05/09/2023
తపస్వి మనోహరం "e "సంకలనం కొరకు,
అంశం : కళ్ళుళ అబద్ధం చెప్తాయి.
శీర్షిక : మబ్బులు వీడిన ఆకాశం.
రచన: శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర
ఆఫీసు నుంచి అరగంట ముందే ఇంటికి వచ్చిన రమేష్ అసహనంగా హాల్లో. పచార్లు చేస్తున్నాడు ఈరోజు కూడా తన భార్య రాధా ఇంట్లో లేదు .
ఇద్దరి దగ్గర రెండు తాళాలు ఉండడంతో, తను తాళం తీసుకుని ఇంటి లోపలికి వచ్చాడు .
కానీ అతని మనసంతా అశాంతిగా ఉంది.
కారణం తన భార్య రాధ ప్రవర్తన.
గత రెండు నెలలుగా రాధ ఇంట్లో అన్యమనస్కంగా, పరధ్యాన్నంగా ఉంటోది. చాలాసార్లు కారణం అడిగినా, రాధ తనకు జవాబు చెప్పలేదు .సరికదా చిన్నగా నవ్వేసేది.
అసలే అతి తక్కువగా మాట్లాడే రాధ, ఈ మధ్యన మాటలు మరీ తగ్గించేసింది.
పెద్దలు కుదిర్చిన సంబంధమే ఐనా, రాధను చాలా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు రమేష్.
రమేష్ కు రాధకు పెళ్లి ఆరు నెలలు అయింది. వివాహనంతరం తనతో చాలా ప్రేమగా ప్రవర్తించేది రాధ .తనకు ఏ విధమైన లోటు లేకుండా చూసుకునేది . అన్నివిధాలా ఉత్తమ ఇల్లాలుగా రాధను చెప్పుకోవచ్చు
కానీ గత రెండు నెలలుగా తన భార్య ప్రవర్తనలో చాలా మార్పు చూసాడు తను..
రాను రాను, తన దగ్గర రాధ, ఏదో దాచుతోందన్న అనుమానం కలిగేది రమేష్ కి.
దానికి కూడా తగిన కారణం ఉంది.
తన స్నేహితుడు రాజేష్ ఒకసారి తన ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తానని ఒక పార్కుకి పట్టుకెళ్లాడు.
అది లవర్స్ పార్కుట .అక్కడికి లవర్లు తప్ప, మరెవరరూ రారట.
పార్క్ అంతా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉంది. చెట్లకి చుట్టి ఉన్న సిమెంట్ చట్టాల మీద అక్కడక్కడ కొన్ని జంటలు కూర్చుని ఉన్నారు.
ఆ పార్క్ లో ప్రేమ జంటలు తప్ప, ఎక్కడా పిల్లల జాడగానీ, పెద్దలజాడ గానీ కనిపించలేదు.
పార్క్ పేరు కూడా "లవర్స్ పార్క్."
పేరు విన్నాడే కానీ, తను ఎప్పుడూ ఆ పార్క్ కి వెళ్ళలేదు.
రాజేష్ ,తన లవర్ కోసం నిరీక్షిస్తున్న సమయంలో ,చుట్టూరా చూస్తున్న తనకు ,ఒక బెంచి పై తన భార్య రాధ, ఎవరితోనో కూర్చుని మాట్లాడుతూ కనిపించింది.
ఒక్క క్షణం నివ్వెరపోయాడు రమేష్.
రాధా అతని చేతులు పట్టుకుని కన్నీరు కారుస్తోంది. కొన్ని క్షణాల తర్వాత ఆమె తన పర్స్ నుంచి, కొంత పైకం తీసి అతని చేతిలో పెట్టింది .
అతను రాధను దగ్గరకు తీసుకున్నాడు.
కొంతసేపటికి అతను లేచి వెళ్లిపోయాడు.
రమేష్, రాధ కంట పడకుండా పక్కకు తప్పుకున్నాడు.
కొంత సమయం దాటాక ,రాధ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇంటిదారి పట్టింది.
రమేష్ మనసు మనసులో లేదు. రాధ ఇక్కడేం చేస్తోంది.
అతను ఎవరు ? చాలా అందంగా కనిపిస్తున్నాడు.
రాధా అతను ఎందుకు కలిసింది ?అతనికి డబ్బు ఎందుకు ఇచ్చింది?
కొంపదీసి ఇతను రాధ ప్రేమికుడా ? పెళ్లికి ముందు రాధ ఇతన్ని ప్రేమించిందా?
అయితే రాధ, ఇతనితో పారిపోతుందా?
అప్పుడు నలుగురిలో తన పరువేం కాను ?
తన వాళ్లంతా, తనను వదిలి "రాధ ఎందుకు వెళ్ళిపోయింది "అని అడిగితే " తనందరికీ ఏం జవాబు చెప్పాలి..?
దగ్గరకు వెళ్దామని అనుకున్నాడు గానీ ,పక్కన రాజేష్ ఉండడంతో ,ఏం చేయాలో తెలియక , రాజేష్ ని తప్పించుకుని, ఇంటిదారి పట్టాడు.
నడుస్తున్నాడే కానీ ,అతని ఆలోచనలు, అతనిని విడలేదు
రాధను తనెంతో ప్రేమించాడే...
మరి రాధ లేకుండా తను ఉండగలడా...?
లేదు ,లేదు ."తను చూసింది నిజం కాదు ."
రాధ అసలు అలాంటిది కానే కాదు.
తను ఇంటికి వెళ్ళగానే రాధ తనకంతా చెప్పేస్తుంది.
అతను ఎవరో ఏంటో తొందర్లోనే తనకు తెలిసిపోతుంది.
రమేష్ , అస్తవ్యస్తమైన ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు.
అప్పటికే రాధ, కడిగిన ముత్యంలా తయారై, చిరునవ్వుతో ఎదురొచ్చింది.
తను ఫ్రెష్ అయి రాగానే ,స్నాక్స్ తో పాటు కమ్మటి " టీ"
తెచ్చి పెట్టింది.
రమేష్ చాలాసేపు ఎదురు చూసాడు. రాధ తనతో ఏమైనా చెప్తుందేమో అని.
కానీ రాధా ఏమీ చెప్పలేదు. ఎప్పటిలాగే ర మౌనంగా, తన పనులు తాను చేసుకుపోతోంది.
రమేష్ కూడా తనంతట తానుగా బయట పడదలచుకోలేదు.
ఇదిగో ఇప్పటినుంచే మొదలైంది రమేష్ లో అనుమానం.
అప్పటినుంచి అడపా దడపా ఆఫీసు నుంచి తొందరగానే ఇంటికి వచ్చేస్తున్నాడు .చాలాసార్లు రాధ లేకుండానే ఇంట్లోకి వెళ్ళాడు.
మరికొన్నిసార్లు ఆత్రుత భరించలేక,
"లవర్స్ పార్క్ కి" వెళ్లి అక్కడ రాధ , అతనితో కూర్చుని మాట్లాడుతూ ఉండడం చూశాడు.
అటుపై అతడు ఆఫీసు నుంచి సమయం దొరికినప్పుడల్లా, ,పార్క్ వైపు వెళ్లడం మొదలెత్తాడు.
రోజుజూ కాకపోయినా, రెండు మూడు రోజులకు ఒకసారై నా, రాధ అతనితో కనిపించేది.
రమేష్ కి ఏం చేయాలో తెలియడం లేదు. రాధ తనతో ఏమి చెప్పడం లేదు.
అతనెవరు..? అసలు రాధ అతనిని ఎందుకు కలుస్తున్నాది.?
కలిసినప్పుడల్లా అతనికి డబ్బులు ఎందుకు ఇస్తున్నాది ? ఎందుకు కన్నీళ్లు పెడుతున్నాది..?
అన్న ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు.
************
రోజులు గడుస్తున్నాయి. రమేష్ కి ఓపిక నశిస్తున్నాది.
ఈ విషయమై తానే, " రాధను నిలదీద్దాం" అనుకున్నాడు రమేష్.
ఆరోజు ఆఫీసుకు వెళ్లడం మానేసాడు రమేష్.
సదా సిదాగా తయారైన రాధ" రమేష్ ఆఫీస్ కు ఎప్పుడు వెళతాడా "అని చూస్తున్నట్టుగా అనిపించింది రమేష్ కు.
ఇంక రమేష్ తాత్సారం చేయలేదు.
రాధ దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకొచ్చాడు
సోఫాపై కూర్చున్న తర్వాత , ఒక్కొక్కటిగా తను చూసినవన్నీ రాధ ముందు బయటపెట్టి ,విషయం ఏంటని నిలదీశాడు.
రాధ ముందు తెల్లబోయింది .తర్వాత ఆశ్చర్యపోయింది.
ఆమె నుదుటినిండా ముచ్చెమట్లు పట్టేయి. శరీరం అంతా మెల్లగా కనిపించ సాగింది.
"ఏమిటి? రమేష్, నెల్లాళ్లుగా, తనను వెంబడిస్తున్నాడా...?"
"తను ప్రేమించేది ఎవర్ని" అని నిలదీసి అడుగుతున్నాడే,. "తను ఏం చెప్పగలదు ? ఎలా చెప్పాలి? "
" నిజం తెలిస్తే, రమేష్ తనను తిరిగి ఎలుకుంటాడా?"
" అసలు తను పెళ్లికి ముందే, ఈ విషయం రమేష్ తో చెప్పేయవలసిందేమో? "
" కానీ తన తల్లిదండ్రులు, ఈ విషయం బయటకు చెప్పవద్దని, తనను ఎంత నిర్బంధించారని.
వారి మనస్థాపం చూసి, తను మౌనంగా ఈ పెళ్ళికి
అంగీకరించింది . రాను రాను పరిస్థితులు అన్నీ ,చక్కపడతాయి అనుకుంది .
కానీ తన అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి..?"
ఇంక, ఈ విషయం దాచి లాభం లేదు ,ఏదైతే అదే అవుతుంది.
" తను రమేష్ కు ,అసలు నిజాన్ని చెప్పేస్తుంది.."
మనసులో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చిన రాధ
తలవంచుకుని, మెల్లగా చెప్పడం మొదలెట్టింది.
********************** ****************
సావిత్రి కి ,ప్రభాకర్ కి వైభవంగా పెళ్లి జరిగింది.
ఇరుపక్షాల వారి నవ్వులతో ,ఆనందంగా పెళ్లి ముగిసింది.
చాలా సంతోషంగా గడుస్తుంది కానీ మూడు సంవత్సరాలైనా సావిత్రి కడుపు పండలేదని
అటు వారు, ఇటు వారు, కూడా, ఈ విషయమై డాక్టర్లను సంప్రదించారు.
హార్మోన్స్ లోపం అంటూ వాళ్ళు ఏవేవో మందులిచ్చారు.
చాలా పరీక్షలు చేశారు ఇద్దరికీ.
మరో రెండు సంవత్సరాల తర్వాత ,వీరి ప్రార్థనల ఫలితమా అన్నట్టుగా , సావిత్రికి నెల తప్పింది.
ఇరు కుటుంబాల వారి ఆనందానికి అంతులేదు.
సావిత్రి ,ప్రభాకర్లు కూడా చాలా ఆనందంగా ఉన్నారు..
నెలలు నిండాయి .పండంటి కొడుకు పుట్టాడు.
ప్రభాకర్ కు , ఉద్యోగం లో ప్రమోషన్ వచ్చి, మరో ఊరికి ట్రాన్స్ఫర్ అయింది .
సావిత్రికి సీ.సెక్షన్ అయిన కారణంగా, రెండో సంతానానికి ఐదేళ్లు సమయం ఇద్దామనుకున్నారు.
-----------------
కొడుకుని ముద్దుగా "కృష్ణయ్య" అని పిలుచుకుంటూ, మురిసి పోయారు.
పసిపిల్లాడి ఆట-పాటలతో ,సావిత్రి -ప్రభాకర్ ల జీవితం.
చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది . కృష్ణయ్యకు ఆరేళ్లు వచ్చాయి.
ఈ లోపల సావిత్రికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది.
అందమైన ఆడపిల్ల పుట్టింది. ముద్దుగా "రాధ" అని పిలుచుకుంటూ ,ఇద్దరు పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచసాగారు.
కృష్ణయ్య ఆనందం అంతా ఇంతా కాదు. ఒంటరిగా ఉన్న తనకు చెల్లి రూపంలో ఒక తోడు దొరికిందని చాలా సంతోషించాడు. ఇప్పుడు కృష్ణయ్యకు ఆమె తోడితే జీవితం అయిపోయింది .ఆట- పాటగా ,ఇద్దరూ పెరుగుతున్నారు.
చూస్తుండగానే సంవత్సరాలు గడిచాయి.
ఐదేళ్ల రాధ , నట్టింట తిరుగుతూ ఉంటే ఇంట, లక్ష్మీదేవి తాండవిస్తున్నట్టే ఉండేది.
ఇక ఆ అన్న చెల్లెళ్ల ప్రేమ అయితే చెప్పలేం. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఆప్యాయతగా మసలే వారు.
చెల్లెమ్మ ఏడిస్తే , తట్టుకోలేకపోయేవాడు కృష్ణయ్య. కృష్ణయ్యను కసురుతే ఒప్పుకునేది కాదు రాధమ్మ.
పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అవుతున్న కొలదీ ముచ్చటతీరా ఆనంద పడుతున్నారు సావిత్రి, ప్రభాకర్లు.
అదిగో...అప్పుడే ,వారి జీవితంలో చీకట్లు కమ్ముకోవడం
ప్రారంభమైంది.
ఏడవ క్లాసు చదువుతున్న కృష్ణయ్యకు రాను రానూ , నడకలోనే కాక ,శరీర భాగాల్లో కూడా చిన్న చిన్న మార్పులు కనిపించ సాగాయి. అతడికి చెల్లెలికి కొన్న గాజులు ,తిలకం, కాటుక ,వంటివి చాలా నచ్చేవి. ఒకనాడు అతడు అడగలేక అడగలేక అమ్మను పట్టీలు కావాలని అడిగాడు.
ముందు సావిత్రి కేమీ అర్థం కాలేదు. మనసులో చిన్న అనుమానం మొదలైంది.
ఎవరితోనూ చెప్పుకోలేదు, మానలేదు.
చివరికి మానసిక వేదన భరించలేక , భర్తతో ఈ విషయాన్ని గూర్చి విపులంగా వివరించింది.
ఆందోళనకు గురైన ఇద్దరూ కలిసి, కృష్ణను డాక్టర్లకు చూపించేరు. , వాళ్ళు చెప్పిన విషయం విని,
ఇద్దరూ, నిర్గాంత పోయారు. సావిత్రి అనుమానం నిజమైంది
లేక లేక పుట్టిన మగపిల్లవాడికి , ఈ విధమైన మార్పునిచ్చి భగవంతుడు తమకెందుకీంత అన్యాయం చేశాడో,
తాము ఏ పాపం చేశామో" అని లోలోనే ఇద్దరూ కుమిలిపోసాగారు.
కృష్ణ కన్నా ఆరు సంవత్సరాలు చిన్నదైన రాధ , పెరుగుతున్న కొలది, ఈ ప్రభావం ఆమె మీద కూడా పడుతుందేమో? ఎందుకంటే "సమాజం చాలా చెడ్డది.
ఉన్నవి లేని ఊహించి ప్రపంచమంతా చాటుతారు. దాంతో ఆడపిల్లకు పెళ్లి కాకుండా పోతుందేమో" అన్న భయం పట్టుకుంది సావిత్రి ప్రభాకర్లకు.
కొంతకాలానికి తాము ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు , ఈ విషయం నలుగురికి తెలియక ముందే, పిల్లాడిని ఎక్కడో దూరంగా పెట్టాలి. లేక లేక పుట్టిన ఈ పిల్లాడిని తాము వదులుకోలేరు అలాగని ఇంట్లో ఉంచి, అవమానాలు పడలేరు .
ముందుగా తాము, ఈ ఊరు వదలి ఎక్కడికైనా వెళ్లిపోవాలి",
అన్న ఆలోచన రాగానే ప్రభాకర్ ముందుగా, తను పని చేస్తున్న చేస్తున్న జాబ్ కు రిజైన్ చేసేసి, ఒక చిన్న కుగ్రామానికి మకాం మార్చాడు.
అక్కడ కొన్ని ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయడం మొదలెట్టి, కష్టించి పనిచేసే జీవితానికి అలవాటు పడ్డాడు.
12 సంవత్సరాలు నిండుతున్న కృష్ణయ్యకి, తను పడుతున్న బాధ కన్నా, తన తల్లి తండ్రి ఎదుర్కొంటున్న సమస్యలు, తనవల్లే, అన్న బాధ ఎక్కువైంది.
దాంతో కృష్ణయ్య తను అచ్చంగా మగపిల్లాడులా ఉండడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తూ, తన మనసు చదువుపై లగ్నం చేయసాగాడు.
రాను రానూ, కృష్ణయ్య లో శారీరకంగా ఆడ లక్షణాలు కనిపించసాగాయి.
దాంతో సావిత్రి ప్రభాకర్లు కృష్ణయ్య సంగతి అందరికీ తెలిసిన తర్వాత పుట్టిన ఆడపిల్ల
(రాధ ) జీవితం ఏమవుతుందో, ఆమెకు పెళ్లి అవుతుందో, లేదో అని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేవారు.
ఈ విషయం గ్రహించిన కృష్ణయ్య ,ఇంక తాను ఈ ఇంట్లో ఉంటే వీళ్ళందరి జీవితాలు దుఃఖమయం అవుతాయని తలచి, ఒకనాటి రాత్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు.
పొద్దున లేవగానే కనపడని కొడుకు కోసం, ఎంతో గాలించి పోలీసులు రిపోర్ట్ ఇవ్వలేక ,నలుగురిలో చెప్పుకోలేక, మధనపడుతూ, సావిత్రి మంచం పట్టింది. పొలం కౌలుకు తీసుకుని, వచ్చిన డబ్బులతో సావిత్రి కి సరైన వైద్యం చేయించలేకపోయాడు ప్రభాకర్.. మంచం పట్టిన సావిత్రి కోలుకున్నా. ఇదివరకులా తిరగలేకపోయింది .
చూస్తుండగానే సంవత్సరాలు గడిచాయి.
ప్రభాకర్ ,సావిత్రి ఇంక ఆ ఊర్లో కూడా ఉండలేక ,తమ సొంతూరైన సాలూరు చేరుకున్నారు. ఎప్పుడో చిన్నప్పుడు
తాము , పుట్టిన ఊరు .. తమ తల్లిదండ్రులున్నప్పటి
వారెవరూ ఇప్పుడు లేరు .అక్కడెవరికీ ,తమకు కొడుకుకున్న సంగతి తెలియనందున , కొన్ని నెలలకే కాస్త తేరుకున్నారు.
ప్రభాకర్ తనకు తెలిసిన ఓ స్నేహితుని షాపులో ఉద్యోగానికి కుదిరాడు రాధ బాధ్యత తమపై ఉన్నందున ,ఏదోలా జీవితం గడపసాగారు.
రాధకు 18 సంవత్సరాలు వచ్చాయి. పల్లెటూరు కావడంతో రాధ , చాలా క్రమశిక్షణతో పెరిగింది.
అప్పుడపుడు రాధ ,తన అన్న కృష్ణయ్య, ఎక్కడ ఉన్నాడో తెలియక మధన పడుతూ ఉండేది.
కానీ అమ్మా,నాన్నలు ఈ ఊరికి వచ్చే ముందు తనతో, తనకో అన్నయ్య ఉన్నట్టుగా ఎవరికీ తెలియనివ్వకూడదని గట్టిగా చెప్పినందువల్ల ,తన మనసులోని బాధ ఎవరితోనూ చెప్పలేకపోయింది . అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోయిన కారణం తెలుసుకున్న రాధ మనసు విలవిలలాడింది
తన అన్నయ్య ఎప్పటికైనా ఇంటికి వస్తాడేమో నన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండేది.
కానీ వారెవరికీ కృష్ణయ్య ఆచూకీ తెలియలేదు .ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియలేదు.
రాధకు పెళ్లీడు వచ్చింది
రోజురోజుకు అందంగా తయారవుతున్న రాధకు వరుసగా
సంబంధాలు, వాటంతటవే రాసాగాయి.
అలా వచ్చిన వాటిలో, ప్రభాకర్ సంబంధం ఒకటి.
తమకున్న స్తోమతకు ఒప్పుకొని , రాధను నచ్చి, పెళ్లి చేసుకున్నాడు ప్రభాకర్.
రాధ ,పెళ్లిలో కూడా అన్నయ్య వస్తాడేమో అని, ఆశగా ఎదురు చూస్తూనే ఉంది.
బయటకు చెప్పకపోయినా, సావిత్రి ప్రభాకర్ల పరిస్థితి కూడా అదే .ఉన్న ఒక్కగానొక్క కొడుకు ఎక్కడున్నాడో ? ఈ సంతోష సమయంలో తమకున్న ఒక్కగానొక్క కొడుకు ,దగ్గర లేకపోవడం వల్ల , వారి మనసు బాధతో నిండిపోయింది.
మరి రెండు రోజుల తర్వాత రాధ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళిపోయింది.
సావిత్రి, ప్రభాకర్లు మానసికంగా కుంగిపోయిన మనసుతో ఒంటరిగా మిగిలిపోయారు.
రాధ కూడా పెళ్ళ్లై వెళ్ళిపోవడంతో , సావిత్రి జబ్బు తిరగబట్టింది. సావిత్రి ఆరోగ్యం , రోజురోజుకు క్షీణిస్తున్నాది.
ఆమెకు కేన్సర్ వ్యాధి సోకింది.
భార్యకు వైద్యం చేయించే స్థితిలో లేని ప్రభాకర్, మౌనంగా
రోదించడం తప్ప , ఏమీ చేయలేకపోయాడు.
వయసు మీద పడి, ఇంటి పనులు బయట పనులు చేయలేక, నీరసించి పోయిన ప్రభాకర్ ని పక్షవాతం దెబ్బతీసింది.
విషయం తెలిసిన రాధ , భర్త అనుమతితో , కొన్నాళ్లపాటు తల్లిదండ్రులకు సేవ చేసేందుకు సాలూరు వచ్చింది.
ఇంట్లో ధన లేమి బాగా కనిపిస్తున్నది.
ఒకప్పుడు బాగా బతికిన తల్లి, తండ్రి, ఈ పరిస్థితికి దిగజారిన సందర్భాలు తలుచుకొని రాధ కన్నీరు మున్నీరైంయింది.
ఇంత దయానీయ పరిస్థితులలో ఉన్న తల్లిదండ్రులను,
మరో రెండు రోజులలో తన దగ్గరకు, అంటే హైదరాబాద్ తీసుకెళ్లి పోవాలని నిశ్చయించుకుంది.
రాధ ,ఇక్కడికి విషయాలన్నీ భర్తతో చెప్పగా, అతను వెంటనే వారిని ఇంటికి తెచ్ఛీమని , ఇక్కడికి వచ్చేక, వారిని మంచి డాక్టర్లు చూపిస్తానని. చెప్పాడు.
ఆరోజు సాయంత్రం రాధ , భర్త ,తన ఖర్చులు కోసం ఇచ్చిన డబ్బుల్లో, కొంత డబ్బు తీసుకొని "వెచ్చాలు" కొని తేవడానికి , మార్కెట్ కు వెళ్ళింది.
సామాన్లన్నీ తీసుకుని, డబ్బులు" పే' "చేస్తున్న సమయంలో "చెల్లీ "అన్న పిలుపు ,పక్కనే వినబడడంతో, రాధ తుళ్ళిపడి వెనుకకు తిరిగింది.
తన వెనకాతలే హుందాగా, సూటు- బూటుతో, నిలబడిన అందమైన వ్యక్తి కనిపించాడు .రాధ తేరపారి చూసింది. సందేహం లేదు అతడు కచ్చితంగా తన క్రిష్ణన్నయ్యే...
అన్నని చూసిన రాధ మనసు , సంతోషంతో తబ్బుబ్బైయింది.
ఆత్రుత ఆపుకోలేక "అన్నయ్యా "అంటూ ,గట్టిగా అరచి,
కృష్ణయ్యను హత్తుకుపోయింది.
కృష్ణకు కూడా, గొంతుకలో ఏదో అడ్డం పడినట్టై ,
మాటాడలేకపోయాడు.. కొన్ని సంవత్సరాల తరువాత కనిపించిన చెల్లెలు ,తన ఎదురుగా ఉండడంతో , అతను కూడా ఆనందంగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.
ఆ తర్వాత ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు
కృష్ణన్న ఇల్లు విడిచి వెళ్లిపోయిన తర్వాత, చాలా కష్టాలు పడ్డాడట.
కానీ, ముందు కష్టాలు పడ్డా ,తరువాత చదువు మీద దృష్టి పెట్టి , పట్టుదలగా చదవి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత, పిహె.చ్ డీ కూడా చేయడం తో, బ్యాంకులో మేనేజర్ గా ఉంటూనే, అంచలంచలుగా ఎదిగి, చాలా పెద్ద పోస్టులో, ఉద్యోగం సంపాదించి, ప్రపంచమంతా ఉద్యోగరీత్యా చుట్టి వస్తున్నాడని , హెడ్ ఆఫీస్ హైదరాబాదులోనే ఉందని, చెప్పగా, రాధ చాలా సంతోషించింది.
చెల్లెలు భర్తతో హైదరాబాద్ లోనే ఉంటుందన్న విషయం తెలిసి కృష్ణ కూడా చాలా ఆనందపడ్డాడు.
అటు పై రాధ ,కృష్ణ వెళ్లిపోయిన తర్వాత ,ఇంటి పరిస్థితులు ఎలా మారిపోయాయో, తర్వాత తన వివాహమెలా జరిగిందో, అనంతరం , అమ్మా- నాన్నల దైన్యస్థితి ,ఇప్పుడు ఈ సాలూరులో అమ్మ ,నాన్నలకున్న అనారోగ్య పరిస్థితి, నాన్నకున్న. అసహాయపరిస్థితుల గురించీ ,,అన్నీ వివరించి చెప్పింది .
అన్నీ విన్న కృష్ణయ్య ,తాను "అమ్మ నాన్నల గురించి, తన వివాహం గురించి, గత. సంవత్సరం బట్టి, కనుక్కుంటూనే ఉన్నాడని, తల్లిదండ్రులను చూడాలన్న ఉద్దేశంతోనే తను సాలురుకు వచ్చానని , అనుకోకుండా తనను కూడా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందని ,కంటనీటితో చెప్పాడు.
తర్వాత రాధ, అన్నయ్యను ఇంటికి రమ్మన్నాది .
కానీ కృష్ణ తను తల్లిదండ్రులకు ఎప్పటికీ ఎదురు పడలేనని, నిజం తెలిస్తే వారు తనను విడిచిపెట్టరని, తను తన " గే" సమాజంలో ఒకడుగా ఎప్పుడో కలిసిపోయి, వారి చలవ వల్లే పై చదువులు చదవగలిగి, ఈ స్థితికి చేరుకున్నానని,
తాను వచ్చినందువల్ల, సుఖంగా ఉన్న నా జీవితం కూడా అస్తవ్యస్తమవచ్చని తెలిపి బాధపడ్డాడు..
అమ్మానాన్నలను తనతో హైదరాబాద్ తీసుకెళ్లిపోమని వారిని మంచి హాస్పిటల్ లో చేర్పించమని, వారు కోరుకునే వరకు ఐన ఖర్చులన్నీ తానే భరిస్తానని, ఆమెను" దిగులు పడవద్దు" అని చెప్పి ,తిరిగి త్వరలోనే "హైదరాబాదులో కలుసుకుందాం "అని చెప్పి, తన ఫోను నెంబరు రాధకిచ్చి, రాధ ఫోన్ నెంబర్ తను తీసుకుని వెళ్ళిపోయాడు.
రాధ, అన్నయ్యని చూసిన సంతోషంతో, ప్రశాంతమైన మనసుతో ఇల్లు చేరింది.
అనుకున్నట్టుగానే రెండు రోజుల తర్వాత తల్లిదండ్రులను తీసుకుని హైదరాబాదు బయలుదేరింది.
అనుకున్నట్టుగానే మంచి ఆసుపత్రిలో తల్లిని ,తండ్రిని ఇద్దర్ని చేర్పించింది.
భర్త రమేష్ ,ఆమెకు అన్నింటా చేదోడువాదోడుగా ఉంటూ ఆమె మనసు కష్టపడకుండా చూసుకుంటున్నాడు.
మరొక నాలుగు రోజుల్లోనే హైదరాబాద్ చేరిన కృష్ణ , తల్లిదండ్రులను హాస్పిటల్ లో చేర్పించిన విషయం తెలుసుకొని ,ఆసుపత్రి ఖర్చులన్నీటికి సరిపడా డబ్బును ఏదో ఒక చోట కలిసి, చెల్లెలకు అందిస్తున్నాడు.
రాధా అన్నతో ,అతని విషయం రమేష్ తో చెప్తానని ,ఇంటికి రమ్మని చాలాసార్లు పిలిచింది.
కానీ కృష్ణ ,తాను ఈ ఊర్లో ఉన్నట్టుగా గానీ , ఆమెకు డబ్బు ఇస్తున్న విషయం గానీ, రమేష్ కు తొందరగా చెప్పవద్దని, తానే కొంతకాలం పోయిన తర్వాత రమేష్ ని కలిసి విషయాలన్నీ మాట్లాడతానని, చెల్లెలు దగ్గర మాట తీసుకోవడంతో, రాధ ఆ ప్రకారంగానే భర్తలేని సమయంలో అన్నని కలిసి డబ్బు తీసుకొని ఇంటికి వస్తున్నాది.
************
రాధ నోట్లో నుండి వస్తున్న ఈ విషయాలన్నీ ఆశ్చర్యంగా వింటున్న, రమేష్. , చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు.
తను రాధను పెళ్లి చేసుకునేటప్పుడు, వాళ్లకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని, ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాడని, వారు తెలియపరచనందున ,తను రాధను అపార్థం చేసుకున్నాడు.
సొంత అన్నను కలుస్తున్న రాధ గురించి తను ఏదో ఊహించేసుకుని ,మరోలా అపార్థం చేసుకుని రాధను అనుమానించాడు.
" కళ్ళు అబద్ధం చెప్తాయి" అన్నమాట.
అందుకే అన్నారు పెద్దలు ,చూసేవన్నీ నిజం కావని, విషయం తెలుసుకోనిదే ఎవరినీ నిందించవద్దని.
ఇక్కడ కృష్ణ,
ఒక కొడుకుగా తన తల్లిదండ్రుల ఎదుట పడాలన్న తపనతో కృష్ణ "ట్రాన్స్ జెండర్ "గా మారకుండా, తన జీవితమంతా కష్టాలను అనుభవిస్తూ, పెద్ద చదువులు చదివి, ఒక మగాడిగా నిలబడి, తన బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకు , కృష్ణను చాలా అభినందించాడు రమేష్.
ఇన్నాళ్లు ఈ బాధలు మనసులోనే దాచుకొని నలిగిపోతున్న రాధను అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాడు రమేష్.
అతను మెల్లగా లేచి, రాధ దగ్గరికి వెళ్లి, చేతులు పట్టుకున్నాడు "రాధా కంటితో చూసిన వన్నీ నిజం కావు" అన్న విషయం, నీ మాటల ద్వారా నాకు అర్థమైంది .ఎప్పుడు ఏ విషయాన్ని చూసినా, దాని వెనుకనున్న పరిస్థితులు, నిజా -నిజాలు తెలుసుకోకుండా మనుషుల్ని అపార్థం చేసుకోకూడదు అన్న విషయం నాకు బోధపడింది.
ఈనాటికైనా నువ్వు నాకు నిజం చెప్పినందుకు, నాకు చాలా సంతోషంగా ఉంది .ఇక నువ్వు ఏం బాధ పడకు .
కృష్ణను నా స్నేహితునిగా ఇంటికి పిలుద్దాం .అమ్మ నాన్నల్ని అతనికి చూపిద్దాం.
మనమంతా ఎప్పుడూ ఒక కుటుంబం వాళ్ళమే.
ట్రాన్స్ జెండర్ గా పుట్టడం కృష్ణ తప్పు కాదు.
నేను రేపే మీ అన్నను కలుస్తాను" అంటూ రాధను దగ్గరికి తీసుకున్నాడు రమేష్.
తనను ఎంతో అపార్థం చేసుకుంటాడనుకున్న రమేష్ ఈ విధంగా మాట్లాడడంతో రాధా ఆశ్చర్యానికి గురైంది .
తర్వాత ఆనంద పడింది .అతని మహోన్నత వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించింది.
ఇన్నాళ్లూ మనసులో అణచుకున్న బాధ, కన్నీటి రూపంలో బయటకు ఉబుకుతూ ఉంటే,, భర్తను గట్టిగా కౌగిలించుకొని ,భర్త రమేష్ గుండెల్లో తలదాచుకుంది రాధ.
****""""""""
--------------