Wednesday, October 30, 2024
శీర్షిక : సంగం : సంగమేశ్వర దేవాలయం .
Sunday, October 20, 2024
శీర్షిక : నాలో నేనెక్కడ...?
బ్రతుకు చిత్రం.
శీర్షిక : నాలో నేనెక్కడ...?
రచన - శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర
చెప్పాలని ఎన్నున్నా చెప్పలేకపోతున్నా
అడగాలని ఎంతున్నా అడగలేకపోతున్నా
రాయాలని అనుకున్నది రాయలేకపోతున్న
పాడాలని అనుకున్నది పాడలేకపోతున్నా !!
ఎరిగినట్టి సత్యాలను ఎదలోననే దాచి పెట్టి
మనసు చెప్పు మాటలనే మదిలోనే అణచిపెట్టి
కపటమైన నవ్వు వెనక వికటరూపు దాచిపెట్టి
నిజాలకే నివురు పెట్టి ముఖానికో రంగు కొట్టి !!
కల్లలనే ఎల్లలుగా చేసుకునీ బ్రతికేస్తూ
ఎదుటి మనిషి పదవులకే దాసోహం అంటున్నా
కుక్క కన్న హీనంగా కూటికొరకు బ్రతికేస్తే
సిగ్గులేని మనిషి బ్రతుకు బ్రతికి ఏమి లాభమన్న !!
వాదన ప్రతి వాదనతో బమ్మి,తిమ్మి చేస్తున్నా
అసలు నిజం తెలియకున్న అల్లరెంతో చేస్తున్నా
మార్పు రాని వ్యవస్థలో మార్చుతున్న చరితలెన్నో
అక్షరాల కూర్పులలో అబద్ధాల రాతలెన్నో !!
ఫలము లేని వాదనలను పట్టు పడక చేస్తున్నా
ప్రస్తుతమౌ పరిస్థితిని పెడదారిని పెడుతున్నా
ముందడుగును వేయలేక సందు దారులను వెదకుచు
ముసుగు తీసి చూపలేక ముడుచుకునే పోతున్నా !!
----------------------------------------
Wednesday, October 16, 2024
చందస్సు, పద్యము ,నియమాలు, ప్రాస భేధాలు.
Tuesday, October 15, 2024
అంశం : ఏ.పీ.జె. అబ్దుల్ కలాం..
/10/2024.
వారం : మంగళవారం
మహతీ సాహతీ కవి సంగమం.
అంశం : ఏ.పీ.జె. అబ్దుల్ కలాం.
ప్రక్రియ :గేయం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
మ.స.క.సం.: 43
పల్లవి :
మంచి మనిషిగా ఎదగాలంటే
విద్యాబుద్ధులు నేర్వాలిరా
సాధువర్తనము, సకలజనహితమే
మనసులు గెలిచే సాధన రా !!
అనుపల్లవి:
యెంచి సాధనతో సాధించేటి
విజయ గాధలు ఎన్నో రా
అబ్దుల్ కలాము జీవిత చరితే ,
సాక్ష్యమొకటిగా తెలియుము రా!!
1.చరణం:
ఆర్థిక బాధల నొడ్డి, యాతడు,
చదువుల సంద్రము దాటెనురా
శాస్త్రవేత్తగా "క్షిపణుల" కనుగొని
సాధ్యమసాధ్యము చేసెనురా
"భారతదేశపు రాష్ట్రపతిగ "పదవందిన
మానవ మాన్యుడురా
"మిస్సైల్ మేన్ "గా పేరొందిన ఘన
చరితకు అతడే సాక్ష్యమురా !!
.2.చరణం:
చదువును మెచ్చిన పిల్లల స్నేహమే
" కలాము "మెచ్చిన బాటదిరా
మంచి మాటలను ప్రసంగించుటే
"కలామ్" కు నచ్చిన మాటదిరా
"భారతరత్నగ " కీర్తికెక్కిన
బాధ్యత నిండిన బంధుడు రా
"ప్రతిష్టాత్మకా పురస్కారముల"
చేపట్టిన ఘన గౌరవుండురా!!
3.చరణం:
చిరస్థాయిగా చరితను నిండిన,
మానవ జన్మమే ధన్యము
"అబ్దుల్ కలాము" నాదర్శముగా
నెంచు చదువులే సార్థకము
"అబ్దుల్ కలాము" పురస్కారముల
"నందుకొనుటె, గర్వ కారణము
ఇటువంటి చరితలే దేశ మకుటమున
"కలికి తురాయి" సమానము !!
ముగింపు
చరితలందు ఘన చరితలు ఎన్నో
చదువు నిండు,సంస్కారాలెన్నో
విద్వత్ నిండిన విద్యలు నేర్పిన,
విషయ సంపదల వేడుకలెన్నో..!!
----------------------
Sunday, October 13, 2024
శీర్షిక :బ్రతుకు తక్కెడ.
14/10/2024.
మహతీ సాహితీ కవిసంగమం.
అంశం : చిత్ర కవిత.
శీర్షిక :బ్రతుకు తక్కెడ.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కళ్యాణ్ మహారాష్ట్ర
బేలన్స్ కాని బతుకు తక్కెడ లో జరిగే
వింత పరిణామాలను ప్రశ్నించలేక ,
, అధికారిక ఆక్రమణలకు తలవాల్చిన
నా కళ్ళు, బ్రతుకు భయంతో, బావురుమంటూ,
కన్నీటి గుటకలు మింగుతున్నాయి!!
ఓటు కోసం నోటుతో చేసే దురాగతాలకు,
మనసు నింగిలో ముసురుకున్న ఆశలు,
వాడి అన్యాయాల వేడి తాకిడికి "భగ్గు" మంటున్నాయి.
సంయమనం కోల్పోయిన సామాన్యుడి అసమర్థతలా.....!!
పెరుగుతున్న కామానికి పెట్టుబడి పెడుతున్న
రాజకీయపు,విషపు జ్వాలల వేడి తాకిడికి
మల్లె తీగల చాటు దాగిన లేత మొగ్గలు,
వాడి వడలిపోతున్నాయి, వనితల జీవితాల్లా....!!
అధికార బలం,చేసే ఆగని దురాగతాలకు
వీధిని పడిన విశ్వ కార్మికులు, ముందుకు
అడుగేయలేని అసమర్థత తో,మారని
బతుకులకు మసిపూసుకుంటున్నారు.!!
ధర్మ రక్షణ పేరుతో దారుణాలు చేస్తూ,
జాతి మతాల జాలంతో , ప్రజల మనసుకు
గాలం వేస్తున్న. ఘనాపాటీలు
తడంటని చేతులతో తల రాతలు రాస్తున్నారు.!!
బ్రతుకు భయంతో బాంచనంటున్న
బడుగు బతుకులు , బలిపశువుల్లా
ఐదు కిలోల గ్రాసానికి ఆవురావురు మంటూ,
"నోటు"కు "ఓటు"నమ్ముకుంటున్నారు
గొర్రెల మందలా..!!
-----------
Saturday, October 12, 2024
శీర్షిక: *సిద్ధి దాత్రీ!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు* ప్రక్రియ: *పద్యము(తరళము)*
Thursday, October 10, 2024
శీర్షిక: *కాళరాత్రీ దేవీ!నమోస్తుతే*కవి: *పొర్ల వేణుగోపాలరావు*
Tuesday, October 8, 2024
వరలక్ష్మి యనమండ్ర* అంశం: *కాత్యాయనీ దేవి!*
అంశం: *కాత్యాయనీ దేవి!* కవి: *పొర్ల వేణుగోపాలరావు*
ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,"బతుకమ్మ" కవితోత్సవం..శీర్షిక : కొండంత అండ.
08/10/2024.
(కవి పీఠం)
ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో,
"బతుకమ్మ" కవితోత్సవం..
శీర్షిక : కొండంత అండ.
రచన : శ్రీమతి జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ , మహారాష్ట్ర.
ప్రక్రియ : పాట.
---------------
వేములవాడలోన ఉయ్యాలో
రాజరాజేశ్వరాలయము ఉయ్యాలో
భక్తి గొల్చె రాజులంత ఉయ్యాలో
తల్లి నెరనమ్మి వేడిరంట ఉయ్యాలో!!
చోళ రాజనందనుడు ఉయ్యాలో
రాజరాజ చోళుడంట ఉయ్యాలో
పోరు జేసి గెలిచెనంట ఉయ్యాలో- వేముల
వాడ ఓడిపోయెనంటనుయ్యాలో!!
గెలిచినంతనే గూల్చిరి ఉయ్యాలో
రాజరాజేశ్వరీ గుడిని ఉయ్యాలో
గుడిలోన శివుని లింగముయ్యాలో
తంజావూరు తరలించిరి ఉయ్యాలో!!
లింగమునకు గుడి కట్టిరి ఉయ్యాలో
లింగ ప్రతిష్టను చేసిరచట ఉయ్యాలో
"బృహదీశ్వర" ఆలయమదె ఉయ్యాలో
ముక్తి నిచ్చు ధామమదే ఉయ్యాలో !!
వేములా వాడలోన ఉయ్యాలో
"భీమేశ్వరా"లయమ్ము ఉయ్యాలో
శివుడు లేని గుడిగ మారెనుయ్యాలో
"బృహదమ్మ" ఒంటరాయెనుయ్యాలో !!
ఊరు వాడ తరలివచ్చిరుయ్యాలో
"తల్లి" గానరాక తల్లడిల్లి రుయ్యాలో
తలపులోన" తల్లి" దలచి ఉయ్యాలో
"పూల గౌరమ్మ"ను జేసి గొలచిరుయ్యాలో!!
ఏటేటా తెలంగాణనుయ్యాలో
పూల బతుకమ్మకు సంబరాలు ఉయ్యాలో
ఆట,పాట,లాడి ,పాడి ,ఉయ్యాలో
"అమ్మ" గొల్చు తీరు అద్భుతమే ఉయ్యాలో !!
కష్టాలు కడతేరగనుయ్యాలో
గొల్చి ,సంబరాలు జేతురంత ఉయ్యాలో
బంగారు బతుకమ్మకు ఉయ్యాలో
బోనాల భోగమిత్తురుయ్యాలో.!!
కోర్కెలన్ని దీర్చు తల్లి ఉయ్యాలో
మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..
మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..
మనకు కొండంత అండగాదె ఉయ్యాలో..!!
------------------------------
ఈ పాట నా స్వీయ రచన.