Tuesday, November 20, 2018

మధుర స్మ్రతి.

               వాస్తవానికి దగ్గరగా.  నా ఆలోచనల ని మీతో. పంచుకోవాలని రాసే చిన్ని అనుభవం.
              "మధుర స్మ్రుతి "
          ------------------
హడావిడిగా  అరిచే భర్త ని ఆఫీసుకి ,
ఆరడి చేసే పిల్లలని. స్కూలు కి తరలించి ,  భారంగా ఊపిరి తీసుకున్నాను . వడలిన శరీరాన్ని     సేద తీరుస్తూ.  ఈజీచైర్ లో అలసటగా  నడుం  వాల్చేను  మరు క్షణం నా చెవులకి సోకిందొక చిరపరిచిత శబ్ధం.
టప్     ....టప్ .....టప్ ......
అంతే ...ఒక్క ఉదుటున. లేచి పరుగెత్తేను కిటికీ వైపుకి .    "వర్షం "తీసిన తలుపుల్లోంచీ  చల్లగా. , ఝల్లుగా ,   హాయిగా ......ఉత్సాహంగా.
పెరట్లోకి  పరుగెత్తేను .
వర్షం లో తడుస్తూ. నా అలసటని పారదోలుతూ. నన్నేవేవో. జ్ఞాపకాలలోకి  
తీసుకుపోతూ.... "వర్షం ".
ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నుల ముందు కదలాడే చిరుఝల్లుల
జ్ఞాపకాలు ....అవును ఇదే వర్షం లో నేనూ , నా స్నేహితురాళ్ళూ , చిలిపి గిల్లికజ్జాలూ...........

----------------
చేతుల్లో చేతులు వేసుకొని " వానా వానా చల్లప్పా "......అని పాడుకుంటూ.
అందరం కలిసి గుండ్రంగా గింగరాలు తిరిగే చిన్ననాటి చిలిపి సరదాలు .....
చెట్ల ఆకులపై పడే వర్షపు నీటి బొట్లని
నోరు పట్టి. జుర్రుకొనే ఆనంద  క్షణాలు ......
గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడుతూ చిందర వందర కబుర్లతో కలిసి స్కులుకి వెళ్ళే ఎత్తు- పల్లాల కాలిబాటలు .....
వర్షానికి తడిసిన పచ్చని పైరుబాలల తివాచీ తోరణాలు ......
చిరుజల్లు తో కలిపి వీచే చల్లని గాలులలోంచీ  వచ్చే  , తడిసిన మట్టి సుగంధాలు ...
పిల్ల కాలువల పారే నీటిలో , పోటీల కాగితపు పడవల వరుసలు ........
వేడి వేడి ఫల్లీలు తింటూ , ఉరుముల శబ్ధాన్ని. వింటూ , మెరిసే మెరుపుల్ని
వింతగా చూసే అమాయకపు.
,విస్మయ , చిన్నారి చూపులు.....
శ్రావణమాసపు  నోముల సందడిలో ,
పట్టు పరికిణీ , పావడాల  రెప రెపల తో
అమ్మ చేయి పట్టుకొనీ , అమ్మలక్కల ఇళ్ళకి. " పేరంటానికి ". వెళ్ళే తోవలో
గుడినుంచి వినిపించే. "జే గంటల " చిరు గణ గణలు ......
అట్లతదియ రోజు  ఆరు గంటలకే. ఉట్టికింద ముద్దలు తిని , ఊయలలాటలకై. , ఉత్సాహంగా పరుగులుతీసే కాలి మువ్వల గలగలలు ....
రాత్రి కాగానే. నాన్నమ్మ పక్కలో , వెచ్చగా ఒదిగి ఆమె చెప్పే చిలకమ్మ . కధలు  వింటూ ,   ఆశ్చర్యానందాల పసి హ్రుదయపు పులకరింతలు ......
ఇలా ఎన్నో. .... ఇంకెన్నో జ్ఞాపకాలు , ఇంకా నాలో మాసిపోని బాల్య స్మ్రుతులు.
ఆ రోజుల్లో ప్రతి రోజూ ఒక కొత్త వెలుగు
ప్రతి క్షణం ఒక నందనవనం .
ఆ రోజులు మళ్ళీ వస్తాయా .......అటువంటి.  పండగలు , సరదాలు. ఇప్పుడు  ఏవీ
పిల్లలలో  పసితనం వెతికినా కనపడ్డంలేదే ...

అలవోకగా ఆలోచిస్తున్న. నేను ,చెవులకి వినిపించే గంటలమోతకి. ఉలిక్కిపడి
గడియారం వైపు చూసేను .
సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ,
ఉస్సురంటూ కదిలేను .
ఆయన వస్తారు , పిల్లలు వస్తారు .
టిఫిన్ ఏమి చేయాలబ్బా ...... అనుకుంటూ వంటింటి వైపు కదిలేను
" రొటీన్ గా ".
               రచయిత్రి ,
   పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి ,
                 కల్యాణ్ .my iPhone

హిజ్రా..

హిజ్రా
-----
మానసికమైన  మౌన వేదన
కనపరచలేని కన్నీటి రోదన |
పెరుగుతున్న వయసుతోపాటు
మారుతున్న అంగాంగాల సోధన ||
నన్ను ప్రతి క్షణం
నలిపే వేదన ,
నాకే ఎందుకిలా ? అన్న
ప్రశ్నల ఆవేదన ||
ఆడా -మగల మధ్యలో , నేనెవరో
నిర్ణయించుకోలేని అతర్మధనం  
నిరంతరం నన్ను రగిల్చే
బడబాగ్ని గోళం ||
చెప్పుకుంటే నిరాదరణ
చెప్పకుంటే మనోవేదనల
మధ్య నలిగే అంతరంగం ||
నన్ను నిలదిసే మానసిక
బాధా  తరంగాల విత్తు
భారమైన గుండె కోతతో
నిండిన బాధాపూరిత భవిష్యత్తు ||
ఏమి చేయాలో తెలియని
గాధాంధకార హ్రుదయ దౌర్బల్యం
ఐనవాళ్ళందరినీ వదిలి వెళ్ళే
నిర్లజ్జా పూరిత నిర్ణయం ||
బతుకు -తెరువుకోసం
భారంగా నెట్టుకొస్థున్న భవితవ్యం
పట్టెడన్నం కోసం పడే ఆరాటం
జీవితాన్ని పణంగా పెట్టే పోరాటం ||
హిజ్రా లోకంలో హీనమైన
బ్రతుకు వాసం |
కనికరం లేని క్రౌర్య హ్రుదయులతో
కర్కశ  సహవాసం. ||
కుళ్ళిన ఒళ్ళు , మళ్ళిన వయసు
మత్తుగా చేసే విక్రుతపు చేష్ఠల
వీధి  ఆట బొమ్మలం  ,
క్రౌర్య మైన కామలీలలను
మౌనంగా భరించే
మూగ తోలు బొమ్మలం ||
జీవన గతిలేని విధి శాపగ్రస్థులం
రతికి పనికిరాని రాసలీలా రంకులం ||
ఐనా పడుపువ్రుత్తిలో బతుకుతున్న
పవిత్రమైన పతితులం |
కారే కన్నీటి మధ్య నవ్వులు పండిస్తూ
నగ్న ప్రదర్సనలతో నీచవ్రుత్తి
చేస్తున్న సతీ సావిత్రులం ||
-----------------------
రచన ,
పుల్లాభట్ల -
జగదీశ్వరీ మూర్తి .
కల్యాణ్ .

జే గంటలు.

జే గంటలు .
----------
నెత్తిమీమీద మట్టి ప్రమిదల
సరుకు బరువు
రెక్కాడితేగానీ డొక్కాడని
బడుగు బతుకు ||
ఎంత తిరిగినా
దమ్మిడీ రాని బేరం.
ఆగ్రహం వ్యక్తం చేయలేని
అసహనపు ఆక్రోశం ||
కాలంతో మారిన
ఆచారవ్యవహారాలంటూ
ప్రతీ మనిషీ వారికి వారే
ఇచ్చుకున్న భాష్యం ||
దీపావళి నాడు
వీధి వీధికీ వెలుగుతున్న
మిణుకు తళుకుల
కరంటు  దీపాల సాక్ష్యం ||
లేవెక్కడా పచ్చ
పచ్చని తోరణాలు
వాసన లేని ప్లాస్టిక్ పూలే
గ్రుహాలకి ఆభరణాలు ||
రతనాల ప్రాంగణాల్లో
రంగవల్లులకి బదులుగా
పరుచుకున్న ప్లాస్టిక్
స్టిక్కర్ల రంగు బిళ్ళలు ||
లేవెక్కడా గుమ్మాలకి
పసుపు కుంకాల కళలు
కనబడవు గ్రుహిణుల
మెడలో తాళి బొట్లు ,
నుదుటిపై కుంకాల
సిరి చిరు మెట్లు. ||
కత్తిరింపుల జుట్టుల్లో
కానరావు పూలచుట్లు.
చీరకట్టుకి నోచుకోని
చిత్రాంగులు ,
ఇరుకు వస్త్రాల్లో కనపరచే
ఆడతనపు అరుదైన రహస్యాలు ||
అద్దే రంగుల్లో అణగారిపోయిన
అమ్మతనపు లాలిత్యాలు ||
సమాజ మార్పుల వేటలో
మూతపడిన మిల్లులు ,
కుటీర పరిశ్రమల్లో చిల్లులు ||
కూటికి గుడ్డకి నోచుకోని
బీదరికపు చావులు ,
పంట చేతికందని
అప్పుల భయాల ఆత్మహత్యలు ||
వారు కార్చే కన్నీటి బిందువులు
మారుతున్న మనసులను
శపించే శక్తిహీన శాపాలు ||
వారుచేసే ఆకలి ఆర్తనాదాలు
మండే విస్ఫోటాలు ,
ముంచే సునామీలు ||
నాగరికపు పేరుతో మనం చేసే వ్యయం
ధనహీన కుటుంబాలకి
ఒకపూట గడిచే ఆదాయం. ||
మనం చేసే దండగల జోరు
మట్టి బతుకుల్లో అగుపడని
కన్నీటి హోరు ||
తెలుసుకో ఈ నిజం
మార్చుకో నీ నైజం.
మనం చేసే పని కావాలి
అందరి ఆనందపు ఆమని ||
మనం చేసే పండుగలు
అవ్వాలి కుటీరపరిస్రమలు
నడిపేవారికి వేడుకలు ||
మన ఆచారాలు , మన మనుగడని
శాసించే ఆరోగ్య సూత్రాలు.
మన వ్యవహారాలు సమత ,
మమతల మల్లెల హారాలు ||
మనం కొలిచే దేవుని
గుడి , గోపురాలు
మన ప్రాచీన సాస్క్రుతిక సాంప్రదాయ
ఇతిహాస చిహ్నాలకు నిలయాలు ||
మనం చేసే అన్ని పండగలు
అవ్వాలి ప్రతీ ఒక్కరి కన్నుల
విందులు , పసందులు ||
అవే మన మనసుకు
శాంతినిచ్చే గుడిగంటలు ,
మానవత్వానికి నిదర్సనంగా
నిలిచే ". జే గంటలు ". ||
-----------------------
రచన ,
శ్రీమతి పుల్లాభట్ల
జగదీశ్వరీ మూర్తి.
కల్యాణ్  .

అందాల పుాబాల.

అందాల పూబాల
-----------------
అందాల పుాబాల వికసించె  పరువాల ,
కలువ కన్నులతోడ చుాచె నాడా ఈడ ।
వింత లోకపు తీరు నెరుగనట్టిది బాల ,
ఎంతగానో మురిసె మనుగడెరుగని బేల ॥

అతోటలో పుాలు రంగు వలువల చెలులు,
వలపు వింజామరల పంచె సౌరభములు ।
మొగ్గ తొడిగిన సాటి పుాల బాలల తోడి ,
కవ్వింత తుళ్ళింత  లాడి పాడెను కలసి ॥

అంత నరుదెంచెనా  తోట  వనమాలీ,
పుాల బాలల  తెంపె వాడు దయమాలి।
విరిసి విరియని పుాల చేర్చె నంగడిలోన,
వెలగట్టి తెగనమ్మె కఱకు సందడితోన॥

చిదిమె కొందరు వాని  నలిపె భోగులు మేని,
కొన్ని చేరెను గుడికి..ఎన్నొ నలిగెను చితకి।
కన్నీట మున్నీట వాడి రాలెను నేల,
ఏల పుాచితి  ననుచు  వగచె  నలిగిన బేల ॥

                                           రచయిత్రి
                             పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
                                              కల్యాణ్

రేపటి ప్రపంచం

రేపటి  ప్రపంచం
-------------/-
అంతరిక్షం లో అలజడి మొదలౌతుంది
బాంబుల మంటల వేడికి తాళలేని
సుఁర్యుడు  , మేఘల్లో  మొహం     
చాటు వేస్తాడు.
మేఘాలు -మిస్సైల్స్
పొగలతో  జబ్బుపడి ,
పొడిదగ్గులు దగ్గుతాయి.
మిణుకు తారలు  ,
మ్రుత మానవులకు ,చోటు లేదంటుా
నినాదాలు చేస్తాయి.
పిల్లలకు  చదువుల్లో..''  ,
బాంబ్ తయారీ "ప్రాక్టికల్స్ ,
మారణహోమం ',
థియరీలు పెరుగుతాయి .
T.V. చానల్స్ లో ""రక్తపు రసాయనాలు ",
"బొమికల ఎరువులు " అన్న అంశం మీద
చర్చలు మొదలౌతాయి.
అమెరికా మేధావులు
"అస్థిపంజరాల రోబోట్లు " తయరుచేసి,
అడ్డమైన పనులు చేయిస్తారు .
రోడ్ల మీద చెత్తకుండీల జాగాల్లో
శవాల బండిలు నిలబడతాయి.
పంట పొలాలు బీడుబారి
బంగారు మట్టి జాగాలో
మందు గుండు మసి....కెమికల్స్
నుసి..గుట్టలుగా తేలుతుంది.
డొక్క పీనుగులు ,బక్క ప్రాణాలతో-
ఒడి పట్టని " భరతమాత ",
భారం మోయలేక బాధతో
భోరున విలపిస్తుంది.
                              రచన,
                              శ్రీమతి
       పుల్లాభట్ల   జగదీశ్వరీముార్తి.

జీవితం.

              జీవితం  .
-------------------------------
                
జీవితమే నడి సంద్రపు నావ
తెలియని బ్రతుకొడిదుడుకుల త్రోవ
అలల  ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది ? ఏమని అడిగేది..?॥

గడచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలె దొంతరలై కదిలే
వెదకిచుాడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యధ కలిగించె..॥

ఎవరిని ఎన్నని  ఏమిటి లాభం
గడచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై  నే నిలచిన  క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం..॥

భువిలో  ఎన్నో అక్షర మాలలు
ఉచ్ఛ..నీచ , ఆచారపు దాడులు
జాతి -మతముల జాడ్యపు మరకలు
తెరవని తలపుల అడ్డుగోడలు...

జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి ,  తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేదీ నీ వెనుక  యాత్రలో..

ఒంటరినై నెే  నిలచిన క్షణం  నా
మనసే నాతో మాట్లాడు నేస్తం...॥
------------------------------------------
ఈ కవిత నా స్వీయ రచన.
దేనికీ  అనువాదము కాదు అని తెలియచేయడమైనది.
----------------------------------
                      (Date )               
                   1/15/2019.

                      రచన ,
     పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి..
                     .కల్యాణ్.
                 
-------------------------------------------------------------- P.S. Murthy ...101,
Vighnahar Sankul ,
Birla collage Road.,
Bhoir wadi.
KALYAN ( west ).
8097622021.
----------------------.

ఓ పడతీ....

ఓ పడతీ
----------
ఓ పడతీ...పైట కప్పుకో..
పైటలాగ గానే
పరుగెత్తుకొచ్చే పరంధాముడు
ఇక  రాడు....లేడు గనక..

అసహ్యపు హీన బ్రతుకును
ఆస్వాదంచే    మ్రుగ మగాడికి
నీ ఆర్తనాదం  ఆనందగీతమై  
అర్ఘ్యం పోస్తుంది    అందుకే ...
ఓ  పడతీ...పైట కప్పుకో...

ఎవరో వస్తారని   ఏదో చేస్తారని
ఎన్నాళ్లిలా  ఎదురు చుాస్తావు
కాగితపు నోట్లకి అమ్ముడు పోయిన
న్యాయం...కామాంధుడికి
అద్భుత  దీపం లాంటది.
కసిగా రుద్ది...కరకుగా వాడుకోవడమే
కాదు
కోరిన వారికి   కావలసినంత
పంచేంత
దుర్గుణ  హేయానంద
హృదయం వాడిది
అందుకే...ఓ పడతీ...
పైట కప్పుకో..

నీవు అక్రోశించిన  ప్రతీ చోటా
దుశ్శాశన రాజ్యం
దుందుభిలు
మ్రోగిస్తోంది
సిగ్గు విడచిన సీమ పందుల్లాంటి
జనం మురికిలో కామం మందు
తాగి పొర్లుతుా.మలం
నంజుకు తింటున్నారు
అందుకే..ఓ..పడతీ..
పైట కప్పుకో..

పాచికలు పారడానికి  
సిద్ధంగా ఉన్న
శకునులతో జూదమాడి
ఓడిన  తలలు
సిగ్గుతో  వాలి  పోయాయి .
అవి నిన్ను  చుాడలేవు.
అందికే..ఓ  పడతిీ....
పైట గట్టిగా క ప్పుకో ॥
                  ఎందుకంటే
న్యాయం గుడ్డిదే కాదు.
చెమిటిది. ...ముాగదీ కుాడా
దానికి నీ ఆర్తనాదాలు
వినబడవు
అవి రాజకీయ సీస శాశనాలతో
ముాసుకుపోయాయి
దాని నోరు పదవుల పెద్దనోట్ల  
పక్షవాతంతో   ఎప్పుడో  
పడిపోయింది..అందికే...
ఓ.....
పడతీ...పైట గట్టిగా కప్పుకో
పైట లాగినంతనే పరగెత్తుకొచ్చే
పరమాత్ముడిక్కడ...లేడు. .
ఇంక రాడు కుాడా...

                   రచయిత్రి
     పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.

అమ్మ.

అమ్మ
-------
అమ్మ కుక్షిలో తలదాల్చుకున్న్ క్షణం నుంచీ
తన రక్త మాంసాలను నా ఆకార వికాశానికి
ధారపోసి , తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
                               అమ్రుతమయి.  "అమ్మ "

భూమిపై పడిన క్షణంలో , విడీ విడని కన్నులతో
ప్రపంచమెరుగని మెదడుతో , నాలో. కదిలే
భావాలకు నాందిగా పలికే మొదటి పలుకు
ఉవ్ •••వా •••లో ఇమిడిన.,
                                 ఓంకారధ్వని. " అమ్మ "
ఆకలి బాధకు తాళలేక , ఆక్రోశిస్తున్న నన్ను
తన వెచ్చని ఒడిలో సేద దీర్చీ ,  తనలో నున్న
రక్త స్రావాలను , క్షీర రసాలుగా. మార్చీ -
నా ఆకలి తీర్చే కారుణ్య ఖని ,
                                      అన్నపూర్ణ. " అమ్మ "
వచ్చీరాని నడకతో. తప్పటడుగులు వేస్తూ
నిలదొక్కుకోలేని నాకు చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన అనురాగమయ-
                                     మార్గదర్శి. " అమ్మ "
బడిలో చేరిన క్షణం నుంచీ , నా  విజ్ఞానానికి
తోడ్పడుతూ , నన్నూ నా పుస్తకాలబరువునీ
మోస్తూ , నా భవితవ్యానికి పూలబాట వేసిన -
                                      గురుమూర్తి " అమ్మ".
వయసు తెచ్చిన అహంకారంతో , అమ్మ
మమకారానికి , మూర్ఖత్వాన్ని. జోడించీ -
మంచి మాటలు పెడ చెవిని పెట్టీ - చెడు
సావాసాలకి బలియై , రోగాల పాల్పడిన నాకు
పగలూ ,రాత్రీ. సేవలు చేసీ , నా ఆరోగ్యానికి
తన జీవితాన్ని పణంగా పెట్టిన ,
                                జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో  కూడా , నాకై ఆరాటపడుతూ
తలకు కొరివి పెట్టిన పాపం నాకు అంటరాదని ,
తను బూడిదై గంగమ్మ లో కలిసే వేళ ,
నా చేతుల మీద పోతూ ,  నాచే మూడు -
మునకలు వేయించీ , నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటుమోసుకుపోతూ , సుదూర తీరాలకు
శాంతిగా సాగిపోయే పవిత్ర -
                           క్షమా ధరిత్రి. " అమ్మ "
కారే కన్నీళ్ళతో , నాకళ్ళు మసకబారేయి.
నాతో ఉంటూ , నాకై తపిస్తూ , నా కష్టాలని
ఇష్ఠంగా పంచుకొని , నాకై "సమిధ " లా
కరిగిపోయే "అమ్మ" కు , కనీసపు గుర్తింపు
ఇవ్వని నేను , అమ్మ కోసం విలపిస్తున్నాను.
                                    " అమ్మా -----అంటూ
నన్నో ఒడ్డుకు చేర్చి నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా - న్నాశీర్వదించే -,
                                        దేవత "అమ్మ "

           
-----------------------------------------------------------
             రచన ,

             శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
             కల్యాణ్.

కరచాలనం.

కరచాలనం
-----------
పలక బలపము పట్టి , ఓ,న,మా ,లను దిద్ది
వలయు విద్యల తీర్చి  దిద్దు చేయి.
గురువు పెద్దల పదము లంటి దండములెట్టు ,
చనవు నాశీర్వచనమిచ్చు చేయి. ||
కార్య భారములెల్ల ఇంపుగా సవరించి
నవ్య స్నేహపు పాలు పంచు చేయి.  
కావ్య రచనలు చేసి కీర్తి. బడసిన చేయి
దివ్య జ్యోతుల నింట వెలిగించు చేయి ||
అతిధి సత్కారముల నందెవేసిన చేయి
ఆదరించీ అన్నమెట్టు చేయి.
అడిగినంతనె లేదు లేదన్న మాటొదిలి
కలిగినంతయె  దాన మొసగేటి చేయి. ||
గుడిలోన జేగంట మోగించి వేల్పులను
మనసార ధ్యాన్నించి మొక్కు చేయి.
దడిలోన పూలన్ని దెచ్చి మాలలు గుచ్చి
తగు భక్తి గురుసాయి సేవించు చేయి. ||
ఇష్ఠాల విందులను ఇచ్చి మురిసెడు చేయి
కష్ఠాల కన్నీరు తుడుచు చేయి.
నష్ఠాల నగుబాట్ల. తట్టి ధైర్యము నిచ్చి
శ్రేయమౌ శుభములను ఒసగేటి చేయి ||
గట్టి మేలును చేయు ఘనమైనదాచేయి
అట్టిదానిని పట్టి ఆదరింపగదోయి.
జట్టు సేయగ వచ్చి. కరచాలనము చేసి
మేటి సంస్కారములనందుకోవోయి ||
---------------------------------
రచయిత్రి  
శ్రీమతి
పుల్లాభట్ల  జగదీశ్వరీ మూర్తి.
కల్యాణ్

రాజకీయ చదరంగం.

చదరంగం
----------
రాజకీయ "చదరంగంలో" పావులైన
"సిపాయి" ప్రజానీకానికి. " రాణీ "
మాయ మసి పూస్తోంది ॥

మారే మంత్రులతో మంతనాలు జరిపే
సత్తా " గుర్రాలు" ,దాట్ల దారుల్లో
సంధి కుదుర్చుకుంటున్నాయి. ॥

రాజకీయపుటెత్తుల్లో
రంగులు మార్చిన
గుంట నక్కలు  ,  
-"ఏనుగు" ముసుగుల్లో
అంబారీలు ధరించేయి. ॥

సత్తా తొత్తులుగా మారిన
సత్తు "శకటాలు , "
సామాన్యుణ్ణి  దోచుకునేందుకు
అడ్డ తోవలు పడుతున్నాయి. ॥

మాటకి నీతికి కట్టుబాటు లేని
మహామహులమధ్య
మాటి మాటికి మారే సత్తా
రాజ్యాంగాన్ని "  చెక్ " చేస్తూ
సవాలుగా నిల్చుంది. ॥

నల్ల నుడి తెల్ల గడుల రాజకీయ
రహదారుల్లో దాగు ఉన్న
అణుబాంబుల ఆకస్మిక పేలుళ్ళకు
ఆహుతయ్యే " సిపాయి"  జనాల్ని
అలవకగా అడ్డు తొలగించి
ఆటలు సాగిస్తున్న. హేయమైన
హింసా రాజకీయ ఎత్తుగడలకి
ప్రజా   " పావులు ",
పాడెకెక్కుతున్నాయి. ॥

-----------------------------------
రచన  , శ్రీమతి,
పుల్లాభట్ల జ్గదీశ్వరీమూర్తి
                             కల్యాణ్.


కవితోత్సవం కొరకు.
------------------------------.

చిలకమ్మ కధ.

చిలకమ్మ కధ
------------
అందాల ఓ చిలుక  
ఆకాశమందునా
గూడు కట్టగ తలచి
నింగి నెగిరీ పోయె ||

చెట్లు చేమలు నిండు
ఓ చిన్ని అడవిలో
గుబురు నిండిన
ఆకు చివురు కొమ్మల నడుమ
ఏరి చేర్చెను
ఎండు పుల్లలెన్నో వెదికి
గూడు వెలసెను తుదికి
సేద తీరగ మదికి ||

ముద్దు ముచ్చటవలసి ,
కోరి తానే వలచి
గోరింక తోడుగా. ,
చిరు కూనలను సాకె ॥

కిచ  కిచలు అవి పలుక
చిన్ని రవముల తోడ
చిందులేసెను చిలుక
గోరింక జత కలుప ||

ఏఏటి కా ఏడు
తీరనీ భయమంట
తరుల గూల్చెడి నరుల ,
మ్రొక్కి వేడెడిదంట ॥

ఎగరలేని కూన ,
ప్రాణాలె పణమంట
చిలకమ్మ కంటిలో ,
కన్నీటి వరదంట ||॥

నమ్మలేనీ వింత ,
మరుగాయె వనమంత
నీడ నిచ్చెడి జాడ
కానరాలేదంట ॥

తరుల జాడలు తరిగె.
కొండ చరియలు విరిగె
చిలకమ్మ గూటికై  ,
చిరునీడ కరువాయె ||

( దయచేసి పర్యావరణ రక్షణ చేయండి )

--------------------------------------
       రచన. శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
     కల్యాణ్  ( మహరాష్ట్ర  ).

స్వాతంత్ర్య గీతం.

స్వాతంత్ర్య  గీతం
----------------
పాడవోయి విజయగీతి
పుడమితల్లి వెలుగు కీర్తి
అమరులైన వారె స్ఫూర్తి
స్మరియించే శుభదినం
స్వాతంత్రపు వరదినం ||

సమసమాన భావనతో
కలసినారమీదినం
కుల మతాల భేదములను
కూలదోయుటే ధనం ||

తర తరాల చరితలకే
నిలువుటద్దమీదినం
వీరగతిని పొందు ఘనుల
త్యాగ ఫలపు సత్ దినం ||

స్వాతంత్ర్యపు హక్కులనే
పొందినార మీదినం
భరత మాత కీర్తి ఘనత
చాటి నిలుపు గౌరవం ||

సత్య,ధర్మ, శాంతి గురుతుగా
ఝండా నిలుపుదాం
చేయి చేయి కలిపి మాత
ఒడిని శాంతి నిలుపుదాం ||

అహింస దారి అడుగులేసి
ఆగడాలనాపుదాం
ఆదర్శపు బాట నడచి
ఆనందం పంచుదాం ||

సమత మమత పెంచి
భరతమాత  కీర్తి పెంచుదాం
మన ఝండా ఎగురవేసి
విశ్వ శాంతి నిలుపుదాం. ॥
------------------
      రచన.
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి
                      కల్యాణ్.

తెలుగు తల్లికి వందనం .

తెలుగు తల్లికి వందనం
----------------------
తెలుగు తల్లికి వందనం. మన
వెలుగు  కీర్తికి వందనం.
తెలుగు వెలుగై తరలి వచ్చెను
పలుకు తేనెల సుధలతో
మల్లె మాలల మధుర సౌరభ
మొప్పు మాటల  కళల తో ||
వేద ఘోషలు పుణ్య గాధలు
తల్లి   నడిచెడు  పథములు
తెలుగు  తల్లికి  వెలుగునిచ్చే
కీర్తి చంద్రిక తారలు ||
తేటగీతులు , ఆటవెలదులు
కంద సీసపు మాలలు
తెలుగు పద్యపు పాదములనిడు
మేలి సిరి సిరి మువ్వలు ||
విజయనగర  కాకతతీయుల
ఖ్యాతి ఆమెకు వైభవం
రత్నగర్భ గ పేరు తెచ్చెను
కోటి నిధుల ప్రాభవం ||
జాతి కవులుగ పేరు గాంచిన
సుతుల కీర్తులె తేజము
ఆంధ్ర కేసరి వంటి సుతులకు
మాత ఒడి తరు కల్పము ||
మేలు సంస్క్రుతి నిండు ధనమే
తెలుగు తల్లికి భరణము
సంప్రదాయ సంగీత గీతులె
వన్నె తెచ్చెడి సద్ధనం ||
కూచిపూడి నాట్య సంపద
కొలువు  దీరిన  వైభవం
తెలుగు దనమే మనకు అభయం
తెలుగు బాట అదే స్వర్గం.
-----------------------------
                రచన.  శ్రీమతి
                  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.

Monday, November 19, 2018

కవిత ( కపిలవాయు లింగముార్తిగారి పై )

నమస్సుమాంజలి
-------------------------
తెలుగు చదువు సున్న
పర భాష మిన్న , అన్న పద్ధతిలో
ఇంచుమించు, మాత్రుభాషను
మరచిపోయిన మన దేశంలో
అవతరించిన సాహిత్య సౌరభాల
స్ఫుార్తి " శ్రీ కపిలవాయి లింగముార్తి "॥.
మాత మాణిక్యమ్మ  వడి పండిన
కీర్తి   కిరణాల తేజో పుంజం.
తండ్రి వేంకటాచల స్వప్న
సార ,  సర్వోన్నత బీజం.॥
తెలుగు సాహిత్యాన్ని
విస్తరింపచేయాలన్నసంకల్ప బలం ॥
అక్షర యజ్ఞాన్ని అవలీలగా పుార్తిచేసిన "పరిశోధనా పంచాయన" వ్రుక్ష రాజం ॥
సాహిత్య సారాన్ని ఔపోసన పట్టి
పురాణేతిహాస సారాన్ని ,
పదిలంగా మనకందించిన
" సాహిత్యోద్ధండ పండితుడు ."॥
కంద అందాలు,
ఆటవెలదుల చందాలు,
సీస పద్య గంధాలు చేర్చి
యతి ప్రాసాభరిత వచన
పద్య-గద్య- సాహిత్య సారాన్ని
మనకందించిన నిష్కల్మష సేవా
దురంధర " సాహిత్య భీష్ముడు ॥
గౌరవ " డాక్టరేట్  బిరుదు " ను
సగౌరవంగా అందుకున్న
సమన్వయ " సాహిత్య   సింహం.".॥
సరస్వతీ కటాక్షం  నిండుగా
లభించిన  తెలుగు భాషా ,
        సాహిత్యాక్షర
  " స్వర్ణ సౌరభ కేసరి "॥
తెలంగాణా కీర్తి కిరీటంలో
కైసేయబడిన వెలలేని 
ఆణిముత్యాల మధ్య  కొరలుకొన్న
మేటి " మాణిక్య తేజో పుంజం "॥.
" నంది  అవార్డ్ " తో సన్మానింపబడి
పద్యాలంకార  సార సాహిత్య
తిలకాన్ని నుదుట ధరించిన
          , అక్షర వైబోగ
"  ఆద్యోదయ అంశుమారి ".॥
గౌరవ బిరుదాంకితులు , కావ్య
సాహిత్య " కవితా కళానిధులకు "
  " సాదర నీరాంజనావళి "---
      " కపిలవాయి కళాపీఠ " -
             స్థాపనాంజలి.॥
-----------------------------------------
రచన ..శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                కల్యాణ్.

   

Sunday, November 18, 2018

కవితాగానం...శ్రీగిరి రమణుని.

శ్రీ వేంకటేశ్వర వైభవం.
---------------------------
శ్రీగిరి రమణుని
సుందర రుాపం
కనులార చుాచిన
తొలగించు పాపం
మహిమాన్వితమౌ
మంగళనామం
మదిలో తలచిన
మముగాచు దీపం॥
నిగమాగముడు 
నిత్య సంతోషుడు
నిరతము నగవుల
నిలచెడు వాడు
కరిబ్రోచిన హరి
కరుణా మయుడు
కలియుగ
వెైకుంఠ ధాముడు॥
శంఖము , చక్రము
ఇరువైపుల నిడి
శంకల బాపెడు దేముడు
మంగళ రుాపుడు
ముడుపులు గొనువాడు
మా ఇలవేల్పుడు
తిరువేంకటేశుడు.॥
-----------------------------
రచన.
శ్రీమతి పుల్లాభట్ల,
జగదీశ్వరీముార్తి .
కల్యాణ్.

కవితాగానం ..అమ్మా మాయమ్మ।

శ్రీ వేంకటేశ్వర వెైభవం.
--------------------------------
అమ్మ । మాయమ్మ ।
అలమేలు మంగమ్మ.
మొరవిని గాచేటి తల్లి 
మమ్ముల కావమ్మ.॥
నమ్మిన మా దైవము ఆ
నవతులసీ ధాముడు
వైకుంఠ వాసుడు -
వేల్పిలవేల్పుడు.॥
ఏలిక మా మొరవినగ
ముడుపుల సిరి  కోరినాడు
శ్రీ గిరులేలేటి విభుడు
నీ ప్రియ వల్లభుడు.॥
నీల వర్ణమువాడు
నిత్య శోభనాల రేడు
నిత్యపుాజలందువాడు
నగవుల నిలుచున్నాడు॥
శిలయై వెలసేడు..మా
మొర వినిపించుకోడు.
కల్ల కాదు నీ తోడు
నీ విట కేతెంచి చుాడు.॥
-------------------------
రచన. శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
                 కల్యాణ్.

కవితాగానం...పరమపదమునకు సోపానము

శ్రీ వేంకటేశ్వర వైభవం.
-------------------------------
పరమపదమునకు సోపానము
వేంకట గిరిపతి శుభ నామము .
పదమున కైవల్య పథమును చుాపెడు
కరుణాంత రంగుని గుణగానము॥

పరమాత్ముడు శ్రీ వైకుంఠ ధాముడు
ధర వెలసిన కలియుగ దేముడు .
తిరుమల శిఖరాల వెలసిన భుా ధవుడు
యిడుముల బాపేటి పరంధాముడు ॥

పదునాల్గు కళలతో పరి పరి విధముల
అలరారు శ్రుంగార రస లోలుడు ,
శ్రీదేవి , భుాదేవి , ఇరుగడల సేవంప
లోకాలు పాలించు జగదీశుడు ॥

శంఖ- చక్రాదులను  కరముల ధరియంచు
పంకజ నాభుడు పరంధాముడు.
ముాలము తానని  ముడుపుల గైకొని
వెరసి చెప్పే విభుడు శ్రీ వేంకటేశుడు ॥
---------------------------------------------------
రచన .
శ్రీమతి. పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
                               కల్యాణ్.

కవిత ..నవంబర్ 14.

చాచ‍ా నెహృుా.
శీర్షిక :నంబర్ పధ్నాలుగు,
------------------------------------
పిల్లల మదిలో  బాలల దినోత్సవ
ఉత్సాహపు ఉరుకుల, సందడి.॥
పెద్దల యదలో స్వాతంత్ర్య వీరుల
బలిదానపు జ్ఞాపకాల అలజడి ॥
దేశ స్వాతంత్ర్యం కోసం, తమ-
జీవితాలని ధారపోసిన ,
ధన్యజీవుల , బాధా భరిత
గాధా తరంగాల, కన్నీటి ఝరి.॥
మనిషి " లో" మనిషిని తట్టి లేపే
నిశ్శబ్ద  సందేశ  నినాదాల,
చైతన్యపు సడి.
గుండెను కరిగించే చరిత్రల,
జ్ఞాపకాల  ఆశయాల బడి.॥
తరాలు నారినా , మారని ఆనాటి
మహోన్నత వ్యక్తుల జీవిత పుటలు
ఈ నాడు రచ్చకెక్కిన రాజకీయ
రాట్నాల లో నలుగుతున్న-
అసందర్భపు చర్చల స్వార్ధపు వేటలు ॥
పర్యవసానం.
----------------
నెహ్రుా వంటి ఎందరో
మహాత్ముల త్యాగ చరిత్రలు ,
ఈనాటి కఠోర కర్కశ నిర్ణయాలకు
కలుషితమైన  త్యాగామ్రుత  పానాలు.॥
భవితవ్యానికి బాటగా నిలిచే
అలనాటి బంగారు చరితల
జ్ఞాపికల దినోత్సవాలు,
ఈనాడు భయంకరమైన ,"
" మధుమేఘ " మహమ్మారీల
ఆనవాళ్ళకు ఆలంబనలు.॥
ఫలితం.
----------
ఇకముందు  జాతీయ ఝండా గుర్తుని
తమ యుానిఫారంకు తగిలించుకొని
జాతి పితల త్యాగ నిరతి గాధలను
ఆలాపించే ఆదర్శ బాల-
 బాలికలిక  కానరారు.
వారి పాటల స్ఫుార్తి తో..
దేశభక్తి  పొంగిపొరలి..
దేశోన్నతి కోసం పాటుపడాలన్న
 తపనావేశం కలిగే యువత
ఇక ఏనాడుా మేలుకోదు.॥
ఈ మార్పు సమత- మమతల
శాంతియుత సమాజ
 సమాధికి నాంది.॥
మన నుదుటి రాతను
మనమే రాసుకున్న ,
విధి వైపరీత్యాల విక్రుతి
చేష్టల విద్రోహాలకు సాక్షి.॥
-----------------------------
రచన.
శ్రీమతి, పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.



శాంతి కపోతం.


రచన.. శ్రీమతి,  పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
                                         కల్యాణ్.

ఆకాశం లో అందమైన  హరివిల్లు.
ఎన్నో ఊహలతో మదిలో విరిజల్లు.
మాటలకందని మధురానందం.
ఏడురంగులు ఏకమైన కాంతి .
మదిలో భావాల మధురుాహలకు
 రెక్కలు  మొలిచి విహరింప చేసే
 తెల్లని శాంతి కపోతమై  ఆకాశంలో
నీ, నా భేదాలు లేనిచోట
నిర్మలమైన తెల్లని మనసుతో హాయిగా
విహరిస్తొింది. కవన వనంలో చల్లని
వెన్నెలను పంచు భావ గీతంలా ॥