టర్ అంబేద్కర్ " అమర ఘన కీర్తి.,
శీర్షిక : సాంప్రదాయ పండుగలు.
అంశం: జాతర : గేయం.
శీర్షిక : సాంప్రదాయ పండుగలు.
రచన ,శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
---------------------
గిరగిర తిరిగే రంగుల రాట్నాలు
సందడి నిండిన జాతర హోరులు
పెద్దల మదిలో భక్తి భావాలు
చిన్నారి పాపలు చిందేటి నవ్వులు !!
అంగడి నిండిన బొమ్మల కొలువులు
గాజుల గలగల నిండిన భామలు
పట్టు పావడల రేపరెపల కళలు
కన్నెల పదముల మ్రోగేటి మువ్వలు!!
చల్లని పానీయాలు పంచేటి దాతలు
అరిసెలు, బూరెలు అమ్మేటి బామ్మలు
బజ్జీల ఘుమఘమ నిండిన వీధులు
నోరులు ఊరించు తీయని అమ్మకాలు !!
కోలాటకాటలు , చప్పుళ్ళు, తాళాలు
ఇంపైన భజనలు ,. భక్తి పాటలు
నాగస్వరాల నాడే పాములు
భక్తిశ్రద్ధలతో కొలువుల పూజలు !!
గుడిలో దేవుని దర్శన భాగ్యం
నమ్మిన జేజికి బోనాల భోగం.
మ్రొక్కులు, ముడుపుల జన సందోహం.!
తీర్థ ప్రసాదాలనందే యోగం.!!
పల్లెలు నిండిన ,సరి సాంప్రదాయాలు.
జనాల మోమున వెలిగే కాంతులు.
జాతర నిండిన ఆనంద దీపాలు
కొలువూరు దీరిన దేవ- దేవుళ్లు !!
జాతర, సందళ్లు జయమైన కోర్కెలు
గుండెలు నిండిన అతి మధుర స్మృతులు
దేవుని మహిమల కీర్తులే పాటలు
ఏటేటి జాతర కెదురెదురు చూపులు !!
----------------------------
ఈ గేయం నా స్వీయ రచన.