Sunday, December 30, 2012

Sree Sai Harathi. (.namminavaarikade )

Sree Sai Haarati.(Namminavaarikade..)
శ్రీ సాయి హారతి .
-------------------------------------
నమ్మినవారికదే భవుడవు శ్రీ సాయీ , మా సాయీ
నమ్మకమిదె మా సమ్మతి మంగళ హారతి గొనుమోయీ ||

భోగములన్నియును విడచి యోగముతో శ్రీ సాయీ
యాగములెన్నొ చేసి యోగిగ భువి నిలచితివోయీ
నమ్మినవారికదే భవుడవు .....................(పూర్తిగా )

ద్వారక చావడిలో తపమును చేసితివీ శ్రీ సాయీ
ధర వరమందీ ,ధన్యత నొంది దీనుల బ్రోచితివీ
నమ్మినవారికదే భవుడవు .......................(పూర్తిగా)

సాధు మహా సంతా సద్గురు శ్రీ సాయీ వినుమోయీ
లేరిక భువిలో వేరే దైవము మాకిక గురు సాయీ
నమ్మినవారికదే భవుడవు ......................(పూర్తిగా )

పాపము పరిమార్చే దైవం సాయి హరే , శ్రీ సాయి పరే
పావనపాలకు-డీతని చరితము మా కిల వేదమదే
నమ్మినవారికదే భవుడవు ....................(పూర్తిగా)

షిరిడీ ధామమదే సాయీ వాసమదే నివాసమదే
కలదీ భూమికి పుణ్యపు చరితము, సమాధి వెలసెనదే
నమ్మినవారికదే భవుడవు ........................(పూర్తిగా)

సత్యము తాననుచూ దీనుల బ్రోతుననీ , పాలింతుననీ
సమాధినుండీ పలికిన సాయిని సన్నుతి చేయరదే

నమ్మినవారికదే భవుడవు శ్రీ సాయీ మా సాయీ
నమ్మకమిదె మా సమ్మతి మంగళ హారతి గోనుమోయీ....
|| మూడు సార్లు ||

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక
రాజాధి రాజ యోగిరాజ పరబ్రహ్మ
శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు
శ్రీ సాయినాధ మహారాజ్ కీ జై ||

ఓం శాంతి , శాంతి , శాంతి:
----------------------------




Wednesday, December 26, 2012

Amdinanta dooramlo

    అందినంత దూరంలో  అగుపిస్తావు .
_______________________________


అందినంత  దూరం లో  అగుపిస్తావు - సాయి
కొంత దరికి రానిచ్చి మురిపిస్తావు
మేలమింక  చాలు చాలు మము దయ నేలు
ప్రేమతోడ వినుమా మా వేడికోలు       || అందినంత ||

బంధ మేమొ తెలియదు నిను వీడలేమూ
ఇంపు మాకు వీనులకిదే నీదు నామమూ
మనసులోని మసలు  దేవ  దేవుని ఆన
రూపు నీదు కాన వచ్చె ప్రతి గుడిలోన || అందినంత ||

అలసినాను అడుగడుగున బ్రతుకు బరువుగా
సేదతీర్చి లాలించే సాయి నీవేగా ......
వలసినంత వరములనిడు మంచి దాతగా- సాయి
వెలసినావు షిరిడీ లో మాడు  వేల్పుగా ||అందినంత||
_____________________________________
_____________________________________








Friday, December 21, 2012

నమస్కారమిదె నీకు సాయీ

Namaskaaramideneeku saayee mammelu 

నమస్కారమిదె నీకు సాయీ మమ్మేలు. (  ఈ పాట అందరు కలిసి గ్రూప్ గా పాడాలి   ఆరతి  పాట కాబట్టి , దానికి  సరిపోయిన  మ్యూజిక్  చేయాలి . షిరిడి లో హారతికి వాయించినట్టు 
--------------------------------------------
తలపైని  తలపాగ  చుట్టేవు  నీవు
కఫ్నీని   నిండార   ధరియించినావు
మమ్మేలు మా మంచి  గురువైతివీవు
నమస్కారమిదె  నీకు సాయీ మమ్మేలు ||

మెడలోని హారాలు మా ప్రేమ పూలు
నీ  చేతి  అభయమ్ము  మా భాగ్యమేలు
నీ  పాద పద్మాలు మమ్మేలు  జేలు
నమస్కారమిదె  నీకు సాయీ మమ్మేలు ||

తత్త్వప్రకాశమ్ముతో  సాయి నీవు
నిత్యాగ్ని  ధునిలోన  ద్యుతివై  వెలిగేవు
సత్యాన్ని బోధించు  సారమ్ము నీవు
నమస్కారమిదె  నీకు  సాయీ  మమ్మేలు ||

నీ చేతి  ఓషధులు  తినిపించినావు
మా  ఒంటి  బాధలను  తొలగించినావు
మాలోని  లోపాలు  మన్నించినావు
నమస్కారమిదె  నీకు  సాయీ మమ్మేలు ||

మనమంత  ఒకటంటు  బోధించినావు
ఇల  తారతమ్యాలు  తొలగించినావు
నీ  ప్రేమ- పాశాన   బంధించినావు
నమస్కారమిదె నీకు  సాయా మమ్మేలు ||

నిరాకార  సాకార సత్యమ్ము నీవు
పరాకేల  పరబ్రహ్మ పరమాత్మ  నీవు
పరే  సాయి  సంపూర్ణ  భగవంత  నీవు
నమస్కారమిదె నీకు  సాయీ మమ్మేలు ||
నమస్కారమిదె నీకు సాయీ  మమ్మేలు
నమస్కారమిదె  నీకు  సాయీ మమ్మేలు ||

               

Tuesday, December 18, 2012

Nivedana

                            
                            Nivedana 
                              నివేదన .
                             ----------
                          " స్తోత్రం కస్యన తుష్టయే " అని  మహాకవి కాళిదాసు అన్నారు . అంటే
 ఈ ప్రపంచంలో స్థుతిచే  ప్రసన్నులు  కానివారేవ్వరూ  ఉండరు  అని అర్ధం .
                           అందికే వేదాలు , పురాణాలు,  కావ్యాలు , మొదలైనవి స్తోత్ర  పఠనానికి
 అనువుగా అభివర్ణిoపబడి  ఉన్నాయి  .
                              నవవిధ  భక్తులలో ఏ  విధమైన భక్తితో  భగవంతుని ఆరాధించినా ,ఆతని
అనుగ్రహానికి  పాత్రులమే అవుతాము .అందులో ఒకటైనది ,సామవేదం  నుండి పుట్టినది
శాస్త్రీయ సంగీతం . సంగీతారాధనతో ఆ దేవదేవుని ప్రసన్నం చెసుకొని ,ముక్తిని  , మొక్షాన్నీ
పొందవచ్చుననే  సత్యాన్ని , తమ సంగీత పాండిత్యంతో  నిరూపించిన  ఎందరో వాగ్గేయకారులు
మనకు మార్గ దర్శకులు .
                              సప్త స్వరాలతో కూడుకొని ఉన్న ఈ సంగీతం 72 మేళకర్తలలలో
నిబిడీకృతమై ,  సంపూర్ణ రాగాలు , జన్యరాగాలు, ఉప రాగాలు  గా విభజించబడి
అన్య స్వర ప్రయోగాలతో  , లలిత సంగీతం  , సినీ సంగీతం ,జానపదాలు ,పల్లెపాటలు
ఇలా ఎన్నో విధాలైన  సంగీత  రూపాలకు  ప్రాణం పోసింది .
                             పలురూపాలుగా అవతారమెత్తిన పరమాత్ముడు కలియుగంలో  శ్రీ -
సాయినాధునిగా అవతరించి , అడిగినంతనే  ఆపదలు బాపే అంతర్యామిగా  గణుతికెక్కిన
 యోగపురుషుడు .
                              భక్తికి , భావుకతకి  ప్రాముఖ్యతనిచ్చి , కొన్ని రాగాలను, సినీ సంగీతాన్ని
   ఆధారంగా తీసుకొని అన్య స్వర ప్రయోగాలతో  స్వరపరఛి  సద్గురువులు , దైవాంశసంభూతులు , అవతారపురుషులు అయిన  శ్రీ సాయి నాధుని , నా భావనాదృష్థి తో  దర్శించి  కీర్తించిన  కీర్తనలే  ఈ
                                      " సాయి  భక్తి  గీతామృతాలు  ".
                     ఎన్నో జన్మల పుణ్య విశేష  ఫలంగా  నాచే రచింపబడిన  ఈ కీర్తనా సుమాలను
  నా మొదటి  సంగీత గురువు  . ప్రేమమూర్తి  అయిన  నా తల్లిగారు , స్వర్గీయులు
                                    శ్రీ   " పంతుల  కామేశ్వరీ దేవి  " గారికి  అంకితమిస్తూ ..
 పెద్దలు , సద్గురువుల  అశీర్వచనాలతొ  ఈ  కీర్తనలు  వెలుగులోకి  రావాలని   ఆశిస్తూ
, పరమాత్ముడైన  " శ్రీ   సాయి నాధుని  " చరణారవిందాలకు అంకిత భావంతో  అర్పిస్తున్నాను.
                                   
                                 నా ఈ గీతరచనకు  తోడ్పడి  సహకరించిన  నా కుటుంబ సభ్యులందరికీ
ఆ దేవ  దేవుడైన  శ్రీ  సాయినాధుని  కృపా , కటాక్షాలు  ఎల్లప్పుడూ ఉండాలని  ప్రార్ధిస్తూ ...
                                               శ్రీ  భాగవత్పాదారవిందాశ్రితురాలు ,
                                                              రచయిత్రి
                                           శ్రీమతి   పుల్లాభట్ల  జగదీశ్వరీ మూర్తి .
















Saturday, December 15, 2012

Index of songs

          పాటల పట్టిక .
     -----------------                         

1.  మేలుకో శ్రీ సాయి (సుప్రభాతం ).                            Meluko Sree Sai ( suprabhatam ).
2.  మానవుడైపుట్టి  మహానీయుడైనాడు ...                 Maanavudai putti Mahaneeyudainaadu..
3.  మమ్మేలు మా నాధ శ్రీ సాయి నాధా ..                    Mammelu maanaadha Sree Sai Naadha..
4.  ఖండయోగమున ఖండములైనట్టి ..                       khanda yogamuna Khandamulainatti..
5.  యుగ యుగాలుగా ,యుగమొక రూపుగ ..            Yuga yugaalugaa,yugamoka roopuga..
6.  సాయీ సద్గురు అవతారమిలలొ ...                        Sai sadguru avataaramilalo..
7.  ప్రక్రుతి నిండిన  (రాగమాలిక ).                              Prakruti nindina  Paramaatma ..
8.  కొలువై యున్నాడవు కలియుగ దైవమై ..               KOlyvaiyunnaadavu kaliyuga daivamai..
9.  శ్రీ సాయి సద్గురుని శరణంటిర..                              Sree Sai Sadguruni Saranantira..
10.కలియుగమందున కాచే  దైవము ..                       Kaliyugamanduna kaache daivamu..
11.చావడిలో శ్రీ సాయి సమాగమ మున్నది ..              Chaavadilo sree Sai samaagamamunnaadi
12.సాయీ,సాయాని పిలచితినీ ...                               Sai Saayani pilachitinee....
13.బంధము లన్నియు బూటకములు .                      Bandhamulanniyu bootakamulu..
14.ఓంకారేశ  షిరిడీ మహేశ్వరా ..                               Omkaaresa Shiridee Maheswaraa..
15.అందినంత దూరంలో అగుపిస్తావు                         Amdinanta dooramlo..
16.అదే ద్వారకామాయి ,వేలసే ..(మంగళం )               Ade dwaarakamaayee .(Haarati)
17.తలపైన తలపాగ ....చుట్టేవు నీవు .                       Talapaina talapaaga ( namaskaaramideneeku)
18.నమ్మినవారికదే  భవుడవు  శ్రీ సాయి                     Namminavaarikade Bhavudavu  (Haarati)










Thursday, December 13, 2012

అదె ద్వారకమాయి.

శ్రీ సాయి మంగళం .( Ade dwaraka maayi )
---------------------
అదె  ద్వారకమాయీ  వెలసే షిరిడీ శ్రీ సాయీ
సర్వము నీవోయీ   శ్రీకర నామము నీదోయీ ...

 ( గ్రూప్ )

 హారతి గొనుమా    శ్రీ సాయీ శుభ
 మంగళ  మూరతి  నీవోయీ ,
భారము నీదే         సాయీ ,
మాకాధారము      నీవే గురు సాయీ ||
                                                         
సాయీరాం  సాయీరాం  జై జై సాయీరాం
జైజై సాయీరాం  సద్గురు సాయీ ఘన శ్యాం ||

చరణం .
---------

షిరిడీ భువిపై కాలిడి నంతనే    కలతలు బాపితివీ ..
                              సాయీ    కలతలు బాపితివీ ...
ద్వారకమాయీ  చల్లనినీడను  సేదను తీర్చితివీ
                               సాయీ   సేదను తీర్చితివీ
నిత్యమువేలిగే నిర్మలధునిలో  పాపము కాల్చితివీ
                               సాయీ   పాపము కాల్చితివీ
సత్యము నీవని సమాధి నుండే అభయము నిచ్చితివీ
                                సాయీ అభయము నిచ్చితివీ ||

( గ్రూప్ ).

హారతిగోనుమా శ్రీ సాయీ .......శుభ
మంగళ మూరతి  నీవోయీ
భారమునీదే  సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ ....

సాయీరాం , సాయీరాం  జై జై సాయీరాం
జై జై సాయీరాం  సద్గురు సాయీ ఘన శ్యాం ||

చరణం .
-----------
తిరగలి మరలో నలిగిన  ఔషధి    తీయని అమృతమే
                                    సాయీ    తీయని అమృతమే
తరగని ధునిలో నిత్యాగ్ని బూదిని దాల్చిన శుభ ఫలమే
                                   సాయీ   దాల్చిన శుభఫలమే |
తర,తమ భేదము లెరుగని తలపులు కురిపిoచు  వెన్నలలే
                                    సాయీ  వలపుల మల్లియలే ...
కరమున చూపిన  అభయపు కాంతులు మాకిల వరములులే
                                    సాయీ తరగని పెన్నిదిలే
                                    సాయీ  నీదైన  సన్నిధిలే  ...|

( గ్రూప్ )

హారతి గొనుమా శ్రీ సాయీ  శుభ
మంగళ మూరతి  నీవోయీ
భారము నీదే  సాయీ మాకా
ధారము నీవే గురు సాయీ .....

సాయీరాం సాయీరాం  జైజై  సాయీరాం
జై జై సాయీరాం  సద్గురు సాయీ ఘన శ్యాం ||

_____________________________________
_____________________________________























ఓంకారేశ శిరిడీ మహేశ్వరా

ఓం శ్రీ సాయి రాం. 
---------------------
ధర్మవతిరాగం.
---------------------------
 శ్లోకం :
---------
ఓంకారేశ       షిరిడీ  మహేశ్వరా
మహాయోగ     మహిమాన్విత  తేజా
మంగళ రూప   మహోజ్వల దీపా
నమో నమో     నమో  శ్రీ  సాయి జేజా   ||   ||

అభయము నీయవే    శ్రీ షిరిడి సాయీ
నిరతము నిన్నే          తలచెదనోయీ    || అభయము ||

శంకర , శ్రీకర       సుందర నాయక
మునిజన పాలక బుధజనావనా
మంగళకర  శ్రీ     విఘ్న వినాశక
సద్గురు సాయీ   ముక్తి ప్రదాయక         || అభయము ||

ద్వారకమాయీ     నీ వాసమోయీ
నిత్యాగ్నిహోత్రమే   నీ ఉనికోయీ
నీ పద సన్నిధి      మా పెన్నిదోయీ
శ్రీనిధి                   షిరిడీ దామమోయీ || అభయము||
-------------------------------------------------------
------------------------------------------------------------



సాయి కీర్తన..బంధములన్నియు

ఓం శ్రీ సాయి రాం .
----------------------
భూపాలరాగం .
------------------
బంధములన్నియు    బూటకములు నిల -
వింత  జీవితమే         నాటకమూ ..
పొందలేని సిరి           నీ భక్తీ పథము
అంతర్యామివి           అదియే సత్యము ||  బంధము ||

నీ నామమే ఇల    శుభదాయకమూ
నీ దివ్య  చరణమే  మా కభయం    సాయీ .......
నీ సమాధియే       సాక్షాత్కారము
నీ ధామమే ఇల    వైకుంథమూ          || బంధము ||

విందులు మాకిల  నీ గుణ గానాలు
పంచభక్ష్యములు   ఇంకేలా ?    కను
విందు చేయు నీ   రూపము కంటిమి
ఇహ మున         భోగములింకేలా .?......||బంధము || 

నోరార నీ పేరు తలచిన చాలును
పరమావధి  కది సోపానమూ.......సాయీ ......
పరోపకారము  పరమ ధర్మమూ
నీ సేవ నిజముగ  చేసిన ఫలము          || బంధము ||
-----------------------------------------------------
------------------------------------------------------


























ఖండయోగమున

ఓం శ్రీ సాయి రాం .
---------------------
భాగేశ్వరి రాగం .
--------------------
పల్లవి:అనుపల్లవి.
--------------------
ఖండ యోగమున ఖండములైనట్టి
తనువు  నీదిగని   నివ్వెరపడితి-న -
ఖండ దివ్యమౌ  మహిమను జూపుచు
ప్రత్యక్షమైతివి   ఈ  లీలలేమీ ....?

మిత్రం :(బృందం )
-------------------
సాయీ సద్గురు సన్నుత చరితా
ఏమని  పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాది సద్గురు
సదమల హృదయా  సాదుస్వరూప || ||

1.చరణం .
-----------
కడుపున  ప్రేగుల  నోటను గ్రక్కీ
నీట కడిగి  నేలెండారబెట్టి
కడు వింత గొలుపుచు తిరిగి దాల్చితివి
ఈ వింత ఏమీ  శ్రీ సాయీశా  ||

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప  ||

2.చరణం .
--------------                          

చెక్క బల్లోకటి గని   శ్రద్ధ నూయల గట్ట
ముక్కలుగ  చేసేవు  ముతక బట్టొకటి
ఒక్క వైపుగ నింటి   చూరు నూయల గట్టి
చక్కగ పరుండేవు    ఆ మర్మమేమీ ..?

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ సాదు స్వరూప || ||

3.చరణం .
------------                                  

యోగముచే మా యిడుముల కనుగొని  
యాగముచే  మము కాచేవు శ్రమగొని 
త్యాగము నీ జన్మ మా భాగ్య దాయి
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ, అను
రాగముతో నిన్ను కొలిచెదము సాయీ ||

గ్రూప్.
---------
సాయీ సద్గురు సన్నుత చరిత
ఏమని పొగడుదు నీ ఘనత
యోగిరాజ రాజాధి సద్గురు
సదమల హృదయ  సాధు స్వరూప || ||
                                       
                                              || ఖండ ||
----------------------------------------------
-------------------------------------------------  




         ||


















శ్రీ సాయి సుప్రభాతం.

ఓం శ్రీ సాయి రాం . (Sai Suprabhatam)
---------------------

మేలుకో శ్రీసాయి మేలుకోవయ్యా ,
మేలుకొని మమ్ము దయనేలుకొవయ్యా |
మేలుకో | మేలుకో ||

ఉదయభానుని కాంతికిరణమ్ము పొడచూపె ,
నిదురమేల్కొనుమనుచు , అరుణకాంతులు విరిసే ,
హృదయద్వారము తెరచి , భక్తివాకిట నిలచి ,
భజన,కీర్తనలతో నిను సన్నుతించేను || మేలుకో ||

మందభాగ్యను నేను , మంత్ర, తంత్రములెరుగ ,
వందనములేసేతు , భక్తి , భావము పరగ ,
చంద్రవదనా మందహాసమ్ముతో నీవు -
అండనుండీగావు , అన్యమెరుగను బ్రోవ   || మేలుకో ||

పన్నీటిస్నానాల, పాలనభిషేకింప ,
పట్టువస్థ్థ్రములిడగ , భరణాలుతొడగా ,
సద్దుసేయక నీదు వాకిటనునిలిచేను ,
బెట్టుసేయక రాజ-రాజాధి సద్గురూ ....|| మేలుకో ||

తులసి, మరువము చేర్చి ,పూలమాలలు గుచ్చి
శీలసుందరరాయ ,సార చందనమిడగ ,
ఫాలలోచన పొద్దు వేసారి గడపితీ ,
జాలమేలరయింక , ద్వారకామయిజేజ || మేలుకో ||

పాలు, ఫలములు ,తేనె , పరమాన్నములు -
మేలు భక్ష్య, భోజ్యములివిగొ ,తాంబూలమిదిగో ,
ఆరగించవెస్వామి ఆలసింపకయింక ,
నీరజాక్షా నీకు నీరాజనములిడెద .....|| మేలుకో ||

భక్తవరదా నీకు వింజామరమువీచి ,
చక్కనైనాపక్క, వేసి పాదములొత్తి ,
నృత్య, గీతపు సేవ ,సంతోషముగ సేతు ,
పవ్వళింతువు తిరిగి, పంతమిప్పుడు వీడి || మేలుకో ||

ప్రక్రుతి నిండిన పరమాత్మ

ఓం  శ్రీ  సాయి  రాం. 
-----------------------
రాగమాలిక .
---------------
వసంతరాగం .
-----------------
ప్రకృతి  నిండిన  పరమాత్మ నీవని
పరమేశ్వర శ్రీ  సాయీశా ....
సుకృతంబునను  తెలుసుకొనీ ,  నే
ధన్యత నొందితి  జగదీశా ... || ప్రకృతి ||

కానడరాగం .
------------
సక్రమమున ఋతు , పవన ,కాంతులు
భూ , నీళాదులు       పంచ భూతములు
సృష్టి క్రమములు     చావుపుట్టుకలు
సంకల్ప రచనలు      సాదుస్వరూప ..||

అమృతవర్షిణి రాగం .
--------------------
కామ ,క్రోధ ,మద ,   మత్సర్యమ్ములు
పాప,దుఃఖ ,వైరాగ్య  చింతనలు
కర్మానుసారపు       బుద్ధి ,మాంద్యములు
మా కర్మఫలములు   మహి సాయీశా ||

హిందోళ రాగం .
----------------
జ్ఞ్యానము ,దానము ,  ధర్మనిరత  ఘన
యాగము, యోగము, జపము ,తపము
భావము , భక్తియు  ,  ముక్తి , మోక్షములు
మాకిల నీవిచ్చు        కోటి వరములు  ||

సురటిరాగం .
---------------
తల్లియు ,తండ్రియు , దారా,పుత్రులు
స్నేహ ,బాంధవులు , ప్రేమపాశములు
తన-పర భేదపు        తారతమ్యములు
నీ లిఖితములే          నీరజనయన ||

కల్యాణి రాగం.
------------------
అన్నియు నీవే      అంతయు నీవే
అణువు మొదలు  బ్రహ్మాండము నీవే
యాగమునీవే      యోగమునీవే
సాయినాధ  పర:  బ్రహ్మమునీవే ||   ప్రక్రుతి ||
--------------------------------------------
---------------------------------------------+++
























శ్రీ సాయి సద్గురుని

ఓం శ్రీ సాయి రాం .
--------------------
శ్రీ  సాయి  సద్గురుని  శరణంటిర , సాయి
చరణాలు పట్టి  నే  విడనంటిర ,
ద్వారకా మయి చాయ  మనదంటిర , షిరిడీ
ధామమే  మన పుణ్య భూమంటిరా .............|| శ్రీ  ||

మా సాయి మనసులో సమత మమతల విందు
సరి ప్రేమ కురిపించు    సిరులు మెండు ...
జాతి ,బేధము  విడచి   మసలుచుండు , జనులు
ఆ తీరు పాటించీ           తరలిరండూ ......      || శ్రీ ||

ఏ యుగము నందైన    ఆది అంత్యము లోకటె
జీవులోక్కటే .....          జీవాత్మ ఒక్కటే
ప్రాణు లొక్కటే              ప్రాణి కోటులోక్కటే , యనుచు
సరిజూచి  బ్రోచేదీ          సాయి ఒక్కడే ....      || శ్రీ ||

మనిషి  మనిషి వేరైనా  మనసులోక్కటే , వారి
ఆత్మలందుండేదీ           మాధవోక్కడే ,  పంచ
భూతాలకు నెలవైన      దేహమొక్కటే , మదిని
మాత్సర్యము విడచి చూడు    దైవమొక్కటే   || శ్రీ  ||
-------------------------------------------------
-----------------------------------------------------






మమ్మేలు మా నాధ

ఓం శ్రీ సాయి రాం .
-----------------------
ఆనందభైరవి రాగం .
---------------------

మమ్మేలు మా నాధ     శ్రీ సాయి నాధా
మా ఇంటి వెలుగువూ   నీవు కాదా ......
కమ్మేటి  చీకటుల        తొలగింపగా నీవు
నమ్మేటి దైవమై           మమ్మేలరాదా ....
                                 శ్రీ  సాయి నాధా ....||

అంబ కృప  నీ పైన       అది నీకు వరమూ
నింబ వృక్షము క్రింద    నిత్యమ్ము జపము
లోకాలు గాచుటకు       చేసేటి   తపము
ఫలియించి  పొందేవు     దైవత్వము            || మమ్మేలు ||

కన్నీరు తుడిచేవు        పన్నీరు చిలికేవు
నోట నెంగిలి నీట          దీపాలు నిలిపేవు
గంగ ,యమునల నీరు  పాదాల పుట్టించి
పాపాలు కడిగి మము    పావనుల జేసేవు   || మమ్మేలు ||

ఉప్పు నీటిని  తేట  తీయన్ని నీరుగా
మార్చేవు మహిమతో ,మధురాతి మధురముగ
ప్లేగు ,కలరా వ్యాధి       బాప గోధుమ పిండి
ఊరంత  చల్లేవు          పురజనుల కాచేవు   || మమ్మేలు ||

గీతార్ధ సారమును       బోధించినావూ 
నిస్వార్ధ  సేవలను       అందించినావూ
పరమార్ధమును దెల్పి  పావనుల గావింప
పదకొండు సూత్రాల     నెరిగించినావూ ...
                                పరమాత్మ నీవూ ......|| మమ్మేలు ||

---------------------------------------------------------------
----------------------------------------------------------------
                                     






 





చావడిలో శ్రీ..సాయి.

ఓం శ్రీ  సాయి రాం .
----------------------
చావడిలో  శ్రీ  సాయి  సమాగమమున్నది  రారండీ
సాయిని కొలువగ  రారండీ  భక్తితో భజనలు చేయండీ....
సాయీ సుందర శ్యామ శరీరుని  వేడుక గనరండీ
మాయీ ద్వారక  చేరండీ సాయీ కీర్తన పాడండీ ..

సాయీరాం , సాయీరాం ,జై జై  సాయీరాం ,
షిరిడీ సుందర ,ద్వారక మందిర ,మహిమాన్విత  ఘన శ్యాం ...

శుభములనొసగే   సుందరరూపుని  సొంపుగ  గనరండీ....
                           నిత్యము  పూజలు చేయండీ .....
రోగముబాపే   బూదినిగైకొని   సౌఖ్యము   పొందండ
                           సుఖముల  భాగ్యము కోరండీ
నిత్యమూ వెలిగే నిర్మల ధునిలో నేతిని పోయండీ                  
పాపము భస్మము చేయండీ .....పాపుల బ్రోచును సాయండీ ...                   

సాయీరాం,  సాయీరాం , జై జై  సాయీరాం ....
షిరిడీ సుందర  ,ద్వారకమందిర  మహిమాన్విత  ఘన శ్యాం .


సత్యము, ధర్మము , శాంతీ -సౌఖ్యము  సాయీ వరమండీ
                             నిత్యమూ సాయిని కొలవండీ ..........
సంకటములలో  సన్నుతి చేసీ   శాంతిని  పొందండీ
                             సర్వము సాయని  నమ్మండీ ......
తల్లియు ,తండ్రియు ,దైవంబీతడు ,సాయే గురువండీ
సద్గురు సాయిని తలవండీ  , సన్నుతి చేయుచు పిలవండీ

సాయీరాం , సాయీరాం సద్గురు  సాయీరాం ..
షిరిడీ సుందర , ద్వారక మందిర మహిమాన్విత ఘన శ్యాం ..
--------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------



 













యుగ యుగాలుగా...

ఓం  శ్రీ  సాయి  రాం .
-----------------------
యుగ యుగాలుగా      యుగమొక రూపుగ
అవతరించిన                ఆది   దేవుడవు
జగములనేలే               జగదీశుడవూ
సర్వము నీవే               సాయి గురూ .................!

జై జై  సాయీరాం   సాయీ  సద్గురు  సుందర   శ్యాం ......
అల్లా ,అక్బర్ ,రహీము, సాయీ ,  పర్తీశ్వర  ,హరి ఓం ..(సామూహికం )

మోమున వెలుగై       నిండిన  కన్నులు
ఈ జగములకే           సూర్య , చంద్రులు
చెలువము నిండిన     చల్లని  చూపులు
మమ్ముల నేలేటి       మా  మంచి  సిరులు ...

జైజై  సాయీ రాం   సాయీ  సద్గురు  సుందర  శ్యాం ...
అల్లా ,అక్బర్, రహీం ,సాయీ ,పర్తీశ్వర  ,హరి ఓం .........

చిరు  సిరి నగవులు     కురిపించు  జల్లులు
చింతలు బాపే             సిరిమల్లెలూ .....
అభయము నిచ్చే        నీ దివ్యకరములు
మమ్మాదుకొనే           మా మంచి  నేస్తాలు ....

జై జై సాయీ రాం  సాయీ  సద్గురు  సుందర  శ్యాం
అల్లా, అక్బర్, రహీము, సాయీ ,పర్తీశ్వర  హరి ఓం ......

వేదాల సారం నీ  దివ్య  చరితం
నీ నామ జపమే ఇల వేదమంత్రం
నీ రూపు సాకారమౌ తత్వ సారం
నీ దివ్య చరణం  అదే మాకు శరణం ........

జై జై సాయీ రాం  సాయీ సద్గురు  సుందర శ్యాం ..
అల్లా,అక్బర్,రహీము,సాయీ, పర్తీశ్వర  హరి ఓం .....
--------------------------------------------------
-----------------------------------------------------




కొలువై యున్నాడవు

ఓం  సాయి  రాం .
----------------------
 కొలువై యున్నాడవు   కలియుగ దైవమై
కరుణజూపరాదా           సాయీ ....
విలువలు నీనామ        మహిమలు యిలలో
తలచితిమీ                   గన  రావోయీ            !కొలువై !


కొల్లలు   నీ    భక్తకోటులిలలో ....
                  కరములు  మోడ్చితిరీ   సాయీ ...
ఎల్లలు లేనట్టి   నీ గుణ గానాలు
                  ఎంచి   భజించితిరీ    సాయీ .....
చల్లని చూపుల     కాంతుల  కరుణను
                    నిరతము  కోరితిరీ   సాయీ .....
వెల్లువలై  పొంగు       నీ  ప్రేమే రాగాలు
                    జల్లుగ    కురిపించ     వోయీ     !కొలువై ! 


తనువూ ,మనసు        నీదిగ   చేసి
              ఆరాధించితినీ......    సాయీ .....
ఘనమౌ  నీరూపు    మదిలో నిలిపీ
              ధ్యాన్నము  చేసితినీ  సాయీ ...   
సాయీ సాయని     నిరతము తలపుల
             నినుపూజించితినీ   .....నా ...
వెతలను బాపగ        వచ్చే  భవుడవు
             నీవని నమ్మితినీ       సాయీ ...         !కొలువై! 
------------------------------------------------------
------------------------------------------------------
 
                 

కలియుగమందున కాచే దైవం

ఓం  సాయి .
------------------
---------
కలియుగమందున       కాచే  దైవము
నీవే  నీవే   శ్రీ  సాయీ  ......
కొలఛినవారికి            కొరతలు లేనట్టి
కానుక నీ దయ         గుణమోయీ       ! కలియుగ !

రంగులు  వేరైనా       రకతం    ఒకటని
మతములు వేరైనా   మానవులొకటని
ధర్మం  వేరైనా           దైవం ఒకటని
చాటిన  సద్గురు        సాయివి  నీవే .       !కలియుగ !

పిలచిన పలికే            దైవం  నీవే
తలచిన నీపేరు          కలతలు రావే
కలనైన  నీమహిమ   కొనియాడలేము
ఇలలోన నీ ఉనికి      మా పుణ్య  ఫలము !కలియుగ !
------------------------------------------------------
-----------------------------------------------------
ఓం   సాయి .
---------------
సాయీ  సాయాని       పిలచితినీ నిను
శరణము  నీయగ       రావేలా   .....
ఓయీ సాయాని         వేడితినీ  నను
బ్రోవగ  నీకిక              జాగేలా ........      !   సాయీ !

భయముల బాపెడు     వరదుడవీవని
భావమునందే              తలచితినీ  
అభయమునీవే            ఆర్తపరాయణ
శుభములనొసగే          దీనజనావన       !సాయీ !

చరణము నమ్మి          కరములు మోడ్చితి
కన్నుల నీరూపే           కొలువుగ నిలిపితి
సన్నుతి చేయగ          సమ్మతికోరితి
సద్గురు  సాయీ           నీవే నా గతి         !సాయీ !
----------------------------------------------------
-----------------------------------------------------








Wednesday, December 12, 2012

మానవుడైపుట్టి

శ్రీ  సాయి భక్తి  గీతామృతాలు .
------------------------------------------------------------

పల్లవి .
-------------
మనవుడై పుట్టి  మహనీయుడైనాడు              
 మా దేవుడు   గురు సాయీశుడూ ..  !మానవుడై !
అనుపల్లవి :
కానరాని  ఘన    మహిమలు గలవాడు 
కారణజన్ముడు    కరుణాసముద్రుడు     ! మానవుడై !

చరణం :
--------
మానడు నిత్యము     జపమూ, తపమూ ..
దాన గుణనిధీ           దాచడు ధనమూ 
తనమతమెరుగడు    మనమతమడుగడు 
మనుగడ  యేదైన     మమ్మేలువాడు   !మానవుడై !

చరణం
----------
నిష్ఠను పాటించు   జీవనగమనము 
యిష్థ మైన విధి    పరోపకారము 
కష్థజీవులను        కాపాడుగుణము 
కామితార్ధముల    నొసగే దైవము      !మానవుడై !!

--------------------------------------------------
-----------------------------------------------------

ఓం శ్రీ సాయి రాం .
---------------------
పల్లవి ;
--------
సాయీ సద్గురు       అవతారమిలలో
వేవేల దేవతల         కొలువైనదీ....
అనుపల్లవి.
-----------
 స్థిరముగవెలసిన     షిరిడీపురియే
ఇలమాకు నిండైన    వరమైనదీ.....     !  సాయీ!
చరణం ;1
--------
దాసులు ఇచ్చిన      దానమేదైనను
దాచిఉంచుకొని        ధన్యులజేయును
ఊయలబల్లైన          రాతి ఇటుకైన
ప్రాణముగానెంచి       అనుభవించును  !సాయీ !


ఉడుకునీటిలో        బియ్యముపోసి
చేతితోకలిపి           చక్కగవార్చీ
జీవేదైనను             ప్రేమనుపంచీ
ఆకలిదీర్చును       ఆదరించును       !సాయీ !


సత్యముతానని      సమాధినుండే
పలికిచెప్పిన           పరమేశుడితడూ
నమ్మినవారికి        అన్నీ  తానై
ఆదుకొనే  హరి       అవతారమితడూ   !సాయీ !

---------------------------------------
-------------------------------------------